Saturday, September 10, 2022

కవిసామ్రాట్ విశ్వనాథవారి జయంతి


డా.బల్లూరి ఉమాదేవి

  అంశం:విశ్వనాథ సత్యనారాయణగారు.


ఆ.వె:చెళ్ళపిళ్ళ వారి శిష్యుడి గా విద్య

        నేర్చి నట్టి గొప్ప నేర్ప రితడు

        అన్ని ప్రక్రియల ను నలవోక గా వ్రాసి

         మన్న నంది నట్టి మాన్యుడితడు.


ఆ.వె:అవిరళ కృషిచేత నభ్యాస బలముచే

         వ్రాసె కావ్యములను రమ్యముగను

          రామకథను కూర్చి రక్తి కట్టించిన

          గొప్ప కవివరుండు కువలయాన.


ఆ.వె: వేయిపడగలనెడి విస్తృతగ్రంథమున్

       వ్రాసి మెప్పునందె వసుధ యందు

        నాంధ్ర పౌరుషమ్ము నందముగాచాటి

           ఖిలము కాని యట్టి కీర్తి నందె.


ఆ.వె:సంప్రదాయములకు చక్కని పాదును

        కూర్చిన కవివరుడు కువలయాన

       విశ్వనాథ పేరు విననివారుండరు

       తెలుసుకొనుము నీవు తెలుగు బాల.


ఆ.వె:విశ్వమెరిగినట్టి విశ్వనాథుడితడు

            రామకథను వ్రాసె రమ్యముగను

           జ్ఞానపీఠమందె ఘనముగా నీతడు

           కూర్చె నెన్నొ కథలు కువలయాన.


ఆ.వె:ధర్మ స్థాపనమ్ము ధరలోన చేయంగ

         నెంచి తాను కూర్చె మంచి కథను

       వేయి పుటలయందు వేయిపడగ లను

        నాణ్యమైన యట్టి నవల వ్రాసె.


ఆ.వె:వాణిపుత్రుడితడు వాగ్ధాటి చూపుచు

         కమ్మనైన యట్టి కావ్యములను

      వ్రాసి ఖ్యాతి గాంచె వసుధలో నీకవి

      మేలుమేలటంచు మెచ్చిరెల్ల.


ఆ.వె:విశ్వమెల్ల ప్రాకె విశ్వనాథుని ప్రభ

    తెలుగు తల్లి మురిసి దీవనొసగె   

    సంప్రదాయములకు సముచితస్థానము

  నిచ్చినట్టి కవియు నితడె భువిని.

No comments:

Post a Comment