Saturday, February 29, 2020

పితృదేవులు

కొందరి జీవితాలను చదివితే వారి అనుభవములు మనకు ప్రేరణ కలిగిస్తాయి. మార్గదర్శకాన్నిస్తాయి. అటువంటి ఉన్నత మార్గదర్శక లక్షణములు కలిగిన వారే కీ.శే. శ్రీ పోచిరాజు పేర్రాజు గారు.
ఆ మార్గదర్శి గారిని గూర్చి తెలుసుకుందాము వారే మన సభ్యులైన శ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారి తండ్రి. వారిని గూర్చి వారి అబ్బాయిగారి మాటలలో తెలిసికుందాము. కామేశ్వర రావు గారి అన్నగారు శ్రీ సుబ్బారావుగారు మా పినతండ్రి గారి సహాధ్యాయి మా పెదతండ్రి గారికి శిష్యులు మోడేకుర్రులో.

కీ.శే. శ్రీ పోచిరాజు పేర్రాజు గారు.
బి. దొడ్డవరము, (రాజోలు తాలూక).
(1920 – 2001)
సంక్షిప్త పరిచయము:
కపిలేశ్వర పురములో శ్రీ పోచిరాజు సుబ్బారావు సత్యవతీ దంపతులకు 1920 లో జన్మించిరి.
చిన్న వయస్సు లోనే వివాహమైనది. మా తల్లి గారు శ్రీమతి సత్యసుందరి. పాలగుమ్మి వారి యాడపడచు.
అమరకోశమును తన మేనమామ అయ్యగారి భాగయ్య శాస్త్రి గారి వద్ద నేర్చుకున్నారు.
మా నాన్న గారు చిఱుత ప్రాయములోనే తండ్రిని పోగొట్టుకొని గ్రామ కరణము గా చిన్న కాఱు రైతుగా ముగ్గురు తమ్ముళ్ళ నొక్క చెల్లెలిని పోషించి పెళ్ళిళ్ళు చేసిరి.
ఆయన సంతానమైన మా నలుగు రన్నదమ్ములను మఱియు నైదుగు రప్ప చెల్లెళ్ళను వృద్ధి లోనికి తీసుకొని వచ్చిరి.
చిన్నప్పటినుంచి యాధ్యాత్మిక చింతనలో పరధ్యానముగా నుండెడి వారని మా మామయ్య (మేనత్త గారి భర్త). మాకు చెప్పరి.
స్వామి శివానందుల వారి శిష్యులు. ఉత్తర ప్రతుత్తరములు చేసిన భాగ్యవంతుఁడు.
రమణ మహర్షి, ఇనమడుగు సత్యానంద స్వాముల వారి శిష్యుఁడు.
భగవద్గీత, స్వామి వివేకానంద రచనలు,  మున్నగు నాధ్యాత్మిక గ్రంథములు నిత్యము చదువు చుండెడి వారు దిన చర్యగా.
ప్రతి రోజు మద్యాహ్నము, సాయంత్రము తిరుగుచు భాగవతము లోని పద్యములను (కంఠత) చదువు ఛుండెడి వారు క్రమము తప్పకుండ.

వ్రాసిన గ్రంథములు:
1. గీతా యోగము, భగవద్గీత వ్యాఖ్యానము.
2. Man and God
3. How to become Yogi
4. సావిత్రి, అరబిందొ ఘోష్ గ్రంధ వ్యాఖ్యానము.
5. Glimpses of Ancient Vedic Thought of India.

ఈ పుస్తకము లన్నియు నాయన ప్రియ మిత్రుఁడు, మా మామ గారు నయిన కీ.శే. ధరణీప్రగడ వేంకట సుబ్రహ్మణ్య శర్మ గారి వద్ద నుంచిరి.
అప్పటి మా బా ల్యావివేకము వలన వాటి విలువను గుర్తించ లేక పోయితిమి. ఈ ప్రతులను శ్రీ శివానందాశ్రమము, సత్యానందాశ్రమములకు నొసంగిరి.  కొన్ని ప్రతులుంచగ  వాటిక కొఱకు నేను ప్రయత్నించు చున్నాను.


సత్యాధ్యాత్మిక చింతనా కలిత భాస్వద్జ్ఞాన సంభావ్యుఁడున్
నిత్యోద్దీపిత పద్య కీర్తిత మహానీలాంగ విష్ణుండు నౌ
న్నత్యభ్రాజిత వర్తనుండు స్వపురీ నాథత్వ ధౌరేయుఁ డా
రాత్యామ్నాయ విహీనునిం గొలుతుఁ బేర్రాజాఖ్య విఖ్యాతునిన్

తరణార్థంబు భవాబ్ధి వ్రాసితివి గీతాయోగ భాష్యమ్మునున్
విరియం జేసితి పుష్ప సంచయము సావిత్రీ కథాగమ్మునం
బర భాషామృత భాండ మిచ్చితివి వప్తా సంయమీంద్రత్వమున్
వరమై యొప్పగ నిన్ను గొల్చెదము నీ పాదద్వయం బానుచున్


నర వంద్యోత్తమ సేద దీరితి శివానందద్రుమచ్ఛాయలన్
దరిఁ జేరంగఁ దలంచి వింటి వట సత్యానంద సద్బోధలం
బరమానందము నొందవే రమణ దేవజ్యోత్స్నధామంబునన్
సరి లేరెవ్వరు నీకుఁ దండ్రి యిల సంసారంపు సన్యాసివే

మాన ధనుండు గ్రామ జన మండిత తత్త్వ విశోధకుండు స
త్సూనృత గీతసార పరిశోధిత  మానస భాసమానుఁడున్
మానిత వేద సూక్త పరిమాణ మహోదయ కావ్య రాజ సం
ధానుఁడు సత్యవంత వర దార చరిత్ర మనంగ ధాత్రినిన్

దొడ్డవరంబు నాఁ బరఁగు దొడ్డ పురమ్ము సలీలఁ గాచి తీ
వడ్డము లేని చందమున వ్యర్థపుఁ బల్కుల సంహరించుచున్
దుడ్డున కీక విస్తరము దోరపు గడ్డగు కాల మందునన్
గొడ్డము లెన్ని వచ్చినను గుండె దిటమ్మున నుంటి విద్ధరన్

విబుధ జన విధేయుఁడు
పోచిరాజు కామేశ్వర రావు.

No comments:

Post a Comment