Wednesday, November 14, 2018

puraanamula loni వ్యక్తులు

పురాణముల లోని వ్యక్తులు

అగస్త్యుడు

అగస్త్యుడు మహర్షి. లోపాముద్ర ఆయన ఇల్లాలు.వారి కుమారుడు దృఢస్యుడు.  ఇల్వలుడు వాతాపి అను దుర్బుద్ధి గల ఇద్దరు రాక్షసులు అరణ్యములో నివసిస్తూ దారిలో పోవువారిని మాయమాటలతో వారిని హింసించుటకై ఆతిధ్యమిత్తుము రమ్మని పిలిచెడివారు. ఇల్వలుడు తనసోదరుడు వాతాపిని మేక గా మార్చి దాని మాంసము అతిథికి వడ్డించి భోజనము అయిన వెంటనే 'వాతాపి బయటకు రా' అని పిలిచెడివాడు. వాతాపి పొట్టచీల్చుకొని బయటకు వచ్చెడివాడు.  ఒకసారి అగస్త్య మహర్షి అటుగా వెళ్ళడము తటస్తించింది. ఎప్పటిలాగే వారు మహర్షిని భోజనమునకు పిలిచారు. ఆతిధ్యమైన తరువాత వాతాపిని బయటకు రమ్మని పిలిచాడు ఇల్వలుడు. వాతాపి మహర్షి పొట్ట చీల్చుకొని బయటకు రాగానే మహర్షి చనిపోతాడని తలచాడు. కానీ అంతలోనే అగస్త్యుడు 'వాతాపి జీర్ణం' అని అన్నాడు. వాతాపి జీర్ణమైపోయాడు. ఇల్వలుడు కోపంతో అగస్త్యుని మీద దాడి చేయబోగా అగస్త్యుడు తన హుంకారముతో ఇల్వలునికూడా దహించి వేసాడు. 
అగస్త్య మహర్షి వింధ్యపర్వతము యొక్క గర్వభంగమొనరించాడు. సముద్రమున దాగిన కాలకేయులను రాక్షసులను బయటకు రప్పించుటకై సముద్రమునే ఔపోసన పట్టాడు.
దండకారణ్యములోని అగస్త్యుని ఆశ్రమము దర్శించిన రామునికి ఆయన దివ్యమైన ధనుర్బాణములు అక్షయ తూణీరములు ఖడ్గము ప్రసాదించి వారిని సమీపములో గోదావరి తీరమున గల పంచవటిలో నివసించమని ఆదేశించెను.
 పైన పేర్కొన్న అంశములు అగస్త్యుని యొక్క తపఃశక్తిని, గొప్పతనమును చాటుతున్నవి.అగస్త్యుడు మహర్షి. లోపాముద్ర ఆయన ఇల్లాలు. వారి కుమారుడు దృఢస్యుడు.

అగ్ని

బ్రహ్మ మానస పుత్రుడు అగ్ని. భార్య స్వాహాదేవి.  వశిష్ఠుని శాపం చేత గార్హపత్యము, ఆహవనీయము, దక్షిణాగ్ని అను త్రేతాగ్నులు పృధు చక్రవర్తి కొడుకైన విజితాశ్వునకు  భార్య  శిఖండిని యందు పావకుడు, పవమానుడు, శుచి అను పేర్లతో పుట్టి తమ ప్రభావంతో మళ్ళీ అగ్నులుగా రూపొంది యధా స్థానాలకు వెళ్లిపోయారు.
 అరణి యందు మధింపగా పుట్టినవాడు పవమానుడు. మెరుపులతో నుండువాడు పావకుడు. సూర్యుని తేజస్సు నందుండువాడు శుచి.
పావకుని కొడుకు సహరక్షుడు రాక్షసుల యజ్ఞములో ఉంటాడు.  పవమానుని పుత్రుడు కవ్యవాహుడు పితృదేవతలయందు ప్రీతిగలిగి యుండును. శుచి కుమారుడు హవ్యవాహుడు యజ్ఞములయందలి హవిస్సును దేవతలకు చేర్చు చున్నాడు. 

అజామీళుడు

కన్యాకుబ్జము అనే దేశములో ఒకప్పుడు అజామీళుడు అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు.   ఒకానొక సందర్భములో అతడు ఒక అధమ జాతి స్త్రీ తో కూడి నిగ్రహమును కోల్పోయెను. ఆ స్త్రీయందు కలిగిన సంతానంలో ఆఖరివాని పేరు నారాయణ.  అతనిమీద పెంచుకున్న మమకారం కారణంగా అజామీళుడు ‘నారాయణా నారాయణా’ అని పలుకుతూ ప్రాణములు విడిచెను. మరణకాలమున నారాయణ నామం పలుకుటచే, పాశములతో వచ్చిన యమకింకరులను నారాయణుని సేవకులు అడ్డుకొన్నారు. పవిత్రమైన నారాయణుని నామము ఉచ్చరించినంత మాత్రమున అజామీళుడు శిక్ష నుండి రక్షితుడయ్యెనని తెలిపారు.  యమధర్మరాజు కూడా నారాయణుని స్మరించిన భక్తుల జోలికి వెళ్లవద్దని యమభటులను సమాధానపరిచెను.     అజామీళుడు యమభటులకు, నారాయణ సేవకులకు మధ్యన జరిగిన సంవాదము వినగలుగుతాడు.  తిరిగి జీవించిన అజామీళుడు తాను గడిపిన జీవితమునకు విచారించి అప్పటినుంచి భక్తితో నారాయణుని సేవించి   ఆయనలో ఐక్య మయ్యాడు.

అత్రి


అత్రి మహాముని.  అనసూయ ఆయన ఇల్లాలు. అనసూయ బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో గొప్పవాడు తన ఇంట పుట్టాలని తపస్సు చేసింది. తత్ఫలితముగా ఆమెకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలతో చంద్రుడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు   జన్మించారు.
 సీత రామ లక్ష్మణులు చిత్రకూటము విడిచి వెళ్లునప్పుడు అత్రి మహాముని ఆశ్రమమును సందర్శించిరి.  అనసూయ సీతకు దివ్యాభరణములు, ఎన్నటికీ నలగని వస్త్రములు, మరియు అంగరాగములు   తన తపశ్శక్తితో సృష్టించి  యిచ్చెను.

అద్రిక

అద్రిక ఒక అప్సరస. ఒకనాడు ఆమె మత్స్య రూపము ధరించి యమునా నదిలో విహరిస్తోంది. ఆ సమయములో ఒక బ్రాహ్మణుడు యమునలో దిగి సంధ్యా వందనము ఆచరించుచుండగా చేపరూపములోనున్న అద్రిక అతని అంద చందములకు ముచ్చటపడి పాదములను పట్టుకొని లాగింది. అందుకు కోపించి ఆ బ్రాహ్మణుడు ఆమెను మత్స్యముగానే ఉండిపొమ్మని శాపమిచ్చాడు. అద్రిక అతని పాదములపై బడి క్షమించమని వేడుకోగా ఆమెకు ఒక కొడుకు ఒక కూతురు పుట్టినప్పుడు శాపవిమోచనం మౌతుందని చెప్పి వెళ్ళిపోయాడు.
ఇది ఇలా ఉండగా చేది రాజైన ఉపరిచర వసువు పితృదేవతల కార్యము నిర్వర్తించుట కొరకు తండ్రి చెప్పినమీద మృగార్ధమై వేటకు వచ్చి,  భార్య గిరిక గుర్తుకు వచ్చి తన తేజమును ఆకుదొన్నెలో నుంచి, డేగ ముక్కుకు కట్టెను. వేరొక డేగ తరుమగా దొన్నె క్రిందపడి దానిలోని పదార్థమును చేపరూపములోనున్న అద్రిక ఆహారమనుకొని మ్రింగివేసినది. ఫలితముగా గర్భము దాల్చి చేపరూపములోనున్న అద్రికను పట్టిన  జాలరులు దానిని దాశరాజుకు, దాశరాజు ఉపరిచర వసువునకు కానుకగా ఇచ్చారు. ఆ చేపను చీల్చగా మగపిల్లవాడు ఒక ఆడపిల్ల బయటపడ్డారు. అద్రిక శాపవిమోచనమై అదృశ్యమైంది. ఉపరిచర వసువు మగ పిల్లవాడిని ఉంచుకొని ఆడపిల్లను దాశరాజుకు ఇచ్చి వైచెను. దాశరాజు వద్ద పెరిగిన ఆమెనే మత్స్యగంధి. పరాశరునికి మత్స్యగంధి యందు పుట్టినవాడే వ్యాసుడు.

అనంతుడు

నాగ ప్రముఖులలో ఒకడు. విష్ణుమూర్తి కి  పాన్పుగా అలరినవాడు.

No comments:

Post a Comment