Sunday, November 30, 2014

పద్య రచన కుమ్మరి కుండలు

కుమ్మరి కుండలు సేయును
నిమ్మహిలో ,మారు మూల యిండ్ల ల యందున్
నమ్మగ వాటిని వచ్చిన
సొమ్ముల బోషించు నతడు సుఖముగ నాలిన్

నిషిధ్ధా క్షరము -దీ ర్ఘాక్షరములు /తేటగీతిలోశ్రీ వేంకటేశ్వర స్తుతి

కొండ పైనుండు వెంకన్న !కొమరు మిగుల 
మమ్ము రక్షించ  దిగిర మ్ము మంగయుతము
ముసలి పండుల మైతిమి ముదిమి వలన
సప్త గిరులందు నివసించు చక్క నయ్య !


Saturday, November 29, 2014

చీ త్కరించ దగును శిష్ట జనుల

దుష్ట జనము చేయు దుర్మార్గములిలను
చీ త్కరించ దగును, శిష్ట జనుల
బోధనల నెపుడును బూర్ణ మనసు తోడ
స్వాగ తించ వలయు సామి ! యెపుడు

పద్య రచన - రోజుల మార్పు

రెండు రకముల చిత్రము లుండె నచట
యింటి సామాను గటువుగ నుంట వలన
సన్న బడియెను నాభామ మిన్న గాను
సులువు గల యట్టి  సామాను గలుగు కతన
పనుల భారము లేకను భామ కచట
తనదు దేహము బరువయ్యె దనకు ,మోయ

ఆ రోజులలో నింతులు
నేరోజును వమ్ము సేత  యిష్టము లేకన్
సారము జీవితమును సం
సారము కొఱ కీయు కతన సన్నము లైరీ

ఈ రోజులలో  భామలు
నేరోజున నింటి యందు నేపని పాటుల్
నేరుగ జేయమి వలనన
వారలు మఱి లావు నయ్యి వరలుదు రిలలోన్


Friday, November 28, 2014

దత్త పది -అరి -కరి -గురి -సరి (కర్ణుని దాతృత్వము )

సరి యే  గర్ణున కెవరును
నరి వచ్చిన గురియు ధనము నాతని చేతిన్
నొరులకు దానము చేయును
కరియే గద దానమీయ కౌశికు న కునున్ 

పద్య రచన -పంట చేలు

పచ్చని పైర్లను జూడగ
నచ్చము  మాకోనసీమ యా ?యని పించెన్
పచ్చని కొబ్బరి చెట్టులు
లచ్చనముగ  వరుస నుండి లాభము లిచ్చున్

  పచ్చ చీరను గట్టిన పడతి వోలె
ప్రకృతి కాంతయె హేలగా పరిఢవిల్లె
చామరములైన వచ్చోట చంకురములె
సేద దీర్చుచు నుండెను శ్రీకరముగ

శంకర నారాయణా !


హాస్య మిచ్చు నెపుడు నా యు రారోగ్యము
లెల్ల వార లకును నుల్ల మలర
సదరు హాస్య బ్రహ్మ ! శంకర నారాయ
ణా ర్య !యిత్తు నీకు నతులు శతము

కరివరదుని సేవ సేయఁ గలుగు నిడుములే.

హరహర శంభో శంకర !
కరి వరదుని సేవ సేయ గలుగు నిడుములే
హరభక్తు లందు రిట్టుల
సరియా ? మఱి జెప్పు సామి ! సరికా  దనుచున్
 



Thursday, November 27, 2014

కలము న్ గని కవివరుండు కలవర మందెన్

నలతగ నుంట యె కాకను
నలతిగ నే జ్వరము కూడ నాలికి రాగా
కలవర ము కలుగ కల నే
కలము న్  గని కవివరుండు కలవర మందెన్



పద్య రచన -గోళికాయల ఆట

గోళీ కాయల యాటను
పా ళియ గాం డ్రచట  మిగుల ప్రమదము తోడన్
వేళలు  మఱచియు  నాడిరి
వేళా కోళ ముల నడుమ వేయుచు గుంతన్

వైద్యము

మూడు మాసాల నుండినే  మూల్గు చుంటి
జబ్బ నొప్పితో , డాక్టరు  సముఖ మునకు
నేగ  నచ్చట పరికించి యిచ్చె మందు
లెన్నియో ,వాడితి యవియ యెంత గానొ

అయిన ఫలమేమి యీయక నంత కంత
కెక్కు వగుటన చేయున దేది లేక
బాత మందులే వాడుచు బ్రదుకు చుంటి
భార మంతయు దైవము పైన వేసి

నకలు దీ సియు చినరాజ నాకు మరిని
అమెరికా పయన మునకు  నవసర మగు
కాగి తమ్ములు మఱియును  గావలసిన
నితర సామాను లన్నియు నీయ నపుడు

వచ్చి యుంటిమి యమెరిక  పట్టపగలు
వచ్చి నప్పటి నుండియు బాధ యుండె
నోర్చు గొనలేక నాబాధ దీర్చు కొఱకు
నిప్పు డే గుట కొరకునై  నిచ్చ గలిగి

వైద్యు నొద్దను ననుమతి బడయ గోరి
ఫోను జేయగ నిచ్చెను సాను నయపు
టనుమతి ,బయలు దేరుదు మార్య !యిపుడు
షూ టు బూటు లు  ధరియించి సుఖము కొఱకు

ఆసు పత్రికి నేగగ నచట నర్సు
వలయు టెస్టులు గావించి వలువ యొకటి
తెచ్చి ధరియింపు మాయని యిచ్చి వెడల
నేను దొడిగితి  నాగౌను  నెమ్మది గను

ఇంత లోనన డాక్టరు నేగు దెంచి
జబ్బ మొత్తము పరికించి యబ్బ యిదియ
కండ రంబుల  వ్యాధిగా గాన బడియె
మందు లిత్తును  వాడుము మంచి గ నగ

వైద్య పుంగవునకు మఱి వంద నమును
జేసి వచ్చితి మింటికి క్షేమ ముగను
జబ్బ నొప్పిని దగ్గించు సామి !యనుచు
వేడు కొందును శంకరు వినయ ముగను





 

Wednesday, November 26, 2014

న్యస్తాక్షరి --త్రా -గు -బో -తు .,, నాలుగు పాదాలలో మొదట // తేటగీతి /మద్యపాన నిరసనము

త్రాగ  వలదుర  యెప్పుడు  ద్రా గవలదు
గురువు చెప్పిన మాటలు  గుర్తె రిం గి
బోధ పడలేద ? మఱి నీకు  , బుద్ధి గలిగి
తుచ్ఛ మైనట్టి దీనికి దూర ముండు

పద్య రచన -అల్లూరి సీతా రామ రాజు

పట్టి యిచ్చిన నల్లూరి నెట్టు లైన
నిత్తు పదివేల  రూప్యము లిపుడె యనుచు
బ్రకట  నగలదు  చూడుడు  పటము మీద
యెవరి  వశముగా  నున్నవో యేమొ ? సామి !

 విల్లుని బట్టిన వీరుని
యల్లూరిని బట్టి నీయ నభిహారికమున్
చెల్లింతుము పది వేలని
జిల్లా యధికారి తెలియ జేసెను గెజిటన్ 

Tuesday, November 25, 2014

దిగ్జయుండనగ సవర్ణ దీర్ఘ సంధి

దిక్కు లెల్లను గెలిచె డి దీటు గాడు
దిగ్జయుండనగ ,సవర్ణ దీ ర్ఘ సంధి
యచ్చున కదియే  యచ్చు లు  వచ్చి యగును
దెలిసి కొను మమ్మ  యి ట్లుగా   తేజ ! నీవు

పద్య రచన -బొప్పాయి పండ్లు

పండ్ల బారిన బొప్పాయి పండ్లు జూడ
నూరు చున్నది నోరునా యూర్మి ళ మ్మ !
తెచ్చి పెట్టుమ యొక పండు తీపి గలది
డబ్బు లిత్తును  వెనువెంట నిబ్బ డిగను

శ్రీ సూర్య నారాయణ గారికి

శ్రీ సూర్య నారాయణ గారికి నమస్కారములు . మీరు ప్రతి దినము మొదటి వరుస .
అందులకై నా స్పందన

అమెరి  కాలోన  నుంటిర ? యార్య ! మీరు
శంక రాభర ణంబున శంక రయ్య
వారు పోస్టు జే  యంగనే వ్రాయు చుండ
వచ్చె ననుమాన మయ్యది పరమ గురువ !

కాని యెడ లన రే యిని గాపు గాచి
పద్య రచనము గావించి పండు కొనెద
రేమొ , యటులైన మీకుగా నిప్పుడా ర్య !
వంద నంబులు సేతును భవ్య చరిత !

నాదు విషయము దెలుపుదు నమ్ము డా ర్య !
మూడు మాసము లైనది ముత్యముగను
వచ్చి యమెరికా ,మఱి యుందు  మార్చి వరకు
పద్య రచనము మఱి యును  పఠ న  ములిట
నిత్య కృత్యము లాయెను నిక్క ముగను

Buffalo grove on 24-11-2014


వాతావరణ ము  జూడగ
నాతపమే గాన బడక యహ మంతయునున్
శీ తలముల  తో  గూడిన
వాతము లవి వీచు చుండె భయములు గలుగన్

మంచు గలిగిన  వర్షము మహిని బడగ
దాని వేగమ్ము జుడను దడయు కలిగి
మేని యందలి వెంట్రుకల్ మీది కెగసి
నిక్క బోడుచుకు నుండెను నిక్క ముగను

నేల యంతయు దెల్లనై నిజము గాను
దట్ట  మైనట్టి మంచుతో దిట్ట ముగను
బాల సంద్రము వోలెను భాసిలు టను
నబ్బు రంబును గలిగించె నా క్ష ణ మున

ఎన్ని గంటలు కురియునో నేమొ యికను
కార్ల పై భాగ మంతయు కప్ప బడియె
నింక నింకను గురిసిన యిండ్లు గూడ
మంచు మయమగు నను మాట మఱు వ  వలదు

బయట నెంత మంచు పడుచున్న ,శీ తల
మెంత యున్న గృహము లందు వెచ్చ
గానె నుండు మరిని లేనియెడ నెవరు
బ్రదుక జాల రిచట  పచ్చి నిజము

తగ్గు ముఖము వట్టె  దా మంచు వర్షము
రెండు గంటలు మఱి  మెండు కురిసి
తెరిపి యిచ్చె నభము తెల్లగా మారుచు
గాని పించె యెండ కనుల కిపుడు

రెండవ రోజున కూడను
మెండుగ నిట హిమము పడుచు మేదిని గప్పన్
గండముగ మారె పయనము
దండము నిక సాంబ !నీకు దరికిన్ జేర్చన్




నిషిద్ధము -త ధ -ద -ధ -న . ఆటవెలదిలో =అత్తలేని కోడ లుత్తము రాలు

శ్వ శ్రువమఱి లేక శ్రమణి యేయెక్కువ
యడ్డు వచ్చు వారె యచట లేరు
ఇష్ట మైన మార్గ మెంపిక జేసికు
లెక్క జేయ కెవరి యొక్క మాట

Monday, November 24, 2014

పద్య రచన -బ్రాహ్మణుడు -మహమ్మదీ యుడు

బ్రాహ్మ  ణుం డును మఱి యును బ్రాహ్మ ణే త
రుండు నొకబైకు  పైన ని  రువురు బోవు
చుండ ముచ్చట గొలిపెను చూడగానె
భిన్న మతముల బొత్తుల  నెన్న దరమె ?


 అల్లదె చిత్రము చూడుము
మెల్లగ నాబ్రాహ్మణుండు, మ్లేచ్ఛ గురువుతో
దెల్లటి వాహన మెక్కియు
నుల్లము లలరంగ బోవ నుత్సాహించెన్.


Sunday, November 23, 2014

పిల్లన్ గ్రీ కంట కనుచు భీష్ముడు మురిసెన్

ఇల్లాలుగ దన తండ్రికి
తల్లిగ మఱి తనకు జేయ దలచియు మదిలో
నల్లన నాసత్యవతి యనెడి
పిల్లన్ గ్రీ కంట గ నుచు భీష్ముడు మురిసెన్




పద్య రచన -మేకపిల్ల -బాలుడు

మేక పొదుగు చేపి మేకపి ల్ల యచట
పాలు ద్రాగు చుండ బాలు డొకడు
తొంగి చూచు చుండె వంగి  వంగి మిగుల
చిత్ర మదియ చూడ చిత్ర మాయె

Saturday, November 22, 2014

దత్త పది --- ఆలము -కాలము -వాలము -జాలము రామాయ ణా ర్ధము

ఆలమున గాచుకొ నుముర
కాలము నిక దీరె నీకు ,కర వాలముతోన్
జాలము జేయక జంపుదు
గూళు డ ,యో రావణుండ !కోరిక తీ రన్

కాలము చెల్లెను నీకిక
నాలము లో  గాచు కొనుము హా  దశ కంఠా !
వాలము గలిగెడు  వీరుల
జాలముతో వత్తు నిన్ను జంపుట కొఱకున్

పద్య రచన--- రాధా కృష్ణులు

రాధా కృష్ణుల జూడగ
వ్యాధులులే  దొలగి ,గలుగు పరమప దమ్మున్
గాధలు వినగను గృష్ణుని
బాధలు మఱి  మఱు వ,  వచ్చు బ్రమదము మదికిన్

కుసుమ కోమలి రాధమ్మ కోర్కె లలర
కృష్ణ భగవాను మీదన కేలు వేసి
యధర మధరము గలుపుచు  నాస్వ దించు
రాధ మఱియును గృష్ణుని రహిని గొలుతు

ప్రణయ సుందరి ! జెప్పుము వలపు గలిగె ?
నేల నీ చూపు   లటులుండె ? నిత్తరి మరి
చిరున గవులలో సంకోచ మౌర ,యేల ?
హరిణ లోచన ! యాకంటి  యర్ధ మేది ?
కోమలధరా మృ  తముదాచు  కొనగ నీవు
నేల ? మఱి నాకు దెలుపుము బేల ! యిపుడు





Friday, November 21, 2014

ధై ర్యంబే లేనివాడు ధరణిని గెలిచెన్

ఆర్యా ! యేపని జేయడు
ధై ర్యంబే లేనివాడు, ధరణిని గెలిచెన్
కార్యోన్ముఖుఁ డయి మోడీ
చర్యలు కురిపించె నోట్లు చయ్యన గెలువన్.

పద్య రచన -చిన్న పిల్ల -చదువు ను కూరల అమ్మకము

చిత్ర మందున నచ్చట చిన్న పిల్ల
యానప మఱి యు  బొప్పాయి నమ్మ  నునిచి 
చేయు  చుండెను లెక్కలు శీ ఘ్రముగను
జదువు మీదన నామెకు శ్రద్ధ కనుక

కూర లమ్ముచు నొకప్రక్క ,కూ డికలను
 జేయ జూడగా సంతస మాయె మనసు
వంద నంబులు సేతును వంద లాది
 చిన్న దైనను నాపిల్ల చేత లకును

Thursday, November 20, 2014

న్యస్తాక్షరి == కం-స -వై -రి (పాదా క్షరములుగ ,తేటగీతి ,శ్రీ కృ ష్ణ స్తుతి )

కంజ దళముల బోలిన కనులు  కలిగి
సమర మందు నర్జు  నునకు సాయ పడుచు
వైభ వంబును సమకూర్చి  విభవ మున,ము
రిపెము లనొసంగు  చుండు హ  రినిల గొలుతు


పద్య రచన -హనుమ-రావణుడు

తనదు తోకనే చుట్టల నొనర జుట్టి
రావణా సురు నికెదురు రాజు వోలె
తిష్ఠ  వేసికూ ర్చున్నట్టి  తీరు జూడ
నద్భు తంబైన ఠీ వది  యంగదుడె గ

తనదు తోకనే చుట్టల నొనర జుట్టి
రావణా సురు నికెదురు రాజు వోలె
తిష్ఠ వేసికూ ర్చున్నట్టి తీరు జూడ
నద్భు తంబుగ నుండెనా హనుమ ఠీవి



తొలగించు

శ్రద్ధాంజలి

లేవు లేవమ్మ!యి కమాకు లేవు నీవు
నె చటి  కేగితి? వత్తువ, యి పుడు నీవు?
కళ్ళు మాయవి కాయలు కాచె సుమ్ము
రమ్ము వేవేగ మమ్ముల రక్ష సేయ .

 చిన్న దనమున మమ్ముల చేర దీ సి
చదువు సంధ్యలు నెరపియు సాకి నావు
తల్లి  వైనను  నీవెగా దండ్రివైన
మఱు వ జాలము నిన్నమ్మ ! మఱు వ లేము

 జ్ఞాప కంబులు మాకవి జ్ఞప్తి కొచ్చి
ఉన్న లేకున్న నున్నట్టు లుండె మాకు
అమ్మ ! చూతుము నొకపరి యమ్మ  రమ్ము
 మునుపు వోలెను నీ రాక ముదము మాకు .

ఎవరు వచ్చిన విసుగక నెందు కనక
కడుపు నిండుగ పెట్టుట కలదు నీ కు
నాన్న కూడను నిందుకై నమ్మి నిన్ను 
నుత్స హించును గదమ్మ !నుత్సు కతన

 అమ్మ ప్రేమను బంచిన యమ్మ వీ వు
మఱు వ జాలము మఱి మేము మరువ వ మ్మ !
మాట  లాడుచు నుండంగ మరణ మగుట 
దైవ నిర్ణయ మీ యది దరమె దాట ?

 ఆశ లేదమ్మ ! నీ కిల యాశ లేదు
ఉన్న దానితొ సంతృప్తి నొంది తీవు
సాటి రారమ్మ యె వరును సాటి రారు
అందు కోవమ్మ జోహార్ల నందు కొనుము .

 అమ్మ ! నాన్నయు  బావయు హాయి గాను 
వెళ్లి పోయిరి మమ్ముల విడిచి నిచట
నీవు కూడను వారికి నేస్త మైతి
దిక్కు లేనట్టి మాకిక దిక్కు సాయి .

 అమర లోకము జేరితి వమ్మ నీవు
అమరు లందఱు నినుజూచి యాద రించ
మసలు కొనుమమ్మ యక్కడ మాన్యు రీ తి
నా దు కొనగను  నమరులు , హాయి గుండు .

 చావు పుట్టుక లయ్యవి సహజ మయ్యు
జన్మ లేకుండ జేయను సమ్మతించి
సకల శుభములు గలిగించు శంక రుండు
నీదు నాత్మకు శాంతిని నించు గాక !

శాస్త్ర సంగీత మననీ కు జాల బ్రీతి
పాడ గలవన ర్గళ ముగ బాట లెన్నొ
సాటి యెవరమ్మ ! నీకిల సాటి యెవరు ?
అందు కొనుమమ్మ !శ్రద్ధాంజ  లందు కొనుము
----------------
(20-11-2014 తేదీన మా అ మ్మగారు  పరమ పదించిన సందర్భముగా )
అశ్రు పూర్వక నయనాలతో ........ పరబ్రహ్మ శా స్త్రి ,రామ గోపాలం మఱి యు కుటుంబ సభ్యులు

Wednesday, November 19, 2014

పద్య రచన -బొంగరము

బొంగరము జుట్టు  ద్రాటిని
రింగులవలె చుట్టు ద్రిప్పి రేరే యనుచున్
భంగిమల నొలక బోయుచు
ఖంగను నటు నేల వదల గబగబ దిరుగున్


చేత బొంగరమ్ముఁ జేర్చి త్రాడును చుట్టి
వదలిన నది తిర్గు వర్తులముగ
చేత బ్లాగుఁ బట్టి చిత్రాలఁ బెట్టి
వదల వెల్గు నవియె పద్యములుగ. 

పా దమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్

ఏదరి జూచిన నుండవు
పా దమ్ములు  లేని తరులు ,పరుగిడ జొచ్చె
న్నాదర బాదర నొకపులి
తా దాపున వేటగాడు తరుముచు రాగన్



ఈదురు గాలులు ధాటికి
పాదమ్ములు లేని తరులు పరుగిడ జొచ్చెన్
భూదేవియె శోకించెను
రాదారుల పాదపములు రాలుటగనుచున్
.
ఏదెస వానలు గురియన్,
గోదావరి పొంగివచ్చె గుములుగ నందున్,
వేదొరలి నీట దృఢతర
పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్.




Tuesday, November 18, 2014

నిషిద్ధాక్షరి శ -ష -స లు ,,,,శిశు పాల వధ ... తేటగీతి లో

ఊ రుకొంటిని దప్పుల నూఱు వరకు
హతము జేతును నిప్పుడే యతని  నింక
ననుచు గృ ష్ణుడా చేదివి  భునియ  మపురి
కంపె  జక్రాన దేవతల్  హాహ  యనిరి



అగ్ర తాంబూల మందిన యచ్యుతునకు
నూరు బాధలు గలిగించి దూరు చుండ
చక్రి కినుకున విడువగ చక్ర మంత
దంతవక్త్రుని యనుజుని తలను ద్రెంపె

పద్య రచన తల్లీ -కూతుళ్ళ సంభాషణ

కవిత లనినయా తల్లికి కడుపు మంట
యేమొ !  లేనిచో నట్లను టిచ్చ  గొనునె ?
నిచ్చ గించును గాబోలు తుచ్చ మైన
బూతు పాటల సినిమాలు భూరి గాను

కవుల పల్లకిమోయు భువినేలు మహరాజు
పచ్చలపల్లకీ పట్టిపోయె
అచ్చరంబుకు లచ్చలిచ్చి కైతలమెచ్చు
లచ్చిపుత్రులు నాకమిచ్చగించె
శ్రీనాధ కవిరాజు చీకాకుపాలాయె
గండపెండెరమాయె బండశిలలు
భాగ్యనగరి యశోభాగ్యమూర్తుల పంక్తి
విశ్వనాధకులేదు విగ్రహమ్ము

భువన విజయమ్ము బుగ్గియైపోయెనన్న
కవుల విభవమ్ము అగ్గిలో కాలెనన్న
అవని కవిగాంచి ప్రజ మేలమాడుచున్న
కవనమల్లంగనదియేల కాముడన్న

Monday, November 17, 2014

దురితములకు గారకుడు చతుర్ముఖుడు గదా

అరయగ నా  శనియే గద
దురితములకు గారకుడు, చతుర్ముఖుడు గదా
ధరగ లుగు జీవ కోటిని
నిరవుగ సృ జియించు నతడు నెక్కా లమునన్

పద్య రచన -జామపండ్లు

జామపండ్ల రాశి చవులూరగా జేసె
నొకటి రెండు దినిన నొప్పు గాని
యంత కంటె నెక్కు  వైనయెడ ల జీర్ణ
శక్తి తగ్గి యగును చర్మ రోగి

స్నొఫాల్సు

ఉష్ణ మత్యంత తక్కువ యుండు వలన
కురియు చుండెను వానగా పరిసరముల
మంచు బిందువు లిచ్చట యంచితముగ
నిచ్చ ట నగను నమెరికా యిలను యందు

చూడ కనుచూపు మేరను చోద్య ముగను
పాల సంద్రమా యది యను భ్రాంతి కలిగె
దనర వర్ణించ దానినా దరము కాదు
సాహ సింతును నింకనా  శక్తి కొలది

కురియు చున్నది నొక వైపు కొలది గాను
నింక నొకవైపు వడగండ్లు నింక మఱి ని
మార్గ మదిజూ డ పొడవున మంచు కలిగి
 ప ఱచి  నట్లుండె దెల్లని బట్ట యొకటి

రాలు చుండెను నాకులు రాలు నట్లు
మంచు బిందువు లేకాని యించు కవియ
తేలి కైనట్టి యాకుల తీరు వోలె
గాన బడుచుండె నోయమ్మ ! కంటికిపుడు

బయట మంచు బడగ వాతావరణమది
మిగుల చల్ల నయ్యి మేను నందు
వణకు పుట్టి మిగుల భరియించ రానిదై
యుండె నార్య ! యిచట మెండుగాను

అంత కంతకు నెక్కువ యైనకతన
శీత లంబును నోర్చగ  చేవ లేక
నింటి యందున నుంటిమి  యెక్క డకును
వెళ్ళ కుండగ ,హీటరు  విడువ కుండ .

ఆరవేయగ  బట్టల నారుబయట
చల్లబడి ,యగు గట్టిగ బుల్ల వలెను
మనకు సహితము చేతులు మడవ రాక
విఱు వ  రెండుగా క్షణములో విఱి గి  పోవు

దత్త పది -అత్త -మామ -బావ -వదిన ,,భారతార్ధము

మామనము సంతసిల్లగ
బ్రేమగ నిక నత్త  బావ  ప్రియమగు  వదినె ల్ 
క్షేమముగా నుండునటుల
నేమము తోజేయు సంధి  నేర్వగ కృష్ణా !


ఏమా ?మయసభ మాయలు
మామా! ద్రోవది నగవులు మరువగ లేనే!
మేమత్తరి నగుబాటున్
నా మడతుక బావనముల నణచంగవలెన్


(శ్రీకృష్ణుఁ డర్జునుని యుద్ధమునకై పురికొల్పు సందర్భము)

"చూపుమా మహాశౌర్యప్రతాపములను!
యుద్ధమాయత్తమాయె, నో యిద్ధచరిత!
బాడబావహ్నికీలోగ్రభాసమాన!
నీవ దినమణి సుతునోర్చ నెగడు యశము!"

Sunday, November 16, 2014

పద్య రచన -తిన్నని భక్తి

తిన్నని భక్తిని జూడుమ!
య న్నువుగా నతడు నిచ్చె నాశంభునకున్ 
కన్నును దానుగ దనదియు
కన్నం తనె  నీ రుశివుని కంటన్ రాలన్

తిన్నని భక్తికి మెచ్చియు
నన్నువతో శంకరుండు నతనికి నిచ్చెన్
మిన్నగు మోక్షపదంబును
సన్నుతి జేయంగ సురలు షహబాస నుచున్




Saturday, November 15, 2014

స్వచ్ఛ భారత్

స్వచ్ఛ భారత్తనెడు పేరు సఫలమునకు
మన మందర మొక్కటై కువలయంబు
నందు గలయట్టి చెత్తను నంత మొంద
జేసి పెంచ వలయు నెన్నొ చెట్లు భువిని

ఇందు కొఱకు మనము బృంద ములుగ నయి
యొక్క టొ క్క బృంద మొక్కొ కదరి
కేగి నచట నుండు మాగికు ళ్లి  నచెత్త
నేరి పార వేయ వలయు సుమ్ము

గ్రామ గ్రామాలు పురములు కాక మఱి ని
పల్లె పల్లెలు వీధులు బాగు జేయు
పనిని దృ ఢ ముగ  మనసున బట్టు కొనుచు
కార్య దీక్ష కై నడుములు గట్ట వలయు 

చెత్త యనునది లేకుండ శీఘ్ర ముగను
జేయ ,పూను కొనవలె నజేయముగను
నప్పు డనిపించు కొను నార్య !యెప్పటి కిని
భరత దేశము పరి శుభ్ర భరిత మేను

రహదారుల కిరు వైపుల
 ష హబాసనునటు ల మీరు చక్కని మొక్కల్
 అహమహమనుచును నాటిన
 విహగము వలె పైకి పోవు వేగము తోడన్

 చెట్లు నాటిన మనకిచ్చు చిత్త శాంతి
యెందు కనగను జెప్పుదు నెండ లోన
దిరిగి వచ్చిన సమయాన తరువు క్రింద
నిలబ డం గను   నిచ్చును నీడ మనకు

తరువులు పెంచుట వలనన
తరతరముల వారి కిచ్చు తరగని ఫలముల్
ధరనవి చల్లగ వీచుట
వరమది మనకగును గాక ! వానలు రాకన్

భరత దేశము పరి శు భ్ర భరిత మైన
నాడు,మనప్ర ధాని కలలు న్యాయ సమ్మ
తమగు మనకది యానంద  దా యకమ్ము
కనుక ప్రార్ధింతు మిమ్ముల ననుది నంబు

రండి కలవండి శుభ్ర ప రచగ మరిని
చేయి చేయిని కలుపుద మీ యదనున
భరత మాతకు జేజేలు బలుకు నెడల
నామె  యిచ్చును నాశిసు లందరకును

ఛంద మెఱు గ కుండ వ్రాసె శార్దూ లమ్మున్

        కం  దము ననే ను వ్రాయగ
నిందిర పతి వ్రాసె నొక్క యె ఱు గనిగవితన్
 సుందర పద జా లముతో
ఛంద మెఱు గ కుండ వ్రాసె శార్దూ లమ్మున్

చందపు లక్షణ మెఱు గని
ఇందిరపతి వ్రాసె నిపుడు నిమ్ము గ గవితన్
సుందర పద జా లముతో
ఛంద మెఱు  గకుండ వ్రాసె శార్దూ లమ్మున్

 

పద్య రచన -అవ్వ పేపర్లు అమ్ముట

అవ్వ యచ్చట కూర్చుండి యమ్ము చుండె
పాత ,క్రొత్తవి  యైనట్టి  పలుర కముల
పుస్త కంబులు  పేపర్లు  పొలతు లార !
రండు కొనగను మానుచు దిండి యైన



Friday, November 14, 2014

న్యస్తాక్షరి -రా -వే -పో -వే ,ఇవి నాలుగు పాదాలలో చివర /కంద ము / దుశ్శా సనుని మాటలు


ద్రౌపది మంచిగ నికరా
యేపుగ నీచీర లూ డ్తు నిచటకు రావే
ప్రాపుగ నెవరును  మఱి ,పో
దాపునకుం రారు భామ !తడవక పదవే

పద్య రచన -బాలుడు -నల్లబల్ల -ఉపాధ్యాయుడు

నల్ల బోర్డు మీద నల్లని బాలుడు
రెండు ,రెండు  వ్రాసి  రెండు కూడ
నెంత వచ్చు ననుచు వింతగా, నొజ్జను
నడుగ వింత గొలిపె నార్య  నాకు

నాగ బంధము (చమత్కార పద్యము )

గురుతుల్యులు ఏల్చూరి వారికి నమస్కారములతో

బంధము లన్నిటి గంటె ను
బంధమె మఱి 'నాగ ' గొప్ప బంధము కాదే ?
బంధములు చాల యున్నవి
బంధముగా గవిత వ్రాయ పరులకు వశమే ?


బంధము లన్నిటి కంటెను
బంధమె మఱి గొప్ప నాగబంధము కాదే ?
బంధము లెన్నో యున్నవి
బంధకవిత వ్రాయ నెల్లవారికి వశమే ?








Thursday, November 13, 2014

బాలల దినోత్సవము పెద్ద వారి వేడ్క

పండుగ వలెను  జరిపిరి   బాలు రార్య!
బాలల దినోత్సవము,పెద్ద  వారి వేడ్క
జరుపు టి య్యది ఘనముగ సంతు కొఱకు
బాల బాలిక లిరువురి పండు గౌట

నెహ్రూ పుట్టిన రోజు

పుట్టితి వట యీ రోజున
బుట్టిన యో నెహ్రు !నీవు పూర్ణిమ చంద్రు
న్చట్టున వెలిగితి విప్పుడ 
య ట్టులె  యొకసారి రమ్ము హర్షము గలుగన్

నీదు పుట్టిన రోజును నేడు మేము
జరుపు కొనుచుంటిమి మఱి బా సు రముగాను 
బం డు గనువోలె ,మనసార పంచి పెట్టి
చాకు లైట్లను బాలలు సంతసించ


Wednesday, November 12, 2014

నిషిద్ధాక్షరి - ర -ఱ లు నిషిద్ధములు తేటగీతి లో -రామాయణ ప్రాశస్త్యము

జనకు ని పలుకు జవదాట మనసు లేక
జాన కీ పతి వెడలెను కాన నమున
కీయ  దిమనకు  బోధించె నీ విధముగ
మనము సాగించ వలయును మనుగ డనిక


ఇందు పితృవాక్య పాలనమింపుగాను
అన్నదమ్ముల యనుబంధమందముగను
సాధ్వి లక్షణములనెంత చక్కగాను
తాను లిఖియించి వాల్మీకి ధన్యుడాయె

పద్య రచన -భట్టి విక్ర మార్కుడు

చిత్ర మయ్యది జూడగ చిత్త మందు
వచ్చె ననుమాన మోయమ్మ !భట్టి విక్ర
మార్కు డేకార్య  సిద్ధికై మఱి శ వమును 
మోసికొని పోవు చుండెనో మూర్తి ! చెపుమ . 

మా మనుమరాలు ,తేజ డేన్సు శుభాకాంక్షలు

నీవు చేసిన నృత్యము నిన్న నేను
చూసి సంతసం బొందితి నీశు నిన్ను
నెల్ల వేళల జూచుత ! చల్ల గాను
నాయు రారోగ్య సంపద లన్ని యిచ్చి .

నీవు నింకను బాగుగ నేర్చు కొనుచు
మంచి పేరును గడియించు  మించి గురుని
సంత సించును నీమాత  సంతు వగుట
పొంగి పోవును నీ తండ్రి పుత్రి కగుట

నీదు  నృత్యము నమ్మమ్మ నిరతి జూచి
యెంత బాగుగ నున్నదో నెంత బాగు
ననుచు ముదమార చప్పట్లు దనర గొట్టె
నమ్మ !తేజమ్మ !మామయు హర్ష మొందె .

సంతసంబున  నీకిత్తు సాదరముగ
వేయి రూప్యము లోతేజ ! బిడియ పడక
తీసి కోవమ్మ ,మఱి నేను దెచ్చి యిత్తు
వత్తు కొలదిది  నములలో వత్తు తేజ !

Tuesday, November 11, 2014

తులువను దండించువాడు దుర్మార్గు డగున్

ఇలనగు సన్మార్గుడుగా
తులువను దండించువాడు ,దుర్మార్గు డగు
న్గలలో సైతము పరులకు
తలచునొ నపకార మె వడు తప్పక యతడే

పద్య రచన -సీ తాఫలముల గంపలు

సీ తాఫలముల గంపలు
సీతా ! మఱి చూడు మచట శిఖరముల వలె
న్నాతా వుల  గనిపించెను
నాదారిన వచ్చుకారు నాగున య చట న్ ?

Monday, November 10, 2014

లక్ష పత్రి పూజ


లక్ష పత్రి పూజ లక్షణం బుగ జేయ
 సంత సించి మదిని శంభు డార్య !
సకల  సంపద లను సకలభో  గములను
దప్ప కిచ్చు మనకు దండి గాను

అభి షే  కమనిన నిష్టము
నభవునకుం గనుక జేతు రందఱు పాల
న్నభిషే  కముజే  తురుమఱి
శుభముం గా నమక చమక సూక్తుల తోడన్

పాలు కాకుండ నీరును బంచ దార
పండ్ల రసముల తోడన భవున కికను
పెరుగు వెన్నయు నేతిని బేర్మి దోడ
చేతు రభిషేక మో యమ్మ ! శివున కుమ ఱి

ఆవి  ధమ్ముగ నభిషేక మచటి జనము
బట్టి యెనిమిది గానిచో పదియు మార్లు
మంత్ర యుతముగ నభిషేక తంతు యందు
మనసు నుంచియు జేతురు మాన్య ముగను

దళము లందున మారేడు దళము లనిన
ప్రీతి భవునకు కావున  బ్రియము తోడ
సదరు మారేడు దళములు సంగ్ర  హించి
తెచ్చి పెట్టుదు  రొకచోట పచ్చి వవియ

శివుని యభిషేక తంతుల చివరి దెసన
తాన మాడించి బాగుగ దడిని దుడిచి
యా భర ణముల నన్నిటి నందముగ ను
విశ్వ విభునకు వేతురు విబుధ వరులు

పత్రి పూజను జేయగ వచ్చి నట్టి
బ్రాహ్మ ణో త్తము  లచ్చట బ్రభువు చుట్టు
తిష్ఠ వేసిరి మనముల నిష్ఠ గలిగి
పూజ జేయగ మొదలిడె  బొలుపు గాను

ఒక్క టొ కటిగ నామాలు చక్కగాను
బ్రాహ్మణోత్తము డొక్కడు బయట నుండి
చదువు చుండగ లోపలి సాములపుడు
వేయు మారేడు దళములు విభుని మీద

లక్ష నామాలు కొఱకునై లక్ష పత్రి
వేసి పూజింతు రాశివున్ వినయముగను
దీని నందురు లక్ష పత్రి యనె  పూజ
కార్తి కంబున జేతురు గ్రామ ప్రజలు

కనులు విందు జేయు కార్తీక పూర్ణిమ
దినము నాడు కోటి దీప ములను
వెలుగ జేయ పిన్న పెద్ద లందఱు మఱి
కాంతు లీను చుండు కాలుని గుడి

కోటి దీ పో త్సవ మనుచు కోటి దీ ప
ములను వెలిగింత్రు కార్తికమ్మున జ  నములు
దీప కాంతుల తోడన దేజరిల్లి
పట్ట పగలుగ భాసిల్లు  ప్రాంత మదియ .

అనుభవంబున జెప్పితి నార్యులార !
యిచ్చ గింతురొ ,లేదొ మీ  యిష్ట మదియ
యిలను డొంకరా  యిపురాన వెలసి నట్టి
హరుని సుతుడగు స్కం దుని నా లయమున
బూజ లెన్నియో జేసితి పూర్వ మునన

 


దత్త పది --శవము -పాడె -కాడు -చితి (జన్మ దినము )

శైశ  వమున న  గాంచితి శర్వు గుడిని
నాదు చెలికాడు గొంపోవ నాదు జన్మ
దినము రోజున నంతలోన  దెలివి తప్పి
క్రింద బడగ, గా పా డె నన్మందు లిచ్చి

ఐసు ఫ్రూ టు లు

ఐసు ఫ్రూ టు లు గలవార్య ! హాహ యచట 
యెంత బాగుగ నున్నవో నంత చేటు
గలుగ జేయును నిజమిది కనుక నెవరు
చీక రాదవి  కవివర ! చీక వలదు

Sunday, November 9, 2014

మంజుల నాధా !



కాపాడు మయ్య !మమ్ముల
నేపాపము సేసి యెఱుగ మేవేళల లోన్
మీ పాద సేవ చేతుము
మా పాలిట దైవ మీవె మంజుల నాధా !

గాడిద పాదముల బట్టె గజ కర్ణు డహో

రేడగు నావసుదేవుడు
గాడిద పాదముల బట్టె ,గజ కర్ణు డహో
వేడుకగా గనిపించెను
జూడగ నాచెట్ల మధ్య చూడ్కులలరగన్ 

పద్య రచన -వృక్షములో గణపతి

రెండు  వృక్షము లచ్చట నుండె చూడు
గజము  ఖుని యాకృ తి దనర  గాను నాహ !
యేమి యద్భుత మద్దియ యేమి  ప్రతిమ ?
వంద నంబులు గణపతీ ! వంద నమ్ము

జోహార్లు



  అయ్యా ....
  గోపాలయ్యా !
  అంతంత మాత్రం
  నీ ఆరోగ్యం
  అయినా ....
  మొన్న తల్లి దండ్రుల ఋణం
  నిన్న సోదరి ఋణం
  నేడు సోదరుని ఋణం
  కాదు .......
  పుణ్య లోకాలకు పంపే భాగ్యము నీకు కల్గింది
  అహా ! ఏమి నీ ధార్మికత !
  నావల్ల కాదు
  నిన్ను అభినందిచడం
  ఇవి యే నా జోహార్లు .
 


ఆశీస్సులు
 1 . తమ్ము భార్యకు ,పాపకు దారి చూపి
    ఆదుకొనుమయ్య ! గోపాల ! ఆదుకొనుము
    జరగకూడని దారుణం జరిగిపోయె
    ఏమి సేతుము చెప్పుదు మేవరితోడ !

2   ధైర్యము సెప్పుము లక్ష్మికి
    ధైర్యము  యే సగము బలము 
ధైర్యము సిరులున్
   
ధైర్యము మనుగడ నిచ్చును
   
ధైర్యముగా నుండి నీవు ధైర్యము చెపుమా  !

3   ఆదిదంపతులై నట్టి యాది దేవు
    లాయురారోగ్య సంపదలన్ని యిచ్చి
    కంటికిని    ఱ ప్ప యట్లయి కాచుగా త !
    ఇ  మ్మహా త్ముల గారుణ్య మింపు మీ ఱ
   
   

ప్రసాద్

1 . లేవు లేవాయె యిక మాకు లేవు నీవు
    నే డకేగితి మమ్ముల నిచట విడిచి
    రమ్ము రారమ్ము వేవేగ రమ్ము చిన్ని!
    యె దురుచూతుమ.నీ రాక ముదము మాకు.

2   ఎచ్చట వేసిన గొంగళి 
     యచ్చటనే నుండు పగిదియాస్తులు,సరుకుల్ 
     యె చ్చట పడితే నచ్చట
     కచ్చా గా నుండె చిన్ని!కనుగొనుమయ్యా!

3 .  బ్రతికినన్నాళ్లు రాజాల బ్రతికి తీవు
    ఐదువేళ్ళుకు బెట్టితి వైదురింగ్లు
    లోటు లేద య్య ! చిన్నయ్య !లోటు నీకు
    నీదు భోగము రాదయ్య ! నేరికి నిల

  1. వినబదయ్యా నికపై
            వినబడదిక నీదు మాట వినబదయ్యా !
       వినిపింపు మయ్య ! నొకపరి
       వీ నులవిందౌను మాకు గానమువోలెన్
   5  నీదు జన్మము గొప్పది నిహమునందు
       బ్రతుకు భారము మాకిక బాబు ! మాకు
       కార్య కారణ ఘటనల కర్త వీవ !
                      అందుకొనుమయ్య ! శ్రద్ధాంజ లందుకొనుము

పచ్చి మిరప పళ్ళ పచ్చడి

మిరప పండ్లు దెచ్చి  మిసమిస లాడేవి
చింత పండు వలయు నంత నుప్పు
మిసిమి గాగ వేచి మెంతి పొ  డియును, నా
వాలు  మిరప పండ్లు గలిపి మిక్సి

వేసి ముద్ద యైన ,తీసి యా  ముద్దను
బెట్టి  నొండు  చోట యట్టు లెమరి
గరిటె లోన నూనె గాచిపో పునువేయ
నిచ్చు మంచి రుచిని పచ్చడ దియ

పండు మిరప కాయ  పచ్చడి ,నేతిని
వేడి యన్న మందు వేసి కొనుచు
ముద్ద ముద్ద దినగ మోమునం  గల జిహ్వ
రొట్ట లేయు బుగ్గ సొట్ట బడగ

 


 

Saturday, November 8, 2014

న్యస్తాక్షరి ; నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు రా -మా -రా -వు ఉండాలి రావణుని పాత్రలో .. ఆటవెలది

రావణుండు పాత్ర రాణించు  గతనన
మామ  నస్సు  లందు మహితు  డాయె
రాము డైన గాని రావణు డైన భా
వుకులు నతని నెవరు బోల లేరు


పద్య రచన -ఎలుకబోను

ఎలుకల బోనది చూడుమ!
యె లుకొక్కటి వచ్చె నిపుడు నెర నట  గనుచు
న్వ లదా ? యే గగ   నిప్పుడు
నల జూడుము బోర్డు మీది యక్షర పంక్తిన్

హరిని భజించు వారల కనంత విపత్తులు గల్గు మిత్రమా!


హరిని తలంపకుండ మనమర్పణ  జేయుక దైవసన్నిధిన్
తరుణుల జూచి మోహపడి తన్మయమొందుచు  ప్రేమపేరుతో
నిరతము చూపునిల్పుచును నెచ్చెలు లందున నందమౌ మనో
హరిని భజించు వారల కనంత విపత్తులు గల్గు మిత్రమా!

హరిని పరాత్పరున్ విడచి యన్యుల సేవల నుండవచ్చునే
నరులకు దేవదానవగణంబుల కైనను దారిదప్పి స్త్రీ
పరముగ బుధ్ధి నుంచి సుఖవాంఛల దోగుచు నిత్యమున్ మనో
హరిని భజించువారల కనంత విపత్తులు గల్గు మిత్రమా!

Friday, November 7, 2014

పద్య రచన -బంతి పూల నడుమ బాలిక ముఖము

బంతి పూల మధ్య బాలిక  దనరెను
చంద్ర బింబ మువలె  జక్క గాను
ముద్దు లొలుకు చుండె  మోమామె ది గదార్య !
నవ్వు మొగము దా ని నగవు చూడు

Thursday, November 6, 2014

నిషిద్ధాక్షరి =ప ఫ బ భ మ /పద్మ వ్యుహములో నభిమన్యుడు

సులువుగ గిరీటి సూనుడు
జలజాకర గుహకు నేగ శత్రువు లచట
న్నిల జెండాడగ నొక్కని
నిలువగ నిక నీడలేక నిలువున గూ లెన్

ఒక్కడు విల్లుఁ ద్రుంచె, యిక నొక్కడు సారధిఁ గూల్చెఁ, జూడ వే
రొక్కడు వాజిఁ ద్రోసెఁ, ఘనుడొక్కడు తేరును గొట్టె, చాటుగా
నొక్కడు వీరుడై తొడుగునూడగఁ జేసెను, కత్తిఁ ద్రెంచె, లే
డొక్కడు తోడు వచ్చుటకు నొక్కడె యర్జున నందనుండటన్!!


పద్య రచన -చేతి కర్ర ,కళ్ళకు గంతల బాలిక



చేతి  కఱ్ఱ ను  జేబట్టి  చిన్న పిల్ల
సారు చేసెడి  చేతుల సవ్వ డివిని
వింత దోచెను, గ ళ్ళకు గంత  లుం డి
సాము గరిడీలు సేయుట సహచ రులకు

జన్మ రాహిత్యము

పూర్వ జన్మ మందు పూర్ణము కానట్టి
మిగులు పాపతతులు మిగుల కుండ
ననుభ వించ వలెను నాజన్మమునిలను
జీవి జీ వియు  దప్పక జేయమదియ

పాపమంతయు జీవిని బాయు వరకు
జీవి జన్మించు చుండును జేత నముగ
పుణ్య కార్యాల వలననే బోవు నఘము
జన్మ రాహిత్య మునకది సత్పధ మగు

గిట్టు మనుజుడు దప్పక పుట్టు మరల
నతని పాపము విడివడు నంత వరకు
పుణ్య మార్జన జేయగ బోవు నఘము
కాన జేయుము పుణ్యము గలుగు వరకు

పాప ఫలితము గష్టా లు  వరలు నెడల
పుణ్య ఫలితము సుఖములనొ సగు మదిని
పాప ముల జోలి  కేగక బ్రదుకునంత
కాల ముపకృతి జేయంగ  వలయు సుమ్ము




Wednesday, November 5, 2014

పున్నమి వెన్నెలయె వేడి పుట్టించె శివా !

మిన్నగ హాయిని నిచ్చును
పున్నమి వెన్నెలయె, వేడి పుట్టించె శివా !
సన్నని వర్షపు జల్లులు
మన్నున బడి యుష్ణ మగుచు మాతనువు లకున్

పద్య రచన -కార్తీ క దీపములు

మూర్తుల బోలిన ప్రమిదల
నార్తితొ  వెలిగించు చుండె నచ్చట భామల్
కార్తిక పున్నమి యౌటన
పూర్తిగ నట శివుని మహిమ బొగడుచు నుండెన్

తేజ !కార్తీక పూర్ణిమ దివస మగుట
నియమ నిష్ఠ ల తోడన నెలతు లచట
దీప తతిచేత గుడియంత దేజ రిల్ల
 వేలకొలదిగ దీపాలు బెట్టి రమ్మ !

Tuesday, November 4, 2014

దత్త పది -అసి -కసి -నుసి -మసి --కార్తీక పూర్ణిమ

అసిత మంత తొలగ ను సితము గలుగంగ
నావ రించి న మసి  పోవు కతన
కార్తికమున వచ్చు పూర్ణిమ దినమున
కసిగ వెలిగె దీప కాంతు లచట



పద్య రచన -దేవాలయములు

కనుల విందైన  దీపాలకాంతి తోడ
మృడుని  గుడులన్ని ధగధగ మె ఱ యు   చుండు
దనర కార్తీక పూర్ణిమ దినము నాడు
వీ క్ష జేయంగ జాలవు వేయి కనులు

ముమ్మాటికి నిజము


మనము కోరెడి వారల  మధ్య కాక
మనల కోరెడి వారల మధ్య గలుగ
ముదము గలుగును నోయమ్మ ! మదిని నిండ
నిజము ముమ్మాటి కీమాట  నిజముసుమ్ము

కొడుకు కూతు ళ్ళ నుట దప్ప కొంచె మైన
బ్రేమ లేమాత్రమును లేవు  మేమనగను
దరికి జేరరు పలుకరు తమకుదాము
ముక్త సరిగాను బలుకుదు రుక్త ములవి

పిలువరు తాతా యనుచును
బిలువరు మఱి బామ్మ యనుచు బిలువరు మమ్మున్
బిలువక పోయిన సరియే
పలు దూరము నుండ్రు మాకు భయమున నేమో ?

భయము కాదది  యనుకొందు  వరలువణకు
వారు పిలువని మాత్రాన వచ్చు మిగుల
నష్ట మేమియు లేదులే నాకు నిపుడు
వేరె  గలరులే మమ్ముల బిలుచు వారు

బ్రహ్మ కెఱు క


నోటి దూల గాండ్రు నూటికి పదిమంది
యుండ్రు భువిని మఱి ని  నొండు పనియు
లేక నెపుడు నితరు  లే ధ్యేయ ము గనిల
నాడి పోసి కొందు  రార్య ! వారు

ఇతర జనములు సేసె డి  యేప  నైన
నచ్చు బాటుకా  నందున నసుగు గొనుచు
నా ర్య ! యుందురు  నెపుడును నీ ర్ష్య తోడ
వారి బ్రదుకులొ  నిత్యము  వగలె మిగులు

బ్రదుక నేరరు నలుగురి బ్రజల మధ్య
మేము మాకుగా నధికుల మేయ  నుచును
గొప్ప లెన్నియో మఱి చెప్పు కొందు రిలను
వారి సంస్కార మంతియ , బ్రహ్మ కెఱు క

Monday, November 3, 2014

వార్ధ కమ్మున గావలె బడుచు భార్య

కన్నపిల్లల జేయూ త  మిన్న గాను
వార్ధ కమ్మున గావలె , బడుచు భార్య
యవస  రముయుక్త  వయసున  నలరు యువకు
నకు భు  వినిమఱి   నిజమిది  నమ్ము డార్య !


"వార్ధకంబున గావలె పడుచు భార్య
సత్యవతి" యంచు కోరగా శంతనుండు,
దేవవ్రతు డెంతొ భీషణ తీవ్ర ప్రతిన
జేసి,భీష్ముడై నుతిగాంచె జృంభణముగ

పద్య రచన -తమల పాకు

రక రకంబుల దినుసులు రమ్యముగను
తమల పాకున పైనన దనరె నచట
జీ ర్ణ  శక్తిని గలిగించు జీవు లకది
నాకు నీయమ్మ !తాంబూల మో కు  మారి !


తమలపాకున జూడగా తన్మయమున
పాణపట్టము పైనున్న పరమ శివుని
పలు రకమ్ముల పూలను పత్రములను
పూజ జేసిన రీతియే స్పురణ కలిగె. 

పద్య రచన -బా పూ జీ

దేశ మునకుస్వేచ్చను గోరి  దిశలు పదియు
జనుల  నొక్క ద్రా  టిననడి  పినమ  నుజుడ !
నీ దు  ధీశక్తి  నెన్నగ రాదు నాకు
వంద నంబులు నీకివె  వంద లాది .

న్యస్తాక్షరి ---వి -శ్వ -రూ -ప -నా లుగు పాదాలలో మొదట ఉండాలి కురు సభలో విశ్వరూపము ,,పద్యము .-ఆ టవెలది

వినుడు  సభికు లార!వినిపింతు నొకటి న
శ్వర మ గునది  యనుచు శాంతి కామి ,
రూప రహితు డపుడు రూపము దనది చూ
పంగ దనివి దీర వారు కనిరి

Sunday, November 2, 2014

మహి పుట్టిన రోజు కార్య క్రమము

తెచ్చిరి పీజా బాక్సులు
దెచ్చిరి మఱి డ్రింకు లెన్నొ దెచ్చిరి కేకు
న్దెచ్చిరి తినుటకు ప్లేటులు
తెచ్చిరి యిక గ్లాసు లన్ని దెచ్చిరి యెన్నో

వరుస బెట్టిరి వాటిని భద్రముగను
కేకు కోయంగ సంతోష కేకు పీసు
పీ సు  లుగజేసి  పంచిరి ప్రీతి తోడ
వచ్చి నటువంటి యందరి  బంధు వులకు

కేకు కోయు నపుడు కేరింతలు మఱియు
హా పి  భర్తు డే  యనునట్టి  యఱపు లవియ
మారు మ్రోగెను గదియంత  మరల మరల
పిన్న పెద్దల యఱపులు   మిన్ను నంటె


బల్ల దగ్గర కూర్చుండి బాల లపుడు
తమకు వలసిన భో జ్యము ల్దమకు  తాము
వేసి కొనుచును దినుచుండ వేగముగను
చిత్ర మనిపించె  నందరి చిత్తము లకు

చిన్ని బాలుడు తననోట చీ కికొనుచు
చాకు లైటును నీయను జాప  చేయి
పిల్ల వానిగు  ణ మునకు బ్రీతి గలిగి
యబ్బు రంబును గలిగించె నందఱకును

బేసు మెంటున కేగిరి పెద్ద లపుడు
మేము సేవించి భోజ్యము మితము గాను
పలుకు లాడుచు నిద్దుర వచ్చు వరకు
పండు కొంటిమి హయిగ పరుపు మీద

పద్య రచన -యమ ధర్మ రాజు -ముసలమ్మ

తనదు కొఱ కునై సమవర్తి  తనర రాగ
నొక్క పదియు ని  మిషములు నోపి యుండు
సీరి యలుపూర్తి  తోడనే చేర నిన్ను
వత్తు  నోయము  డ ! మఱి నే   వత్తు, నిజము

దీపము బెట్టంగ దగును దెల వారంగన్

ఆ పర మశివుని దలచుచు
దీపము వెలిగించ నరుడు దేదీ ప్యము గా
బాపములుండవు కావున
దీపము బెట్టంగ దగును  దెల వారంగన్

ౘూపరి సూర్యుఁడు జనులకుఁ
దాపపుఁ దిమిరమ్ముఁ బాప ధవళిత కరుఁడై
తూపగు నిరులకు నిఁక త
ద్దీపముఁ బెట్టంగఁ దగును తెలవాఱంగన్!