శ్రీరాముని సేవించఁగఁ
నారాముఁడె మనకు నిచ్చు నన్నియు ఫలముల్
శ్రీరామ నామ జపమును
నారాత్రియుఁజేయుమెపుఁడు నార్తిని నరుఁడా!..1
మనమునఁదలఁచిన రాముని
మనసంతయుఁ గుదుట బడును మానకు మెపుఁడున్
మనగను నాతఁడె శరణము
మనసారఁగ వేడుకొనుము మాన్యుని నరుఁడా!..2
నమ్మకము తోడ నుండుము
నమ్మకమే సగము బలము నరునకు నెపుఁడున్
నమ్మకముఁ గలుఁగు నెడలను
నమ్మను దర్శించ వచ్చు నాశను నరుఁ.డా!..3
మౌనము భూషణ మరయగ
మౌనముగా నుండు వారు మాన్యులు జగతిన్
మౌనము నాయువుఁ బెంచును
మౌనముగానుండ మేలు మహిలో నరుడా!..4
సత్యము ప్రాణము మానము
సత్యమునుంబోలు గుణము సకలము వెదకన్
సత్యమును గనము కనుకను
సత్యమునే బలుకవలయు సతతము నరుఁడా!..5
అనుమానముఁ బెను భూతము
వినయము లేకుండ జేసి వీధిని బఱచున్
దినమున సంతస మీయక
యనయము బాధించు చుండు నరయుము నరుఁడా!..6
ఆటల పాటల యందున
మాటలు మితిమీరనీక మసలిన యెడలన్
బాటవముఁ బెంచి మనలో
మేటిగ నిఁకఁ జేయు నెపుఁడు మేదిని నరుఁడా!..7
నమ్మకు మసత్య వాదిని
నమ్మకు వెలయాలి మాట ,నడవడిక యునున్
నమ్మకు ధూర్తులఁ బ్రేమను
నమ్మకుమిఁ కమోసగాండ్ర నర్మము నరుఁడా!..8
నమ్ముము సత్యము నెప్పుఁడు
నమ్ముము సజ్జనుల వాక్కు నమ్ముము గురువున్
నమ్ముము తల్లిని దండ్రిని
నమ్మకమే సగముబలము నరునకు నరుఁడా!..9
దుష్టులఁ జోలికిఁ బోయిన
గష్టములే గలుగు నికను గలకాలంబున్
గష్టము గాదని దోచిన
శిష్టుల మార్గంబు నడువ సేమము నరుడా!..10
చేయకు చెడుసహ వాసముఁ
జేయకు మఱి దొంగతనముఁ జేయకు మఘమున్
జేయకు పరిహాసంబులు
సేయకుమా జారతనపు చేష్టలు నరుడా!..11
విడువకు సజ్జన చెలిమిని
విడువకు చేయూత నిడుట బీదలఁ బ్రజకున్
విడువకు శంభుని నామము
విడువకుమా గు రువు నాఙ్ఞఁ బృధివిని నరుడా!...12
జాతకములు బూటకములు
జాతకముల నమ్మకునికి జాతికి మేలౌ
జాతకములకును బదులుగ
నీతినినే నమ్ము మెపుఁడు నిరతము నరుడా!..13
విశ్వాసంబున నుండుము
విశ్వాసము సగము బలము వినయముఁ గూర్చున్
విశ్వాస ముండు నెడలను
విశ్వమునే గెల్వగలవు పేర్మిని నరుఁడా!..14
దీపాలెన్నియొ వెలుగును
దీపావళి నాడు మిగుల దేదీప్యముగాన్
దీపాలు లలిత రూపము
పాపాలను దొలగఁద్రోచు వత్తులు నరుఁడా!..15
వగవకు పోయిన దానికి
వగచిన ఫలమేమి రాదు వంతలు మిగులున్
వగచుము దైవము సన్నిధి
వగచినఁ దానిచ్చుమనకు వరములు నరుడా!..16
పవలును ఱేయియు సంధ్యయు
బవనుడు మనకిచ్చుఁ బ్రాణ వాయువు బ్రదుకం
బవనుని నుపకృతి యదికద
పవనుని వలెనీదు సేవఁ బంచుము నరుడా!..17
విశ్వాసంబున నుండుము
విశ్వాసము సగము బలము వీరునిఁ జేయున్
విశ్వాస ముండు నెడలను
విశ్వమునేఁ ద్రిప్పగలవు వినుముర నరుడా!..18
అపకారికి నుపకారము
నెపమెన్నక సేయుమెపుఁడు నిండు మనంబున్
నపవర్గముఁదానంతట
జపతపములు సేయవచ్చు సరఁగున నరుడా!..19
నొప్పింపకు నెవ్వారిని
నొప్పించిన మనమె దిరిగి నొవ్వగ వలయున్
నొప్పుల బాధను నోర్చుట
యప్పరమేశ్వరు రునకునసాధ్యము నరుడా!..20
ఉన్నది లేనట్లుంగను
సున్నము నన్నంబుమార్చు సూత్రంబందున్
నెన్నందగు మహిమంబునె
యన్నా నాకుం దెలుపుమ యార్యా నరుడా!..21
వినుమది యెవ్వరు సెప్పిన
వినినంతనె మాట యిడక విషయము గూర్చిన్
గనుగొని యందలి నిజమును
వినయముగా యీయు మెపుఁడు వివరణ నరుడా!..22
నవ్వకు మతిగా నెప్పుఁడు
నవ్వకు పదిమంది యుండు నట్టుల యందున్
నవ్వకుము సభల యందున
నవ్విన యున్మాది యండ్రు నలుగురు నరుడా!..23
నోరెత్తి మాటలాడకు
మాఱాడకు తండ్రి యెదుట మౌనము మేలౌ
గోరునఁ బోవఁగఁ నికయా
క్షారముఁబనిజేయ వీలు గలుగదు నరుడా!..24
సద్గోష్ఠి సిరిని యొసగును
సద్గోష్ఠియె కీర్తిఁ బెంచు సరసత నేర్పున్
సద్గోష్ఠి మంచి జేయును
సద్గోష్ఠిని వీడఁబోకు సతతము నరుడా!..25
చేయకుము కాని కార్యము
పాయకమా దైవపూజఁ బ్రతిదినంబున్
జేయకు భుక్తిని సంధ్యను
గూయకుసూ సభను గారుకూతలు నరుడా!..26
కోపముఁ జెందకు మెప్పుఁడు
కోపించిన బోవు శమముఁ గూరిమి దయలున్
గోపము శత్రువు మనిషికి
కోపము లేకుండ యుండు గూర్మిని నరుడా!..27
మఱువకు మానవ సేవను
మరువకు నీ బంధు జనుల మరువకు శి వునిన్
మరువకు నీ కర్తవ్యము
మరువకు నీ మాతృసేవ మహిలో నరుడా !..28
విత్తము విద్యయుఁ గులమును
మత్తునకు నవి క లిగించు మదమును నహమున్
సత్తువ వంతునిఁ జేయును
మత్తునిగా నుండ వలదు మహిలో నరుడా!..29
విత్తము విద్యయుఁ గులమును
మత్తునకు నవి క లిగించు మదమును నహమున్
సత్తువ గలిగిన వానికి
పెత్తనముంజేయ నిచ్చుఁ బేర్మిని నరుడా!...30
తిరుగకు దుర్మార్గులతో
నరుగకుమా సాని యిండ్ల కాతుర తోడన్
మరువకు సజ్జన చెలిమిని
గరముం బాటించ శుభము గలుగును నరుడా!..31
బద్ధకము సంజ నిద్దుర
వద్దుర నామాట వినుము పద్మిని వెడలుం
బద్దుల పొత్తము వ్రాసెడు
తద్దినముం గోరుకొనకు ధరణిని నరుడా!..32
వెలయాలు దీపి మాటలు
గలయందును నమ్మఁబోకు గాటికిఁ బంపున్
గులకాంత నాదరించుము
గులకాంతయె సుఖము నిచ్చుఁ గూర్మిని నరుడా!..33
పాలను గలిసిన జలమది
పాలను దాఁ బోలియుండి పాడుంజేయుం
బాలకుఁ గల యా తీపిని
బాలసు వలె, గనుక బొందు వలదుర నరుడా!..34
పాపము పుణ్యము లనునవి
కాపురముం జేయు హృదిని కలకాలంబుం
బాపముఁ బోవును దప్పక
యాపొద్దును జేయ మేలు నరయుము నరుడా!..35
కలగాగలుపులె బ్రదుకులు
బలువురు మసలుదు రటులనె బయటను గలుగన్
విలవిల లాడును మనసులు
గలనున యనితలఁచు మదిని గలియుగ నరుడా!...36
బధిరుల నంధుల మూగుల
వ్యధలను దానెఱిఁగి దగుస హాయముఁ జేయున్
బదముల నొత్తుచు వానికి
సదయన సూ మెలఁగు మెపుఁడు జగతిని నరుడా!..37
పిలువని శుభకార్యములకు
వలపెఱుగని భార్య తోడ సంభో గంబున్
గలవని మనుజులఁ జెంతకు
బలిమిని బోవలదు వినుము వసుధను నరుడా!..38
పరసతి పొందును గోరకు
పరసతి నిందలచు మదిని బరమేశ్వరిగా
పరసతులు నిప్పు తుల్యులు
సరగునఁపోఁబోకు మెపుఁడు సంధ్యను నరుఁడా!...39
హరి హరులు లేని యూరును
గరివరదుని బూజలేని కాంతల గృహముల్
ధరఁ గానగ రాని యెడల
నరయంగా రుద్రభూమి యగుఁగద నరుఁడా!..40
కూరిమి గలిగిన చోటను
నేరములేఁ గానఁబడవు నిక్కము సుమ్మీ
కూరిమి హద్దులు దాటిన
నేరము రామా యనంగ నిజమది నరుఁడా!..41
ఏఱకుమ లేత పిందెలు
కోరకుమా కూన నెపుఁడుఁ గోరి సుఖింపం
గోరకుము రాని వాటిని
గోరికగా మంచిదనముఁ గోరుము నరుఁడా!..42
పాయసము బూరు లరిసెలు
వాయనముగ వచ్చు సరికి వాహ్వా యంచుం
దీయంగా నుండె ననుచుఁ
నాయత రీతిందినకుమ యరుగవు నరుఁడా!..43
కోటి విధంబుల విద్యలు
గూటికి గాఁ దెలిసికొనుము కూర్మిని నేర్వన్
మాటలు గోటలు దాటిన
పీటలనే నాశ్రయించు వెదకుచు నరుఁడా!..44
: ఇమ్ముగ రోమను సంఖ్యను
దొమ్మిదిలో నొకటి దొలఁగఁ తోరపుఁ బదియౌ
నమ్మక మాయెనె యీయది
నెమ్మదిగాఁ దెలిసి కొనుము నేర్పున నరుఁడా!..45
చేతులు చేతులు గలుపుచుఁ
జేతో మోదంబుఁదోడఁ జిన్మయ మూర్తిన్
గీతాలాపన ,భజనలు
జేతము నుప్పొంగు నట్లు జేయుము నరుఁడా!..46
మూతులు మూతులు గలుపుచు
నాతులతో సరసమాడు నరులను గానన్
వాతలు వెట్టగ వలయును
జేతమునన్ మఱువ వలదు పెట్టుట నరుడా!..47
ఇష్టుల యొద్దను నుండక
యిష్టముగా నిన్ను గోరు నెవరికి నైనం
గష్టముగా భావించక
యిష్టముగా దగ్గరుండు మెప్పుఁడు నరుడా!..48
ఒడలును నొడలును గలుపుచు
నడయాడుచుఁ దిరుఁగు చుండు నాయా జంటన్
గడపకు లో రానీయకు
విడిగాఁ దాఁజేసి కొండ్రు విడిదిని నరుడా!..49
సున్నిత మౌ యాశారద
మిన్నఁగఁ శోకంబుఁ జెంద ,మీరని బాధన్
సన్నయమున బోతనయనె
నెన్నడుఁ దానమ్మనంచు, నెఱుకయె నరుడా!..50
: ఉన్నది లేనట్లుంగను
నున్నట్లుం గానిపించు నొండును లేకం
గన్నవి యన్నియు మాయయె
సున్నాయే మిగులు తుదకు చూడుము నరుడా!..51
: పొగబండిని గమనించుము
సుగమముగాఁ బోవు దాను సూటిగ నెపుఁడున్
యుగములు మారిన మారదు
కుగమనమున కాశపడకు మొప్పదు నరుడా!..52
: సన్మానించుము గురువును
సన్మార్గముఁ గలుగఁ జేయు సంతుంష్టుండై
సన్మార్గ రహితుఁ డవుకుము
సన్మార్గమె మనకు రక్ష సతతము నరుడా!..53
అప్పులు సేసియుఁ దినకుము
పప్పులతోఁగూడు నిఁకను బరమాన్నమ్మున్
దిప్పలఁ బాలౌదువు మఱి
యప్పులనుందీర్చలేక యరయుము నరుడా!..54
వియ్యాలవారి యింటికి
కయ్యమునకుఁ బోవవలదు కలలో నైనం
దియ్యని బలుకులు బలుకుచుఁ
దొయ్యలి కగు పనులయందు తోఁడుగ నరుడా!..55
కామము లోభము మోహము
లే మన యీదేహమందు లీనమ యగుచుం
గామాదులు గలిగించును
గామమునకు నీవు లోను గాకుము నరుడా!..56
శారద మాతకు నతులని
యారాత్రముఁ బలుకు నెడల యా దేవతయే
కారణ మయి నీ వృద్ధికిఁ
బ్రేరణముం గలుఁగఁ జేయుఁ బ్రీతిని నరుడా!..57
: మశకమ్ము లవారణకై
మశకమ్ముల మందుఁజల్ల మరు నిముసంబే
స్పృశియించుచు నా వాసన
మశకము మశకమును గుట్టి మత్తిలె నరుడా!..58
బంధువు లనఁదగు వారలు
బంధుత్వము మఱచి మిగుల బాధలు వెట్టన్
గంధర్వం బొందుదురిల
బంధువులను గౌరవించు భక్తిని నరుడా!..59
: అఘమైనను జంతుబలుల
నఘములుగాఁ దలపవలదు యఙ్ఞము లందున్
మఘవంతున కిచ్చెడు నా
యఘములు దూషితముఁ గాదు హర్షమె నరుడా!...60
[ సన్నయమున వర్తించక
సన్నాసులు గొంతమంది సన్యాసులుగాఁ
బన్నుగ రూపముఁ దాల్చుచు
మన్ననలం బొందు చుండ్రు మహిలో నరుడా!..61
నమ్మకుము కపట తపసిని
నమ్మకు వెలయాలి మాట నమ్మకు ఖలునిన్
నమ్మకుము నీదు కళ్ళను
నమ్ముముమా నాదు మాట నచ్చితె నరుడా!..62
పానకము చెఱకు రసమును
బూనికఁ నైవేద్య మిడగఁ బురిదేవతకున్
గానులు రూకలు గనకము
గానుకగా నిచ్చు నండ్రు గదరా నరుడా!..63
: అక్కఱకు రాని వైద్యము
మ్రొక్కిన దయఁ జూప కుండు మూర్ఖపు పతినిన్
మక్కువఁ జూపని బిడ్డలఁ
గ్రక్కున వర్జించవలయు గదరానరుడా!..64
ఔదలఁ దాల్చుము గురువులఁ
బాదములను భక్తి తోడఁ, బావన మనుచుం
బాదము లంటుచు వేడగ
వేదనలు మిగులకుండ వీడును నరుడా!..65
: దశరా పండుగ రాకను
శశిబింబపుఁ గాంతులీను జానలు మిగులన్
హసితంబగు ముఖు లగుచును
రశనాభరణమ్ము నొసఁగె రక్తిని నరుడా!..66
కాసులు గొరవడి యైనను
వీసమునున్జంకకుండ పేదలకొఱకై
పైసలు పంపుట గనగను
వాసిని మఱి పొందునట్లు భావనె నరుడా!..67
లలిత యని బిలుచు నంతనె
లలితములగు రూ పుతోఁడ లహరుల వోలెం
జిలికించుచు చిఱు నగవులు
లలితయె ప్రత్యక్ష మగును లాలిని నరుడా!..68
సంధ్యను వార్చగ వలయును
సంధ్యా కాలంబులందు సన్మతి తోడన్
సంధ్యా వందన మిదియే
సంధ్యను సేవించ ముక్తి సమకురు నరుడా!..69
విజయము లిచ్చెడు దుర్గను
నిజమగు దగు భక్తితోడ నెమ్మిని గొలువన్
సుజనులఁ గరుణను జూఁడగఁ
నజరా మరమగు నభవము నమరును నరుడా!..70
సకల చరాచర జగతికి
యకళంకపు శక్తి యగుట యా పార్వతినిన్
ముకుళిత హస్తంబులతో
వికచాంభోరుహ పడతిని వేడుము నరుడా!..71
నెలవై యుండిన దుర్గను
గొలువఁగ దానిచ్చుఁబ్రజకు గోరిన వరముల్
దలఁచిన జాలును మనసున
దలఁచుము నూటొక్క సారి తలపున నరుడా!..72
: విజయము నొసగును దప్పక
భజియించిన దశమి నాడు పరితోషితయై
రజమును దామస సత్వము
ల జయించవలయు సుమమఱి లబ్ధికి నరుడా!..73
సంసార పు బంధంబులు
గంసారికిఁదప్పదయ్యెఁ గైవసమగుచున్
హింసాయుతములు బ్రదుకులు
సంసారపుఁగాంక్ష వదలి సాగుము నరుడా!..74
చెప్పిన నీతుల నన్నిటిఁ
దప్పక నేనాచరింతుఁ దథ్యంబిదియే
యిప్పుఁడు యివి విని, మనమున
నెప్పట్టున మఱువ కుండ యెంచుకొ నరుడా!..75
పాలను విషమును సమ
పాలుఁగ నే స్వీకరించు పరమాత్ముండే
యాలన బాలన జూచును
ఫాలాక్షుని వేడు కొనుము భక్తిని నరుడా!..76
మోక్షపు గోరిక మానుము
మోక్షము నీ గుండెయందు మూలగ నుండున్
గక్షలు మానుచు మనగలు
నాక్షణమే ముక్తిఁగలుఁగు నరయుము నరుడా!..77
మనసునకు శాంతి యుండదు
ననవద్యపు శాంతి యుండు నాత్మకు నెపుఁడుం
గనుముచు కచ్చా నిజమును
సాంతముగాఁ దెలిసి కొనుము సరిగను నరుడా!..78
అల వేంకట పుర మునగల
లలితమ్మను జూచి మిగుల లాలనఁదోడం
గలిగిన ముదమున హృదయ క
మలమిడి పూజించెనొక్క మనుజుఁడు నరుడా!..79
శ్రీరాముని చరితమ్మును
నా రాముని తనయులైన యా లవ కుశులుల్
పేరోలగమున నింపుగ
ధీరతతోఁబాడె రతిని దెలియుము నరుడా!..80
ఆలోచనమునఁ జేయుము
కాలోచితములగు పనులు గంభీరముగాన్
మూలము భగవద్ధ్యానము
సాలోచనగల మనిషికి సరసుఁడ! నరుడా!..81
కుటిలపు టొజ్జలు గలుగుత
విటులకు దావలము లయ్యె విద్యాశాలల్
నటియించి ప్రేమ జీవిగ
దిటముగఁ బ్రేమింతు నండ్రు తీయగ నరుఁడా!..82
అన్నియుఁ దెలియును నాకని
యెన్నండును గర్వ పడక యీశుని మదిలోఁ
గన్నుంగవ ముకుళించుచు
నిన్నుం గాపాడు మంచు నిమురుము నరుడా!..83
కాలము మారెనె యందురు
కాలము మఱి మారలేదు కాలము లవియే
వాలకము మారె మనుజుని
ఫాలపు రేఖల నుబట్టి వసుధను నరుడా!..84
జీవన యాత్రను గడుపుము
బావనుఁ డా రామభద్రుఁ బరిరక్షక్షణలోఁ
గావఁగ రాముని మించిన
దేవుఁడు లేఁడనుచు నమ్ము మెప్పుఁ డు నరుడా!..85
సీతారాముల జంటకు
చేతో మోదంబుఁ గలుగ సేవలు సేయం
భూతిని నిచ్చును గావున
యాతల్లిని వేడు కొనుమ యార్తిని నరుడా!..86
కన్నీరుఁ గార్చు మకరము
మిన్నగ లవణంబు లుండ మిలమిల యనుచున్
మున్నెన్నడు విన లేదిది
యన్నియు నిఁకఁ దెలిసి కొనుమ యడుగుచు నరుడా!..87
: కలఁడందురు భక్తుల యెడ
కలడందురు జీవకోటి కాయము లందున్
గలడందురుదిశ లన్నిట
కలడు కలండనెడువాడు కలడా నరుడా!..88
చాముండీ మాతకు నిలఁ
జేమంతుల మాలఁ దోడఁ జేయగఁ బూజం
బాములు దొలఁగును బూర్తిగ
నామాతను వేడుకొనుము నార్తిని నరుడా!..89
: ఇందు గలవందు లేవను
సందేహము లొందకుండ సర్వము నీవై
డెందంబున నుంటి వనుచు
వందనములు సేయుచుండి బ్రదుకుము నరుడా!..90
: వేడుదు నిను బలుమారులు
పాడుదు నీపాట లెన్నొ పరవశ మగుచున్
వేడిన బలుకగ యుండిన
వీ డుదునా నిన్ను ననుచువేడుము నరుడా!..91
సాగర మీసంసారము
వేగమె యిఁక దీని నుండి విడివడ వలయున్
భోగము రక్షణ గలిగిన
గంగాధరుఁ వేడుకొనుము కనుఁగొని నరుడా!..92
జోలలు బాడుచు నిరతము
లాలన నేఁజేతు ననుచు లాహిరి వోవన్
లీలా కారుని శంభుని
ఫాలాక్షుని వేడు కొనుము ప్రగతికి నరుడా!..93
విరమణ యనునది వరముగఁ
గరమును భావించ మనకు కలదు సుఖంబున్
నిరతము భగవద్ధ్యానముఁ
నెరపఁగ వీలుండు గదర నెమ్మిని నరుడా!..94
తైతక్కలు తైతక్కలు
తైతక్కల వేదికయ్యె ధర యాచోటున్
మాతలు పిన్నలు బెద్దలు
గీతాలాపనలఁ దోడ గెంతులె నరుడా!..95
పరులును మనవారుంగనె
యరసిన చో హింస లేక హాయిగ మనువున్
నిరతముఁ గొనసాగును మఱి
కరమును జేయంగ మేలు గదరా నరుడా!..96
: వినుమా నాయీ మాటలు
వినకున్నను బాధ లేదు వేరుగఁ జూడన్
వినినం గడు సుఖ పడుదువు
జననములిఁక యుండబోవు సత్యము నరుడా!..97
భగవద్ధ్యానముఁ జేయుము
పగవారిని నైనఁ జూడు మంతక హరుగా
ఖగపతి వాహనుఁడు, విధిని
సుగుణాత్ముఁగఁ జేయు మనుచు చొక్కిలు నరుడా!..98
: జననము మరణము లయ్యవి
కనిపించెడు సృష్టి కిటుకు కానఁగ వెఱగే
యనయముఁ దిరుగుచు నుండును
మనకర్మనుబట్టి యవియ మానక నరుడా!..99
అరయుము కైలా సంబే
హరుని పుణ్యవాసమ్ము, సింహాచలమ్ము
బరగెను యాత్రా స్థలముగ
నరసింహుడు వెలయు కతన నమ్ముము నరుడా!..100
నూటొక మారులు వేడిన
నోటను నొకమాట యైన నుడువవు సామీ!
మాటలె కరువాయె నేమి
మాటాడుమ యనుము శివుని మాఱున నరుడా!..101
మాయయె యీ జగమంతయు
మాయకు లోఁబడని వాఁడు మహితాత్ముండే
మాయను గెలువఁ గ శక్తుఁడు
మాయల ప్రభుఁ డా యభవుని మరువకు నరుడా!..102
: శ్రీలను నిచ్చును మెండుగ
భోళాశంకరునిఁ గొలువ, మూఢత్వంబౌ
భోళా శంకరు గూరిచి
హేళనగా మాటలాడ,హేయము నరుడా!..103
అంబర కేశుని,యోయన
లాంబక!కామారి!యజుఁడ! యంతక హరుడా!
యంబకు సగభా గమిడెడు
సాంబుడ! కాపాడుమనుము సతతము నరుడా!..104
ఇష్టాయిష్టము లరయుచు
నిష్టుల దరి యుండఁ బోకు మెప్పుఁడు సుమ్మీ
యిష్టము నీవన నెవరికి
నిష్టముగా నుండుమచట యెఱుగుము నరుడా!..105
హింసలు లేకను బుడమిన
హింసావాదమ్మె ప్రజకు హితముం గూర్చున్
హింసలు సెలరేగిన బ్రతి
హింసలు జరుగుటన గాదె హేయము నరుడా!..106
No comments:
Post a Comment