Tuesday, December 28, 2021

 

బ్రహ్మశ్రీ వేదమూర్తులైన జక్కరాజు ప్రకాశరావు గారి జన్మదిన శుభాకాంక్షలతో సమర్పించు పంచరత్నములు.

-------------------------

జక్కరాజను వంశాన సదయమూర్తి

ధరను ప్రకాశరావుగ బరగి మిగుల

నయముగావించితమ్ముల నడవడికను

మానవత్వంబు జాటిన  మహితు డతడు. 1


 తండ్రి యంకము జేరని దనయు లైన

దమ్ము లందరి బాగోగు లిమ్ముగాను

దాను దండ్రియై సాకిన ధర్మ యుతుడు

సాటి యెవరయ్య తనకిల సాటి యెవరు. 2


చదువు సంధ్యలు నేర్పించి చక్కగాను

మాకు బ్రదుకగ శక్తిసామర్ధ్య ములను

నొసగి నటువంటి నీవునౌ నుత్తముడవు

వందనంబుల నిడుదుము వందలాది. 3


నీదు పెంపక మరయగ నిజముగాను

కన్న కొడుకులా యనునటు కానిపించె

నీదు ఋణమును దీర్చగ నేర్వలేము

రెండు చేతుల తోడికై దండ లివియె. 4


ఆది దంపతి వోలెను నలరు నట్టి 

మీకు వదినెకు శంభుడు మిగులదయను

నాయు రారోగ్య సంపద లన్ని యిడుచు

నెల్ల కాలము గావుత  చల్లగాను

----------

ఇట్లు హృదయపూర్వక నమస్కారములతో....

కుటుంబ సభ్యులు

Thursday, December 9, 2021

ఉత్పల గజమాల 108

 భరత మాత కుత్పల గజమాల.

ప్రణీతము: పోచిరాజు సుబ్బారావు

108 పాదములు. 

భారత దేశ సీమలుగఁ బశ్చిమ వైపున వార్ధ్యరేబియా 

దూరుపు దిక్కునం గలదు తోరపు సంద్రము తూర్పువార్ధియే 

యారయ నుత్తరంబునన హైమవతీ పిత పర్వతంబునున్ 

మూరును  దక్షిణాన నిలఁ బుణ్యపు హిందు మహాబ్ధి రత్నమే 

భారత దేశ వాసులకు భావి సుతాలికి మార్గ మీఁ దగున్ 

వారము వార మింపుగను బండిత వర్గము మెచ్చఁగా వలెన్  

గోరిన సాయ మెల్ల నిడి కూరిమి నెల్లరు  పంచఁగా వలెన్  

వారక సంతసం బడరి వర్తిలఁ బౌరులు గాంతు రున్నతిన్

వీరులు దేశ సైనికులు పెన్నిధు లౌదురు దేశ మంతకున్  

వారలు లేనిచో మనము ప్రాణము తోడను నుండఁ జాలమే 

శూరులె యెల్ల వేళలను శూరత జూపుదు రంక భూమిలో 

మారణ హోమమున్ జరిపి మచ్చరిఁ జంపుదు రప్రమత్తతన్ 

సూరన రామకృష్ణ కవి సుబ్బయ శాస్త్రులు తిమ్మ నార్యుఁడున్ 

మారన రంగనాధుఁడును మల్లన పెద్దన భట్టుమూర్తియున్ 

వారలు పండి తోత్తము లవారిత రక్తిని కావ్య సంపదం  

బారగులే మహా కవిత భాసిలు నట్లుగఁ జేయ వీరలున్ 

వీరికి మున్ను నన్నయ కవీశ్వర తిక్కన యెఱ్ఱ ప్రెగ్గడల్ 

గౌరన కృష్ణరాయలును గాకలు తీరిన రామలింగఁడున్ 

నారయ దీక్షితుల్ మఱియు నాచన సోమన వేమ నార్యుఁడున్ 

భారత దేశ మందుననె భాసిలి యిచ్చిరి పెక్కు కావ్యముల్ 

వీరును వారు నున్ననక పిన్నలు పెద్దలు బుద్ధిమంతులే  

వారలు వీరలున్ నిలిచి వ్యాక్సిను బొందఁగఁ బట్టు వట్టిరే 

భారత దేశవాసు లన భారత జాతికి ముద్దు బిడ్డలే 

యే రక మైన కార్యముల నింపుగఁ జేయ సమర్థు లెన్నఁగా  

నారిన జ్యోతికిం దిరిగి హారతి పట్టును భారతీయుఁడే

వారినిఁ బాఱు చుండఁ దగఁ బట్టెడు వాఁడును భారతీయుఁడే

పేరిమి జాతకంబులను బెద్దగ నమ్మును భారతీయుఁడే 

వైరము సూడకుండ జన వర్గము నమ్మును భారతీయుఁడే 

గోరను బోవు దానికిని గొడ్డలి వాడరు కర్కశమ్ముగాఁ  

గోరిన వారి కెల్లరకుఁ గూడును గుడ్డ నొసంగ నేర్తురే  

సైరికుఁ డొప్పుగం దివిరి సాగునఁ జాగును బ్రేమమూర్తియై

వైరము లేని పద్ధతిని భారత దేశము చేయి నిచ్చునే 

భారతి పుట్టి నిల్లయిన బాసర యిక్కడె యుండె నింపుగాఁ   

బౌరు లనంగ నేరుదురు భౌతిక రూపము గాంచి నంతనే 

వీరలు మెచ్చ రెప్పుడును వీసము కూడను గర్ణు దానమున్

వీరలు మెచ్చ రెచ్చటను భీముని శౌర్యము నెట్టి వేళలన్  

సైరికు లోగిరంబులను జక్కగఁ దిందురు పైరు మధ్యలోఁ 

బైరులు పండు బాగుగను భారత దేశపు పంట చేలలోఁ 

బేరు గడించు పండితులు పెక్కురు పుట్టిరి  భారతావనిన్  

భారత దేశ వైభవము బ్రహ్మకు కూడ వచింప శక్యమే 

బీరము లాడు వార లిట పేరుకు నైనను గాన రారులే 

క్రూర మనస్కు లుండ రిటఁ గూరిమి జూపుచు నుందు రెయ్యెడం   

జేరవు భూతముల్ దరికి సేమము సూడఁగ  గ్రామదేవతల్ 

నీరజ నాభుఁడే కదలి నెమ్మిని రక్షణ మిచ్చు ధాత్రికిం  

గారు దురాత్మకుల్ వశులు కాలుని సేవకు నెల్ల వేళలం  

గారుగ హంతకుల్ మదినిఁ గంపెడు జాలిని గల్గు వారలే 

కారుగ మోసగాళ్లు మఱి  కాంక్షలు దీర్చెడు కర్ణులే సుమా 

కారు సుసత్యదూరు లిఁకఁ గాంతలు సైతము సత్య వాదులే 

భారత దేశ కీర్తి యిఁక భాసిలు దేశ విదేశ సీమలన్ 

నీరజ నేత్ర యా గిరిజ నెమ్మిని గాచును  భారతీయులన్ 

భారము గాఁ దలంపకను బామ్మలు సైతము వంటఁ గూర్తురే 

గారెలు జంతికల్ వడలు కమ్మగ వండుదు రిద్ధరిత్రినిన్ 

ధారణ యందునన్ మిగుల దక్షులు భారత దేశ వాసులే

పైరులు పంట లిద్ధరను బాగుగ పండెడు దేశమే సుమా

నేరము జేయు వారి నిట నీతి విదూరులుగాఁ దలంతురే

మీరరు తండ్రి యాఙ్ఞలను మేదిని నొక్కరు నైనఁ గ్రోధులై   

యారదు దీప కాంతి యిట హారము వోలెను  గాంతి యిచ్చుటం  

గ్రూర మృగంబులన్ వనిని గూర్మిని బెంచును భారతీయుఁడే

క్రూరత జూప రెప్పుడును గ్రోధము గల్గిన భారతీయులే

గౌరవ మొప్పగాఁ బ్రభువు  గాచును దప్పక భారతావనిం  

జోరులు సైతమున్ దయను జూపుదు రొక్కొక వేళ లిద్ధరం 

జారులు  తోడ్పడంగఁ గడు చక్కని భద్రత నుండు దేశమే   

జోరున వానలే కురియఁ జూచుచు నుండక వాడు కొందురే 

దారను నొంటిగా వదలి ధర్మము దప్పరు భారతీయులే 

ధీరులు కాని వార లిఁక దివ్వెటఁ జూచిన గాన రా రిటన్ 

నేరము జేయు వాని నిఁక నీచుఁడె యందురు  భారతీయులే 

బేరము లాడు వారి నిట వీసము కూడను లెక్క సేయరే 

పారము సేరఁ గోరు ప్రతి భక్తుఁడు నిక్కపు భారతీయుఁడే  

భారత దేశపుం జనువు భాగ్యమె యౌనను భారతీయుఁడే 

భారవి యాదిగా కవులు భారత మాతకుఁ గన్నబిడ్డలే

భారత దేశ భామినులు పాకపు వృత్తిని నారితేరిరే

కోరిన తత్క్షణం బిడును గూర్మిని నన్నము నమ్మ యింపుగా  

నూరులు బెక్కులున్నయవి యోటమి నొల్లవు వీండ్ల నెన్నఁడుం 

బోరునఁ దీసిపో రెపుడు  భూపతు లెవ్వరు భారతావనిన్ 

వైరి జనంబులం దునుమఁ బ్రాఙ్ఞులు నిచ్చటి వీర సైనికుల్  

చారుతరంబులై మెఱయు చానలు చూడఁగ భారతీయులే 

కోరఁడు బంధువున్ భువినిఁ గూటికి గుడ్డకు భారతీయుఁడే

భారత దేశ సైనికుఁడు భారత మాతను  కాచు నిత్యమున్ 

నేరఁడు చేయి చాఁపుటను నీతిని మానుకు భారతీయుఁడే 

భీరుని జేయ రెప్పుడును  బ్రేమను బంచిన భారతీయునిన్ 

ఘోరముగా దలంతు మిఁకఁ గోడలి హత్యను భారతావనిన్ 

జారుని మోమునుం గనిన జాలిని జూపరు భారతావనిం  

దీరము దాట గోరు నెడ తేకువతోఁ జను భారతీయుఁడే 

ధారుణి నేలు భూపతులు ధార్మిక పద్ధతి నాకళించిరే 

జోరున వర్షముల్ బడెడు చొప్పది సంద్రము దోఁచు నత్తఱిన్ 

భూరిగ దానముల్ సలుపు భూజను లుండిరి  భారతావనిం  

బౌరులు పౌరుషం బడర భారత కీర్తినిఁ జాటి చెప్పరే 

బారుల బారులై మణులు భారత భూమిని దాఁగి యున్నవే 

తోరముగా సిరుల్ గలుగు దూరపు దృష్టిని సాగుచేయుచో 

బోరున నేడ్వ నాఁకలికిఁ బొట్టను నింపుదు రా క్షణంబునన్ 

మారఁడు సజ్జనుం డెపుడు మారుని బంటుగ భారతావనిన్ 

మేరువు వోలె నుందు రిట మీసము ద్రిప్పుచు ధైర్యవంతులై 

వీరశిఖా మణుల్ గలరు వెట్టము పాలిట దండ హస్తులై  

వైరి గణంబులం దునుమ బాసలు సేసిరి భారతీయులే 

వారము వారముం గురియు వానలు దప్పక భారతావనిన్ 

క్షీరము లిచ్చు గోవు లిట చేఁపగఁ జేఁపుచు మిక్కుటమ్ముగా 

సారము లేనిచో బ్రదుక సాధ్యము గాదిట యేరి కైననున్ 

సీరము చాలు నుండి గద సీతమ పుట్టెను భారతావనిన్ 

సూరన నామకం బలరి శోభిలె రాయల రాజ్య మందునన్ 

శారద పేరులో గలదు సౌమ్యత యమ్మల గన్న యమ్మయే 

నేరము జేయకుండు టది నిశ్చల తత్త్వపు భక్తియే సుమా 

కారణ జన్ము లెప్పుడును గాఁగల కార్యము లూహ చేయరే 

గౌరన సార్వభౌములకు గౌరవ పూర్వక వందనంబులే 

భారవి కాళిదాసులకు ఫాలము వంచి నమస్కరించెదన్ 

భారత దేశ కీర్తు లిలఁ బర్వగఁ గోరుదు దేశ రాశులన్ 

వారిజ నాభుఁ డింపుగను భారత దేశముఁ బ్రోచుగావుతన్ 

వారిజ గర్భుఁ డిద్ధరను భద్రత తోడుత రక్ష సేయుతన్ 

మార రిపుండు రక్షణము మానవ జాతి కొసంగుఁ గావుతన్ 

Friday, December 3, 2021

నాన్న పుట్టినదినము2-12


శ్రీకృష్ణార్పిత నిర్మ లాతిశయ చిచ్చేతో మహాంభోధికిన్ 

రాకా పూర్ణ సుధాకరుండ వయి భార్యా పుత్ర బంధమ్ముతో 

నేకాంతస్థిర భావ మగ్నుఁడవు విశ్వేశున్ మదిన్ నిల్పి ని

త్యైకాగ్రస్ఫుట రక్తి నుంటి విట సత్యాకాంక్షఁ దండ్రీ మహిన్