Thursday, June 9, 2022

నివేదన

 నివేదన#

         (పద్య ఖండిక)

     

బుగ్గలందు సిగ్గు మొగ్గలు పూయంగ

బెదురు చూపులెల్ల గుదురు కొనగ

నీలిమబ్బు జిలుగు నేలపై తారాడ

కాలి మువ్వ లెల్ల గేలి చేసె


నీలిమబ్బు తునుక నీలాటి రేవులో

ముత్యమయ్యె నడుము ముడత పైన

త్రోవ తడిసి పోయె పావడా పరిగెత్తె

పూల పరిమళమ్ము ముసిరె నంత


నీలి కాంతిరేఖ లీలగా నిలుజొచ్చి

నిద్రకూరుకనుల ముద్రలిడగ

పరవశంపు టొడలు విరిదండగా మారె

పొగులుచు మొలనూలు బిగువు సడలె


నల్లమబ్బుముక్క నాతిని వెన్నంట

ఉల్లమందు నొక్క ముల్లుగుచ్చె

వెండి వెల్గు వాన యెండవేడిమి చూప

చీకటింట గదిని చేరె దనువు


అలసి సొలసి పడక నట్టులనొరగంగ

నిదుర పొరల గన్ను లొదిగి పోయె

నీలి కాంతి రేఖ పూల తేనెలు త్రాగి.

పెదవి పండు కొరికి ముదము గూర్చె.


డా. ఉపాధ్యాయుల గౌరీ శంకర రావు

No comments:

Post a Comment