:ఆ.వె:రయమున హయమెక్కె రాణి రుద్రమ దేవి
రాజ్యమేలె గాదె రమణ తోడ
ముదితల కిలలోన ముదమార నేర్పంగ
నన్ని నేర్తు రవని యందు నిజము
2.ఆ.వె:అవసరమ్ము నేర్పు నతివలకెల్లను
కష్టసాధ్యమైన కార్యములను
నేర్పుతోడ చేయు నేర్పరి తనమబ్బు
అభినుతించ వలయు నార్యులార.
3.ఆ.వె:.ఝాన్సి రాణి లక్ష్మి జయమందె హయమెక్కి
పోరు సల్పితాను పూజ్యత గనె
వంట పనియెగాదు వడిగ నే పనినైన
చేయగలరతివలు చిటికె లోన.
4ఆ.వె:అడువారటంచు నలుసుగా చూడకు
నవని నేలగలరు నలఘు మతులు
వంట వండగలరు వాహనాలవలీల
నడపగలరు గాంచు డవని యందు.
5.ఆ.వె:ఆడువారనంగ నబలలే గారిల
నాదిశక్తులంచు నరయుడయ్య
ఎట్టి పనుల నైన నిట్టె చేయగలరు
వాహనమ్ము నడుపు పడతిఁగనుము.
6.కం:జల్లెడ దిప్పిన చేతులు
మెల్లగ స్టీరింగు బట్టి మెలకువ తోడన్
తల్లడి చెందక బండిని
నుల్లము నందున బెదరక నువిదయె నడుపున్.
7ఆ.వె:అవనినేలగలదు హయము నెక్కగలదు
విద్య లెల్ల నేర్చి వెలుగ గలదు
వాహనంబు నడిపి వాసికెక్కగలదు
అబల కాదు చూడు సబల యీమె.
8ఆ.వె:బస్తి నేలగలదు బండి నడుప గలదు
నవసరమ్మె నేర్పు నతివకన్ని
చక్రములశకటము చక్కగా త్రిప్పుచు
తాను సాగు చుండు ధరణి యందు.
9ఆ.వె:కష్టసాధ్యమైన కార్యంబు లెల్లను
సులువు గానె చేసి చూపగలదు
ఆడదబల గాదు సబలన్నతీరుగ
సాగు చుండు గనుము జగతి యందు.
0.ఆ.వె:పొట్టకూటి కొరకు పుడమిపై పడుచున్న
పడతి పాట్లు చూడ బాధ కలుగు
తప్పు లెన్ని యున్న తప్పదు సాపాటు
ననుచు తొక్కె రిక్ష యవని యందు.
11ఆ.వె:ఆడదంటె కాదు అంగడిలో బొమ్మ
ఆడదంటె అమ్మె యవని యందు
అమ్మ నాదరించ నఖిలసిరులబ్బు
ననెడి మాట నెపుడు నమ్మ వయ్య.
12ఆ.వె:మగువ మన్ననంద మహియంత వెలుగును
లలనలున్న చోట లక్ష్మి తాను
వాసముండు నండ్రు వసుధలో జనములు
గౌరవించుడయ్య ఘనముగాను.
13ఆ.వె:మగువలె మహిలోన మణిదీపములని
తెలియుమయ్య నీవు తెలివి తోడ
అన్నమిడెడి వేళ నన్నపూర్ణ యౌను
నాగ్రహమ్ము కలుగ నపర కాళి
No comments:
Post a Comment