Thursday, February 24, 2022

సామాజికాంశము 1. కరోనా.


వ.నెం. 33

పద్యం  కామేశ

గణములు  భ-భ-న-జ-న-గ

యతి  11వఅక్షరం

--

చూడు కరోనను మనలను శోషిలఁ బఱచెన్ 

వేడిన మానక యుదయపు వేళలఁ బ్రబలెన్ 

మాడున నొప్పియు నడుమున మంటయుఁ దగులన్  

బాడుగ బండినిఁ జనితిని వైద్యుని దరికిన్ 1.

వ.నెం. 46 

పద్యం.  గణనాథ 

గణములు.భ-యభ-య 

యతి  7వఅక్షరం. 

--

వచ్చిన కరోనా ప్రాకెను ధరిత్రిన్  

హెచ్చగు జనాలే యీల్గిరి భయాన

న్నచ్చపుఁ గరోనా యంటకను ముందే 

విచ్చలవిడిం బో పెద్దలును బిన్నల్ 2.

వ.నెం. 49 

పద్యము . చంద్రకళ 

గణములు..ర-స-స-త-జ-జ-గ. 

యతి  11వఅక్షరం. 

--

కుక్క పందుల మాంసము నందే కోరిక పెంచుచుఁ దిందురే 

యక్కజంబుగఁ జీనులు ఘోరం  బయ్యవి కుళ్లఁగఁ బుట్టఁగా

మిక్కుటంబుగ వైరసు లెల్లన్  మేదిని యంతట నిండఁగా  

నొక్క సారిగ నూపిరియే రాకున్నను  బ్రాణము వోవుగా 3.

వ.నెం. 48  

పద్యం. చంచరీకావళి 

గణములు.  మ-మ-ర-ర-గ. 

యతి.  7వఅక్షరం. 

--

మాయా రోగం బంచున్  మాయలో జారకుండన్ 

వే యేలన్  వైద్యుండే  ప్రీతి నీయంగ మందుల్    

వే యా మందుల్ వాడన్  భీతి దూరంబు గాదే  

వాయిన్ ముక్కుం జుట్టున్ వస్త్రముం జుట్ట నొప్పున్  4.

వ.నెం. 50 

పద్యం.  చంద్రరేఖ 

గణములు.  మ-ర-మ-య-య 

యతి  8వఅక్షరం.

--

దైవంబే రక్ష యంచున్ ధైర్యమ్ముతో మార్కొనంగం

గోవిడ్ శాంతించెనే వే గోర్వెచ్చ తోయంబు చేతన్ 

వే వాటింపంగ నిచ్చల్ ప్రీతిన్ సుదూరమ్ము  మర్త్యుల్ 

పోవుం గీటంబు దాఁచన్ మోమెల్ల వస్త్రమ్ము తోడన్  5.

వ.నెం. 41 

పద్యము. క్షమ 

గణములు.  న-న-త-త-గ. 

యతి . 8వఅక్షరం 

--

పసుపు కలుపుమా  పాలలో సోదరా 

విసము దొలగుగాఁ బ్రీతితోఁ ద్రాగుచోఁ  

బసుపు క్రిములఁ జంపంగ సాహాయ్యమై  

హసిత ముఖుల మమ్మందఱం జేయుఁగా 6.

వ.నెం. 44. 

పద్యం. గగనమణి. 

గణములు. న-న-న-భ-న-లగ. 

10వఅక్షరం యతి

--

లుక లుక లవనినిఁ గరోన వలన బ్రదుకుల్ 

వికలిత మనము లయి భీకర మగు దడతోఁ  

జకితుల రగుచుఁ గడు సైప రెవరు నిలలో 

నిఁక విలయము నరయు నియ్య దచిరము సుమీ  7.

వ.నెం. 45. 

పద్యం.  గజవిలసితము 

గణములు.  భ-ర-న-న-న-గ . 

యతి.8వఅక్షరం. 

--

క్రొత్తది యౌ కరోన  కులుకుచుఁ గులుకుచుఁ గ్రొం 

గ్రొత్తని పేరు తోడఁ గువలయమునకు వెసన్ 

మత్తును నిచ్చు చుండి  మదిఁ దొలఁచి యుసురు గ

మ్మత్తుగ దీయు నండ్రు మది నెఱిఁగిన భిషజుల్ 8.

వ.నెం. 51 

పద్యం.  చంద్రవర్మ.   

గణములు . ర-న-భ-స. 

యతి. 7వఅక్షరం. 

--

రూపు సూడఁగఁ గరోన యెఱుపునై 

మాపు లందున నమానుష సరణిన్ 

దాపు సేరుచును దద్దయుఁ బ్రజకున్ 

వేప కాయలుగ వీపున మొలచున్ 9.

వ.నెం. 52  

పద్యం.  చంద్రశేఖర. 

గణములు. న-జ-ర-జ-ర.

యతి. 13వఅక్షరం. 

--

విడువుము మమ్ము  ప్రేమతోఁ గరోన! వేడెదన్ 

గడువును నిమ్ము  కొద్ది కాల మైనఁ గాలు నే 

నడుగుదు నిట్లు భక్త రక్షకుండ! హా శివా! 

యిడ నభయమ్ము  నీవె కాక లేరె యే రిలన్  10.

Monday, February 14, 2022

భాగవతాంశము.

వ.నెం.  104...పద్యము..భారవి...గణములు...భరభరభరవ...యతి..13అక్షరం..

--

శ్రీకర మైన యీ భాగవతంబునుం జెల్వపుఁ బాఠకుండునై

యేకరు పెట్టినం గల్గును సేమమే  యీశుని రక్షణంబునన్ 

శ్రీకరు బోధలన్ శ్రద్ధగ నేర్చినన్ శ్రేయము గల్గు దప్పకే  

సాకులు సెప్పకే యీశ్వరు గాధలన్  సంతతముం బఠింపుమా 1.

వ.నెం. 02 

పద్యము...అంతరాక్కర....గణములు...1సూర్యగణము , 2ఇంద్రగణములు,1చంద్రగణము....యతి.. 3వగణం అంత్యాక్షరి

---

ఏడు రోజుల వ్యవధి నెంచి  సరి చూచి 

కీడు నేరఁగ నార్తికి శుకమహర్షి 

పాడిగఁ బలికి  పుణ్య భాగవతము నా 

ఱే డగు బరీక్షితున కెఱిగించెఁ బ్రీతి  2.

వ.నెం. 06 

పద్యము...అల్పాక్కర....గణములు....2ఇంద్రగణములు,1చంద్రగణము....యతి...3వగణం ఆద్యక్షరం. 

---

భాగవతమ్మును బఠనమ్మును  

బాగుగ జేసిన బ్రహ్మాదులు 

వేగమె శుభములు ప్రీతు లయి   

యీఁ గల రెల్లర కింపుగను 3.

వ.నెం.  167. 

పద్యము...విద్యున్మాల....గణములు...మ-మ-గ-గ...యతి...5వఅక్షరం(వాడకున్న పరవాలేదు)

——

లోకారాధ్యా! యో శ్రీకృష్ణా! 

యా కామాంధున్  జంపం బూనన్  

లోకాలన్ గాపాడం గల్గున్ 

లోకేశా లోకాలిత్రాతా! 4.

వ.నెం. 26. 

పద్యము...కమలవిలసితము....గణములు...న-న-న-న-గ-గ.  యతి  9వఅక్షరం.

---

విలసిత వదనుడు విలువగు వానిన్ 

మిలమిల మెఱసెడు మెఱుపుల దేహున్ 

పలుకులు సొగసగు ప్రణయపు సూనున్ 

వలపున పిలిచెను భరతము పట్టన్ 5.

వ.నెం. 27. 

పద్యము....కరిబృంహితము...గణములు...భ న భ న భ న ర....యతి..13వఅక్షరం.

--

దప్పి గలుగ గజేంద్రుడు మడుగు దారిని గనుచు బోవఁగా  

నప్పుల రొద వినంబడ మదిని హర్షము గలుగ నీటిలోఁ 

జప్పుడు గలుగు నట్లుగ దిగుచు సంతస మొనర వారి లోఁ 

బప్పను రవము బిగ్గరగ చెవి బద్దలుగ విహరించెనే 6.

వ.నెం.28.  

పద్యం  .కలరవము......గణములు...స-న-న-న-ల-గ. ..యతి...8వఅక్షరం. 

--

సమరం బడలఁగ జరిగె జలమునం  

బ్రమదుం డగు కరిపతికి మొసలికిం   

గమలంగ నట సకల జల చరముల్ 

కుములంగను గొలఁకు దరి గజసతుల్  7.

వ.నెం. 29 

పద్యము...కలితాంతము....గణములు....త-జ-జ-ల-గ.... యతి...8వఅక్షరం.. 

-

ప్రహ్లాదుడు విష్ణుని భక్తుడు నై 

యాహ్లాదపు రీతిని నాతని పై 

సాహ్లాదపు రక్తినిఁ జట్టులతో 

నాహ్లాదము నొందుచు నాడెను జూ. 8.

వ.నెం. 30. 

పద్యము...కవికంఠభూషణము...గణములు....స జ స స స జ గ.   ..యతి..9వఅక్షరం. 

--

వినుమా విదర్భ పతి భీష్మకుడే తన కూతు రుక్మిణిం   

గనుమా యశోదకును గం దగు కృష్ణునితో వివాహమే 

యనుమానమే వలదయా ముదమారఁగఁ జేయఁ బూనెనే   

మన పెద్ద లందరును మంచిగ నాశిసు  లీయఁ గోరుదున్ 9.

వ.నెం.83.   

పద్యము...పణవము.....గణములు....మ-న-య-గ....యతి. 6వఅక్షరం.

---

కోపిం దాఁ గనుఁగొని యారుక్మిం  

జాపంబుం గొని జలజాక్షుండే 

తూపున్ వేయఁగఁ ద్రుటి గృష్ణుండే 

పాపాత్ముం డిలఁ బడె నార్తుండై 10.

వ.నెం. 145. 

పద్యము...మేఘవిలసితము....గణములు...మ-న-న-స.     యతి  6వఅక్షరం. 

---

ప్రాకారంబులు పటుతర మగుచో 

నాకారంబును  ననునయ దిశగా  

నా కార్యం బది నను గలసినచో 

మీ కార్యంబు సుమి సఫలము ప్రియా 

11.

వ.నెం. 74 

పద్యం.,...నందిని....గణములు....భ-త-జ-గ.  .. యతి 6వఅక్షరం. 

--

నమ్మితి నమ్మా నను గావుమా 

యమ్మల కమ్మా యభయంబునే  

యిమ్ముగ నిమ్మా యిటు చూడుమా 

కమ్మటి దానన్  గరుణింపుమా 12.

వ.నెం. 121 .

పద్యం  మణిమాల

గణములు త-య-త-య.

యతి 7వఅక్షరం.

---

నారాయణ యంచున్ నారాయణ నామం  

బా రాత్రులు గీతా లాపంబును జేయన్ 

రా రండని పిల్వన్  బ్రహ్లాదుడు నచ్చోన్ 

నారాయణు నాఖ్యల్ నాకమ్మును జేరెన్ 13.

వ.నెం. 135 

పద్యం. మనోరమ..

గణములు.. న-ర-జ-గ. 

యతి  7వఅక్షరం.

--

జలచరంబు నా  జలంబులోఁ  

గలయఁ దిర్గుచుం గనంగ దా 

జలము నందునం జకాచకా  

కలకలా యనంగ వింటివే 14.

వ.నెం.39

పద్యం  కౌముది 

గణములు  న-త-త-గ .

యతి  6వఅక్షరం.

---

శుకుడు బోధించు ఙ్ఞానంబుచే   

నిక పరీక్షిత్తె మోక్షార్థమై   

సకల విన్యాసముం జేయఁగన్   

ముగితి నొందెన్ మురారాతిచే  15.

వ.నెం. 111 

పద్యం.  భ్రమర విలసితము 

గణములు.  మ-భ-న-వ. 

యతి. 6వఅక్షరం. 

---

అంతం గన్పట్టు హరి యెట ననం   

జింతాగ్రస్తుండ! చెయిదములలోఁ   

బంతంబున్ వీడి ప్రభు వగు హరిన్ 

సంతోషం బంద శరణ మనుమా


(ప్రహ్లాదుడు తండ్రినుద్దేశించి) 16.

వ.నెం. 177 

పద్యం.  శుద్ధవిరాటి  

గణములు.  మ-స-జ-గ. 

6వఅక్షరం యతి

---

ఆవిష్ణుండట నాగ్రహంబునం  

జేవం జూపుచు సింహ రూపుడై

చావం జీల్పఁగఁ జార ణాదులే  

పూ వానన్ రహిఁ బో కురించిరే 17.

వ.నెం. 122 

పద్యము.  మణిరంగము  

గణములు  .ర-స-స-గ. 

యతి  6వఅక్షరం.

--

కొండ క్రిందకుఁ గూలఁగఁ జేయన్ 

మండు టెండను మండఁగ నుంచన్ 

బండ రాళ్ళను భారము వెట్టన్ 

నండగా హరి  యాయువు గాచెన్ 18.

వ.నెం .126 

పద్యము  మత్తహంసిని 

గణములు.  జ-త-స-జ-గ. 

యతి  7వఅక్షరం. 

--

క్షణానఁ గృష్ణుండు సతి రుక్మిణీ మణిన్  

జనాలు చూడంగ సచివుల్ భయంబునన్ 

రణం బొనర్పన్ బలము లేక పాఱఁగా  

మనోనుకూలంబు మగుడించి యేఁగెఁ జూ  19.

వ.నెం. 35 

పద్యము.  కుసుమ విచిత్రము 

గణములు  న-య-న-య 

యతి  7వఅక్షరం. 

--

కలియుగ మందుం గఠినపు భక్తిం  

గొలిచిన గృష్ణుం గువలయ మందుం 

బలికినఁ బేరుం  బగలును ఱేయిన్  

సులువుగ వచ్చున్ సుగతులు దల్పన్    20.

Friday, February 4, 2022

భారతాంశము.


పద్యము..అంబురుహము (గణములు..,భ,భ,భ,భ,ర,స,వ, యతి 13వ అక్షరం)

———

భారత మందలి గాధలు నేర్చుటఁ బావనం బగు జన్మమే

ధీరులు భీముడు క్రీడియుఁ గర్ణులు తేజముం గనఁబర్చిరే  

శూరులె యందరు ,నాజినిఁ జూపిరి శూరతన్ బలమున్ గదా 

వారికి వీరికి కృష్ణుడె నెచ్చెలి బంధువుం డభిమానుడున్ 1.

పద్యము...ఉత్సాహ..(గణములు...7సూర్యగణములు 1గురువు..యతి..5వగణం మొదటి అక్షరం )

———

పంచపాండవు లన వీరు బరగిరి భువి భూవరా! 

యెంచి చూడ ధర్మజుండు నీ నకులుఁడు భీముఁడున్ 

సంచితంబు లైన గుణులు సవ్యసాచి మఱియు నా 

పంచముం డగు సహదేవ వర్యుఁడు గుణ వంతులే 2.

పద్యము...హరిహర..(గణములు...భ,జ,న.త. యతి 7వఅక్షరం)

——

కౌరవుల మాయ కతన  జూదమ్ము 

పారక జయమ్ము  వడయ రాదయ్యె 

నేరక జయించు నియమ సూత్రాలు 

చేరిరి వనంబు సిరులు లేకుండ 3.

వ.నెం. 196. పద్యము..స్వాగతము  .గణములు..ర,న.భ.గ.గ..యతి 7వఅక్షరం 

——

స్వాగతం బిడుదు బాండుకుమారా! 

యాగమంబునకు నాకృతి నీవే 

మూగ జీవులము మోదము నీయన్  

సాగ కుండగను జప్పున రావా 4.

వ.నెం. 07..పద్యము..అశ్వగతి..గణములు..భ,భ,భ,భ,భ,గ..యతి.10వఅక్షరం.

-- 

ధర్మజు డెన్నడు తప్పడు ధర్మము నాపదలన్ 

మర్మము నేర్వడు స్వచ్ఛపు మాటయె యాతనిదౌ 

నర్మపు మాటలు సెప్పని నైజము నాతనిదే 

కర్మమె సాక్షిగ దమ్ములఁ గాంచును బ్రేమగనే 5.

వ.నెం.199

పద్యము...హరిహయము..గణములు...న,స,న,భ,న,గ...యతి..10 వఅక్షరం.

--

వినయముగఁ గృష్ణుఁ డనె  వెంగలి నృపతితో 

ననునయపుఁ బల్కు వినుమా యిది మమతతో 

వినిన గలుగున్ శుభము వేయి విధములుగా 

ననుమతిని నీయు మిక నర్ధపుఁ బుడమినే 6.

వ.నెం.191.

పద్యము...సుగంధి...గణములు...ర,జ.ర,జ,ర....యతి 9వఅక్షరం

--

పాండు రాజ! రాజసూయ ప్రాంగణంబు నందునన్ 

మండు చుండు నగ్ని హోత్ర మధ్య యందు భక్తితో

నెండు రావి జువ్వి పుల్ల లిమ్ము గాను వేయుచో

మండి సిద్ధి నిచ్చు నీకు మర్మ మిద్దె భూవరా 7.

వ.నెం.04

పద్యము..అపరాజితము...గణములు...న,న,ర,స,వ.   యతి..9వఅక్షరం

--

ద్రుపదుని సుత కృష్ణ తోయజ నేత్రయే 

జపము దపము సేయ జన్మము గల్గెగా 

నపజయ మన లేక యార్జన సేసె నా 

ద్రుపద విభుడు వైరితో జగడంబునై 8.

వ.నెం. 05 

పద్యము...అలసగతి...గణములు.. 

న,స,న,భ,య....యతి..10వ అక్షరం.

--

అట నడచు ద్రౌపదిని హర్షమునఁ జూడం  

గటువుగ మదం బడరఁ గర్కశ నరుండై        

యెటు దిశకుఁ కీచకుడు నింతి వెడలం దా 

నటులె వడిఁ బోవు చెద నాశను వహించెన్ 9.

వ.నెం.12

పద్యము...ఇంద్రవంశము...గణములు...త,త,జ,ర.  యతి 8వఅక్షరం.

--

ధామంబు జేరంగను ద్రౌపదిన్ సతిం     

గామాంధుఁడే పిల్చెను గాటినిం గనన్

భీముండు తాఁ జంపెను భీకరంబుగా 

నీమంబుతోఁ గీచకు నేర మెంచుచున్ 10.

పద్యము..ఇంద్రవజ్ర...గణములు...త,త,జ,గ,గ..యతి 8వఅక్షరం.

--

పంతంబు సాధించెను బాపి నీడ్చన్ 

సంతోషముం బొందెను సాగ నంప

న్నంతంబు నీచుండు జనాళి కింపై 

సాంతంబు గైదండను సాగిలంగన్  11.

వ.నెం. 08.

పద్యము...అశ్వలలిత...గణములు...న,జ,భ,జ,భ,జ,భ,వ.  యతి..13 వఅక్షరం.

--

పనుపఁగ మాయ జూదమున నోడు వార లిక పోవు నట్టి పగిదిన్ 

వినయము దోపఁ బాండవులు హస్తి వీడి చని రెల్లఁ గాఱడవికిన్ 

దినుచును గందమూలములు ద్రాగి తీయ నగు కొండవాలు జలముల్ 

మనుగడ సాగఁ జేసి రట వారి మంచితన ముండ నార్యుడ!తగన్ 12.

వంనెం. 10

పద్యము...అసంబాధ...గణములు...మ,త.న.స,గ,గ.  యతి..12 వఅక్షరం.

--

లోకారాధ్యుండా! నను గరుణను లోఁ గొమ్మా  

యేకాంతం బందే కొలువఁగ గిరిజేశుండా 

యా కామేశున్ ద్రౌపది యడిగిన దా గృష్ణున్ 

నా కీసాయం బిం డనుచు నిజ మనం బందున్  13.

వ.నెం. 14..

పద్యము...ఇల....గణములు...స,జ.న,న,స....యతి..8వఅక్షరం.

--

విదురుండు వచ్చిన పెనుముదమున ననెన్ 

గదనంబు నెట్లగు కనికరము గలుగన్ 

విదురా!సరాసరి వివరముగ చెపుమా 

వదరెన్ సరాగము వరలగను నపుడున్ 14.

వ.నెం. 17 

పద్యము...ఉపస్ధితము...గణములు...త,జ,జ,గ,గ....యతి ..8వఅక్షరం.

-

దుర్యోధను డంతట తోషితుండై 

కార్యాచరణంబును గర్ణు నాఙ్ఞం 

గార్యోన్ముఖుఁ జేసెను గర్కశుండై      

యార్యుండగు కృష్ణుని యంతుఁ జూడన్ 15.

వంనెం.19. 

పద్యము....ఏకరూప....గణములు...మ,భ,జ,గ,గ....యతి..8 వఅక్షరం.

--

వీరాలాపంబు లన వేసరమ్ముల్ 

వీరుండౌ యుత్తరుని  వేగ మంతన్

వీరుండౌ యర్జునుడు వింటిఁ గొమ్మం    

చా రాపుత్రుం బిలిచె నాజి సేయన్    16.

వ.నెం. 21. 

పద్యము..కంఠీరవము....గణములు..న,య,స,గ,గ.. యతి..7వఅక్షరం.

రయముగ నా సారధివై యుండన్ 

భయ మిసుమంతం బడనో కృష్ణా

జయముల నందన్ జయశీలుండన్ 

బ్రియ నరు డేనే బిలువన్ రావా 17.

'వ.నెం. 22...పద్యము...కంద వృత్తము...గణములు...య-య-య-య-ల. యతి..8వఅక్షరం.

--

విశాలంపు దేశమ్ము పీయూష పానంపు  

టశాంతంబు హీనంబు హ్రైంకార గానంపు  

దిశాదివ్య రూపంపు దేదీప్య మానంపుఁ  

బ్రశస్తంపు దేశమ్ము పాంచాల దేశమ్ము 18.

వ.నెం. 25.  పద్యము...కనకలత.....గణములు...న,న,న,,న,న,న,స  .. యతి..13వఅక్షరం.

--

ద్రుపదుని కొమరుడు  చనియెను దొడరుచును నరునితో 

రిపులను సమర తలమునఁ బరి పరి విధములుగఁ దో 

రపు బలముల గణముల నిక రయమున దునిమెను గ్రూ 

రపు జను లగు రిపుల తలలు రగిలిన వనలముతో. 19.

వ.నెం. 24. పద్యము...కందుక వృత్తము ...గణములు ...య,య,య,య,గ.   యతి .8వఅక్షరం.

---

చిదానంద రూపుండు శ్రీకార మాద్యుండే 

సదానందకారుండు సాకార దేహుండే 

పదాంభోజయుక్తుండు పాలాభి షేకుండే 

ముదాకార రూపుండు ముద్దౌను గృష్ణుండే 20.

Tuesday, February 1, 2022

రామాయణాంశము:


కందము.

శ్రీరాముని చరితమ్మును

నా రాముని తనయులైన  యా లవ కుశులుల్ 

పేరోలగమున నింపుగ 

ధీరతతోఁ బాడి రార్య! దివిజులు మెచ్చన్ 1.

ఆటవెలది. 

రామచంద్ర విభుని రమ్యపుఁ బాలన 

చూడ ముచ్చ టయ్యె జూపరులకు

సంతసమ్ము తోడ సకల జనులు నెమ్మి 

మీర కలసి మెలసి మెలగు చుండ్రి 2.

తేటగీతి. 

రామచంద్రుని తమ్ములు లక్ష్మణుండు 

భరత శత్రుఘ్ను లారయ బాహు బలులె 

యన్న చాటున నుండుచు నర్భకులుగ  

నన్న ప్రేమను బొందిరి యద్భుతముగ 3.

ఉత్పలమాల. 

రాముడు శాంతి కాముకుడు రమ్యుడు తేజుడు నీల దేహుడే  

యేమరు పాటుఁ జూపకయు నించుక యేనియు నుండు వాడునున్ 

రామున కాతడే దనరి రంజిలు మోమును గల్గు వాడునై 

భీమ పరాక్రమం బలరఁ బ్రేమను జేసెను రాజ్యపాలనన్ 4.

చంపకమాల. 

ఘనమగు తేజముం గలిగి కైకకు మ్రొక్కియు గౌరవమ్ముతో 

ననుమతి నీయగా జనని హర్షము తోడను సీత తోడుతన్ 

వనమున వాస ముండుటకుఁ బార్థివ పుంగవు కాంక్ష మేరకున్ 

వినయ మనస్కుడై చనెను బ్రీతిని లక్ష్మణుఁ డుండ తోడుగా 5.

శార్దూలము. 

ఘోరారణ్యము నందుఁ గాంచఁగ మహాఘోరంపు టమ్మాయనే 

యౌరా యే మిది యంచు రాఘవుఁడు దా నత్యుగ్ర బాణంబునున్ 

నారిం లాగుచు వేయ హా యని వ్యథన్ నాకంబునే దాకఁ ఘో

రారావమ్మునఁ జచ్చె నిట్టు లనుచున్ హా సీత! హా లక్ష్మణా!  

  6.

మత్తేభము.         

మునులుం జేసిన యాగమున్ మునుల యామోదంబు వర్ధిల్లఁగా  

ననిశంబున్ విలుఁ జేతఁ గైకొనుచు నాయా చోటులం దిర్గుచుం  

గనినన్ రాక్షస కోటినిం దునిమి యా కాంతార మధ్యమ్ములో    

నెన లేకుండఁగ ధైర్యసాహసములం దీ రాముఁడే భాసిలెన్ 7.

నాగరవృత్తం(భ,ర,వ గణములు)

రాముఁడు వేట కేఁగగా

భామకు రక్షకుండుగా  

నా మహి తాత్ముఁ డయ్యెఁగా 

నామము లక్ష్మణుం డిలన్ 8.

నారాచ పద్యము(త,ర,వ గణములు) 

మారాము సేయు చుండగా 

నా రావణుండు దించెగా

నారామ మందు శింశు పా 

పారమ్ము పాదపంబునన్ 9.

భద్రకము పద్యము(ర,స,వ గణములు) 

అట్టహాసము సెల్గగం  

బెట్టెఁ గావలి నామెకుం

గట్టడిం దగ నిచ్చి యా  

బిట్టు రక్కసి మూఁకనున్ 

10.

పద్యము సావిత్రి (మ,మ గణములు) 

శ్రీరామా కాపాడన్ 

వే రావా?నీ వే న 

య్యా రామా మా దైవం 

బారాధింపన్ ధాత్రిన్    11.

పద్యము కంటక (భ,భ,గ గణములు) 

పూత మనస్కయ యౌ

సీత హరించిన వాఁ   

డా తఱి రావణుఁడే 

భీతిని గొల్పునులే 12.

పద్యము  కుసుమ (న,ర,ర గణములు) 

రామ మూర్తియే శ్యాముఁడై 

రామ మంత్రమే బంధువై

రామ నామమే యందమై

రామ పాలనే సాగెనే 13.

పద్యము  మధుమతి (న,న,గ గణములు) 

హనుమ యరసి తా 

వినయముగను బ

ల్కెను ధరణిజతో

నినకుల విభుఁడే  

యిన నిభుఁ డనుచున్  14.

పద్యము గుణవతి(న,మ గణములు) 

అబల సీతమ్మా 

గుబులు వీడమ్మా 

తబల వాయించుం  

బ్రబల సైన్యంబే 15.

పద్యము   ప్రియంవద (గణములు   న,,భ,జ,ర) యతి 8 

మిగుల విక్రముఁడు మేటి  రాముఁడే 

యగణితమ్ముగ మహా కపుల్ తగం  

బగతురన్ నఱుక భండనమ్ములో 

స గరిమన్ వెనుకఁ జాగ నేఁగెనే  16.

పద్యము..అచలము (గణములు..న,న,ల,ల) 

వినుమ పలుకు లివి 

యనుదినమును నిను 

మనమున దలచు న 

వనిజ! యనెఁ గపియె  17.

పద్యము..కోకనద (గణములు..భ,భ,భ,స) 7వఅక్షరంయతి 

రాముడు వచ్చును రాజస మొనరన్ 1

నీమము దప్పడు నీతిగ మసలున్ 

రాముని శౌర్యము రంజిల భువినిన్ 

ప్రేమను  గైకొను భీతి వదలుమా  18.

పద్యము..మృత్యుంజయ (గణములు..త,మ,ల,గ ) 

రామున్ దయాంబోధిన్  రతి

న్నీమంబుతో నేకాంతుఁడై  

నామంబునే కీర్తించునో

యా మానవుండే పుణ్యుడౌ 

19.

పద్యము...సింహరేఖ (గణములు..ర,జ.గ.గ) 

పావనమ్ము రాముఁ డమ్మున్ 

సావధాన రీతి వేయన్ 

రావణాసురుండు హాహా

రావమే ధ్వనింపఁ జచ్చెన్ 20.