Wednesday, September 21, 2016

చమత్కార పద్యాలు



ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

మొదటి అర్థము - గణపతి స్మరణ

భూరి = పెద్దయగు
జఠర = కడుపు గలవారిలో
గురుఁడు = గొప్పవాడును,
నీరజ = నీటఁ బుట్టిన యగ్ని
అంబక = నేత్రముగాఁ గల శివునకు
భూతి = పుట్టినవాఁడును,
మహిత = అతిశయమైన
కరుఁడు = తొండము గలవాఁడును,
అహీన మణి = సర్పరాజ శ్రేష్ఠము
కలాపుఁడు = అలంకారముగా గలవాఁడును,
అలఘుసత్ = అధిక శ్రేష్ఠమైన
గణేశుఁడు = గణేశ నామము గలవాడును,
అగ్ర = ముఖ్యమైన
గోపుఁడు = వాక్కులు గల ప్రభువైనవాఁడును,
మహా = గొప్పయగు
అమర్త్యసింహుఁడు = దేవతాశ్రేష్ఠుఁడును (అగు గణపతి)
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

No comments:

Post a Comment