Wednesday, August 30, 2017

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి




 1. బావిని నీవుగావెలసి భక్తజనాళి హృదంతరాళముం

     దావులనింపినావుగద ధన్యతగూర్చుచు కాణిపాకము

     న్నోవర సిద్ధినాయకుడ! మోదకహస్తుడ!మూషికాధిపా!

     కావుమ మమ్ముసంతతము గౌరిముఖాంబుజ ద్వాదశాత్ముడా!

 2. ఇష్టము నీకనిన్నిల గణేశుడ! తీయనినిక్షుఖండముల్

     కష్టమెయైన దెచ్చితిని గైకొనివాని దయార్ద్రచిత్తతన్

     స్పష్టపు యోచనల్గలుగ చక్కని బుద్ధిని నాకొసంగుమా

     నిష్ఠగ నిన్నుగొల్తునిక నీరజనాభుని మేనగుర్రడా!

3. రైతు పొలాననీవు కడు రాజసమింపెసలార బావిలో

     చేతమురంజిలం దమదు సేమముగోరుచు నుద్భవించితో

     భూతగణాధినాధుని సుపుత్రుడ!షణ్ముఖ సోదరా ! మహ

     ర్జాతక! కాణిపాకనగరాధిప! నీకివె మానమస్కృతుల్.


 వందే గణనాయకమ్.


1. ప్రథమ తాంబూలమర్పించి ప్రాంజలింతు

    విఘ్నరాజుగ స్తుతియించి వేడుకొందు

    కార్యమేదేని తలపెట్టి ఘనతజెంద

    దొడ్డగణపయ్య ననుగావు దురితహరణ!


2. అమ్మ పార్వతి మలచిన బొమ్మవీవు

    అయ్య కరుణరేఖల వెనకయ్యవీవు

    పందెమందున తమ్ముని ప్రక్కనిడిన ...దొడ్డ.....


3. నిన్ను పరిహాసమాడిన నేరమునకు

    శాపమందెను నిర్దయ చంద్రుడపుడు

    ఘనత మీరగ సతతంబు గారవింతు...దొడ్డ.....


4. మాతపితలను సేవించు మార్గమొకటె

    సకలసౌఖ్యాల గనియంచు చాటినట్టి

    జ్ఞానివీవయ్య  వెనకయ్య!మానితుండ!...దొడ్డ.....


5. ఇర్వదొక్కటి పత్రాల నింపుగాను

    పూజలందుచు భక్తుల మోదమలర

    మోక్షమందించు పరమాత్మ! పుణ్యపురుష!...దొడ్డ...


6. గరికపూజకె ముదమంది దురితములను

    పారద్రోలెడు పరమాత్మ! భవ్యచరిత!

    కార్యసిద్ధిని గూర్చెడు ఘనుడవీవు...దొడ్డ...


7. మోదకంబుల నర్పింప మోదమంది

    వెనుకముందులుజూడక మనుజులకును

    సర్వవిజయాలు గూర్తువు సాధువదన!..దొడ్డ...


8. గర్వపడినట్టి తమ్ముని గర్వమణచి

    వినయశీలంబె సర్వత్ర విజయమంచు

    చాటిచెప్పిన ఘనుడవు మేటివయ్య!..దొడ్డ...


9. సర్వసైన్యాధిపత్యంపు సాధనాన

    నీవు జూపిన ప్రజ్ఞకు నీరజాక్ష!

    మిగుల నాశ్చర్యమొందెను మిన్ను మన్ను..దొడ్డ...


10.పంటలన్నియు సతతంబు పాడుసేయు

     ఎలుక మీదను నీవుండి యెఱుకగూర్చి

     జ్ఞాననేత్రంబునిచ్చిన జ్ఞానివీవు.

     దొడ్డ గణపయ్య ననుగావు దురిత హరణ!




[

No comments:

Post a Comment