Wednesday, September 27, 2017

బతుకమ్మపాట



ద్విపద మాలిక :
శ్రీగౌరి బ్రతుకమ్మ సిరులీయ రావె
మాగౌరి వోయమ్మ మన్నింపు మమ్మ

ఇంపార మాయింటి యిలవేల్పు వమ్మ
సొంపార సక్కఁగ జూడఁగ రావె

వెతలన్ని బాపఁగ వేగంబ రావె
బ్రతుకమ్మ బ్రతుకమ్మ బంగారు తల్లి

మాయమ్మ దుర్గమ్మ మము గన్న తల్లి
యాయమ్మ బ్రతుకమ్మ నర్చింప రమ్మ

తంగేడు గుమ్మడి తామర సుమలు
బంగారు గునుగును వామనె విరులు

కమనీయ గరికలు కనువిందు కట్ల
రమణీయ దోసలు లావణ్య బీర

చేమంతి పూబంతి చెంగల్వ పూలు
భామ లందరు జేరి వాలుగ పేర్చి

పసుపు గౌరినిఁ జేసి వాటిపై నుంచి
వసుధను తంబల ప్రభల నీయంగ

నెలత లందరు గూడి నృత్యమ్ము లాడి
పలుమారు కీర్తించి పాటలు పాడ

కతలన్ని వింటిమి కారుణ్య మూర్తి
బ్రతుకమ్మ సద్దుల బ్రతుకమ్మ బ్రతుకు

కుదురుఁగ నిత్యమ్ము కొలుతుము నిన్ను
కదలిరా బ్రతుకమ్మ కాపాడ మమ్ము.
(రచన:కామేశ్వరరా వు)

No comments:

Post a Comment