అన్నమయ్య జయంతి పద్యములు.
(రచన: పోచిరాజు సుబ్బారావు.)
పదములు పాట లింకఁ బలు బద్యము లన్నియు శ్రీనివాసుపై
ముదిరిన భక్తి తోడ నిల మోదము తోడను వ్రాయ నందుకే
పద కవితా పితామహుఁడు భవ్యుఁడు నాయెను లోక మంతటన్
ముదము సెలంగెఁ జేయఁగను పుట్టిన యట్టి దినోత్సవమ్మునున్ 1.
వేంకటేశుని నరసింహు వేలుపులను
సన్ను తించుచు భక్తిని శ్రద్ధ తోడ
వేల కొలఁదిగఁ గీర్తనల్ బ్రియము తోడ
నలరి పాడెను రచియించి యన్నమయ్య 2.
చంద మామ రావె జాబిల్లి రావె నా
బంతి పూలు దేవె పాట లిట్టు
లన్ని యు మన భాష కమిత గౌరవ మిచ్చెఁ
దెలుఁగు పదము లలరి తీయ నగుచు 3.
రాగి ఱేకుల మీదను రమ్యముగను
జెక్కి యుంచిరి భద్రమ్ము సేయఁ దలఁచి
యన్న మాచార్యులకు నరయంగ సాటి
జగము నందుఁ గన్పట్టరు సత్య మెంచ 4.
No comments:
Post a Comment