Sunday, April 19, 2026

పాపాయి గృహప్రవేశం

 చి. సౌ కామేశ్వరి, చిరంజీవి నాగరాజ గార్ల నూతన గృహా ప్రవేశం సందర్బంగా.... శుభాకాంక్షలతో


నూతన గృహమును జూడఁగఁ

జేతోమోదంబుఁగలిగెఁజిన్మయ రూపా! 

వేతన జీవుఁడ వయ్యును 

భీతినినే జెందనట్టి వీరుఁడవార్యా!


నీవు కనినట్టి కలలకు నెఱవుఁజూపి

ఫలిత మాశించు విధముగ వలను పన్ని 

కష్టములకోర్చి చివరకు తుష్టి నొందు  

నాగరాజార్య! నీకివె నమశతములు


మంచి మూర్తాన కుడికాల నంచితముగ 

గడప లోపల గోమాత తోడనునిచి 

బంధుగణమును నీవెంట బంధురముగ 

కదలి వచ్చుట చూడంగఁగన్నులదరె


వేద మంత్రాలు సదువంగ వేదవిదులు 

యఙ్ఞ యాగాది క్రతువుల నార్యులపుఁడు 

శాస్త్రరీతిని జేసిరి శ్రధ్ధతోడ 

నేమి భాగ్యము మీయది యేమి భక్తి!


మనుమ రాళ్ళును మనుమల మందితోడ  

జీవయాత్రను సాగించు మీవసుధను 

నందుకొనుమ శుభాకాంక్ష లందుకొనుమ  

నాగరాజార్య! జామాత! త్యాగశీల!


సకల శుభములు గలిగించు శంకరుండు 

నాయురారోగ్య సంపద లన్నియిచ్చి 

కంటికినిఱె ప్ప యట్లయి కాచుగాత! 

యెల్లకాలము మిమ్ములఁజల్లగాను


ఇట్లు  

కుటుంబ సభ్యులు

Monday, March 16, 2026

తపమొనరింపరాదు.....

 ఉపకృతిఁజేయు చుండునెడ తృప్తిని పొందినవారు కల్గుచో 

తప మొనరింపరాదు మఱి దానముఁ జేయఁగ వద్దు సజ్జనుల్”

చపలపు బుధ్ధితోడమఱి సాములు కొందఱు కక్షతోడనే 

కుపితమనస్కులొందుచును గోరిక మీఱగ హానిఁజేతురో?

Saturday, March 14, 2026

ఇల్లరికమందు....

 ఇల్లరికంబునందుఁగల దెంతయొ సౌఖ్య మటండ్రు పండితుల్

కల్లయుగాదుసత్యమది కాంతను జూచుచు నుండ వచ్చుగా
బిల్లల పుట్టుకై వడిని ప్రేమను బంచుచు జీవకోటినిన్
బల్లకి మోతనా పగిది పైరవి లీలను జేయ వీలగున్

Thursday, March 12, 2026

ముచ్చట.....


ముచ్చట గొల్పునాసతిని మూఁడగు కన్నులు గల్గువానికిన్
బచ్చగనుండు గద్దెపయి పాణికి పాణిని గల్పఁజేయగా
వచ్చిరి తల్లిదండ్రుల వివాహముఁజూడఁగ పుత్రులెల్లరున్
జెచ్చెర దేవలోకమును జిన్మయ మూర్తులఁజూడ వచ్చెనే


నీరుచాలక.....

 పంట పొలములు పూర్తిగాఁబండిపోయె 

నీరు చాలక,దీపమ్ము లారిపోయయెఁ  

బెద్ద గాలులు వీచుచుఁ బిడుగు పడఁగ 

నెపుఁడు వచ్చునో దీపాలు సెప్పలేము

నీరము లేకాదీపములు

 సారము గల్గియున్  బుడమి సాలుల వెంబడి గట్టియాయెనే 

నీరములేక,దీపములు నిల్చివెలుంగకయారెఁజూడుమా 

జోరుగ వర్షముల్ గురియ చూరులనుండియు ధారకారగాఁ

దోరపు చెమ్మయుండుటన దూలము ప్రక్కన తీగలూడగన్

Wednesday, March 11, 2026

హీనుడే

 దాన  ధర్మ ముల్ నిరతముఁ దానుజేయ

 సంతసం బొంద మిత్రులు సాదరమునఁ 

 జేయి చేతులు గలుపంగఁ జేరు గర్వ

 హీనుఁడే లోకమున గౌరవించఁబడును”