Thursday, July 28, 2022

నాగభూషణా శతకము

శ్రీల నొసంగు నీవకట చేరుట బ్రేతవనంబు  వాసిగా 

నేలకొ? చెప్పుమా వినగ  యీశ్వర !కాలుడ! కారణంబునున్ 

ఫాలము నందునన్ గలుగు భైరవ నేత్రపు మూలమేదియో 

చాలుదు నేర్పునన్ దెలుప శాంకరి నాధుడ! నాగభూషణా !......1


 శాస్త్రము వేదముల్  గనకె సాలె యు, సర్పము నాగజేంద్రుడున్  

శాస్త్రపు రీతిగా  వడసె సాకల్య మున్ గద  భక్తి గల్గుటన్ 

శాస్త్రము లేవియున్ గనక సాకుము నన్నును నెల్లవేళలన్ 

శాస్త్రము  వేదముల్ మఱియు శబ్దము రూపుడ!నాగ భూషణా !.....2

 సర్వము నీశ్వరా మయము సర్వులు దైవము గాఁ దలంచుచోఁ

బర్వ మిదే యటంచు నొక ప్రక్కకు నేగిరి సూర్యచంద్రులే  

యుర్విని జీవముం గలుగు  జీవుల భారము మోయుచున్న యో 

శర్వ !మమున్ దయన్ గనుమ శార్వరి నాధుడ!  నాగభూషణా!....3


కాశికిఁ బోయినట్టి కవి కాంక్షలు మిక్కుట మయ్యె నక్కటా

ఆశలు లేక యుండుటకు నాశను బోవుదు రెల్ల వారునున్

నీశ! విచిత్ర మిచ్చటను నీకవి కోరెను ధాన్య సంపదన్

లేశము కూడ లేదు మతి లీలగ మాత్రము  నాగ భూషణా !........4


పంతులె తప్పులం బలుకవచ్చని చెప్పెను పిల్లవాండ్రతో

వింతగ నుండె బాల !విన వీనుల కిప్పుడు పిల్ల వాండ్రతోఁ 

బంతులె సెప్పెనా రనుట పాడియె చెప్పుము పార్వతీ పతీ !

సుంతయు బుద్ధి లేని బహు చోద్యపు మానిసి   నాగ భూషణా !.......5

లోకులు గాకులే యనుచు లోకము కోడయి కూయు చుండగా 

నేలనొ వారిగూర్చి యిక యీరక మైన ప్రసంగమేలనో  

జాలును నాదురాత్ములను జాటున నుంచుదు వారి మాటలన్ 

బాలిసు మాటగాఁ దలతు భావము నందున  నాగభూషణా !.........6


బాధలఁ గల్గనీక యికఁ బ్రార్ధనఁ జేసెడు మానసంబునున్ 

బాధల నోర్చునట్టి  దగు వర్ష్మము  నీయుమ యెల్లవే ళలన్ 

బాధలు మంచివా రికిడ భావ్యమె  చింతఁ జేయగన్ 

బాధలు నాకిడన్ దగున? భక్తులఁ గాచెడు నాగభూషణా !....

.7

కుక్షిని నింపఁ గోరికను క్షుద్రపు పూజలు సేయుచుండుచున్  

రాక్షసు వోలెఁ గ్రూరముగ  ఱాళ్ళను బిండు విధంబు పాంథులన్ 

శిక్షగ వారియస్థికలు సీల్చుచు రక్తముఁ ద్రాగుచుండగా 

సాక్షిగ యుంటివే  యరయు సాదర మొప్పగ  నాగభూషణా !........8


: త్రాగుచు నెల్లవేళలను దాహతు మించగఁ గల్లుమద్యమున్ 

వాగుచు నుండునా కిరణు  వాగుడు కాయగఁ బ్రొద్దు నంతయున్  

భోగముగాగ దానుదలఁ బోయుచు మానడు నెప్పుడున్ సుమా 

తూగుచుఁ దోగుచున్ మసలు దూరక కావుమ నాగభూషణా !.......9


మానగ లేను  మోహమును  మానక జాలను గామవాంఛలున్ 

మానగ లేను క్రోధమును, మానగ సాధ్యమె రాగ వాసనల్ 

మానగలేను సానిచెలి మానగ సాధ్యముఁ గాదునాకికన్ 

మానుప జేయవే ,దయను  మాధవ  సఖ్యుడ నాగభూషణా !....10


ఉత్పల చంపకంబులను నొయ్యనఁ దెచ్చుదు నీదు పూజకై 

సత్పథ మీయగా వలయు సారస నేత్రము

లానతీయగా 

నుత్పల రేకులం దనరు చూపులు  గల్గిన మాత దీవనల్  

సత్పథ మిచ్చు గాకనుచు జాగృతి నీయుము  నాగభూషణా!..11



 త్రాగుచు నెల్లవేళలను దాహతు మించగఁ గల్లుమద్యమున్

వాగుచు నుండునేగదిల  వాగుడు కాయగఁ బ్రొద్దు నంతయున్

భోగముగాగ దానుదలఁ బోయుచు మానవుడెప్పుడున్ సుమా

తూగుచుఁ దోగుచున్ మిగులు  దోర్బలమంతయు  నాగభూషణా !....12


: రాగము మోహముల్ మదిని రాపిడిఁ జేయుచు సంచరించగా 

దాగిన శత్రులార్గురును దాంతము శాంతము లేమిపర్చగన్ 

రోగము లొక్కసారిగను రుగ్ణునిజేయగ ఁ జేతకానినై

గాగల గార్యముల్ భవుడ! కాంచగ వేడెద నాగభూషణా..13


 !...నమ్మక మెంచి చూడగను నాణ్యతయైనది యెల్లవారికిన్ 

నమ్మకమే జనాళినిల నల్గురి యందున గారవంబుగా 

సమ్మదమొందు నట్లుగను

జయ్యన జేయును గాదెయీభువిన్

నమ్మలకమ్మయౌ సతిని నాశిసులిమ్మను నాగభూషణా !....14


పొందిక లేక కొంచెమును బోకిరి వోలెను దిర్గుచుండగా 

నందరు వానినిన్ గసరి యారడి వెట్టగ ఖిన్నుడై వెసన్ 

నిందను ద్రిప్పికొట్టుటకు  నేర్చియు శాస్త్రము లన్నిచక్కగన్  

వంద వధానముల్ సలిపె బాగనఁ బౌరులు నాగభూషణా !...15


ఙ్ఞానముఁ బొందఁ గోరునెడ కాయము మీదను నాశవీడుచున్  

నేనను భావమున్ వదలి నిత్యము నీదగు నామమంత్రమున్ 

వేనకు వేలుగాఁ బలికి  వేసడి నొందగ జాలినొందుచున్ 

ఙ్ఙానము నీయ పూనుదువె  కల్మష హారుడ నాగభూషణా !...16ప

పట్టుదు నీదు పాదములు పట్టును వీడను నింకనెప్పుడున్ 

పట్టిన నిన్నుఁ బట్టవలెఁ బాముల మాదిరి యెల్లవేళలన్ 

పట్టపు రాణియాగిరిజ  ప్రాపును నిచ్చుదు లెమ్మనంగ ,నా 

పట్టును వీడి నీగురిచి ప్రార్ధనఁ జేయుదు నాగభూషణా !...17


నాదము నీవయై గరిమనాభిని జేరెను సున్నితంబుగాఁ  

బాదము లంటియుండుదును బావనుఁ డౌవను భావమొంద,నీ 

గాధలు నిత్యముంజదివి కాఁగల ప్రాప్తికి  సిద్ధమౌదు నా 

వేదనఁ దీర్చి మమ్ములను బేర్మిని గావుము నాగభూషణా !...18


పొందిక లేక  యగ్రజుఁడుఁ బోకిరి వోలెను దిర్గుచుండగా

నందరు వానినిన్ గసరి యారడి వెట్టగ ఖిన్నుడై వెసన్

నిందను ద్రిప్పికొట్టుటకు నేర్చియు శాస్త్రము లన్నిచక్కగన్

వంద వధానముల్ బుధులు బాగనఁ జేసెను నాగభూషణా!...19


నేనను భావమున్ దొలగ నిర్మల తేజము నావహించె నా 

మానస మందునన్ బలుక మాటలు వచ్చుట లేదు నాకిటన్

గానగ వచ్చితే చెపుమ కావగ మమ్ముల నోదయానిధీ ! 

మానక రమ్ముమా దయను మారుని సంహర !నాగభూషణా !...20


 ఇభమది మూర్ఖ భావమున నేరునఁ గ్రుంగగఁ గుంభి పట్టగా

విభుఁడగు నారసింహుని కివేగమె మ్రొక్కగఁ విష్ఞుఁ డంతటన్

నభయ మొసంగి చంపుటయె యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ

ప్రభులను వారలెప్పుడును బాధితు పక్షమె నాగభూషణా !...21


చదువుము తండ్రి బాగుగను శాస్త్రము లన్నియు నేర్పు పెంపునన్ 

ననగను మొండి వైఖరిని నాదర మీయక  బాలు

డుండుచో  

మృదు మధురోక్తు లెన్నఁడును మేలొన గూర్చవు తిట్టఁగా వలెన్ 

నదియె సుమార్గ   మందునిక నాశ్రవమే యది నాగభూషణా!..22


 పుట్టుక నాటినుండియును బూజలు సేసిన వాడనైన నున్ 

గిట్టుట లేదు మోహములు గీడును జేయుట మానకుంటినే 

కట్టడిఁ జేయనైతినిక  క్రౌర్యపు చేష్టలు  మేలుపొంద,నీ 

చట్టుగఁ జేరదల్చితిని జాలిని జూడుమ నాగభూషణా !..23


పాదము లంటియుండుదును  బాపము లేవియు నంటనీకుమా  

పాదము లొత్తుచున్ దమిని బ్రార్ధనఁ జేయుదు బంధమీకుమా

పాదము రెంటినిన్ గడిగి  వాజముఁ జల్లుదు నౌదలంబునన్ 

నీదగు నిర్మలంబయిన నెమ్మిని నీయుమ నాగభూషణా !..24


మల్లెల మాలనున్ దినము మార్చుచు వేయగఁనిచ్చగింతు.నేఁ 

బల్లవి రాగమున్ నిపుడు పాడుచు హర్షము నొందజేయుదున్ 

మెల్లగ నీపదంబులను మెత్తగ నొత్తుచుఁ దుష్టిఁ జేయునన్ 

జల్లగఁ జూడుమా యికను శాంతినొసంగుచు నాగభూషణా !..25.


కోరను నిన్ను భోగములఁ గోరను శ్రీలను గోరనెప్పుడున్ 

దారల శీలమున్ మదిని, దానముఁ జేయుమ రాజ్యమంచు నేఁ 

గోరను దేవలోకమును గోరను నైహిక వాంఛలెన్నడున్ 

గోరుదు సామినీ పదముఁ గోరికఁ దీర్చుమ నాగభూషణా!...26


 కావుమ యంచు నాగజము  గైటభమర్దను గోరగా వెసన్  

నావనజాక్షు సోదరుఁడు నంబుజ నాభుఁడు విష్ణువే గదా 

కావగ వచ్చినచ్చటికి  కాచెను నాగజ రాజుప్రాణమున్ 

నావిధ మేననున్  మనుచు నాశనునుందునునాగభూషణా!..27


భారము గాఁ దలంచకను  బంధుగణంబును నెల్ల వేళ,నా 

వారిగ భావమందునిచి  బాధలు లేమిగఁ జేయుచున్ సదా 

వారలఁ జెంతనే మెలగి వారి సుఖంబులు నావిగా వెసన్ 

జేరగఁజేయుశక్తినిక శీఘ్రమె యిమ్ముము నాగభూషణా!...28


నమ్ముదు నామనంబున సనాతనులై మను బార్వతీశులన్ 

నమ్ముదు యోగమాయయుతుఁ నమ్ముదుఁ భాలనేత్రునిన్ 

నమ్ముదు సర్పభూషణుని నమ్ముదునంతయు నీవెయంచిలన్  

నమ్మక మియ్యదిన్  మనిచి నమ్ముము నన్నిక నాగభూషణా!..29


మేడలు మిద్దెలంచునిల మీరని యాస్తిని గూడఁ బెట్టి,వే 

గూడుచు లాభనష్టములు గుల్కుచు నీపద సేవనంబునే 

గాడినిఁ దప్పఁ జేసితిని గాగల కార్యము నేర్వనై తినే 

వేడుకగాఁదలంచకిది పెట్టుము భిక్షను నాగభూషణా!..30


మేలము లాడుచున్ నొకడు మీరని సంతస మొందగ బల్కెనిట్లుగా 

వాలికిఁ బుట్టె మారుతి నభశ్చరుఁడౌ రవి గాంచి మెచ్చఁగన్  

వాలికి సోదరుండగును భాస్కరుఁ డయ్యది నేర్వగా వలెన్  

మూలముఁ జూచినం దెలియు మొత్తము జూడుము  నాగభూషణా!..31


అమ్మను బెండ్లి యాడుటకు నాంక్షలు పెట్టితి వెన్నియో కదా 

యిమ్ముగ నుండె నీ కవియ? యేమనిఁ జెప్పుదు నీదు వైఖరిన్

నమ్మయె మూలమీ భువికి నమ్మయె కారణ భూతురాలు,మా

యమ్మకుఁ జెప్పుమా దయను నక్షరమిమ్మని నాగభూషణా!..32


మంచిగ నుండఁ గోరికను మార్పును జేయుదు నాదువర్తనన్ 

బంచుదు నాదు ప్రేమనిక బాధను గ్రుంకుచు నుండువారికిన్  

బంచుదు నాదు సంపదను బాధిత లోకము సంతసించగన్  

నెంచుదు నీదు నామమును నెల్లపుఁ డిచ్చట నాగభూషణా!33.


కానగ లేను నేనిపుడు కన్నులు గల్గియు నీదు రూపమున్ 

వీనులు పొందియున్ వినను వేమఱు చెప్పిన యెంతవారలున్

మేనది యెంత చెప్పినను మీరెను హద్దులు శాశ్వతంబుగా 

నేనను భావముందొలగె నిర్మల చిత్తుడ! నాగ భూషణా!..34


 దక్షుని యఙ్ఞమున్ గనగ  దక్షుని కూతురు నేగగా రతిన్ 

దక్షుఁడు నామెనున్ గసరి  తద్దయు ఁ గోపముఁ జేయగా వెసన్

శిక్షను జేయనౌ దునిమె చిత్రుఁడు వీరుఁడు వీరభద్రుఁడున్ 

రక్షణఁ జేయుమా ననిక రక్షకుఁ డీవెగ  నాగభూషణా!..35


వేదనఁ దీర్చువాడవని వేయి విధంబులఁగోరుచుండ,నా

వేదనఁ దీర్చవా? చెపుమ బేషరతున్నయిన న్ సదాశివా! 

పాదము రెంటినిన్ గడిగి పాద జలంబును జల్లుకొందు,నా 

వేదన నీవయే తగును వీడగఁ జేయగ నాగభూషణా!..36


తాతల యాస్తి లేదసలు తాహతు మించిన ఖర్చులాయెనే 

వేతన జీవి నౌట,యికఁ బెండ్లము బిడ్డల పోషణంబు నో 

తాతకుఁ సఖ్యుఁడౌ భవుడ! దారినిఁ జూపుము నాకునిత్తరిన్ 

ద్రాతవు నీవెగానబరిదానముఁ జేయుము నాగభూషణా!..37


కాలము మారెనంచనుచుఁ గాంతుని బేరునఁ బిల్చు పోఁ 

గాలము దాపురించెఁ గద కాలుడ!యేమిది దారుణంబు,మా

కాలము నందు మేమిటుల గాంచుట ,పిల్చుట  చేయలేదుగా 

నాలముఁ జేయకింకయిది యాపుము వేడెద నాగభూషణా!..38


యజ్ఞము లెల్ల లోకులకు హానినిఁ గూర్చుటకే తలంచినన్ 

విఙ్ఞత తోడి పల్కులవె? వీనుల కింపుగ లేవు చూడగన్ 

యఙ్ఞము లెల్ల లోకులకు నాయువుఁ బెంచును బండు పంటలున్ 

బ్రఙ్ఞయె గాదె రైతులది  భావిసుఖించగ  నాగభూషణా!..39


పెద్దల పుణ్యమున్ గలుగఁ బేర్మిని గల్గెను వ్రాయు కోరికల్ 

బద్యము  నీపయిన్ భవుడ! పండితు లందఱు మెచ్చురీతిగన్

హృద్యముగా రచించెదను నృత్యప్రియుండ !ర యంబునన్ రతిన్ 

పద్యము లన్నియున్ సరస భావము లొప్పగ నాగభూషణా !...40


చూచితి నీదు రూపమును  జూడ్కులు బర్వశ మౌవిధం బుగా 

జూచితి నాత్రిశూ లమును శోభను గూర్చగ నామనంబునున్  

జూచితి మూడుక న్నులను జూచు కొలందిని జూడఁ గోరికన్ 

చూచుదు నెల్లకాలమును  జొచ్చుము గుండెను నాగభూషణా!...41


పార్ధుని దెబ్బకున్మిగుల బాధను నొందిన వానివోలె యే 

యర్ధముఁ జెప్పఁ గోరుచును నట్లుగ నుంటివి? చెప్పఁ గోరెదన్ 

బార్ధున కిచ్చితీవి గద పాశుపతంబును హర్షమొందగాఁ 

బ్రార్ధన జేయుచుంటి నినుఁ బ్రాపును నీయుము నాగభూషణా!..42


 శ్రీశునిఁ జేరి యాగిరిజ సేమముఁ గాసగ మాక్రమించెగా

నీశునిఁగంఠమున్  దగఁఫ ణీంద్రుఁడుఁ జుట్టెను భక్తితోడనే 

గాశిని నుండుగంగ, సిగ  కందువఁ జేరెను సాదరంబుగా 

నాశను వేడుచుంటి నిను నాశ్రయ  మిమ్మని  నాగభూషణా!..43


 ఆర్యులు సెప్ప నమ్మితిని హాస్యము గాఁగని పించె నియ్యదిన్  

సూర్యుఁడు సైకిలెక్కఁ గని చొక్కముగా శశి నవ్వె మెచ్చుచున్

చౌర్యముఁ జేసిరే పటము  జాలును జెప్పుట యిట్టి మాటలన్ 

సూర్యుఁడు సోము లిద్దరును సోదర తుల్యులు నాగభూషణా!...44


 మౌనము నాబరంగు నిల మాటలు,చేష్టలు లేకయుండుటన్ 

మౌనము మూలమే ఋషులు మాన్యులె యౌటకు లోకమందునన్ 

మౌనము మూల కారణము ముక్తిని జెందుట కిజ్జగంబునన్ 

మౌనముఁ జెంది యుండుదును మోక్షము నీయవ? నాగభూషణా!..45


బ్రదుకఁ దలంచి  నేనిఁకను బండ్లను మాత్రమె భోజనంబుగాఁ

నుదయము సాయమున్నిక యూపిరి యుండెడు కాలమంతయున్ 

పదముల నంటి యుండుదును భానుని సాక్షిగ నమ్మ కంబుతో  

సదయను గావుమా యికను సన్ముని శేఖర! నాగభూషణా!..46


 కోరినఁ గోరకుండినను గోరిక లిచ్చెడు భూతనాథుఁడా! 

మీరిన సత్కృపాన మము మేదిని రక్షణఁ జేయుమా యికన్  

సారెకు సారెకున్ బ్రజల సంపద లన్నియు వృద్ధిఁ జేయుమా 

శారదమాత వల్లభుడ! చంద్రకళాధర! నాగభూషణా!...47


 తిరిపెముఁ జేయు చుండునట  దెల్లని యాకృతిఁ దాల్చువాడునై  

నిరవుగఁ బ్రేతభూమినట యేర్పడఁజేసెను వింతఁ గొల్పగాఁ 

బురములు మూఁడుఁ గూల్చగను భూమిని దేరుగ మేరుధన్వుగాఁ

 బోరును సల్పు ధీరుఁడవుగ బూచుల రాయుడ! నాగభూషణా!...48


మౌనము గల్గుమానవుఁడు   మాన్యత నొందును భూతలంబునన్ 

మౌనము భూషణంబగును మౌనము శాంతినిఁ గల్గ జేయునే 

మౌనముఁ జేతనే మునులు మన్ననఁ గాంచిరి మానసంబులన్ 

మౌనము నిమ్ము నాకునిక మౌనిగణాఢ్యుఁడ! నాగభూషణా!..49


 నీరస మొందిమూర్ఛిలిరి నీరజ నాభుని భక్తులందరున్ 

సారము లేని తిండిఁ దిని, శక్తి గడించిరి లోకులెల్లరున్ 

నారస రూపు శాంభవిని నాయత రీతిని వేడుకోవగాఁ 

గారణ భూతుఁ డౌ భవుడ! కాచితి వీవయె నాగభూషణా!...50


: అతులిత మాధురీయతన నాశువుఁ దోడను బద్యమల్లు భా 

సతనిట యీయఁగోరుదును శాంకరి నాథుఁడ! ముక్తి వాంఛతోఁ 

సతతము నీదు రూపమునె  శక్తికొలందినిఁ జూచు వాడనై  

గతమును జూడ నెప్పుడును గావుము నన్నిక నాగభూషణా!..51


 కంటికిఁ గానిపించునవి  ఖాయము గానిది గానెఱుంగుమా 

మంటికి యంకి తంబునగు, మాయయె యౌటను మాయమౌనుగా 

మింటను నుండు తారవలె,మేదినిఁ గన్బడ జాలవేవియున్  

గంటికి నీవుతప్పయిక కానరు స్తంభుడ! నాగభూషణా!...52


విశ్వము నంతనీ యునికి  వేదము సాక్షిగ రూప మౌటచేఁ

శశ్వ దలంకృతా మయము చక్షువు రెంటికిఁ జింతఁజేయగన్

నీశ్వరి దక్షిణమ్ముగల నీశుడ! యుగ్రుడ! లోకనాథుఁడా! 

విశ్వవి భుండవీవనుచుఁ బేర్మిని వేడెద నాగభూషణా!..53


శంకరుఁ డెత్తె నా కనకశైలము మాధవు వాంఛ దీరఁగన్  

శంకరు వాసమే యదియ శైలము, నెత్తుట యేమి? భావ్యమే 

శంకలు గల్గఁవారటులు  సందడిఁ జేయఁగఁ జిత్రమాయె,నీ

యంకము వీడ నెప్పుఁడును  నాశ్రిత రక్షక! నాగభూషణా!..54


అమ్మయు నాన్న బావలు సహాగతి యించిరి యేమిపాపమో 

యిమ్మహి నేమి జేసితిమొ? యేమిది శంకర! యక్కలిద్దరున్ 

నమ్మను జేరగావెడలె నాయువు దీరగ నేమి జెప్పుదున్  

నమ్మవు నాన్న వీవెయిక  నాశ్రయ మీయుము నాగభూషణా!..55


కోరను భాగ్య మెప్పుఁడును గోరను  నేనిను  ధాన్యసంపదన్ 

గోరను రాజ పీఠమును గోరను నెప్పుఁ డు  దేవలోకమున్   

గోరను  మోక్ష మీయుమని  గోరను సానుల పొందుని త్తరిన్  

గోరుదు నీదు సేవనముఁ

 గోరికఁ దీర్చుము  నాగభూషణా!..56


కంటిని మంచియౌ కలను గండ్లకు నింపును గూర్చెనత్తరిన్ 

మింటను దారకావళులు మేళముఁ జేయగ నృత్యలీలలన్ 

జంటగ మల్లికార్జునుఁడు సైతముఁ జేయగ నృత్యమంతలోఁ 

గంటికి మాయమయ్యె యది గాంచితి వెల్తురు నాగభూషణా!..57


కాంచితి లింగరూపమును  గాంచితిఁ శూలపు మూఁడు కోణముల్ 

గాంచితిఁ భాలనేత్రమును  గాంచితిఁ  గుండ్రని బానవ ట్టమున్   

గాంచితి మోముమధ్యమున  గైరవ వర్ణపు భస్మ రేఖలన్ 

గాంచఁగఁ బొంగిపో వమది గంతులు  వేసితి  నాగభూషణా!..58


భల్లునఁ దెల్లవారినది భామలు బిందెలు సంకనెత్తుకు 

న్బల్లవి పాడుకొంచు మఱి బావుల యొద్దకు నీరు తేవగా

నల్లది చూచి నాయెడద హ్లాదము నొందుచుఁ బర్వశించగాఁ 

మెల్లగ నొత్తఁ బాదములు మీదరిఁ జేరితి నాగభూషణా!..59


వరముని సేవితుండవయి బాధిత లోకము నార్తిఁ దీర్చు చున్ 

బరమ దురూహలం జెలఁ గు పాలసు లైఁజను వారినందరిన్ 

తరతమ భావముంగనక దండనఁ జేయుచు నుండు చేత నే 

వరమని నీదు పాదములు బట్టుదుఁ గావుము నాగభూషణా!..60


ఆలును బిడ్డలున్గలుగ హాయిగ నుండక వారితోడ,నీ 

వేలన? లింగరూపమున నిక్కడ యుంటివి? చెప్పుమా దయన్ 

గాలుని  గర్వమూడ్చగను,గాముని జంపగ నిట్లు మారితే? 

చాలను నిట్లు చూడగను జంద్రకళాధర! నాగభూషణా!..61


వాసుకిఁ ద్రాడుగా మలచి పాలసముద్రముఁ జిల్కనత్తరిన్ 

భాసుర మొప్పగా నమృత భాండముఁ గల్పవృక్షమున్ 

వాసిగఁగామధేనువిడ, బాయగ వచ్చిన గాలకూటమున్ 

దీసుకుఁ ద్రాగ భావ్యమునె? దీయగ నుండెనె? నాగభూషణా!..62


నిరతముఁ ద్రాగు చుండుచును నేర్వక మంచిని గోలఁజేయగాఁ 

బరువును బోయెనంచునిఁక భామిని వేదనఁ జెంది తానుగా

మరణముఁ గోరి వచ్చినది మానిని సూడఁగఁ బాధఁగల్గె నో 

పురహర!యామె కీయనగుఁ బూర్తిగ రక్షణ నాగభూషణా!..63


చేతిని బెట్టగాఁ దలను శీఘ్రము గానగు వేయిచెక్కలౌ 

భాతిని రాక్షసాధముఁడు భస్మున కీయగ  నీప్సితమ్ము ,నే 

రీతిని నిన్ను వేదనము రేగగ  జేసెనొ నూహఁజేసితే 

ఱాతిని నాతిగా మలచు రాముఁడు  నీవెగ నాగభూషణా!..64


సారెకు నీదు మంత్రమును సంతస మొందగఁ బాడు కొందు ,సా 

కారపు గొప్పరూపమును గన్నుల విందుగఁ జూచు కొందు,నే 

తీరుగు నైన  మోక్షమను దేరును నెక్కుట నిశ్చ యంబు ,నీ 

దారిని జూపు నీదరికి  దర్శన మిచ్చుచు నాగభూషణా!..65


ఒంటరి వాడుగాఁ బ్రదుకునుండుట  జేయుము  నాత్మ శాంతికిన్ 

బంటును వేడుచుంటినిను భాస్వర తేజుఁడ ! శ్యామ కంఠుఁడా! 

యంటుదు నీదు పాదముల నాశ్రిత రక్షక!  సాక తమ్మునౌ 

గంటిని జూడఁగో రుదును గల్మష హారుఁడ! నాగభూషణా!..66


భాగ్యము లెన్ని యుండినను బాధిత లోకము నాదరించకన్  

యోగ్యము కాని కోరికలు యూహకు రానివి యైన గోరుచున్ 

భాగ్యము లింకనుం బెరుగు వాసిత మార్గముఁ జూపు గోరికన్ 

యోగ్యుఁడ వంచు వచ్చు నెడ యోచనఁ జేయుము నాగభూషణా!..67


 కాలుని బారినుండితను గావుమటన్న మృకండు సూనునిన్ 

గాలయముండవై చనుచుఁ గాచితి వీవయె ప్రేమ మూర్తివై 

యాలయ మందె కాక యిఁక యంతట నుందువు పార్వతీశ! పూ

మాలలు దెచ్చి నీకిడుదు  మమ్ములఁ గావుము నాగభూషణా!..68


నాకము నందు దేవతల నాట్యము లెంతగ  హృద్య మైన భో 

నీకమనీయ తాండవము నీమధు రాకృతి ముందు సాటియే 

లోకము మర్చి చూచుదురు లోలత  నొందగ  భక్తు లందరున్  

నాకటువంటి దర్శనము నవ్వుచు నీయుము నాగభూషణా!..69



విద్దెలు నేర్చుగా, మొదట విఘ్నము లేవియు  లేక యుండనౌ 

దద్దయుఁ బూజఁజేతురిల దప్పిద మంతయు మాన్చి, మమ్ములన్  

బెద్దమ నంబుతో ననుచు వేడుదు రెల్లరు నీ కుమారునున్ 

గద్దఱి యంచుఁ ,గావున నగాధిప!  కావుము నాగభూషణా!..70



మూగగ మారె నా మనము మూసిన పుస్తక మా యనంగ ,నో 

యాగమ శాస్త్రరూపుఁడ!  యయాచిత  సంపద లిచ్చువాడవై 

మాగమ నంబు నీ దరికి  మారగఁ జేయుమ యెల్లవేళలన్  

వేగమె మిమ్ముఁ జే రుటకు వేడెద నిప్పుఁడె నాగ భూషణా!..71


ముక్తినిఁ బొందఁ గోరునెడ  విషయ  మోహముఁ జెందక  యెల్ల వేళలన్  

శక్తిని భక్తిపూ ర్వకము,సల్పఁగఁ బూజను హర్ష మొంది,దా 

రక్తినిఁ జేరదీ సితన రమ్యపు హస్తము  మస్త కంబు నన్  

ముక్తిని బొందు గాకనుచు మోదము తోడను బెట్టుఁ బ్రీతితోన్ 

ముక్తిని బొంద మార్గమిది  మోహన రూపుఁడ!  నాగ భూషణా!..72


చంపక మాలలో నునిచి సంపగి మల్లెలు నుత్పలంబు తోఁ 

నింపుగఁ జేతుఁబూజనిక యీశ్వర కాదన కుండ యుండు,నీ 

పంపునఁ జేయుచుంటి యిటు వంకలు బెట్టక యుండు మాదయం 

గెంపులు వజ్రముల్ మణులు గేలుకు దొడ్గుదు నాగ భూషణా!..73


 జగతికి నీవె మూలమని సల్పగఁ బూజలు,సూచు చుంటివా 

పగతుని వోలె యెందుకిటు పాపముఁ జేసితె? పూజఁజేసి,నా 

వగపులు దీర్చుమాదయను  భారము నీదని నమ్మి యుంటి సూ

సుగతినిఁ గల్గఁజేయుమిక  సూనృత పాలన! నాగభూషణా!..74


చూచితి సామి నేనిపుఁడు చూడ్కులు నిండుగ నీదు మోమునుం 

జూచితి గాదెచి ర్నగవుఁ జూచిన వెంటనె సంత సంబునం 

జాచితి నాదు చేతులను  సాదర మొప్పగ నిన్ను వేడనై

బ్రోచగ  రాగదే  యిపుఁడ బూచుల రాయడ! నాగ భూషణా!..75



చేసితిఁ బాపకార్యములు సేసితి దుర్జన వాస మిత్తఱిం 

జేసితి నేరముల్ మిగుల  చేతన బుద్ధిని జింతఁ జేయకం 

జేసితి నన్యదైవముల జేరిభ జించెడు వారి పొందు,నేఁ 

జేసిన దప్పునీ హృదిని జేరగ నీయకు  నాగభూషణా!..76


త్రాగుదు నీకథామృతముఁ ద్రాగుదు  నీపద కంజ వారినిం 

ద్రాగుదు నీదునా మ మహి తారస  సారము నెల్ల వేళలం 

ద్రాగుదుఁ ద్రాగి దూలుదును  దన్మయ మొందుచు నాట్య భంగిమన్ 

వేగమెఁజేర నీదరికిఁ బ్రేమను జేర్చుకొ నాగభూషణా!..77


ఏలయు పేక్ష నేననిన ,నెందుల కిట్లుగ  ,నన్నుఁ జూడ నీ 

వేలన ?నేహ్య భావమున నెంతగ వేడిన జాలిఁ జూపకం 

గాలుని వోలె నిర్దయను గాంక్షను దీర్చను మొండికేతువా? 

చాలిక  నీయుపేక్ష  మరు జన్మము నీయకు నాగ భూషణా!..78


కాలము లెన్నియుం డినను గాసుల నార్జన యక్ర మంబుగాఁ 

బాలన మూలముం బ్రభులు  పాల్పడు చుండుట కారణంబు నౌ 

కాలములందు మేటి కలికాలమె యంచు వచింత్రు పండితుల్ 

బాలనఁ జేయఁగాఁ దగునె  పాలసుఁ  డక్కట నాగభూషణా!..79


వాసన లేని పూవువలె  వమ్ముగ  నాయెను  నాదు పద్యముల్ 

వ్రాసిన వన్నిపోయినవి బాధమి గుల్చుచు నైన నాదు పే

రాస ను  వ్రాయఁబూనితిని రంజిలు నట్లుగఁ జేయుమా దయం 

గాసి నివాస !భార్గవుఁడ! కల్మష కంఠుడ! నాగభూషణా!..80


వరముగ నాయె నీకు ధర బండిగ మేరువు నాయె విల్లుగా 

పరువము గల్గునాతఁడగు బ్రహ్మయు సారధి యాయె,విష్ణుఁడుం 

శరముగ మారె, యగ్నియును శల్యపు సూదిగ మారె గాదె సూ

యరయగఁదారకాసుతులహత్యకు బీజము  నాగభూషణా!..81


చదువును బెద్దగాఁ జదువ జాలక పోతిని బొట్ట కూటికైఁ 

జదివితిఁ గొద్దిపాటిగను సంస్కృత  భాషను దెల్గు భాషనుం 

బదుగురి కీయగాఁ దలచి  పాఠన రూపున నో దయామయా!  

తదనుగుణంపు సారమును దప్పక యీయుము నాగభూషణా!..82



ఞ కవనముఁ జేయు వారలకుఁ గావలె మందు పదా ర్ధము లందు చేతనే 

కవివరుఁ డెల్లవారు గనఁగా వడిఁ జొచ్చెను గల్లుపాకలో  

దివమును ఱేయి యంతయును దృప్తిగఁ ద్రాగుచు  నుండు వార లీ 

యవనికిఁజీడ పుర్వులిల యంత్రణ  మీయవె? నాభూషణా!..8

3

కలతలురేపు దుష్టులను,గాపురుషాదుల చేష్ట,శత్రుమూ

కలను,సహింపగావలయు గాపురమందభివృద్ధి,గోరినన్

గలతలులేని గాపురము గాంచును వృద్ధిని నెల్లవేళలన్

గలనున సైతమున్ వలదు కర్కశరూపము నాగ భూషణా!..8

4

హీనపు వానిగా మసలి హేయపు జీవిత మొందనౌనుగా

మానక మాతృభాష నవమాన మొనర్చెడివాడె,మాన్యుడౌ

మానవు డెల్లవేళలను మంచిగ నుండుచు బీదసాదకున్

దానయి పెద్దదిక్కుగను ధార్మికదృష్టిని  నాగభూషణా!..85


 హృద్యముగాకభావమునునేరికినర్ధముగానియట్టుగా

పద్యమువ్రాయబూనుటయెపాపముద్రోహముమానుకొమ్మికన్

పద్యమువ్రాయగావలయుప్రాసయుతంబుగ,లక్షణాలతోన్

చోద్యముగాదెపండితులుసూచనలిచ్చుట నాగ భూషణా!,,86


వినుమురభార తంబునిల వేయిరకంబులుగా రచించినన్

వినదగునట్లుగాసరగు వీనులకింపుగనుండు నందుచే 

ననయము బాల బాలికలు హర్షము ,నార్ద్రత గల్గి విన్నచో

గనుదురు మోక్షముం దుదిని  గాలునిఁగాదని నాగభూషణా!..8

7

వారము వారముంగుడిని భక్తులు సేసెడు వేదమంత్ర మోం 

కారము తీయనై సుఖముగా మురిపించెను భక్తబృందమున్  

భారము గాఁ దలంచక ను భారతి   తీర్ధుల దివ్య  బోధనా 

సారము నంతయుంగలిపి  సాకృతిఁ జేయుదు నాగభూషణా!..88


వంకలు జూడగా దొరకు వందలువేలుగ నిజ్జగంబునన్

శంకను నొందుచున్ మనక సర్దుకు బోయిన హాయిగల్గుగా

శంకల బాటలోనడువ శక్తివిహీనులె యౌదురెప్పుడున్

శంకలు లేనివాడు సరసంబునెఱుంగును   నాగభూషణా!..89


ణూచూరగొనంగ మానసము చోద్యము నాకపుభామరంభయా

కారము గాంచినంతనె వికారము గాంతురు మౌనిపుంగవుల్

పారము నొందియున్ మునులు భ్రష్టులు నౌటకు కామవాంఛయే

కారణమౌట జూడ,విను గామము చెడ్డది నాగభూషణా!..90


ఘనమగు తేజముం గలిగి కైకకు మ్రొక్కియు గౌరవమ్ముతో 

ననుమతి నీయగా జనని హర్షము తోడను సీత తోడుతన్ 

వనమున వాస ముండుటకుఁ బార్థివ పుంగవు కాంక్ష మేరకున్ 

వినయ మనస్కుడై చనెను బ్రీతిని జూచితె నాగభూషణా!..91


పలువిధ పాపకార్యముల బాధితుఁ జేయగ బూనువాడిలం

దలపఁగ గ్రూరుడౌను,గురుదక్షిణ నిచ్చెడువాడు నమ్ముమా

యిలనజరామరంబగుచు నెల్లెడగారవమొందుచుండుచుం

బలువురిచేత మన్ననల వాసిగడించును  నాగభూషణా!..92


 అరమరి కల్ గనంగకను నర్హత కానటువంటి వారికిన్

విరివిగ నిచ్చుచుంటివిల వేలకువేలు వరంబు లొక్కెడన్

ఖరులగు వారలెప్పుడును కర్కశ వృత్తిని జేటు జేతురే

వరములనిచ్చి దుష్టులకు వాసిగ డింతువె? నాగభూషణా!..93


 దురితము లెల్లఁబోవుగద దోచిన సొమ్ముల వేయ హుండిలో

నరయగఁ గొంతపాపమది యాక్షణమందున బోవు నందురే 

యిరవుగ మంచికార్యమున కిచ్చుచు ఖర్చునుబెట్టగల్గుచోఁ

గరమును సంతసించుచును గాంక్షలు దీర్తువు  నాగభూషణా!..94


పెంపనుఁ దల్లివై శ్రవణ పేయపు నామము నుచ్చరించ ర 

క్షింపను దండ్రివై యొడలఁ జిక్కిన  రోగముల్ ని వా 

రింపను వెజ్జువై దయ గు రించి వరంబు ది రంబు గాఁగ స 

త్సంపద లీయుమా 

కృపను సాంబశి వా!హర! నాగభూషణా!..95


తప్పు లెఱుంగలేక దురితంబులు సేసితినంటి,నిన్ను నే 

గొప్పవ రాల దాతవని గోరుచు నుంటిని ముక్తి ధామమున్ 

దప్పుగ నాదలంచకను  దాల్మిని జూపుచు నెల్లవేళ లం 

దిప్పలు లేని చందమున  దీర్చుము కోరిక నాగభూషణా!..96


 నిలయముఁగల్గి యుండియును నెవ్వగ లేవియు లేకయుండి,రూ 

కలు గలవాఁడె రాజు కలికాలములోనఁ దలంచి చూచినం 

బలువురి నోటి యందిదియె పల్కగ వింటిని  బెక్కు మార్లుగా 

కలుఁగుట సంపదల్ భువిని గారకుఁడీవయె  నాగభూషణా!..97


 నేటికిఁ దీరె నావరము నిక్కము గానని సంతసించి,స 

య్యాటల నాడ బూని  నొయారపు మాటల  నిన్ను జేరగన్ 

మాటికి మాటి కిన్మదికి మక్కువ  హెచ్చెను  కాలకంధరా! 

సూటిగఁ జూచి నాముఖము  శూన్యముఁ జేయుము  నాగభూషణా!..98



కోపము మాని నా యెడలఁ గూర్మిని జల్లని జూపు వెన్నెలల్ 

నాపయిఁ జల్లుమా దయను నమ్మితి సర్వము నీవయంచు నో 

దాపస వర్య! నాకిడుమ దానముఁ జేయఁగ బుద్ధిని,  నెల్ల వేళలం 

బ్రాపును  బ్రోపునున్ శమముఁ బాయక యీయుము నాగభూషణా!..99


వందలు మించి నీపయిని  వ్రాసితిఁ బద్యము  లైనఁ జెప్పు  నీ 

వెందుల కిట్లు మౌనముగ , నేమరు పాటున నుంటి వోశివా! 

యందరి వంటి భక్తుఁడను నాశను నుంటిని రక్షఁ జేయుమా 

వందలు వేలుగా నతులు భక్తిని జేయుదు నాగభూషణా!..100


అల్లన బేరరా జునకు నగ్రపు బుత్రుని గాజనించి  నీ 

యుల్లము సంతసింపఁగను నుత్పల చంపక మాలతో జనం  

బెల్లరు హాయనంగ రచి యించితి  రక్తిని గల్గి నీపయిం 

దెల్లని దేహముం గలుగు దేవర! శంకర! నాగభూషణా!..101


గోకుల మందు గోపికలు గొల్వగఁ గృష్ణుని బ్రేమ తోడుతన్ 

వ్యాకుల భావముంగలిగి వైకృత చేష్టలు సేయు చుండు నా

పోకిరి వారు కొందరట పూర్తిగ మత్తున నుండి పేలగా 

సాకుట న్యాయమా చెపుమ  శాంకరి నాథుఁడ నాగభూషణా!..102


 అమ్మగు శారద కరుణన 

నిమ్ముగ నే వ్రాసినట్టి యీశతకము మా 

యమ్మకు నంకిత మీయుదు 

నెమ్మనమునఁ జెప్పు చుంటి  నిక్కము సుమ్మీ .


రాముఁడు రాక్షసప్రభువు రావణుఁడే పురుషోత్తముం డిలన్  

రాముని గూర్చి యట్లుడువ రాక్షసు లై జని యించు దప్పకన్ 

రాముడు లోకరక్షకుఁడు రాజిలు  మోమున నొప్పు వాడునై  

దామహి తాత్ముఁడౌ భువిని దాశరధే గద నాగభూషణా!..103




 దేహము పైన మోహమును దీరిన పిమ్మట గీత పైని వ్యా 

మోహము, మోక్షకారణము మోదముఁ గూర్చును సజ్జనాళికిన్ 

సాహస కార్య మే యగును సద్గురు సేవన ముండు చోనగున్ 

మోహము పాప పంకిలము మూర్ఖునిఁ జేయును  నాగభూషణా!..104



: సానికి మ్రొక్కి పత్నికి విషంబిడు టొప్పు వివేకశీలికిన్  

మానుట యొప్పు మ్రొక్కుటలు మంచిది కాదది మెచ్చ రెవ్వరున్  

గానగ వచ్చునే యరయ కాంతకు నీయగఁ గాలకూటమున్ 

సానులఁ మార్చగా వలయు సాధ్వుల వోలెను  నాగభూషణా!..105



మారడు గాక మారఁడిక మాపులు రేపులె యెన్ని వచ్చినన్  

వారక వారకామినుల వద్దకుఁ జేరెడివాఁడు ,విజ్ఞుఁడౌ  

కారణ భూతుఁడౌచునిల గాఁగల జన్మకు నాందిఁ బల్కనౌ 

భూరిగ దానధర్మములు బ్రీతిని జేయఁగ నాగభూషణా!..106


సత్యముఁ బల్క నాపద లసత్యముఁ బల్కిన మేలు గల్గెడిన్  

సత్యముఁ బల్కఁ గాఁదలచి చప్పునఁ బల్కిరి తారుమారుగా 

నిత్యము వారు సత్యమును నిండుమనంబున బల్కువారలై 

భృత్యులు  సైతమున్ బలుకు వీలుగఁ జేయును నాగభూషణా!..107

No comments:

Post a Comment