వ.నెం. 1
పద్యము.. అహిళ.
గణములు..త స జ గ.
యతి. 7వఅక్షరం.
--
విద్యాభ్యసనమే విశాలమౌ
యాద్యంతమును నే ర్పవశ్యమై
యాద్యమ్ము తెలుగే హసింప నౌ
వేద్యంబ భృశమున్ వివేకికిన్ 1.
వ.నెం. 2
పద్యము... తోధక
గణములు..భ భ భ లగ
యతి. 6వఅక్షరం.
---
బోధన సేయ బుధాళి తెలుగున్
రాదన కుండ రమాది సతులున్
సాదర మొప్ప సరాగ మతులై
హ్లాదము నొంది రయాచితముగన్ 2.
వ.నెం 03
పద్యము .విష్టంభము .
గణములు..స స స గ గ.
యతి.. 6వఅక్షరం.
--
తెలుగే కద తీయనిదై యొప్పున్
బలు చోటుల వారలు సైతంబున్
వెలుగై యది ప్రీతినిఁ జేకూర్చున్
వల పేర్పడఁ బల్కిరి యిబ్భంగిన్ 3.
వ.నెం. 04..
పద్యము. అతిరంహి.
గణములు.. జ జ జ ర గ.
యతి.6వఅక్షరం.
-
సుబోధనయే సుమ మాలగా రహించున్
సభాపతియై సమభావ మాచరించున్
నభేదము గన్బడు నట్లుగాఁ జరించున్
స బాంధవమున్ ససుఖమ్ము జీవ ముండున్ 4.
వ.నెం. 5
పద్యము...ప్రవాహిక
గణములు....జ త త త గ
యతి. 10వఅక్షరం.
--
విశాల భావంబు తోడైన విశ్వంబునన్
దిశాంతరాళంబు ముట్టంగ దిట్టమ్ముగన్
స్వశక్తితో విద్య నేర్వంగ సాధింపఁగా
సుసాధ్యమౌ మాతృభాషన్ సుశోధింపఁగన్ 5.
వ.నెం. 6.
పద్యము..లలితపతాక.
గణములు..న స య య గ గ
యతి. 7వఅక్షరం.
--
గురువులు కదా గుబాళించు వారే విద్య
న్నిరువు రనగా నిలన్ బంధులే శిష్యుండున్
గురు విరువురున్ గుణాతీతులే కా శిక్షా
కరుఁడు నుడువంగ శిష్యుండు నేర్చుం జక్కన్ 6.
వ.నెం. 7.
పద్యము... జలదరసిత.
గణములు., న స య య లగ .
యతి. 7వఅక్షరం.
--
సులభతరమై సునాయాసమౌ రీతిగా
లలిత పద జాల భాషా వరం బొప్పు నీ
తెలుగు ధరలోఁ ద్రికాలంబునం దింపుగా
వెలుగు జిలితో విశేషంబుగా వెల్గుగా 7.
వ.నెం, 8
పద్యము. చిత్ర
గణములు. మ మ మ య య
యతి. 9వఅక్షరం.
--
భాషా ఙ్ఞానంబే యిచ్చుంగా పాండితీ నైపుణమ్మున్
నీషద్విద్యా గంధంబుం దా మీయ నొజ్డల్ సురీతిన్
దోషవ్రాతం బేమాత్రమ్మున్ దొర్లకుండంగఁ బ్రీతిం
బాషాణుల్ సైతంబున్ మేలౌ ప్రఙ్ఞఁ బొందంగ నౌఁగా 8.
వ.నెం.9.
పద్యము...ఊహిని
గణములు.. ర స య జ జ
యతి. 9వఅక్షరం.
--
మాతృ వక్త్రము నుండియే మాతృ భాషను నేర్చు
మాతృ భాషకు మూలమే మాత పృథ్విని నెంచ
మాతృ భాషయె ముఖ్యమౌ మానసంబును దెల్ప
మాతృ భాషల శ్రేణిలో మాన్యమే తెలు గౌను
9.
వ.నెం. 10.
పద్యము. తరవారిక
గణములు. న స స జ జ గ.
యతి 10వఅక్షరం.
--
తెనుగు వలెఁ దీపినిఁ బ్రీతి నిచ్చెడు భాషనున్
గనులు గన వెప్పుడు నింక భూమినిఁ జూడఁగా
వినుము తగ బోధన మే విధంబునఁ జూచినన్
దెనుగుననె యుండిన జాతి కంతకు మేలగున్ 10.
No comments:
Post a Comment