Tuesday, February 1, 2022

రామాయణాంశము:


కందము.

శ్రీరాముని చరితమ్మును

నా రాముని తనయులైన  యా లవ కుశులుల్ 

పేరోలగమున నింపుగ 

ధీరతతోఁ బాడి రార్య! దివిజులు మెచ్చన్ 1.

ఆటవెలది. 

రామచంద్ర విభుని రమ్యపుఁ బాలన 

చూడ ముచ్చ టయ్యె జూపరులకు

సంతసమ్ము తోడ సకల జనులు నెమ్మి 

మీర కలసి మెలసి మెలగు చుండ్రి 2.

తేటగీతి. 

రామచంద్రుని తమ్ములు లక్ష్మణుండు 

భరత శత్రుఘ్ను లారయ బాహు బలులె 

యన్న చాటున నుండుచు నర్భకులుగ  

నన్న ప్రేమను బొందిరి యద్భుతముగ 3.

ఉత్పలమాల. 

రాముడు శాంతి కాముకుడు రమ్యుడు తేజుడు నీల దేహుడే  

యేమరు పాటుఁ జూపకయు నించుక యేనియు నుండు వాడునున్ 

రామున కాతడే దనరి రంజిలు మోమును గల్గు వాడునై 

భీమ పరాక్రమం బలరఁ బ్రేమను జేసెను రాజ్యపాలనన్ 4.

చంపకమాల. 

ఘనమగు తేజముం గలిగి కైకకు మ్రొక్కియు గౌరవమ్ముతో 

ననుమతి నీయగా జనని హర్షము తోడను సీత తోడుతన్ 

వనమున వాస ముండుటకుఁ బార్థివ పుంగవు కాంక్ష మేరకున్ 

వినయ మనస్కుడై చనెను బ్రీతిని లక్ష్మణుఁ డుండ తోడుగా 5.

శార్దూలము. 

ఘోరారణ్యము నందుఁ గాంచఁగ మహాఘోరంపు టమ్మాయనే 

యౌరా యే మిది యంచు రాఘవుఁడు దా నత్యుగ్ర బాణంబునున్ 

నారిం లాగుచు వేయ హా యని వ్యథన్ నాకంబునే దాకఁ ఘో

రారావమ్మునఁ జచ్చె నిట్టు లనుచున్ హా సీత! హా లక్ష్మణా!  

  6.

మత్తేభము.         

మునులుం జేసిన యాగమున్ మునుల యామోదంబు వర్ధిల్లఁగా  

ననిశంబున్ విలుఁ జేతఁ గైకొనుచు నాయా చోటులం దిర్గుచుం  

గనినన్ రాక్షస కోటినిం దునిమి యా కాంతార మధ్యమ్ములో    

నెన లేకుండఁగ ధైర్యసాహసములం దీ రాముఁడే భాసిలెన్ 7.

నాగరవృత్తం(భ,ర,వ గణములు)

రాముఁడు వేట కేఁగగా

భామకు రక్షకుండుగా  

నా మహి తాత్ముఁ డయ్యెఁగా 

నామము లక్ష్మణుం డిలన్ 8.

నారాచ పద్యము(త,ర,వ గణములు) 

మారాము సేయు చుండగా 

నా రావణుండు దించెగా

నారామ మందు శింశు పా 

పారమ్ము పాదపంబునన్ 9.

భద్రకము పద్యము(ర,స,వ గణములు) 

అట్టహాసము సెల్గగం  

బెట్టెఁ గావలి నామెకుం

గట్టడిం దగ నిచ్చి యా  

బిట్టు రక్కసి మూఁకనున్ 

10.

పద్యము సావిత్రి (మ,మ గణములు) 

శ్రీరామా కాపాడన్ 

వే రావా?నీ వే న 

య్యా రామా మా దైవం 

బారాధింపన్ ధాత్రిన్    11.

పద్యము కంటక (భ,భ,గ గణములు) 

పూత మనస్కయ యౌ

సీత హరించిన వాఁ   

డా తఱి రావణుఁడే 

భీతిని గొల్పునులే 12.

పద్యము  కుసుమ (న,ర,ర గణములు) 

రామ మూర్తియే శ్యాముఁడై 

రామ మంత్రమే బంధువై

రామ నామమే యందమై

రామ పాలనే సాగెనే 13.

పద్యము  మధుమతి (న,న,గ గణములు) 

హనుమ యరసి తా 

వినయముగను బ

ల్కెను ధరణిజతో

నినకుల విభుఁడే  

యిన నిభుఁ డనుచున్  14.

పద్యము గుణవతి(న,మ గణములు) 

అబల సీతమ్మా 

గుబులు వీడమ్మా 

తబల వాయించుం  

బ్రబల సైన్యంబే 15.

పద్యము   ప్రియంవద (గణములు   న,,భ,జ,ర) యతి 8 

మిగుల విక్రముఁడు మేటి  రాముఁడే 

యగణితమ్ముగ మహా కపుల్ తగం  

బగతురన్ నఱుక భండనమ్ములో 

స గరిమన్ వెనుకఁ జాగ నేఁగెనే  16.

పద్యము..అచలము (గణములు..న,న,ల,ల) 

వినుమ పలుకు లివి 

యనుదినమును నిను 

మనమున దలచు న 

వనిజ! యనెఁ గపియె  17.

పద్యము..కోకనద (గణములు..భ,భ,భ,స) 7వఅక్షరంయతి 

రాముడు వచ్చును రాజస మొనరన్ 1

నీమము దప్పడు నీతిగ మసలున్ 

రాముని శౌర్యము రంజిల భువినిన్ 

ప్రేమను  గైకొను భీతి వదలుమా  18.

పద్యము..మృత్యుంజయ (గణములు..త,మ,ల,గ ) 

రామున్ దయాంబోధిన్  రతి

న్నీమంబుతో నేకాంతుఁడై  

నామంబునే కీర్తించునో

యా మానవుండే పుణ్యుడౌ 

19.

పద్యము...సింహరేఖ (గణములు..ర,జ.గ.గ) 

పావనమ్ము రాముఁ డమ్మున్ 

సావధాన రీతి వేయన్ 

రావణాసురుండు హాహా

రావమే ధ్వనింపఁ జచ్చెన్ 20.

No comments:

Post a Comment