Friday, October 21, 2016

వేంకటేశ్వరా!





(౧)
శతకం బొక్కటి వ్రాయ నెంచితిని మీచారిత్ర్యముల్  చాటుచున్
నుతియింతుం దమ లీలలన్నిటిని నే నోరార రమ్యంబుగా
వెతలం బెట్టక శక్తి నిచ్చి నను దీవింపంగ రావే నమ
శ్శతముల్ సేసెద భక్తినిం దిరుమలేశా భక్త రక్షాగ్రణీ!

శ్రీసతి భీకరాగ్రహము శ్రీపతి శాంతము గాదె మిమ్మిలన్
భాసిత సప్తశైలయుత భారత విశ్రుత పుణ్య భూమినిన్
హాస విలాస రేఖల విహార నివాసము సేయ నిల్పె సం
త్రాస జనాళి రక్షణకు రాజనిభానన వేంకటేశ్వరా!                                1.

నుదుటను నామ మొప్పెను గనుంగవ కన్పడ కుండు నట్టులన్
సదమల దామ మొప్పెను భుజద్వయ భాసిత భూషణమ్మనన్
ముదిత లలంకరించి రట ముచ్చట గొల్పుచు వక్షమందునం
దదసదృ శాకృతిన్నరయ ధన్యుల మైతిమి వేంకటేశ్వరా!                        2.

శంభుని కంఠ మందున విషమ్మును చంద్రుని యందు మచ్చయున్
గుంభిత తాపమే యినుని క్రూర కరమ్ములఁ దల్లడిల్లగన్
గుంభన రీతిఁ జంపె వనిఁ గోతిని రాముడు నట్టి దోషముల్
సంభవ మన్న మీ కడ  నసత్యపుఁ బల్కులు వేంకటేశ్వరా!                      3.

కలువలు పూయ నేర్చునె ప్రకాశిత చారు శశాంకుఁ గానకే
వలవల యేడ్చు పద్మములు పశ్చిమ దిక్కున సూర్యు డున్నచో
వెలవెలఁబోవు గేహములు పేరిమి పూజలు సల్పకున్నచో
నిలయము సత్య సంపదకు నీ భజనావలి వేంకటేశ్వరా!                        4.

సుందర దివ్య విగ్రహము సూర్య శశాంక నిభాక్షియుగ్మ పా
రీంద్ర నిభావలగ్న పరిలిప్త సుగంధ నితాంత గాత్ర మా
నందమ యాభయప్రద ఘనద్యుతి హస్త వికాస మూర్తివే
నందిత పద్మగర్భ సురనాథ మహేశ్వర వేంకటేశ్వరా!                        

No comments:

Post a Comment