Wednesday, November 14, 2018

soudasudu

సౌదసుడు(కల్మాషపాదుడు)

భగీరథుని సంతతిలోనివాడైన ఋతుపర్ణుడు నలచక్రవర్తితో స్నేహమొనరించి అతడికి అక్ష విద్యను నేర్పి నలుని నుండి అశ్వ విద్యను గ్రహించాడు. ఆ ఋతుపర్ణుని మనుమడు సౌదాసుడు, అతడి భార్య మదయన్తి. సౌదాసునికి దైవభక్తి మెండు, ధర్మపరుడు. సౌదాసుడు ఒకసారి వేటకు వెళ్లి మార్గములో తారసపడిన ఒక రాక్షసునితో పోరి వానిని చంపివైచెను. ఆ రక్కసునకు ఒక తమ్ముడు కలడు. వాడు రాజు పై పగబట్టి వంటవాని వేషములో రాజు ఇంట్లో చేరాడు. ఒక రోజు రాజు, కులగురువు వసిష్ఠుని ఆతిధ్యమునకు పిలిచెను. అదే అదనుగా వంటవాడుగా నున్న  రాక్షసుని తమ్ముడు నరమాంసమును వసిష్ఠునకిచ్చు ఆతిధ్యములో కలిపివేసెను. ఈ విషయము రాజునకు తెలియదు. వసిష్ఠుడు భోజనమునకు కూర్చొని తనకు వడ్డించిన పదార్ధములో నరమాంసము కలిసియుండుట గ్రహించి సౌదాసుని నరమాంస భక్షకుడైన  రాక్షసుడవు కమ్మని శపించెను. తరువాత  రాజు నిరపరాధి అని, అతని ప్రమేయము లేదని తెలిసికొని, తన శాపమును పన్నెండు ఏళ్లకు కుదించెను. వసిష్ఠుడు తనకు ఆకారణముగా శాపమిచ్చినందుకు ఆగ్రహించి వసిష్ఠుని శపించుటకు రాజు తన చేతియందు నీళ్లు పోసుకొని మంత్రించసాగెను. ఆ సమయములో రాజు భార్య మదయన్తి వచ్చి సౌదాసునితో  ‘కులగురువైన వసిష్ఠుని శపించుట తగదని, దానివలన రాజుకు అతని వారసులకు క్షేమముగాదని’  పలికి రాజును అందుండి విరమింపజేసెను. సౌదాసుడు భార్యమాటలు విని తాను కోపము తెచ్చుకొనకుండవలసినదని తలబోసి చేతిలోని జలమును తన కాళ్ళ పై వదలివేసెను. అలా మంత్రించిన జలము పడిన కారణముగా అతని కాళ్ళ రంగు నల్లగా మారి  అప్పటినుంచి రాజు కల్మాషపాదుడయ్యెను.

అలా శాపవశమున నరమాంసభక్షకుడి గా రాక్షసరూపములోనున్న రాజు, అరణ్యములో బ్రాహ్మణ దంపతులను చూచి బ్రాహ్మణుని మ్రింగ బోయెను. బ్రాహ్మణుని భార్య రాక్షస రూపములోనున్న రాజుతో 'మానవజన్మ దుర్లభమైనది, మనిషిగా పుట్టినందుకు దానం ధర్మం పరోపకార గుణము ఉండాలి. సూర్యవంశములో జన్మించిన నీవు బ్రాహ్మణుని చంపి ఆ పాతకాన్ని కొని తెచ్చుకుంటావా? మీ తాత తండ్రులను గురుతుకు తెచ్చుకొని ధర్మమును పాటించి నా భర్తను వదలి పెట్టు'  అని ఆక్రోశించింది.  అలా అతని భార్య ప్రాధేయపడినా కూడా వినకుండా సౌదాసుడు బ్రాహ్మణుని భక్షించివేసెను. అపుడా బ్రాహ్మణ యువతి సౌదాసునితో  ‘ఈ పాప కృత్యమునకు ఒడిగట్టిన నీవు భార్యతో సంగమించినచొ  మరణింతువుగాక’ అని శాపమిచ్చి ఆమె భర్త చితిలోపడి ప్రాణము వదలెను. పన్నెండు సంవత్సరముల కాలము ముగియగానే సౌదాసునకు నిజరూపమువచ్చి రాజ్యమునకు తిరిగివచ్చెను. బ్రాహ్మణ యువతి శాపకారణముగా, భార్యతో రమించిన సౌదాసుడు మరణించగలడు అందుచేత భార్యతో సంభోగించలేడు. సంతానము లేని కారణముగా మదయన్తి అప్పటి సాంప్రదాయము ననుసరించి భర్త అనుమతితో కుల గురువైన వసిష్ఠునితో కూడి  కొడుకును కన్నది.     అతడి పేరు అస్మకుడు. అలా ఆ మదయన్తి వసిష్ఠుని వలన పొందిన గర్భమును ఏడు సంవత్సరములు ధరించింది. అప్పటికీ ప్రసవం కాకపోవటంతో వసిష్ఠుడు వాడిగా ఉన్న రాయితో ఆమె గర్భమును చీల్చగా అస్మకుడు పుట్టాడు. ఆ అస్మకుని కొడుకు మూలకుడు జన్మించిన సమయంలోనే  పరశురాముడు, తండ్రి జమదగ్ని మరణమునకు ప్రతీకారంగా రాజ సమూహములను తన గండ్ర గొడ్డలితో మట్టుపెడుతున్నాడు. అప్పుడు స్త్రీలందరు ఆ బాలుని చుట్టూ చేరి కాపాడటం వల్ల మూలకుడు నారీకవచుడుగా గా పేరొందాడు. పరశు రామునిచే నిర్మూలింపబడిన  సూర్య వంశమునకు మూలమై నిలిచాడు కావున ఆ బాలుడు మూలకుడయ్యాడు.
 
ఖట్వాఙ్గడు సౌదాసుని తరువాతి తరములోనివాడు. ఖట్వాన్గుని కుమారుడు దీర్ఘబాహుడు, దీర్ఘబాహుని కుమారుడు రఘుమహారాజు. రఘుమహారాజు సంతతివాడు అజుడు, అజుని పుత్రుడు దశరధ మహారాజు.

No comments:

Post a Comment