Sunday, March 27, 2022

సామాజికాంశము 4. బడి-గుడి.


వ.నెం. 11  

పద్యము.  సురలలిత  

గణములు..  మ న స త ర గ.  

యతి.  10వఅక్షరం. 

-

విద్యా దానము గలుగు నా విద్యాలయంబు నందే 

యాద్యంతంబును నిరతి నా నాబోతు రౌతుకున్  నై        

వేద్యం బిచ్చుచు భవుని వే వేడంగ బ్రార్ధనాదుల్  

సద్యఃస్ఫూర్తిని నడరుచో సంసిద్ధి గల్గుఁ దోడ్తోన్ 1.

వ.నెం. 12   

పద్యము..  సుగంధి-2   

గణములు..ర జ ర జ ర లగ 

యతి..10వఅక్షరం. 

--

ఙ్ఞాన మార్జనమ్ము గల్గు  చాన! భోగ భాగ్య సంపదల్  

వాని యంత వచ్చు విద్య నేర్వ గారవమ్ము బెర్గుట

న్నాననంబు వెల్గుఁ జంద్రు సోయగంబు గల్గి కాంతితో 

మాననీయ మౌను గాదె మామకీన పాఠశాలయే 2.

వ.నెం.13   

పద్యము.  విలులిత వనమాల  

గణములు.. న న మ న న మ 

యతి. 10వఅక్షరం 

-

బడుల వలన సౌమ్యుండై పరమత సహనం బందున్  

గుడుల వలన భక్తుండై కువలయమును రక్షించున్ 

బడిని గురువు బాధ్యుండై  పలు రకముల బోధించున్ 

గుడిని శివుడు పూజ్యుండై గురుతర శివ మీడేర్చున్ 3.

వ.నెం. 14.  

పద్యము.  ఫుల్లదామ   

గణములు...మ త న త ర ర గ. 

యతి. 13వఅక్షరం.  

-

విద్యా బుద్ధుల్ నేర్పుదు రిట నొజ్జల్ సవిస్తరంబౌ విధంబే  

యాద్యంతంబున్ శిష్యులు సరి నేర్వంగ హర్షముం బొందు వారౌ  

విద్యావంతుల్ వేల కొలఁది యుండంగ  విశ్వమం దంత వ్యాప్తుల్ 

సద్యఃస్ఫూర్తిన్ దేశమునకు నిత్యమ్ము సాయముం జేయ మేలౌ 4.

వ,నెం.  15  

పద్యము.  భూరిశోభ  

గణములు.. మ మ న న త త గ గ.  

యతి.  7,14 అక్షరములు

__

దైవంబే కాపాడున్  దయ కలిగినచో దర్శనార్థంబ యేగన్   

భావోద్వేగం బందం బరమ శివునికై  ప్రార్ధనల్ సేయ నిచ్చున్  

జీవం బెన్నాళ్లుండున్  జెడక యిలను నా శీసు లందాఁకఁ బ్రీతిన్ 

దైవం బచ్చో నుండున్  దరిసెన మిడ నా దైవ తాగార మందున్  5.

వ.నెం.  16.

పద్యము.  సతి  

గణములు.  భ త య న జ జ న గ  

యతి.  9, 15 అక్షరములు. 

--

దేవళ మందున్న మహా దేవునిఁ గడు భక్తిని వేడుకొనినచోఁ  

బావన చిన్మూర్తియు నా పార్వతి పతి గావఁగ నెప్పుడు భువిలో  

దేవుని రూపమ్ముననే  దేహరమును వేదిక నొందుచు మనుఁగా  

మోవిని మంత్రమ్ములు ముప్పూటలు చదువన్ ముద మొంది సిరు లిడున్ 6.

వ.నెం. 17  

పద్యము. శంబరము.  

గణములు.  న భ భ ర న భ భ ర  

యతి.  7,19అక్షరములు. 

--

బడికి నేఁగుచుఁ బాఠము నప్పగించుచును శ్రద్ధగఁ బంతులు సెప్పు నా  

నుడులఁ జేకొని నోటను బట్టి  కంఠమున నుండఁగ నూఱఁగ జ్ఞప్తులౌ 

బడు లొసంగును బారము లెల్ల దేహులకుఁ బృథ్విని బంగరు బాటలౌ 

గుడికిఁ జుట్టును  గోడలు రక్షలౌ  బడికిఁ జుట్టును గుంజలు బ్రాణముల్  7.

వ.నెం.18. 

పద్యము...భుజంగము.. 

గణములు...య య య య య య య  య.   

యతి..8,21 అక్షరములు. 

--

అకారాది వర్ణంబు లన్నింటి మూలంబు నేర్పంగ నొజ్జల్గదా యాకరంబుల్  

వికారంబు లేకుండ వేదాది శాస్త్రంబు లా కర్ణపేయంబుగా విశ్వ మంతన్ 

సకాలమ్ము నందే ప్రశాంతంబుగా వ్యాప్తి సేయంగ విద్యార్ధులే సాక్షు లౌఁగాఁ 

బ్రకాశమ్ముకా నోపు బ్రహ్మాండ మందున్న ఙ్ఞానమ్ము పూర్ణమ్ము విశ్వమ్ము నందున్    8.

వ.నెం. 19. 

పద్యము.. హంసపద.  

గణములు..త య భ భ న న న న గ.  

యతి. 11వఅక్షరం.

--

భావించుచు రూపం బూహలలోఁ బగ లనక నిశి యనక నిరతము నా

దైవంబును నారాధించినచో దయను గలిగి మన యెడ నిడు సిరులే 

యే వారము నందున్ మానకుమా హిమగిరి కొమరితను గొలుచుట నెదన్ 

నీ వైభవ మెల్లం బెర్గునుగా నిముసము నిముసమునకు సతి కరుణన్ 9.

వ.నెం. 20  

పద్యము..  వినిద్రసింధురము..  

గణములు.. ర ర ర ర  జ ర జ ర లగ.  

యతి. 10, 20 అక్షరములు. 

--

ఒజ్జ బోధించు పాఠా లహో యుత్సుకత్వ మొందఁ జేయు చుండి యోల లాడఁ జేయుఁగా 

యొజ్జ సామీప్య మందుండఁగా  నొప్పు గల్గు నట్లు మెల్గు చుండి యూపి రున్న మేర కా  

యొజ్జనున్ గౌరవింపం దగున్నూర కెప్పు డే విధంబు నో రహో చెలంగఁ జేయుచుం   

గజ్జ లాడంగఁ బో రాదుసూ  కౌశలమ్ము తోడ విద్య  నేర్వఁగా శుభంబు గల్గుఁగా    10.

No comments:

Post a Comment