Monday, March 4, 2019

గురుమూర్తిజీ


శి వ క ‌ ళ్యా ణ ము



పార్వతీ పరమేశ్వరులను నూత్న వధూ వరుల జేయుట


గౌరిని జంద్రకాంతఫలకమ్మున కూర్చొనబెట్టి , గంధపున్
సారము - నంగలేప‌నము - సంపెగనూనె నలంది , పూసి క
స్తూరిని , హేమకుంభములతో జలమార్చుచు , ధూపధూమ వి
స్ఫారితదీర్ఘకేశములఁ జక్కగ వేనలి వేసి రంగనల్

అభ్యంగనస్నాన మాచరింపగనె స
ర్వాంగసంస్కారకార్యముల జేసి
అంగరాగమ్ముల నంజనాలేపముల్
సొంపారగా సంతరింప జేసి
తళుకులగుల్కు పీతవసనమ్ముల మేన
నింపొదవగ ధరియింప జేసి
మాణిక్యఖచిత హేమక భూషణముల ను
న్నత రీతిగా నలంకృతము జేసి

సర్వభువన జన నయనోత్సవకరముగ
గౌరినిం దీర్చిదిద్దిరి కాంతలెల్ల |
జనని మే‌నకాదేవి రచన మొనర్చె
మలయజ కలిత కళ్యాణతిలకరేఖ |

జనకుడగు హిమక్ష్మాధర చక్రవర్తి
లలన కిడె లలాటమున లలామకమ్ము

భసితము మారె కస్తూరి భరితాంగ రాగసంపదగ
పసిమియేనికతోలు మారె పసిడియంచుల పచ్చడముగ
బుసకొట్టు భుజగము మారె భూషించు తార హారముగ
నొసటి నేత్రము మారె నాహ ! నూత్నదీప్త లలామకముగ

జూట మది శిరోవస్త్రమై శోభ నొసగ
బాలశశియె చూడామణిత్వమును పొంద
పెండ్లికొడుకయ్యె శంభుడు వేడ్కమీర
పెండ్లిపల్లకిగా మారె వృషభు డంత

వివహవేదికా వర్ణనము


అమరగణమ్ము లెల్లయు " శివా " యనుచున్ జయపెట్టుచుండగా ,
యమునయు గంగయున్ గలసి యల్లన చామర వీచుచుండగా ,
రమయు నరుంధతీసతియు బ్రాహ్మియు హారతు లిచ్చుచుండ , స
ప్తమునులు దివ్యవేదవిదితమ్ముగ కార్యము లాచరించగా ,
ప్రమదముతోడ నిల్వ నిరుపార్శ్వములందున బ్రహ్మవిష్ణువుల్ ,
రమణుడు - శంకరుం డిక విరాజిలె చక్కని పెండ్లిబిడ్డడై


ప్రకట మంగళకర మధురవాద్యనిస్వనములతో
సకల బంధుహితులు రాగ , శంభు నెదురుకొనియె మే
నక | మరియు తుషార శైలనాధు డతని యమలపా
ద కమలముల నెలమి గడిగి దానమొసగె కన్యకన్


ప్రమథులు మంగళవాద్యముల్ మొరయింప ,
దిక్పతుల్ పుష్పవేదిక నమర్చ ,
నలుగిడె నా యరుంధతి వధూవరులకు |
కమలాతపత్రమ్ము కమల పట్టె |
ఆ కేశవాంభోరుహాసను లిరువైపు
నిలిచిరి శంభుని నికట మందు |
గీర్పతి మంత్రము లేర్పడ బఠియింప
గీర్వాణి కళ్యాణ గీతి బాడె |

గిరిజయు శివుడున్ దమయొక్క శిరముల పయి
ముత్తెముల తలంబ్రాలను పోసుకొనిరి
సేస లుంచెను దేవతాసిధ్ధగణము

శ్రీకరము మనోహరము నై త్రిజగములకు
పరగె వారి శుభంకర పరిణయమ్ము
వినిన చదివిన మోక్షమ్ము మనకు గలుగు




బాలచంద్రమౌళి . దీనభక్తపాల . శంకరా .
శూలపాణి . నాగభూష . శుభ్రదేహ . ఈశ్వరా .
నీలకంఠ . నిర్వికార . నిర్మలా . మనోహరా .
జాల మేల మమ్ము బ్రోవ జాలితో . మహేశ్వరా

No comments:

Post a Comment