Tuesday, March 28, 2017

శ్రధ్ధాంజలి

అత్త! మేనత్త! నీవును నరిగితీవ
శోక సంద్రాన  మమ్ముల స్రుక్క జేయ
జాలి యనునది యిసుమంత కలుగ లేదె?
యేమి మామీద కోపమా? యేమి నీకు

అమ్మ నాన్నలు మామయ్య యరిగి రమ్మ
వారి మార్గమ్ము నీవును బడసి తీవ
దిక్కు మాకిక యెవరమ్మ యిక్కడింక
దిక్కు లేనట్టి వారమే యక్క టకట

కన్న బిడ్డల కంటెను మిన్నగాను
సాకి తీవమ్మ  మమ్ముల సహృద యమున
నీదు ప్రేమను మరువను నేది నమ్ము
దల్లి యంతటి దానవు కల్ల కాదు

కాన రానట్టి దూరమ్ము కడచి నావె
యెచట యున్నను మమ్ముల నచట నుండి
కంట గనిబెట్టు చుండుమా కరుణ తోడ
వేడు చుంటిని నిన్నునే వేయి మార్లు


ఎండ లెక్కువ నుంటచే నెచ్చటకును
బయన మయ్యది జేయగ వలను కాదు
కాన మమ్ముల నించుక కనిక రించి
యందు కొనుమమ్మ! శ్రధ్ధాంజ లందు కొనుము

No comments:

Post a Comment