Thursday, February 24, 2022

సామాజికాంశము 1. కరోనా.


వ.నెం. 33

పద్యం  కామేశ

గణములు  భ-భ-న-జ-న-గ

యతి  11వఅక్షరం

--

చూడు కరోనను మనలను శోషిలఁ బఱచెన్ 

వేడిన మానక యుదయపు వేళలఁ బ్రబలెన్ 

మాడున నొప్పియు నడుమున మంటయుఁ దగులన్  

బాడుగ బండినిఁ జనితిని వైద్యుని దరికిన్ 1.

వ.నెం. 46 

పద్యం.  గణనాథ 

గణములు.భ-యభ-య 

యతి  7వఅక్షరం. 

--

వచ్చిన కరోనా ప్రాకెను ధరిత్రిన్  

హెచ్చగు జనాలే యీల్గిరి భయాన

న్నచ్చపుఁ గరోనా యంటకను ముందే 

విచ్చలవిడిం బో పెద్దలును బిన్నల్ 2.

వ.నెం. 49 

పద్యము . చంద్రకళ 

గణములు..ర-స-స-త-జ-జ-గ. 

యతి  11వఅక్షరం. 

--

కుక్క పందుల మాంసము నందే కోరిక పెంచుచుఁ దిందురే 

యక్కజంబుగఁ జీనులు ఘోరం  బయ్యవి కుళ్లఁగఁ బుట్టఁగా

మిక్కుటంబుగ వైరసు లెల్లన్  మేదిని యంతట నిండఁగా  

నొక్క సారిగ నూపిరియే రాకున్నను  బ్రాణము వోవుగా 3.

వ.నెం. 48  

పద్యం. చంచరీకావళి 

గణములు.  మ-మ-ర-ర-గ. 

యతి.  7వఅక్షరం. 

--

మాయా రోగం బంచున్  మాయలో జారకుండన్ 

వే యేలన్  వైద్యుండే  ప్రీతి నీయంగ మందుల్    

వే యా మందుల్ వాడన్  భీతి దూరంబు గాదే  

వాయిన్ ముక్కుం జుట్టున్ వస్త్రముం జుట్ట నొప్పున్  4.

వ.నెం. 50 

పద్యం.  చంద్రరేఖ 

గణములు.  మ-ర-మ-య-య 

యతి  8వఅక్షరం.

--

దైవంబే రక్ష యంచున్ ధైర్యమ్ముతో మార్కొనంగం

గోవిడ్ శాంతించెనే వే గోర్వెచ్చ తోయంబు చేతన్ 

వే వాటింపంగ నిచ్చల్ ప్రీతిన్ సుదూరమ్ము  మర్త్యుల్ 

పోవుం గీటంబు దాఁచన్ మోమెల్ల వస్త్రమ్ము తోడన్  5.

వ.నెం. 41 

పద్యము. క్షమ 

గణములు.  న-న-త-త-గ. 

యతి . 8వఅక్షరం 

--

పసుపు కలుపుమా  పాలలో సోదరా 

విసము దొలగుగాఁ బ్రీతితోఁ ద్రాగుచోఁ  

బసుపు క్రిములఁ జంపంగ సాహాయ్యమై  

హసిత ముఖుల మమ్మందఱం జేయుఁగా 6.

వ.నెం. 44. 

పద్యం. గగనమణి. 

గణములు. న-న-న-భ-న-లగ. 

10వఅక్షరం యతి

--

లుక లుక లవనినిఁ గరోన వలన బ్రదుకుల్ 

వికలిత మనము లయి భీకర మగు దడతోఁ  

జకితుల రగుచుఁ గడు సైప రెవరు నిలలో 

నిఁక విలయము నరయు నియ్య దచిరము సుమీ  7.

వ.నెం. 45. 

పద్యం.  గజవిలసితము 

గణములు.  భ-ర-న-న-న-గ . 

యతి.8వఅక్షరం. 

--

క్రొత్తది యౌ కరోన  కులుకుచుఁ గులుకుచుఁ గ్రొం 

గ్రొత్తని పేరు తోడఁ గువలయమునకు వెసన్ 

మత్తును నిచ్చు చుండి  మదిఁ దొలఁచి యుసురు గ

మ్మత్తుగ దీయు నండ్రు మది నెఱిఁగిన భిషజుల్ 8.

వ.నెం. 51 

పద్యం.  చంద్రవర్మ.   

గణములు . ర-న-భ-స. 

యతి. 7వఅక్షరం. 

--

రూపు సూడఁగఁ గరోన యెఱుపునై 

మాపు లందున నమానుష సరణిన్ 

దాపు సేరుచును దద్దయుఁ బ్రజకున్ 

వేప కాయలుగ వీపున మొలచున్ 9.

వ.నెం. 52  

పద్యం.  చంద్రశేఖర. 

గణములు. న-జ-ర-జ-ర.

యతి. 13వఅక్షరం. 

--

విడువుము మమ్ము  ప్రేమతోఁ గరోన! వేడెదన్ 

గడువును నిమ్ము  కొద్ది కాల మైనఁ గాలు నే 

నడుగుదు నిట్లు భక్త రక్షకుండ! హా శివా! 

యిడ నభయమ్ము  నీవె కాక లేరె యే రిలన్  10.

No comments:

Post a Comment