🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
తిరుమల విషయాలు 🙏
వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రాశస్త్యం.🙏
హిందువులకు ఎంత మంది దేవుళ్లు ఉన్నా- వేంకటేశ్వరస్వామి ప్రాశస్త్యం వేరు. మన దేశంలో తిరుమల గురించి తెలియని వారు, మన రాష్ట్రంలో తిరుమలకు వెళ్లని వారు అతి తక్కువ మంది అంటే అతిశయోక్తి కాదు. అలాంటి తిరుమల గురించి, అక్కడ వెలసిన వేంకటేశ్వరుడి గురించి తెలియని గాథలెన్నో ఉన్నాయి. - ''తిరుమల చరితామృతం...' దానిలోని ఒక ఆసక్తికరమైన భాగం..
...
తిరుమల శ్రీవారి ఆలయంలోని గర్భగృహంలో ఈనాడు మనం చాలా విగ్రహాలు చూస్తాం. అయితే లోపల ఎన్ని విగ్రహాలున్నా, అక్కడ జరిగేది ఏకమూర్తి పూజే. అంటే పూజానైవేద్యం కైంకర్యాలన్నీ ధ్రువ బేరానికే. ధ్రువబేరం అంటే మూలమూర్తి - శిలా విగ్రహం. ఎవరూ ప్రతిష్టించింది కాదు - పద్మపీఠంపై ఉన్న అచల ప్రతిమ. ఈ విగ్రహం గురించి మొదట శంఖరాజు భగవంతుని ఆజ్ఞగా తాను భగవంతుని ఎలా చూశాడో అలాగే విగ్రహం చేయించాడని, తర్వాత కాలంలో నిషాదునికి వరాహస్వామి శ్రీనివాసుని వృత్తాంతం తెల్పి తొండమానుని సాయంతో ఈ విగ్రహాన్ని పుట్టలోనుండి తీయించి ఆలయం కట్టించమన్నాడనీ..., పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణం తర్వాత తొండమానుడు కట్టించిన మూడు ప్రాకారాల రెండుగోపురాల ఏడు ద్వారాల ఆలయంలో శ్రీనివాసుడుండేవాడనీ... యోగులకు, దేవతలకు తపస్సంపన్నులకే కన్పడేవాడనీ... అప్పుడే బ్రహ్మదేవుడు భగవంతుని అర్చామూర్తిగా కలియుగాంతం వరకూ ఇక్కడ ఉండి, పాపులను ఉద్ధరించి వారి పాపాలు నాశనం చేసి, లోకాలను రక్షించమని కోరాడనీ... బ్రహ్మ ప్రార్థన మన్నించి స్వామి అర్చామూర్తిగా శ్రీవేంకటాచలంపై ఉన్నాడనీ పురాణాలలో ఉంది.
....
ప్రస్తుత తిరుమల వేంకటేశ్వరుని విగ్రహం ఆగమాతీతం. వైఖానస, పాంచరాత్ర, శైవ శాక్తేయ ఆగమాలలో ఏ దేవతామూర్తి ఎలా ఉండాలి? నిల్చున్న మూర్తి ఎలా ఉండాలి? కూర్చున్న మూర్తి ఎలా ఉండాలి? శయనమూర్తి ఎలా ఉండాలి? విష్ణు విగ్రహాలు ఎలా ఉండాలి? అవతార రూపాలు ఎలా ఉండాలి? వాటి పరిమాణాలు, ఆయుధాలు, అలంకారాలు ఎలా ఉండాలన్న నిర్ణయం చేయబడింది.
కాని శ్రీనివాస విగ్రహం ఏ ఆగమాల్లో చెప్పిన ఏ విగ్రహం లాగానూ లేదు. అంటే ఈ విగ్రహం ఆగమాలు పుట్టక ముందు నుండి వుందని గ్రహించాలి. పూజా విధానం జరగాలి కనుక, తన పూజ వైఖానస ఆగమం ప్రకారం జరగాలని భగవంతుడే ఆదేశించినట్లు పురాణం చెబుతుంది. అలాగే ప్రాచీన కాలం నుండి ఈనాటి వరకూ వైఖానస పూజావిధానమే కొనసాగుతోంది. శ్రీనివాసుని కుడి వక్షఃస్థలంలో శ్రీదేవి ఉంది. నాలుగు చేతులలో, రెండు పైకెత్తినట్లు (ఆయుధాలు పట్టుకోవడానికన్నట్లు) ఉంటే మూడవది వరదహస్తం, నాలుగవది కటి హస్తం. అతికించిన బంగారు శంఖచక్రాలు పైకెత్తిన చేతులకుంటాయి. పాదాలు ఆశ్రయించమని చూపుతున్నట్టుగా వరదహస్తం. అలా ఆశ్రయించిన వారికి, ఈ సంసారసాగరం కటిలోతే అని సూచించేలా కటిహస్తం. మరి ఈ మూర్తికి ధనుస్సు ఏదీ? శిలప్పదిగారంలో ఈ మూర్తి వర్ణన ఇస్తూ - భుజాల దగ్గర అమ్ములపొది, ధనుస్సు ఎల్లప్పుడూ ధరిస్తూండడం వలన కలిగిన ఒరిపిడికి పడిన చారలు విగ్రహానికున్నాయని చెప్పబడింది. పురాణకాలంలో చోళ చక్రవర్తికి తన ఆయుధాలు అయిదూ ఇచ్చినట్లు చెప్పబడింది. ఈ ధనుస్సు ధరించే సూచన కృష్ణావతారానికి ముందు తన రామావతారాన్ని సూచించేదిగా ఉంది కనుకనే గర్భాలయంలో శ్రీవేంకటేశ్వరుని ఐదు మూర్తులు కాక రామకృష్ణుల విగ్రహాలు కూడా ఉంటాయి.
ఈ స్వామికి జరిగే సుప్రభాతం మేల్కొలుపు నుండి అర్చనలు, సహస్రనామార్చనలు, మంత్రపుష్పములు అన్నిటిలో విష్ణుపరంగానే కాక అవతారరూపాలలో రామ, కృష్ణావతార విశేష ఘటనాప్రశస్తి చాలా ఉంది. ఇది రామావతారానికి, కృష్ణావతారానికి, ఈ అర్చారూపానికి పూర్తి సంబంధం ఉందని, భేదం లేదని చూపడానికి నిదర్శనం. ఈ ధ్రువబేరం (మూలవిగ్రహానికి) మెడలో ఎప్పుడూ తీయని కౌస్తుభ హారం ఉంటుంది. చేతులకు విగ్రహంలో నాగాభరణాల చిహ్నాలు లేవు. బంగారు నాగాభరణాలే అలంకారంగా వేస్తారు. పురాణకాలంలో శ్రీనివాసుని వివాహసమయంలో రెండు నాగాభరణాలు ఆకాశరాజు అల్లునికి బహూకరించినట్లు భవిష్యోత్తర పురాణం చెబుతుంది. కాని ఇప్పుడున్న నాగాభరణాలు అవి కావు. ఒక నాగాభరణాన్ని గజపతి వీరనరసింహ రాయలు చేయిస్తే, రెండవది రామానుజులు చేయించారని చారిత్రక ఆధారాలు. ఆగమప్రకారం ధ్రువబేరానికి అనుబంధంగా ఉండే విగ్రహాలు కౌతుక బేరం, స్నపన బేరం, ఉత్సవ బేరం. చివరిగా బలిబేరం. విగ్రహాలు ఆగమాల్లో చెప్పినట్లు లేకపోయినా గర్భగృహంలో ఉన్నాయి. ప్రతిరోజూ స్నపన మండపంలో రాత్రి ఏకాంతసేవ - అంటే పవ్వళింపు సేవ జరిగేది భోగశ్రీనివాసునికే. బంగారు ఊయల పరుపు మీద స్వామికి నేతితో వేయించిన జీడిపప్పు నైవేద్యం పెట్టి, అన్నమయ్య వంశం వారు లాలి పాడుతుండగా, తరిగొండ వెంగమాంబ ముత్యాలహారతి ఇస్తూండగా స్వామివారు శయనిస్తారు.🙏
ఏడుకొండలవాడ అందరిని చల్లగా చూడు తండ్రి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment