Sunday, March 27, 2022

సామాజికాంశము 4. బడి-గుడి.


వ.నెం. 11  

పద్యము.  సురలలిత  

గణములు..  మ న స త ర గ.  

యతి.  10వఅక్షరం. 

-

విద్యా దానము గలుగు నా విద్యాలయంబు నందే 

యాద్యంతంబును నిరతి నా నాబోతు రౌతుకున్  నై        

వేద్యం బిచ్చుచు భవుని వే వేడంగ బ్రార్ధనాదుల్  

సద్యఃస్ఫూర్తిని నడరుచో సంసిద్ధి గల్గుఁ దోడ్తోన్ 1.

వ.నెం. 12   

పద్యము..  సుగంధి-2   

గణములు..ర జ ర జ ర లగ 

యతి..10వఅక్షరం. 

--

ఙ్ఞాన మార్జనమ్ము గల్గు  చాన! భోగ భాగ్య సంపదల్  

వాని యంత వచ్చు విద్య నేర్వ గారవమ్ము బెర్గుట

న్నాననంబు వెల్గుఁ జంద్రు సోయగంబు గల్గి కాంతితో 

మాననీయ మౌను గాదె మామకీన పాఠశాలయే 2.

వ.నెం.13   

పద్యము.  విలులిత వనమాల  

గణములు.. న న మ న న మ 

యతి. 10వఅక్షరం 

-

బడుల వలన సౌమ్యుండై పరమత సహనం బందున్  

గుడుల వలన భక్తుండై కువలయమును రక్షించున్ 

బడిని గురువు బాధ్యుండై  పలు రకముల బోధించున్ 

గుడిని శివుడు పూజ్యుండై గురుతర శివ మీడేర్చున్ 3.

వ.నెం. 14.  

పద్యము.  ఫుల్లదామ   

గణములు...మ త న త ర ర గ. 

యతి. 13వఅక్షరం.  

-

విద్యా బుద్ధుల్ నేర్పుదు రిట నొజ్జల్ సవిస్తరంబౌ విధంబే  

యాద్యంతంబున్ శిష్యులు సరి నేర్వంగ హర్షముం బొందు వారౌ  

విద్యావంతుల్ వేల కొలఁది యుండంగ  విశ్వమం దంత వ్యాప్తుల్ 

సద్యఃస్ఫూర్తిన్ దేశమునకు నిత్యమ్ము సాయముం జేయ మేలౌ 4.

వ,నెం.  15  

పద్యము.  భూరిశోభ  

గణములు.. మ మ న న త త గ గ.  

యతి.  7,14 అక్షరములు

__

దైవంబే కాపాడున్  దయ కలిగినచో దర్శనార్థంబ యేగన్   

భావోద్వేగం బందం బరమ శివునికై  ప్రార్ధనల్ సేయ నిచ్చున్  

జీవం బెన్నాళ్లుండున్  జెడక యిలను నా శీసు లందాఁకఁ బ్రీతిన్ 

దైవం బచ్చో నుండున్  దరిసెన మిడ నా దైవ తాగార మందున్  5.

వ.నెం.  16.

పద్యము.  సతి  

గణములు.  భ త య న జ జ న గ  

యతి.  9, 15 అక్షరములు. 

--

దేవళ మందున్న మహా దేవునిఁ గడు భక్తిని వేడుకొనినచోఁ  

బావన చిన్మూర్తియు నా పార్వతి పతి గావఁగ నెప్పుడు భువిలో  

దేవుని రూపమ్ముననే  దేహరమును వేదిక నొందుచు మనుఁగా  

మోవిని మంత్రమ్ములు ముప్పూటలు చదువన్ ముద మొంది సిరు లిడున్ 6.

వ.నెం. 17  

పద్యము. శంబరము.  

గణములు.  న భ భ ర న భ భ ర  

యతి.  7,19అక్షరములు. 

--

బడికి నేఁగుచుఁ బాఠము నప్పగించుచును శ్రద్ధగఁ బంతులు సెప్పు నా  

నుడులఁ జేకొని నోటను బట్టి  కంఠమున నుండఁగ నూఱఁగ జ్ఞప్తులౌ 

బడు లొసంగును బారము లెల్ల దేహులకుఁ బృథ్విని బంగరు బాటలౌ 

గుడికిఁ జుట్టును  గోడలు రక్షలౌ  బడికిఁ జుట్టును గుంజలు బ్రాణముల్  7.

వ.నెం.18. 

పద్యము...భుజంగము.. 

గణములు...య య య య య య య  య.   

యతి..8,21 అక్షరములు. 

--

అకారాది వర్ణంబు లన్నింటి మూలంబు నేర్పంగ నొజ్జల్గదా యాకరంబుల్  

వికారంబు లేకుండ వేదాది శాస్త్రంబు లా కర్ణపేయంబుగా విశ్వ మంతన్ 

సకాలమ్ము నందే ప్రశాంతంబుగా వ్యాప్తి సేయంగ విద్యార్ధులే సాక్షు లౌఁగాఁ 

బ్రకాశమ్ముకా నోపు బ్రహ్మాండ మందున్న ఙ్ఞానమ్ము పూర్ణమ్ము విశ్వమ్ము నందున్    8.

వ.నెం. 19. 

పద్యము.. హంసపద.  

గణములు..త య భ భ న న న న గ.  

యతి. 11వఅక్షరం.

--

భావించుచు రూపం బూహలలోఁ బగ లనక నిశి యనక నిరతము నా

దైవంబును నారాధించినచో దయను గలిగి మన యెడ నిడు సిరులే 

యే వారము నందున్ మానకుమా హిమగిరి కొమరితను గొలుచుట నెదన్ 

నీ వైభవ మెల్లం బెర్గునుగా నిముసము నిముసమునకు సతి కరుణన్ 9.

వ.నెం. 20  

పద్యము..  వినిద్రసింధురము..  

గణములు.. ర ర ర ర  జ ర జ ర లగ.  

యతి. 10, 20 అక్షరములు. 

--

ఒజ్జ బోధించు పాఠా లహో యుత్సుకత్వ మొందఁ జేయు చుండి యోల లాడఁ జేయుఁగా 

యొజ్జ సామీప్య మందుండఁగా  నొప్పు గల్గు నట్లు మెల్గు చుండి యూపి రున్న మేర కా  

యొజ్జనున్ గౌరవింపం దగున్నూర కెప్పు డే విధంబు నో రహో చెలంగఁ జేయుచుం   

గజ్జ లాడంగఁ బో రాదుసూ  కౌశలమ్ము తోడ విద్య  నేర్వఁగా శుభంబు గల్గుఁగా    10.

Friday, March 18, 2022

సామాజికాంశము 3. మాతృభాష-విద్యాబోధన.



వ.నెం.  1

పద్యము.. అహిళ.  

గణములు..త స జ గ.

యతి.  7వఅక్షరం. 

--

విద్యాభ్యసనమే  విశాలమౌ 

యాద్యంతమును నే ర్పవశ్యమై  

యాద్యమ్ము తెలుగే  హసింప నౌ 

వేద్యంబ భృశమున్ వివేకికిన్ 1.

వ.నెం.  2

పద్యము... తోధక  

గణములు..భ భ భ లగ 

యతి.  6వఅక్షరం.

---

బోధన సేయ బుధాళి తెలుగున్  

రాదన కుండ రమాది సతులున్ 

సాదర మొప్ప సరాగ మతులై 

హ్లాదము నొంది రయాచితముగన్ 2.

వ.నెం 03

పద్యము   .విష్టంభము . 

గణములు..స స స గ గ. 

యతి.. 6వఅక్షరం. 

--

తెలుగే కద  తీయనిదై యొప్పున్ 

బలు చోటుల వారలు సైతంబున్ 

వెలుగై యది ప్రీతినిఁ జేకూర్చున్ 

వల పేర్పడఁ బల్కిరి యిబ్భంగిన్ 3.

వ.నెం.  04.. 

పద్యము.  అతిరంహి. 

గణములు.. జ జ జ ర గ. 

యతి.6వఅక్షరం. 

-

సుబోధనయే సుమ మాలగా రహించున్ 

సభాపతియై  సమభావ మాచరించున్ 

నభేదము గన్బడు నట్లుగాఁ జరించున్  

స బాంధవమున్ ససుఖమ్ము జీవ ముండున్  4.

వ.నెం. 5 

పద్యము...ప్రవాహిక   

గణములు....జ త త త గ  

యతి.  10వఅక్షరం.  

--

విశాల భావంబు తోడైన విశ్వంబునన్ 

దిశాంతరాళంబు ముట్టంగ దిట్టమ్ముగన్  

స్వశక్తితో విద్య నేర్వంగ  సాధింపఁగా  

సుసాధ్యమౌ మాతృభాషన్ సుశోధింపఁగన్ 5.

వ.నెం.  6.   

పద్యము..లలితపతాక.  

గణములు..న స య య గ గ 

యతి. 7వఅక్షరం.

--

గురువులు కదా గుబాళించు వారే విద్య

న్నిరువు రనగా  నిలన్ బంధులే శిష్యుండున్  

గురు విరువురున్ గుణాతీతులే కా శిక్షా

కరుఁడు నుడువంగ శిష్యుండు నేర్చుం జక్కన్    6.

వ.నెం. 7.  

పద్యము... జలదరసిత. 

గణములు., న స య య లగ .

యతి.  7వఅక్షరం. 

--

సులభతరమై  సునాయాసమౌ రీతిగా 

లలిత పద జాల భాషా వరం బొప్పు నీ  

తెలుగు ధరలోఁ ద్రికాలంబునం దింపుగా  

వెలుగు జిలితో విశేషంబుగా వెల్గుగా 7.

వ.నెం, 8  

పద్యము.  చిత్ర   

గణములు.  మ మ మ య య  

యతి. 9వఅక్షరం.  

--

భాషా ఙ్ఞానంబే యిచ్చుంగా  పాండితీ నైపుణమ్మున్ 

నీషద్విద్యా గంధంబుం దా మీయ నొజ్డల్ సురీతిన్ 

దోషవ్రాతం బేమాత్రమ్మున్ దొర్లకుండంగఁ బ్రీతిం  

బాషాణుల్ సైతంబున్ మేలౌ ప్రఙ్ఞఁ బొందంగ నౌఁగా 8.

వ.నెం.9.  

పద్యము...ఊహిని 

గణములు.. ర స య జ జ   

యతి.  9వఅక్షరం. 

--

మాతృ  వక్త్రము నుండియే  మాతృ భాషను నేర్చు 

మాతృ భాషకు మూలమే మాత పృథ్విని  నెంచ 

మాతృ భాషయె ముఖ్యమౌ మానసంబును దెల్ప 

మాతృ భాషల శ్రేణిలో మాన్యమే తెలు గౌను 

  9.

వ.నెం. 10.  

పద్యము.   తరవారిక   

గణములు.  న స స  జ జ గ.  

యతి  10వఅక్షరం.

--

తెనుగు వలెఁ దీపినిఁ బ్రీతి నిచ్చెడు భాషనున్ 

గనులు గన వెప్పుడు నింక భూమినిఁ జూడఁగా 

వినుము తగ బోధన మే విధంబునఁ జూచినన్ 

దెనుగుననె యుండిన జాతి కంతకు మేలగున్  10.

Thursday, March 10, 2022

సామాజి కాంశము 2. పరిసరాల పరిశుభ్రత.


వ.నెం. 198. 

పద్యం.  హరిణి. 

గణములు.. న-స-మ-ర-స-వ. 

యతి. 12వఅక్షరం. 

---

పరిసరము శుభ్రంబై నిత్యమ్ము భాసిలుచుండుచో    

సరి యగును, గాదేనిన్ రోగాలు సంభవ మౌనుగా 

సరిగమలతోఁ బాటల్బాడంగ శక్తిని వాడకే 

పరిసరముఁ జక్కం జేయుం డింక బల్వురు నేకమై    1.

వ.నెం. 194. 

పద్యం.  సురభూజరాజము  

గణములు.. న-భ-ర-న-న-న-ర 

యతి. 12వఅక్షరం. 

--

చదలు వోలెను జక్కగాఁ బరి  సరములను బరిశుభ్రమౌ 

విధము జేసిన, మంచి సంపద వివిధ విధములఁ బొందనౌ  

చెదలు పట్టవు పాము చేరదు సిరులు గురియును దప్పకన్ 

బదము నిల్పును లక్ష్మి యచ్చటఁ బ్రబలిన ముదము తోడుతన్ 2.

వ.నెం.  161.  

పద్యము...వరలక్ష్మి..  

గణములు.  త-భ-భ-భ-య. 

యతి..8వఅక్షరం  

-

మారాము జేయక యో మనుజుండ!యిక రమ్మా  

బీరమ్ము లాడక యీ విరి మొక్క క్రిమి కోటుల్  

నీఱైనఁ గాల్చినచో నెఱులౌఁ బరిసరాలే 

రారమ్ము వేగముగా రమణా!యిక శుభంబౌ 

3.

వ.నెం. 81. 

పద్యం.  పంక్తి.  

గణములు...భ-భ-భ-గ. 

యతి. 7వఅక్షరం. 

--

కాలువ లందును గల్మషముల్ 

హేలగ వేయుట హీనము సూ 

మూలను మూలన  మూత్రములు   

చా లిక  మందును జల్లుమురో 4.

వ.నెం. 80.  

-పద్యం.  ..నిశ.  

గణములు... న-న-ర-ర-ర-ర 

యతి. 9వఅక్షరం.

--

పరిసరములు సూడ బాగుండుచో రోగమే రాదుగా 

నరి గణముల రాక హర్షమ్ము బోఁద్రోచి చీకాకులన్ 

బఱచిన, మనయింటి ప్రాంతాలు చక్కంగ ,శుభ్రమ్ముగా   

వరలు నటులఁ జేయు వైరమ్ము చాలించి పౌరుండుగా 5.

వ.నెం... 65.  .

పద్యం.  తరళము.  

గణములు...7నగణములు,1గురువు. 

యతి.. 13వఅక్షరం.  

---

మలినములను గృహము దరిని మరుగు బఱుచు నెడల, చీ 

మల ,పురుగుల, క్రిముల భవ మమరినఁ బుడమి రుజములే 

గలుగుఁ గనుక మలినములను  గనులకుఁ గనఁబడని చో 

టులను గనుగొని యచటనె కటువుగ బుడమిని నిడుమా

6.

వ.నెం. 66 

పద్యం...తలుపులమ్మ  

గణములు.. భ త త భ న ర గ. 

యతి.  10వఅక్షరం. 

-

చెత్త చెదారమ్ము నేరించి చీడ పురుగులఁ జంపుమా యో 

యత్త కుమారుండ! వేగమ్ము నగ్ని రగిలిచి కాల్చుమా యా 

చెత్తలు లేకుండ యుండంగఁ జేటును గలుగకుండ నుంచున్ 

మత్తును గల్గించు నా మాయ మద్యముల నిక ద్రాగకుండీ  7.

వ.నెం. 58.

పద్యం.  జలదము.  

గణములు..  భ ర న భ గ.

యతి.  10వఅక్షరం. 

--

గొట్టపు బావి చుట్టు గల క్రుళ్ళును,బోఁ  

గొట్టగ,శుభ్ర మైన తఱి గోతులలోఁ   

జట్టున కీటకంబులకుఁ జల్లినచో  

మట్టొనరింప మందు నట మంచి యగున్ 8.

వ.నెం..116

పద్యం...మందాక్రాంత... 

గణములు...మ-భ-న-త-త-గ-గ.

యతి...11వఅక్షరం.

--

స్వచ్ఛందంబై పరిసరములన్ బాగు చేయంగ నొప్పౌ 

యిచ్ఛన్ జేయంగ బ్రతి మనుజుం డిష్టమౌ రీతి గానే 

స్వచ్ఛంబౌ భారత మనుట యే సార్ధకం బట్లు చేయం  

జిచ్ఛక్తిన్ హర్షము లొలుకగా సేవలో మున్గ నొప్పౌ 9.

వ.నెం. 176 

పద్యము... శివశంకర 

గణములు.  స-న-జ-న-భ-స. 

యతి. 11వఅక్షరం 

--

శివ! శంకర! భవ! నా కిటఁ జినచూపును నిడకే    

దివ మంతట పరిశుభ్రము తిరమౌ నటు లగుఁ గా 

నవసానము వరకున్  దగు నరుసం బగు బలమున్  

జవమున్ సహనము శక్తినిఁ జవులూరఁగ నిడుమా 10.