Wednesday, June 9, 2021

మాహేశ్వర దండకము

మాహేశ్వర దండకము.
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)


 శ్రీకాళహస్తిత్రయోద్ధర్త!  కాశీపురాధీశ! కైలాస సంవాస! శ్రీశైల సంచార! శ్రీకంఠ చిద్రూప!  గౌరీమనోనాథ! గంగాధరా! చంద్ర మౌలీశ్వరా!  శుద్ధ భస్మాంగ! కామారి!  నాగేంద్ర హారా! త్రినేత్రా! మహాదేవ! దేవాలి సంభావ్య! నాట్యానురక్తా! హరా! నీ పదాబ్జమ్ము లెన్నండు నే వీడ నిత్యమ్ము నిన్నుంచి డెందమ్మునం దేను బూజింతు సద్భక్తిఁ బాపమ్ములం బాపి దేవేశ రక్షింపు నేత్రమ్ము లీయంగఁ గన్నప్పనుం బ్రోచితే ప్రీతి దక్షాధ్వరం బెల్లఁ గోపించి ధ్వంసమ్ము గావించితే పూని శాంతమ్ము రక్షించి తే పిమ్మటం బ్రీతి వేఁడంగ బ్రహ్మాదు లేతెంచి కారుణ్య మేపార లోకాలఁ బీడింపఁగా నప్పురామ్నాయముం గూల్చితే శంకరా యొక్క బాణమ్మునం బానముం జేసి హాలాహలం బెల్ల ముల్లోకముల్ గాచితే నీదు నామాలి నెన్నంగ శక్యంబె సౌరాష్ట్ర సోమేశ శ్రీశైల సన్మల్లికా ద్యర్జునా యయ్యవంతిన్ మహాకాళ నామేశ పుణ్యామరేశాన నోంకార నామేశ కేదార కేదార నామేశ యా ఢాకినిన్ భీమ నామేశ కాశీ పురం బందు విశ్వేశ మున్నీట నా నాశికన్ గౌత మేశా మహద్వైద్య నాథంపు విద్యా మహానాథ తద్ద్వారకన్ నాగ నామేశ రామేశ్వరం బందు రామేశ భాస్వద్ఘ నేలా పురం బందు  ఘృష్ణేశ్వరా భక్త నందీశ్వరుం డింక భృంగీశ్వరుండుం ద్వదీ యాంఘ్రి యుగ్మంబు నిత్యంబు సేవించు భాగ్యంబునుం బొంది ధన్యాత్ములై రెంచ ఫాలమ్ముపైఁ గన్ను కంఠంబునం బాము గాత్రంబు నందెల్ల భస్మం బహో పుఱ్ఱెలే నీకు ముత్యాలు చిత్రాతి చిత్రంబు వేషంబు గాచంగ నాద్యంత హీనుండ వత్యంత కారుణ్య చిత్తుండవే నీకటాక్షంబుఁ దానొంది పేట్రేగి వే కాలె భస్మాఖ్య దైత్యుం డహో ద్రౌణినిం గాచితే నర్జునిం గాచితే ప్రీతి సర్వజ్ఞ శశ్వద్ద యాంభోధివే పంచవక్త్రా భవానీధవా విశ్వనాథా విరూపాక్ష విశ్వాత్మ భూతేశ రుద్రా విశాలాక్ష పింగాక్ష నిత్యమ్ము సద్భక్తి నిం గొల్చెదం గొల్చెదం గొల్చెదన్.

No comments:

Post a Comment