Wednesday, August 17, 2016

శ్రీకృష్ణ దేవరాయా!



శ్రీకృష్ణదేవరాయా!
ప్రాకట కర్ణాట రాజ్య రమణీ రమణా!
నీ కావ్య సుధనుఁ గ్రోలఁగ
మా కందును మధురమైన మాకందములే.


ఆయత బాహువిక్రమ సమార్జిత వంశ పరంపరాగత
శ్రీయుత రాజ్యవైభవ మశేషముఁ జెందియు ధర్మరక్షణో
పాయ విదుండవైన నరపాలశిఖామణి! నీ ప్రజాళికిన్
న్యాయము దప్పకుండగ ఘనంబగు పాలన మందఁజేసితే.

వచియింతున్ భవదీయ విక్రమ కళా భాస్వద్యశోభూషిత
ప్రచురోదంతములన్; సమస్త ఘన కర్ణాటాంధ్ర సామ్రాజ్య స
ద్రచనా కార్య నిరంతరాత్త నిపుణత్వమ్మున్ విభూషింతు; భా
వ చయాంచత్ సుమనోజ్ఞ దివ్య కవితాప్రౌఢిన్ బ్రశంసించెదన్.

నీ యన్గుం బ్రజ కెల్ల మోదమును సంధింపంగఁ బాలించితే
యా యన్యాయపు శత్రుమూఁకల రణంబం దోడఁగాఁ జేసితే
వ్రాయం బొందితి వాంధ్రభాషను కవీంద్రస్థానమున్ విష్ణుచి
త్తీయంబున్ నినుఁ బోలు రాజు కలఁడే దేశమ్మునన్ జూడఁగన్.

ఒక చేతన్ గరవాల మూని రిపురాడుద్వృత్తి ఖండించితే
యొక చేతన్ ఘన ఘంట మూని రసకావ్యోత్పత్తినిన్ జేసితే
వికసించెన్ ముఖ మష్టదిగ్గజ కవుల్ ప్రీతిన్ నినుం జేరి కా
వ్య కళాగేహము లష్టదిక్కుల యశోవ్యాప్తిన్ గనం జేయఁగన్.

రచన - కంది శంకరయ్య, వరంగల్

No comments:

Post a Comment