తరణార్థంబు భవాబ్ధి వ్రాసితివి గీతాసార భాష్యమ్మునున్
విరియం జేసితి పుష్ప సంచయము సావిత్రీ కథాగమ్మునం
బర భాషామృత భాండ మిచ్చితివి వప్తా సంయమీంద్రత్వమున్
వరమై యొప్పగ నిన్ను గొల్చెదము నీ పాదద్వయం బానుచున్
నర వంద్యోత్తమ సేద దీరితి శివానందద్రుమచ్ఛాయలన్
దరిఁ జేరంగఁ దలంచి వింటి వట సత్యానంద సద్బోధలం
బరమానందము నొందవే రమణ దేవజ్యోత్స్నధామంబునన్
సరి లేరెవ్వరు నీకుఁ దండ్రి యిల సంసారంపు సన్యాసివే
మాన ధనుండు గ్రామ జన మండిత తత్త్వ విశోధకుండు స
త్సూనృత గీతసార పరిశోధిత మానస భాసమానుఁడున్
మానిత వేద సూక్త పరిమాణ మహోదయ కావ్య రాజ సం
ధానుఁడు సత్యవంత వర దార చరిత్ర మనంగ ధాత్రినిన్
సత్యాధ్యాత్మిక చింతనా కలిత భాస్వద్జ్ఞాన సంభావ్యుఁడున్
నిత్యోద్దీపిత పద్య కీర్తిత మహానీలాంగ విష్ణుండు నౌ
న్నత్యభ్రాజిత వర్తనుండు స్వపురీ నాథత్వ ధౌరేయుఁ డా
రాత్యామ్నాయ విహీనునిం గొలుతుఁ బేర్రాజాఖ్య విఖ్యాతునిన్
దొడ్డవరంబు నాఁ బరఁగు దొడ్డ పురమ్ము సలీలఁ గాచి తీ
వడ్డము లేని చందమున వ్యర్థపుఁ బల్కుల సంహరించుచున్
దుడ్డున కీక విస్తరము దోరపు గడ్డగు కాల మందునన్
గొడ్డము లెన్ని వచ్చినను గుండె దిటమ్మున నుంటి విద్ధరన్
ఫల్గు దురంత కార్యచయ భంజన! చిత్తము నందు స్వార్థమే
కల్గ నెఱుంగ వీ వెపుడుఁ గామ మదోద్ధృత ఖాండ వాటవీ
ఫల్గుణ! బంధు మిత్ర జన వర్గ సమంచిత పూజ్య పూరుషా!
వెల్గితి వీవు దొడ్డవర వీర్య జనప్రవ రాధి నేతవై
శత వర్షంబులు గాంచఁ జాగినను మా స్వాంతమ్ము లందుండు నీ
దు తలంపుల్ నెఱి నింపుఁ జిత్తముల సంతోషామృతద్రోణి నీ
వితతస్ఫూర్తి వచో నికాయ మొసఁగున్ విజ్ఞాన విత్తమ్ములం
బితృలోకాంతర వాస! మమ్ముఁ గరుణన్ వీక్షించి దీవింపుమా!
జననం బంది సు కౌశి కాన్వయమునన్ సద్బ్రాహ్మణజ్యోత్స్నఁ జి
ద్ధన రాజత్కపిలేశ్వరాఖ్య పురి విద్యాశుద్ధ చేతస్కుఁడై
మనమం దెన్నఁడు విష్ణు నామ రతి నే మాత్రమ్ము క్షీణింప నే
రని వృత్తమ్మున గ్రామపాలకుఁడు బేర్రాజాఖ్య జీవించెనే
చిరకాలమ్ము సనాతనార్ష గుణ సంశ్లేషైక సన్మానసుం
బర మార్థాతత శోధనార్థ పరితప్తస్వాంత సంచారినిన్
గురు సేవానుగ తాఖిలాంచిత మహా గుప్తార్థ విజ్ఞానినిన్
దరహాసాస్య విరాజమాన జనకున్ ధాతాభునిం దల్చెదన్
శ్రీకృష్ణార్పిత నిర్మ లాతిశయ చిచ్చేతో మహాంభోధికిన్
రాకా పూర్ణ సుధాకరుండ వయి భార్యా పుత్ర బంధమ్ముతో
నేకాంతస్థిర భావ మగ్నుఁడవు విశ్వేశున్ మదిన్ నిల్పి ని
త్యైకాగ్రస్ఫుట రక్తి నుంటి విట సత్యాకాంక్షఁ దండ్రీ మహిన్
Saturday, December 3, 2022
నాన్న పుట్టిన రోజు సందర్భము
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment