శ్రీలు శూలము దండముల్ క్షితిని నెపుడు
సర్ప హారము నెలవంక సంతుగాదె
భస్మ ధారణ మనగను బరమ ప్రీతి
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర! 1.
చేయ జాలను బూజను శ్రీనిఁ బోలెఁ
గర్మ కాండల నెఱుగను గజము పగిది
మణుల నీయఁగ సరిపోను ఫణి వలె నిక
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర! 2.
ఏమి పుణ్యము సేసెనో యేమొ కాని
సాలె పురుగును నేనుగు సర్ప మరయ
ముక్తి నొందెను, నాకును మోక్ష మిచ్చి
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర! 3.
స్వార్ధ మంచును నెగతాళి సలుపు దేమొ
నాదు బాగును నేఁ జూడ న్యాయమె కద
కోరు చుంటిని నిన్నునేఁ గూర్మి తోడ
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర! 4.
శాస్త్ర విఙ్ఞాన గ్రంధముల్ సదువలేదు
మొక్కు బడిగాను నేర్చితి ముద్ద కొఱకుఁ
జిన్ని పదములఁ గూడిన సేద్య మిదియ
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర! 5.
పార్ధు దెబ్బకు నీ లోన బహు విధముల
మార్పు జరిగిన కతనాన మదిని సొలసి
యలుక నొందుచు దయఁ జూడ వకట నన్ను
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర! 6.
కాళ్లు నొప్పులు వీనులు కలసి రావు
చేతు లాడవు కనఁగ రా దేదియు నిక
భజన జేయగ లే నిట్టి వార్ధకమున
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర! 7.
పసిడి రజతము తామ్రపుఁ బట్టణముల
నొక్క బాణానఁ గూల్చిన నురసిలుడవు
వంద నంబులు సేయుదు వంద లాది
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర! 8.
చేయి పెట్టిన శిరసుపై వేయి ముక్క
లగు విధం బగు వరమును నసురున కిడి
ప్రాణ హానికి లోనయి పరువు లెత్తఁ
గాపు గాచెను గద సామి! కైట భారి
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర! 9.
బ్రహ్మ విష్ణులు నీ రూపుఁ బడయు కొఱకు
నెంత వెదకినఁ గన రావు సుంతయైన
నాకు శక్యమే నిను జూడ నతులు దప్ప
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర! 10.
ఆభరణములతోఁ గల యమ్మఁ జూడ
మనసు పులకించె నప్పుడు మైమఱవఁగ
నేమి భాగ్యము నా యది యేమి రూపు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 11.
లేకు కంట్రీ పురంబున లింగ మూర్తి
యాలయమునకు భక్తులు హర్ష మొదవ
వచ్చి పూజింతు రమితంపు భక్తి తోడ
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 12.
కాశి కేగిన వారలు గాంతు రచట
దివ్య మంగళ మూర్తుని, భవ్య పతినిఁ
బుణ్య మంతయు వారిదే పుణ్య పురుష !
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 13.
గురునిఁ బూజించు నెడ మంచి గుణము గలుగు
రుజయుఁ దొలగును నాతని రూపుఁ జూడ
దేశికుడవు నీవె గద యీ దీనున కిల
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 14.
తప్పుఁ జేయని మనుజుని దరమె వెదకఁ
జేయు చుందుము తప్పులు సివరి వరకు
నైన దయఁ జూపి మమ్ముల ననవరతము
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 15.
కాల భైరవ స్వామినిఁ గాంచి మ్రొక్క
శునక వాహను డగుచును మనకు నిచ్చు
సృష్టి జీవన లయముల నీశు వోలె
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 16.
గిట్టు మనుజుడు దప్పకఁ బుట్టు మరల
యతని పాపము విడివడు నంత వరకుఁ
బుణ్య మార్జనఁ జేయగఁ బోవు నఘము
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 17.
పూర్వ జన్మపుఁ బాపాలు వోవు వఱకు
జన్మ రాహిత్య ముండదు సత్య మదియ
పాప పరిహార మగు నీదు పాటవమున
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 18.
గతము నెన్నడుఁ దలపను గలను నైన
భావి నూహింప మనమున, వర్త మాన
ము నిక నాచరింతు సతము ముదము కొఱకు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 19.
పార్వతమ్మకుఁ దగు సగ భాగ మిచ్చి
యర్ధ నారీశ్వ డను పేరు సార్థ కమ్ముఁ
జేసి కొను నట్టి పార్వతీశా !శివ !యిక
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 20.
పుట్టు ప్రతిజీవి తప్పక గిట్టు భువిని
బ్రదుకు నన్నాళ్లు దైవము పైన మనసు
మలచి పాపాలు సేయక మసలు కొందు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 21.
విశ్వ గురువును గామారి వేద విదుడు
సకల దేవ తారాధ్యుడు శంకరుండు
నయిదు మోముల వేల్పును నయిన నీవు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 22.
అన్ని చోట్లను నీ వుందు వండ్రు ఋషులు
చెట్లు పుట్టలు గ్రామాలు సేరి వెదకఁ
గాన రాదయ్యె నిన్ను నా కన్ను దోయి
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 23.
వెదక వెదకంగఁ దెలిసె నా మదికి నిపుడు
నీవు గల వని నా లోన నెమ్మి గాను
బట్టు కొనువాఁడ నిపుడు నీ చుట్టుఁ దిరిగి
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 24.
మ్రోగు గంటలు బడిలోన ముద్ద కొఱకు
గంట మ్రోగును గుడిలోనఁ గాలుఁ జూడ
గుడి బడుల గంట లుండె మా గుండె లందు
నాత్మ పరమాత్మ రూపాన ,నవియ నీవె
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 25.
ఆత్మ పరమాత్మ లను నవి యర్థ మగుట
చాల కష్టము ,నరయ వత్సరముల ఘన
సాధనలచేత నయ్యది సాధ్య మగును
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 26.
దేశ భాషల యందునఁ దెలుగు లెస్స
యనుచు రాయలు నుడువుట నాదరించి
వ్రాయు చుంటిని దెలుగులోఁ బద్యములను
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 27.
పుట్టఁ బోయెడు బిడ్డకై పురుటి నొప్పు
లెన్ని వచ్చిన భరియించు నింతి వోలె
నెన్ని కష్టము లెదురైన నిన్ను వదల
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 28.
కన్ను మూసిన చోటను గన్నుఁ దెఱచు
బంధముల పైనఁ బ్రీతిని వదల లేక
జీవి యిటులనేఁ దిరుగును జేరి గృహము
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 29.
శ్వాస యున్నంత కాలమే బ్రదుకు జీవి
శ్వాస యాగిన మరణము సంభవించి
కాలి బూడిద యగు సుమా కాంతిఁ దొలగి
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 30.
శ్వాస యనగను బ్రాణము ప్రాణ మనగ
నాత్మ , యా యాత్మ నీవయే యాది దేవ !
యట్టి నీవు మా డెందముఁ బట్టి యుండి
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 31.
బద్ధకము గల మనుజుఁడు భరణి యందు
నేలఁ గొట్టిన ముద్దలు నేల మీద
నణగి యుండు విధంబున నటులె యుండు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 32.
ఎంత చెప్పిన వినకుండ సుంత యైన
ముళ్ల బాటను నడిచెడు మూర్ఖ జనుని
బాగుఁ జేయంగఁ జాలడు బ్రహ్మ యైన
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 33.
నిదుర లేచెద నుదయాన, నిన్ను గనుచుఁ
బద్య ములు రెండు మూడైన వ్రాసి రతిని
నీవె తల్లియుఁ దండ్రివి నీవె గురువు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 34.
కంటకము లన్ని గడదేఱుఁ గలుగు సుఖము
నీదు దర్శన మాత్రాన నిజము సుమ్ము
వమ్ము సేయకు నామాట వసుధ యందు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 35.
ఆశ్రిత జనుల రక్షించు నగ్గి కంటి
పాల పుంతల విహరించు భైరవుండు
నాదు గోడు విందు రనుచు నమ్ము చుంటి
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 36.
ఆశ్రిత జన రక్షకు డగు యఙ్ఞ పురుషు
డేని మసన మందునఁ గల యీశుఁ డేని
నాదు గోడును విను నని నమ్ము చుంటి
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 37.
వేయి మందియు వైద్యులు విసుగు లేక
జాగరూకత తోడను సాకి యైన
నాప గలరె రుగ్ణుని చావు ? నాప లేరు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 38.
ఏది యెటు లగుఁ దెలియగ నెవరి తరము
జరుగ మానదు పృథివిని జరుగు నదియ
చింత నొందను దానికై సుంత యైన
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 39.
నాది నే నను భావమ్ము నన్నుఁ దాక
గర్వ మేర్పడి నశియించు ఙ్ఞాన ధనము
కాన యా రెండు రా నీక కాచి నన్ను
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 40.
సత్త్వము తమము గుణములు సత్వరముగ
నింక నారజో గుణమును నిముడు కొఱకు
నాలయముఁ జుట్టుఁ దిరుగుదు నార్తి తోడ
మూడు మారులు లెక్కకు మూడు వరకు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 41.
నీదు నామముఁ బలుకుచు నిదుర లేచి
యుల్ల మలరగఁ నినుఁ జూచి యుత్సుకతన
నాసనములను వేయుదు ననుదినమ్ము
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 42.
అమ్మ నాన్న గురువు చెలి యక్క యన్న
లన్ని మీరె మాకం చను నాశ తోడ
బ్రదుకు చుంటిని మీ మీద భార ముంచి
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 43.
నీవు నాలోన నుండగ నెవ్వఁ డైన
భీతిఁ జెందును దరిఁ జేరఁ బృథివి యందుఁ
జివర కా యముఁ డైనను జేర వెఱచు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 44.
కార్తికంబునఁ బూజింపఁ గాలు రతిని
సాహసింపడు దరిఁ జేర సంయమనుడు
భక్తి భావము గలిగిన వ్యక్తి యగుట
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 45.
పాప హారుఁడు ముక్కంటి భస్మ ధరుడు
హస్త మందుఁ గపాలము హరికి సఖుఁడు
చంద్ర రేఖపుఁ జిహ్నుఁడు, సాంబు డౌచు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 46.
వేగ హర! "అ ఇ ఉణ్ ఋ ఌక్" నాఁగ నాడ
సంభ వించె నకా రాది జలము లన్ని
యవియె వర్ణ మాలగ నయ్యె నడరి యపుడు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 47.
మహిమ లెన్నియో జేసెడు మానవుండు
పతన మగు చుండె నహము దాఁ బరగు కతన
నహముఁ దొలగిన సిద్ధిని నందఁ గలడు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 48.
కోరు కొలదినిఁ బెరుగును గోరిక లిల
వాని నణచుట మే లగు బాగు కొఱకుఁ
గాని యెడలను బతనమే కాన నగును
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 49.
మనసు సెప్పిన విధముగ మసల రాదు
మనకు లోబడి మన వలె మనసు సుమ్ము
జీవితంబున ముఖ్యము జీవి కెపుడు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 50.
పద్య భావాల తీరును బట్టి నాదు
నార్తి గ్రహియించి దగు విధ మగు నుపకృతిఁ
జేయఁ గోరుదు ననిశముఁ జిన్మ యుండ
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 51.
ఏమి బ్రదుకులో యమెరికా గామి జనుల
తొమ్మి దైనను లేవరు తుడుపు లేదు
వండు కొనుటయుఁ దినుటయుఁ బండు కొనుటె
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 52.
కాని పించరు బయటను గనుల కెవరు
నిరుగు పొరుగులు సహితము నింటి లోనె
తిరుగు నలవాటు కలిగిన దిరుగ లేము
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 53.
గుణము లన్నిటిఁ గన దాన గుణము మేలు
దాన మీయుట చేతనే దైవ శక్తి
తో డగుచు నిడు మోక్షముఁ బుడమి యందు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 54.
అప్పు డప్పుడు వచ్చెడు నార్తి కేను
నిప్పు డింతగాఁ గుములుట యేలఁ జెపుమ
వచ్చి పోవును నొడలిలో బలము దఱుఁగ
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 55.
ఒకరిది ధనము భోగమిం కొకరిది యను
విధముగను నుండె మీ స్థితి విశ్వనాధ !
మీకు వృషభము గరుడుడు శ్రీకరునకు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 56.
నమ్మ కముఁ దోడ దంపతు లిమ్ముగాను
జేయు చుండిరి సంసృతిఁ జివరి వరకు
నట్టి నమ్మక ముండె నీ వనిన నజుడ !
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 57.
ఓం శివ యనుచు నీ నామ ముదయ మందు
నిత్య కృత్యము గాగ ననిశము పఠన
పాఠనంబులు సేసెడు భక్తుని గద
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 58.
బంధ ముండిన బ్రదుకులు బానిస లగు
నట్లు మెలగుట నొల్లను నాది దేవ !
బంధ ముక్తుని జేయుచుఁ బరము నిచ్చి
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 59.
మనము మనలను నమ్మిన మహితుఁడైన
హరిణ చిహ్నుని సంతోష పరచి నట్లు
నమ్మకమునకు సాక్షి గౌరమ్మ విభుడు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 60.
ఎపుడు పోవునో యీ ప్రాణ మెవరి కెఱుక
ప్రాణ ముండగఁ జేయుచుఁ బరుల కీవి
బ్రదుకు దినములు దృప్తిగఁ బ్రదుకుదు నిక
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 61.
మమను విడుచుట యెపుడును మఱవ కుండు
మదియ మఱుజన్మ లేమికి నాస్పదమ్ము
కాన విడుతును దప్పక నేను విభుడ!
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 62.
ఎవరి మనసును నొప్పింప ,నెవరి కైనఁ
జేత నైనంత వఱకును జేసి మేలు
మీ దయకుఁ బాత్రు నగుదును మిత్తి గొంగ!
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 63.
కాచి వడఁబోసి చూడగఁ గాపురమ్ముఁ
బేలవమ్ముగఁ దోచెను బ్రియము లేమి
తప్ప దీ జన్మ కయ్య దీ ధరణి యందు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 64.
మౌన మరయగ భూషణ మై చెలంగు
ఋషులు మును లైరి మౌనము చేతఁ జుమ్ము
మానసిక ముగ శాంతిని ,మహిమ నొసఁగు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 65.
కన్న తల్లినిఁ దండ్రిని గౌరవించి
సేవఁ జేయగ నగుఁ జుమా శివుని సేవ
పుష్టి తుష్టులు గలుగును బుణ్య మబ్బు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 66.
మల్లె పూలను జక్కగ మాల కట్టి
నీకు దండగా వేసెడు నియమ మికను
నిత్య కృత్యముఁ జేయుము నేల మీద
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 67.
ముక్తి కోరిక గల్గుచో రక్తిఁ గలిగి
సాంబ శివునికి వేవేల సార్లు జపము
లాచరింపగ వలెఁ జుమా యార్తితోడ
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 68.
కర్మ కాండలు సేసెడు కర్త లవియ
యాత్మ సాక్షిగఁ జేసిన నాయు వెదుగు
సకల శుభములు గలుగును శమముఁ గలుగు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 69.
వేల కొలదిగఁ బద్యాలు బేర్మి మీర
వ్రాయు శక్తి యుక్తుల నిమ్ము రాణ కెక్కు
పద్య ములు వ్రాయుదు కవులు బరవ శింప
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 70.
కన్ను గారుట గమనించి కన్న డపుడు
తనదు కన్నును నతికించె దయను గలిగి
యేమి భక్తినిఁ జూపించె నేమి యీవి
వంక పెట్టక కాపాడు ఫాల నే త్ర ! 71.
శిరమున నెలవంకకుఁ గల జిలుగు మెరయ
చుట్ట లూడిన సర్పాలు సుట్టుఁ దిరుగఁ
దోరపు రవమునను గంగ దుముక భువికి
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 72.
తప్పు లైనను నవి యగు నొప్పులుగను
బదుగురి పలుకు లొక్కని బలుకు సరియ
యైనఁ దప్పని యందురె యౌర ప్రజలు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 73.
కండ్లు గలవని పెద్దగాఁ గన జగమును
మాయ మగుఁ జుమా కనబడి మరలఁ జూడ
శాశ్వతంబు నీ రూపమే సకల భువికి
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 74.
బలము గలుగును దప్పక ప్రతి యొకనికి
నాత్మ విశ్వాస ముండిన, నది నిజముగ
నౌను బరమాత్మ విశ్వాస మభవ! యికను
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 75.
మువ్వు రుండగఁ బిల్లలు ముచ్చటగను
నాకు లేదిఁక నే లోటు నమ్ము నిజము
మూడు పూటల నీ పూజ ముదముఁ గూర్చు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 76.
సహన శక్తిని గోల్పోయి జనము ధరను
జీటి మాటికి నొకరికిఁ జేటుఁ జేయఁ
జూచు నెప్పుడు తప్పులు సూచి చూచి
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 77.
ఉందు వందురు కైలాస మందు నీవు
భక్త రక్షణ కొఱకునై భరణికి దిగి
వత్తు వనుచును వింటిని భక్త వరద !
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 78.
శాశ్వతంబులు గావేవి,శాశ్వతుండ
వీవయే యీ చరాచర మిలను జుమ్ము
దెలిసి కొనలేక పోతిని దెలివి లేమి
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 79.
మూడు గుణములు లేమికై మూడు మార్లు
భవుని చుట్టును దిరుగంగ వలయుఁ జుమ్ము
మూడు కంటెను నెక్కువ మొరకుఁ దనము
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 80.
అమ్మ నాన్నలు వోయిరి యకట మాకు
పోయి రక్కలు బావలు ముంచి వ్యధను
నంత మందినిఁ బోఁగొట్ట న్యాయ మౌనె
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 81.
గురుని బాధ్యత సంఘాన గురు తరమ్ము
భావి పౌరులఁ జేయును భవ్యముగను
ప్రధమ గురుడవు గనుకనే ప్రగతి నిచ్చి
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 82.
వ్యాస పూర్ణిమ నాఁడు నీ యాలయమున
మాకు చేసిరి ఘనపు సన్మానము గద
శాలువను గప్పి యచట నీ సమ్ముఖమున
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 83.
వచ్చి మిమ్ములఁ జూడగ , నచ్చ మైన
కాంతి పుంజము గనబడెఁ గాంతి తోడఁ
గన్ను లార్పకఁ జూచితి గడియ సేపు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 84.
మంచి చదువులు సదివిన మాన్యుఁ డగును
మంచి పనులను జేసిన మహితుఁ డగును
మంచి యందున నుండునా మహిమ కనుక
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 85.
పొగరుఁ గలుగుచుఁ బెద్దలఁ బూతు లాడ
పాప కూపమ్ముఁ జేరుచు భద్ర ముగను
వత్స రమ్ముల తరబడి బాధ లొందుఁ
గాన పాపము ల్సేయను గనికరించి
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 86.
ఆడది యనగ సబల ,కాదబల యనుచుఁ
జేసి చూపించె నీనాడు జివరి వరకు
నన్ని రంగాల యందుఁ దా నగుచు మెలగి
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 87.
మా తృ మూర్తులు గొందఱు మమత లేమిఁ
బురిటి బిడ్దను గోతినఁ బూడ్చు చుండ
బ్రహ్మ యటులనె వారికి వ్రాసె ననుచు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 88.
వేడు చుంటిని పలుమార్లు విశ్వ నాథ!
శాంతి కాముకుఁ డనగుచు , శమన మిమ్ము
పాద పూజను జేయుదుఁ బ్రతి దినమ్ము
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 89.
నీదు పాదాల చెంతన నెమ్మనమునఁ
బద్య పుష్పాలఁ బెట్టుదు ఫాల నేత్ర!
దయను జూడుమ నాయందు తప్ప కుండ
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 90.
వ్యావహారిక పదములు వాడు కొనుచు
వ్రాసి యుండెను నీ పైన ప్రముఖ కవియె
శతక మను పేరఁ బద్యాలు స్వామి ! వింటె
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 91.
సర్వ జగమును బాలించు శక్తి యుతుఁడు
సృష్టి లయముల కాపాడు చేవ గలిగి
మసన మందున నివసింప మంచి యగునె
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 92.
రాచి ఱంపాన బెట్టెడు రాక్షసులను
మార్చ నీకు మాత్రము దగు మఱవ కుండ
మంచి మార్గముఁ జూపించి మాననీయ
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 93.
నాగ భూషణ విశ్వేశ నైక రూప
పన్న గాశన విష్ణుని ప్రాణ మిత్ర
శీత నగమున నివసించు శ్రీ కరుండ
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 94.
సవతి పోరులు గలుగుట సహజ మిలను
దాని మూలాన పిల్లలు దైనిక మగు
బ్రదుకునఁ బడకుండు నటుల వారిఁ జూచి
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర 95.
ఙ్ఞాన వారాశి యైనట్టి చదువు లమ్మ
యాశి సులు గలు గు కతన హ్లాద మిచ్చు
పద్య కుసుమాలు నీపైన వ్రాయు చుంటి
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 96.
ఙ్ఞాన నేత్రము తోడను గనుచు నన్ను
బంధ ముక్తునిఁ జేయుచుఁ బరము నిమ్ము
చివరి సారిగ నినుఁ జేరు సృతిని నిచ్చి
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 97.
నాగ భూషణా !మకుటాన నాగ ధారి!
యుత్పలమ్ముల హారమ్ము నుత్సుకతన
వేయఁ దలచితి నీ యాఙ్ఞ వేగ యిచ్చి
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 98.
బుద్ధి కుశలతఁ గలిగిన బోధకుండు
వ్యక్త పఱచుట యందున వ్యర్థు డైన
వాని పాండిత్య మే పాటి పనికి వచ్చు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 99.
వ్రాసి నటువంటి పద్యాలు శ్రద్ధ తోడఁ
జదివి సరి యగు విధముగ సవరణమ్ముఁ
జేయు తమ్మున కిడుదు నాశిసుల మూట
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 100.
అమ్మ నాన్నలు పైనుండి యాశిసు లిడ
వ్రాయఁ గలిగితి శతకమ్ము బాగు గాను
నంకితముగ నిడుదు వారి కాదరమున
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 101.
మాతృ మూర్తిని సేవింప మహితుఁ డగును
పితరుని యెడలఁ గల భక్తి విడుపు నిచ్చు
గొప్ప వానిగఁ జేయును గురుని సేవ
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 102.
శత్రు లార్గురు నొక్కటై శక్తిఁ బీల్ప
నీరసంబు జనించెను నిజము గాను
బాఱఁదోలుచు నా నుండి వడి వడిగను
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 103.
ప్రేమ పెండ్లిండ్లు లోకానఁ బ్రియము తోడ
చేసి కొనుచును విడిపోవు చేష్ట వలన
భ్రష్టు పట్టెనుగ వివాహ పద్ధతి యిల
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 104.
వావి వరుసలు లేకుండ వ్యవహరించు
ప్రజల నే మన వలె నేమి పాప మిదియ
యేవగింపును గలిగించె నీ బ్రదుకులు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 105.
ఉబ్బు లింగడ వను మాట యబ్బురమ్మె
యింత వేడినఁ బద్యాల నిన్ని యిడిన
నులుకు బలుకును లేకుండ నుంటి వైన
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 106.
వృద్ధ దంపతు లందరు విశ్వ విభుని
యంశము లగుట వారిని నామతింతు
భక్తి శ్రద్ధల తోడను భజనఁ జేసి
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 107.
పట్టు చీరను శోభిల్లు భద్రకాలి
యాయు రారోగ్య సంపద లన్ని యిడుత
శతక మీయది చదివిన చదువరులకు
వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 108.
No comments:
Post a Comment