ఉ. ప్రాణములొడ్డుచుండి మన ప్రాణము గావగ దీక్షబూనుచున్,
ద్రాణము లేనిరాత్రులను తావళమందున దాచిబెట్టి, సం
త్రాణము చేయనెంచి తమ తల్లికి యిచ్చిన మాట నిల్పుచున్
ప్రాణము చేతబట్టి యెడబాయక యుందురు వీరసైనికుల్.
( ద్రాణము = నిద్ర; త్రాణము= రక్షణ; తావళము = గుడారము)
ఉ. ప్రేమకు నోచుకోరు తమ పిల్లల మోములు చూడకుండ నీ
సీమను కాపుగాసి మన సేమము నెప్పుడు కోరుచుండిలన్ .
శ్రామిక జీవనంబు ననుశాసనజేయుచు కొండనేస్తులై
ఆమని నోచరెన్న డిలనైహిక జీవులు వీరసైనికుల్.
ఉ. గేహము నెన్నడున్ దలచకీగతి దాస్యము చేయువారు సం
దేహము లేదువారియెడ ధీరతకల్గిన వారహోయనన్
దేహము నప్పగించి మనదేశము కావలి గాచువారలై
మోహము చూపబోరు తమ మోమున నెన్నడు వీరసైనికుల్.
చం. భగభగ మండుచున్న బడబాగ్నుల కీలలు చుట్టుముట్టినన్
తెగువను వీడబోక తమ ధీరత కొంచెము పెంపుజేయుచున్
జగడము చేయువారలను చాగఱలాడుచు త్రిప్పికొట్టి మా
నగరము గాచుచుంద్రు తమ నైజము యొప్పగ వీరసైనికుల్
రచన శ్రీసత్తిబాబుగారు
No comments:
Post a Comment