Saturday, December 3, 2022

నాన్న పుట్టిన రోజు సందర్భము

 తరణార్థంబు భవాబ్ధి వ్రాసితివి గీతాసార భాష్యమ్మునున్
విరియం జేసితి పుష్ప సంచయము సావిత్రీ కథాగమ్మునం
బర భాషామృత భాండ మిచ్చితివి వప్తా సంయమీంద్రత్వమున్
వరమై యొప్పగ నిన్ను గొల్చెదము నీ పాదద్వయం బానుచున్

నర వంద్యోత్తమ సేద దీరితి శివానందద్రుమచ్ఛాయలన్
దరిఁ జేరంగఁ దలంచి వింటి వట సత్యానంద సద్బోధలం
బరమానందము నొందవే రమణ దేవజ్యోత్స్నధామంబునన్
సరి లేరెవ్వరు నీకుఁ దండ్రి యిల సంసారంపు సన్యాసివే            

మాన ధనుండు గ్రామ జన మండిత తత్త్వ విశోధకుండు స
త్సూనృత గీతసార పరిశోధిత  మానస భాసమానుఁడున్
మానిత వేద సూక్త పరిమాణ మహోదయ కావ్య రాజ సం
ధానుఁడు సత్యవంత వర దార చరిత్ర మనంగ ధాత్రినిన్                

సత్యాధ్యాత్మిక చింతనా కలిత భాస్వద్జ్ఞాన సంభావ్యుఁడున్
నిత్యోద్దీపిత పద్య కీర్తిత మహానీలాంగ విష్ణుండు నౌ
న్నత్యభ్రాజిత వర్తనుండు స్వపురీ నాథత్వ ధౌరేయుఁ డా
రాత్యామ్నాయ విహీనునిం గొలుతుఁ బేర్రాజాఖ్య విఖ్యాతునిన్        

దొడ్డవరంబు నాఁ బరఁగు దొడ్డ పురమ్ము సలీలఁ గాచి తీ
వడ్డము లేని చందమున వ్యర్థపుఁ బల్కుల సంహరించుచున్
దుడ్డున కీక విస్తరము దోరపు గడ్డగు కాల మందునన్
గొడ్డము లెన్ని వచ్చినను గుండె దిటమ్మున నుంటి విద్ధరన్                 

ఫల్గు దురంత కార్యచయ భంజన! చిత్తము నందు స్వార్థమే
కల్గ నెఱుంగ వీ వెపుడుఁ గామ మదోద్ధృత ఖాండ వాటవీ
ఫల్గుణ! బంధు మిత్ర జన వర్గ సమంచిత పూజ్య పూరుషా!
వెల్గితి వీవు దొడ్డవర వీర్య జనప్రవ రాధి నేతవై                        

శత వర్షంబులు గాంచఁ జాగినను మా స్వాంతమ్ము లందుండు నీ
దు తలంపుల్ నెఱి నింపుఁ జిత్తముల సంతోషామృతద్రోణి నీ
వితతస్ఫూర్తి వచో నికాయ మొసఁగున్ విజ్ఞాన విత్తమ్ములం
బితృలోకాంతర వాస! మమ్ముఁ గరుణన్ వీక్షించి దీవింపుమా!            

జననం బంది సు కౌశి కాన్వయమునన్ సద్బ్రాహ్మణజ్యోత్స్నఁ జి
ద్ధన రాజత్కపిలేశ్వరాఖ్య పురి విద్యాశుద్ధ చేతస్కుఁడై
మనమం దెన్నఁడు విష్ణు నామ రతి నే మాత్రమ్ము క్షీణింప నే
రని వృత్తమ్మున గ్రామపాలకుఁడు బేర్రాజాఖ్య జీవించెనే                

చిరకాలమ్ము సనాతనార్ష గుణ సంశ్లేషైక సన్మానసుం  
బర మార్థాతత శోధనార్థ పరితప్తస్వాంత సంచారినిన్  
గురు సేవానుగ తాఖిలాంచిత మహా గుప్తార్థ విజ్ఞానినిన్
దరహాసాస్య విరాజమాన జనకున్ ధాతాభునిం దల్చెదన్             

శ్రీకృష్ణార్పిత నిర్మ లాతిశయ చిచ్చేతో మహాంభోధికిన్
రాకా పూర్ణ సుధాకరుండ వయి భార్యా పుత్ర బంధమ్ముతో
నేకాంతస్థిర భావ మగ్నుఁడవు విశ్వేశున్ మదిన్ నిల్పి ని
త్యైకాగ్రస్ఫుట రక్తి నుంటి విట సత్యాకాంక్షఁ దండ్రీ మహిన్

Saturday, September 10, 2022

కవిసామ్రాట్ విశ్వనాథవారి జయంతి


డా.బల్లూరి ఉమాదేవి

  అంశం:విశ్వనాథ సత్యనారాయణగారు.


ఆ.వె:చెళ్ళపిళ్ళ వారి శిష్యుడి గా విద్య

        నేర్చి నట్టి గొప్ప నేర్ప రితడు

        అన్ని ప్రక్రియల ను నలవోక గా వ్రాసి

         మన్న నంది నట్టి మాన్యుడితడు.


ఆ.వె:అవిరళ కృషిచేత నభ్యాస బలముచే

         వ్రాసె కావ్యములను రమ్యముగను

          రామకథను కూర్చి రక్తి కట్టించిన

          గొప్ప కవివరుండు కువలయాన.


ఆ.వె: వేయిపడగలనెడి విస్తృతగ్రంథమున్

       వ్రాసి మెప్పునందె వసుధ యందు

        నాంధ్ర పౌరుషమ్ము నందముగాచాటి

           ఖిలము కాని యట్టి కీర్తి నందె.


ఆ.వె:సంప్రదాయములకు చక్కని పాదును

        కూర్చిన కవివరుడు కువలయాన

       విశ్వనాథ పేరు విననివారుండరు

       తెలుసుకొనుము నీవు తెలుగు బాల.


ఆ.వె:విశ్వమెరిగినట్టి విశ్వనాథుడితడు

            రామకథను వ్రాసె రమ్యముగను

           జ్ఞానపీఠమందె ఘనముగా నీతడు

           కూర్చె నెన్నొ కథలు కువలయాన.


ఆ.వె:ధర్మ స్థాపనమ్ము ధరలోన చేయంగ

         నెంచి తాను కూర్చె మంచి కథను

       వేయి పుటలయందు వేయిపడగ లను

        నాణ్యమైన యట్టి నవల వ్రాసె.


ఆ.వె:వాణిపుత్రుడితడు వాగ్ధాటి చూపుచు

         కమ్మనైన యట్టి కావ్యములను

      వ్రాసి ఖ్యాతి గాంచె వసుధలో నీకవి

      మేలుమేలటంచు మెచ్చిరెల్ల.


ఆ.వె:విశ్వమెల్ల ప్రాకె విశ్వనాథుని ప్రభ

    తెలుగు తల్లి మురిసి దీవనొసగె   

    సంప్రదాయములకు సముచితస్థానము

  నిచ్చినట్టి కవియు నితడె భువిని.

Tuesday, August 23, 2022

నరుఁడా శతకము

శ్రీరాముని సేవించఁగఁ 

నారాముఁడె మనకు నిచ్చు నన్నియు ఫలముల్ 

శ్రీరామ నామ జపమును 

నారాత్రియుఁజేయుమెపుఁడు నార్తిని నరుఁడా!..1


మనమునఁదలఁచిన రాముని 

మనసంతయుఁ గుదుట బడును మానకు మెపుఁడున్ 

మనగను నాతఁడె శరణము 

మనసారఁగ  వేడుకొనుము  మాన్యుని నరుఁడా!..2


నమ్మకము తోడ నుండుము 

నమ్మకమే సగము బలము  నరునకు నెపుఁడున్ 

నమ్మకముఁ గలుఁగు నెడలను 

నమ్మను దర్శించ వచ్చు  నాశను నరుఁ.డా!..3



మౌనము భూషణ మరయగ 

మౌనముగా నుండు వారు మాన్యులు జగతిన్ 

మౌనము నాయువుఁ బెంచును 

మౌనముగానుండ మేలు  మహిలో నరుడా!..4


సత్యము ప్రాణము మానము  

సత్యమునుంబోలు గుణము  సకలము వెదకన్ 

సత్యమును గనము కనుకను  

సత్యమునే బలుకవలయు  సతతము నరుఁడా!..5


అనుమానముఁ బెను భూతము 

వినయము లేకుండ జేసి వీధిని బఱచున్ 

దినమున సంతస మీయక 

యనయము బాధించు చుండు  నరయుము నరుఁడా!..6


ఆటల పాటల యందున 

మాటలు మితిమీరనీక మసలిన యెడలన్ 

బాటవముఁ బెంచి  మనలో

మేటిగ నిఁకఁ జేయు నెపుఁడు  మేదిని నరుఁడా!..7



నమ్మకు మసత్య వాదిని 

నమ్మకు వెలయాలి మాట ,నడవడిక యునున్  

నమ్మకు ధూర్తులఁ బ్రేమను 

నమ్మకుమిఁ కమోసగాండ్ర  నర్మము నరుఁడా!..8


నమ్ముము సత్యము నెప్పుఁడు 

నమ్ముము సజ్జనుల వాక్కు  నమ్ముము గురువున్ 

నమ్ముము తల్లిని దండ్రిని 

నమ్మకమే సగముబలము  నరునకు నరుఁడా!..9



దుష్టులఁ జోలికిఁ బోయిన 

గష్టములే గలుగు నికను గలకాలంబున్  

గష్టము గాదని దోచిన 

శిష్టుల మార్గంబు నడువ సేమము నరుడా!..10


చేయకు చెడుసహ వాసముఁ

 జేయకు మఱి దొంగతనముఁ జేయకు మఘమున్ 

జేయకు  పరిహాసంబులు

సేయకుమా జారతనపు చేష్టలు నరుడా!..11


విడువకు సజ్జన  చెలిమిని 

విడువకు చేయూత నిడుట బీదలఁ బ్రజకున్ 

విడువకు శంభుని  నామము 

విడువకుమా గు రువు నాఙ్ఞఁ బృధివిని నరుడా!...12


జాతకములు బూటకములు 

జాతకముల నమ్మకునికి  జాతికి మేలౌ 

జాతకములకును బదులుగ 

నీతినినే నమ్ము  మెపుఁడు నిరతము నరుడా!..13


విశ్వాసంబున నుండుము 

విశ్వాసము సగము బలము  వినయముఁ గూర్చున్ 

విశ్వాస ముండు నెడలను 

విశ్వమునే గెల్వగలవు  పేర్మిని నరుఁడా!..14


దీపాలెన్నియొ వెలుగును 

దీపావళి నాడు మిగుల దేదీప్యముగాన్  

దీపాలు లలిత రూపము 

పాపాలను దొలగఁద్రోచు  వత్తులు నరుఁడా!..15


వగవకు పోయిన దానికి 

వగచిన ఫలమేమి రాదు  వంతలు మిగులున్ 

వగచుము దైవము సన్నిధి 

వగచినఁ దానిచ్చుమనకు  వరములు   నరుడా!..16


పవలును ఱేయియు సంధ్యయు

బవనుడు మనకిచ్చుఁ బ్రాణ వాయువు బ్రదుకం 

బవనుని నుపకృతి  యదికద 

పవనుని  వలెనీదు సేవఁ బంచుము నరుడా!..17


విశ్వాసంబున నుండుము 

విశ్వాసము సగము బలము  వీరునిఁ  జేయున్ 

విశ్వాస ముండు నెడలను 

విశ్వమునేఁ ద్రిప్పగలవు వినుముర నరుడా!..18


అపకారికి నుపకారము  

నెపమెన్నక సేయుమెపుఁడు  నిండు మనంబున్ 

నపవర్గముఁదానంతట

జపతపములు సేయవచ్చు  సరఁగున నరుడా!..19


నొప్పింపకు నెవ్వారిని  

నొప్పించిన మనమె  దిరిగి నొవ్వగ వలయున్

నొప్పుల బాధను నోర్చుట 

యప్పరమేశ్వరు రునకునసాధ్యము నరుడా!..20


ఉన్నది లేనట్లుంగను  

సున్నము నన్నంబుమార్చు సూత్రంబందున్  

నెన్నందగు మహిమంబునె  

యన్నా నాకుం దెలుపుమ యార్యా నరుడా!..21


వినుమది యెవ్వరు సెప్పిన  

వినినంతనె మాట యిడక విషయము గూర్చిన్ 

గనుగొని యందలి  నిజమును  

వినయముగా యీయు మెపుఁడు  వివరణ నరుడా!..22


నవ్వకు మతిగా నెప్పుఁడు 

నవ్వకు పదిమంది యుండు  నట్టుల యందున్ 

నవ్వకుము సభల యందున 

నవ్విన యున్మాది యండ్రు  నలుగురు నరుడా!..23


నోరెత్తి మాటలాడకు 

మాఱాడకు తండ్రి యెదుట మౌనము మేలౌ

గోరునఁ బోవఁగఁ నికయా 

క్షారముఁబనిజేయ వీలు గలుగదు  నరుడా!..24


సద్గోష్ఠి సిరిని యొసగును

సద్గోష్ఠియె కీర్తిఁ బెంచు  సరసత నేర్పున్ 

సద్గోష్ఠి మంచి జేయును 

సద్గోష్ఠిని వీడఁబోకు సతతము నరుడా!..25


చేయకుము కాని కార్యము

     పాయకమా దైవపూజఁ బ్రతిదినంబున్ 

     జేయకు భుక్తిని సంధ్యను 

     గూయకుసూ సభను గారుకూతలు నరుడా!..26


కోపముఁ జెందకు మెప్పుఁడు  

కోపించిన  బోవు శమముఁ గూరిమి  దయలున్

గోపము శత్రువు మనిషికి 

కోపము లేకుండ యుండు  గూర్మిని నరుడా!..27


మఱువకు మానవ సేవను
మరువకు నీ బంధు జనుల మరువకు శి వునిన్
మరువకు నీ కర్తవ్యము
మరువకు నీ మాతృసేవ మహిలో నరుడా !..28


విత్తము విద్యయుఁ గులమును 

మత్తునకు నవి క లిగించు  మదమును నహమున్

సత్తువ వంతునిఁ  జేయును 

మత్తునిగా నుండ వలదు  మహిలో నరుడా!..29


విత్తము విద్యయుఁ గులమును 

మత్తునకు నవి క లిగించు  మదమును నహమున్

సత్తువ గలిగిన వానికి 

పెత్తనముంజేయ నిచ్చుఁ బేర్మిని నరుడా!...30


తిరుగకు దుర్మార్గులతో 

నరుగకుమా సాని యిండ్ల  కాతుర తోడన్ 

మరువకు సజ్జన  చెలిమిని 

గరముం బాటించ శుభము గలుగును నరుడా!..31


బద్ధకము సంజ నిద్దుర 

వద్దుర నామాట వినుము  పద్మిని వెడలుం 

బద్దుల పొత్తము వ్రాసెడు 

తద్దినముం గోరుకొనకు ధరణిని నరుడా!..32


వెలయాలు దీపి మాటలు  

గలయందును నమ్మఁబోకు  గాటికిఁ బంపున్ 

గులకాంత నాదరించుము  

గులకాంతయె సుఖము నిచ్చుఁ గూర్మిని నరుడా!..33


పాలను గలిసిన జలమది  

పాలను దాఁ బోలియుండి పాడుంజేయుం 

బాలకుఁ గల యా తీపిని 

బాలసు వలె, గనుక బొందు  వలదుర నరుడా!..34


పాపము పుణ్యము లనునవి 

కాపురముం జేయు హృదిని కలకాలంబుం 

బాపముఁ బోవును దప్పక 

యాపొద్దును జేయ మేలు నరయుము నరుడా!..35


కలగాగలుపులె బ్రదుకులు 

బలువురు మసలుదు రటులనె బయటను  గలుగన్ 

విలవిల లాడును మనసులు 

గలనున యనితలఁచు మదిని గలియుగ నరుడా!...36


బధిరుల నంధుల  మూగుల 

వ్యధలను దానెఱిఁగి దగుస హాయముఁ జేయున్ 

బదముల నొత్తుచు  వానికి   

సదయన సూ మెలఁగు మెపుఁడు  జగతిని నరుడా!..37


పిలువని శుభకార్యములకు  

వలపెఱుగని భార్య తోడ సంభో గంబున్ 

గలవని మనుజులఁ జెంతకు 

బలిమిని బోవలదు వినుము  వసుధను నరుడా!..38


పరసతి పొందును గోరకు 

పరసతి నిందలచు మదిని  బరమేశ్వరిగా

పరసతులు నిప్పు తుల్యులు 

సరగునఁపోఁబోకు మెపుఁడు సంధ్యను నరుఁడా!...39


హరి హరులు లేని యూరును  

గరివరదుని బూజలేని  కాంతల గృహముల్  

ధరఁ గానగ  రాని యెడల 

నరయంగా రుద్రభూమి  యగుఁగద నరుఁడా!..40


కూరిమి గలిగిన చోటను 

నేరములేఁ గానఁబడవు నిక్కము సుమ్మీ 

కూరిమి హద్దులు దాటిన  

నేరము రామా యనంగ  నిజమది నరుఁడా!..41



ఏఱకుమ లేత పిందెలు 

కోరకుమా కూన నెపుఁడుఁ గోరి సుఖింపం  

గోరకుము రాని వాటిని 

గోరికగా మంచిదనముఁ గోరుము నరుఁడా!..42



 పాయసము బూరు లరిసెలు  

వాయనముగ వచ్చు సరికి వాహ్వా యంచుం 

దీయంగా నుండె ననుచుఁ

నాయత రీతిందినకుమ యరుగవు నరుఁడా!..43



 కోటి విధంబుల విద్యలు 

గూటికి గాఁ దెలిసికొనుము  కూర్మిని నేర్వన్

మాటలు గోటలు దాటిన  

పీటలనే నాశ్రయించు వెదకుచు నరుఁడా!..44


: ఇమ్ముగ రోమను సంఖ్యను  

దొమ్మిదిలో నొకటి దొలఁగఁ తోరపుఁ బదియౌ 

 నమ్మక మాయెనె యీయది

నెమ్మదిగాఁ దెలిసి కొనుము  నేర్పున  నరుఁడా!..45



చేతులు  చేతులు గలుపుచుఁ 

జేతో మోదంబుఁదోడఁ జిన్మయ మూర్తిన్ 

గీతాలాపన ,భజనలు

జేతము నుప్పొంగు నట్లు  జేయుము నరుఁడా!..46



మూతులు మూతులు గలుపుచు 

నాతులతో సరసమాడు నరులను గానన్  

వాతలు వెట్టగ వలయును  

జేతమునన్ మఱువ వలదు  పెట్టుట  నరుడా!..47



ఇష్టుల యొద్దను నుండక 

యిష్టముగా నిన్ను గోరు నెవరికి నైనం 

గష్టముగా భావించక 

యిష్టముగా దగ్గరుండు మెప్పుఁడు నరుడా!..48



 ఒడలును నొడలును  గలుపుచు 

నడయాడుచుఁ దిరుఁగు చుండు  నాయా జంటన్ 

గడపకు లో రానీయకు

విడిగాఁ దాఁజేసి కొండ్రు విడిదిని నరుడా!..49


 సున్నిత మౌ యాశారద 

మిన్నఁగఁ శోకంబుఁ జెంద ,మీరని బాధన్ 

సన్నయమున బోతనయనె 

నెన్నడుఁ దానమ్మనంచు, నెఱుకయె నరుడా!..50


: ఉన్నది లేనట్లుంగను 

నున్నట్లుం గానిపించు నొండును లేకం 

గన్నవి యన్నియు మాయయె 

సున్నాయే మిగులు తుదకు చూడుము నరుడా!..51



: పొగబండిని గమనించుము  

సుగమముగాఁ బోవు దాను సూటిగ   నెపుఁడున్ 

యుగములు మారిన  మారదు 

కుగమనమున కాశపడకు మొప్పదు నరుడా!..52



: సన్మానించుము గురువును

సన్మార్గముఁ గలుగఁ జేయు సంతుంష్టుండై 

సన్మార్గ రహితుఁ డవుకుము

సన్మార్గమె మనకు రక్ష  సతతము నరుడా!..53



అప్పులు సేసియుఁ దినకుము 

పప్పులతోఁగూడు నిఁకను బరమాన్నమ్మున్  

దిప్పలఁ బాలౌదువు మఱి  

యప్పులనుందీర్చలేక  యరయుము నరుడా!..54



 వియ్యాలవారి యింటికి

కయ్యమునకుఁ బోవవలదు  కలలో నైనం 

దియ్యని బలుకులు బలుకుచుఁ 

దొయ్యలి కగు పనులయందు తోఁడుగ నరుడా!..55



కామము లోభము మోహము 

లే మన యీదేహమందు లీనమ యగుచుం 

గామాదులు గలిగించును  

గామమునకు  నీవు లోను గాకుము నరుడా!..56



 శారద మాతకు నతులని 

యారాత్రముఁ బలుకు నెడల యా దేవతయే 

కారణ మయి నీ వృద్ధికిఁ 

బ్రేరణముం గలుఁగఁ జేయుఁ బ్రీతిని నరుడా!..57



: మశకమ్ము లవారణకై 

మశకమ్ముల మందుఁజల్ల మరు నిముసంబే  

స్పృశియించుచు నా వాసన

మశకము మశకమును గుట్టి మత్తిలె నరుడా!..58



 బంధువు లనఁదగు వారలు 

బంధుత్వము మఱచి మిగుల బాధలు వెట్టన్  

గంధర్వం బొందుదురిల 

బంధువులను  గౌరవించు భక్తిని నరుడా!..59



: అఘమైనను జంతుబలుల 

నఘములుగాఁ దలపవలదు  యఙ్ఞము లందున్ 

మఘవంతున కిచ్చెడు నా 

యఘములు దూషితముఁ గాదు  హర్షమె నరుడా!...60


[ సన్నయమున వర్తించక 

సన్నాసులు గొంతమంది సన్యాసులుగాఁ 

బన్నుగ రూపముఁ దాల్చుచు 

మన్ననలం బొందు చుండ్రు మహిలో నరుడా!..61



నమ్మకుము కపట తపసిని 

నమ్మకు వెలయాలి మాట నమ్మకు ఖలునిన్  

నమ్మకుము నీదు కళ్ళను  

నమ్ముముమా నాదు మాట నచ్చితె నరుడా!..62



 పానకము చెఱకు రసమును 

బూనికఁ నైవేద్య మిడగఁ బురిదేవతకున్ 

గానులు రూకలు గనకము 

గానుకగా నిచ్చు నండ్రు గదరా నరుడా!..63



: అక్కఱకు రాని వైద్యము 

మ్రొక్కిన దయఁ జూప కుండు మూర్ఖపు పతినిన్ 

మక్కువఁ జూపని బిడ్డలఁ 

గ్రక్కున వర్జించవలయు గదరానరుడా!..64



 ఔదలఁ దాల్చుము గురువులఁ 

బాదములను భక్తి తోడఁ, బావన మనుచుం 

బాదము లంటుచు  వేడగ 

వేదనలు  మిగులకుండ వీడును నరుడా!..65


: దశరా పండుగ రాకను  

శశిబింబపుఁ గాంతులీను జానలు మిగులన్  

హసితంబగు ముఖు లగుచును  

రశనాభరణమ్ము నొసఁగె రక్తిని  నరుడా!..66



 కాసులు గొరవడి యైనను

వీసమునున్జంకకుండ పేదలకొఱకై

పైసలు పంపుట గనగను

వాసిని మఱి పొందునట్లు భావనె నరుడా!..67



లలిత యని బిలుచు నంతనె  

లలితములగు రూ పుతోఁడ లహరుల వోలెం 

జిలికించుచు చిఱు నగవులు  

లలితయె ప్రత్యక్ష మగును లాలిని నరుడా!..68



 సంధ్యను వార్చగ వలయును  

సంధ్యా కాలంబులందు  సన్మతి తోడన్  

సంధ్యా వందన  మిదియే  

సంధ్యను సేవించ ముక్తి సమకురు నరుడా!..69


 విజయము లిచ్చెడు దుర్గను  

నిజమగు దగు భక్తితోడ  నెమ్మిని గొలువన్ 

సుజనులఁ గరుణను జూఁడగఁ

నజరా మరమగు నభవము నమరును నరుడా!..70



 సకల చరాచర జగతికి 

యకళంకపు శక్తి యగుట యా పార్వతినిన్ 

ముకుళిత హస్తంబులతో

వికచాంభోరుహ పడతిని వేడుము నరుడా!..71



 నెలవై యుండిన దుర్గను  

గొలువఁగ దానిచ్చుఁబ్రజకు గోరిన వరముల్ 

దలఁచిన జాలును మనసున 

దలఁచుము నూటొక్క సారి తలపున నరుడా!..72



: విజయము నొసగును దప్పక 

భజియించిన దశమి నాడు పరితోషితయై

రజమును దామస సత్వము  

ల జయించవలయు సుమమఱి లబ్ధికి నరుడా!..73



 సంసార పు బంధంబులు

గంసారికిఁదప్పదయ్యెఁ గైవసమగుచున్ 

హింసాయుతములు బ్రదుకులు 

సంసారపుఁగాంక్ష వదలి సాగుము నరుడా!..74 



చెప్పిన నీతుల నన్నిటిఁ 

దప్పక నేనాచరింతుఁ దథ్యంబిదియే 

యిప్పుఁడు యివి విని, మనమున 

నెప్పట్టున మఱువ కుండ యెంచుకొ నరుడా!..75 



పాలను విషమును సమ 

పాలుఁగ నే స్వీకరించు పరమాత్ముండే 

యాలన బాలన  జూచును 

ఫాలాక్షుని వేడు కొనుము  భక్తిని నరుడా!..76



మోక్షపు గోరిక మానుము 

మోక్షము నీ గుండెయందు  మూలగ నుండున్

గక్షలు మానుచు  మనగలు   

నాక్షణమే  ముక్తిఁగలుఁగు నరయుము నరుడా!..77



 మనసునకు శాంతి  యుండదు

ననవద్యపు శాంతి యుండు  నాత్మకు  నెపుఁడుం 

గనుముచు  కచ్చా నిజమును  

సాంతముగాఁ దెలిసి కొనుము సరిగను నరుడా!..78



 అల వేంకట పుర మునగల 

లలితమ్మను  జూచి  మిగుల లాలనఁదోడం 

గలిగిన ముదమున హృదయ క

మలమిడి పూజించెనొక్క మనుజుఁడు  నరుడా!..79



శ్రీరాముని చరితమ్మును

నా రాముని తనయులైన యా లవ కుశులుల్ 

పేరోలగమున నింపుగ 

ధీరతతోఁబాడె రతిని దెలియుము నరుడా!..80



 ఆలోచనమునఁ జేయుము  

కాలోచితములగు పనులు  గంభీరముగాన్ 

మూలము భగవద్ధ్యానము  

సాలోచనగల మనిషికి  సరసుఁడ! నరుడా!..81


 కుటిలపు టొజ్జలు గలుగుత

విటులకు దావలము లయ్యె విద్యాశాలల్

నటియించి ప్రేమ జీవిగ

దిటముగఁ  బ్రేమింతు నండ్రు  తీయగ నరుఁడా!..82



అన్నియుఁ దెలియును నాకని 

యెన్నండును గర్వ పడక యీశుని మదిలోఁ 

గన్నుంగవ ముకుళించుచు  

నిన్నుం గాపాడు మంచు నిమురుము  నరుడా!..83



కాలము మారెనె యందురు 

కాలము మఱి మారలేదు  కాలము లవియే  

వాలకము మారె మనుజుని

ఫాలపు రేఖల నుబట్టి వసుధను నరుడా!..84



 జీవన యాత్రను గడుపుము 

బావనుఁ డా రామభద్రుఁ బరిరక్షక్షణలోఁ

గావఁగ రాముని మించిన 

దేవుఁడు లేఁడనుచు నమ్ము  మెప్పుఁ డు నరుడా!..85



సీతారాముల జంటకు 

చేతో మోదంబుఁ గలుగ సేవలు సేయం 

భూతిని నిచ్చును గావున 

యాతల్లిని వేడు కొనుమ యార్తిని నరుడా!..86 



కన్నీరుఁ గార్చు మకరము 

మిన్నగ లవణంబు లుండ మిలమిల యనుచున్ 

మున్నెన్నడు విన లేదిది 

యన్నియు నిఁకఁ దెలిసి కొనుమ యడుగుచు నరుడా!..87


: కలఁడందురు భక్తుల యెడ 

కలడందురు జీవకోటి కాయము లందున్ 

గలడందురుదిశ లన్నిట 

కలడు కలండనెడువాడు కలడా నరుడా!..88



 చాముండీ మాతకు నిలఁ 

జేమంతుల మాలఁ దోడఁ జేయగఁ బూజం 

బాములు దొలఁగును  బూర్తిగ 

నామాతను వేడుకొనుము నార్తిని నరుడా!..89



: ఇందు గలవందు లేవను

 సందేహము లొందకుండ  సర్వము  నీవై

డెందంబున  నుంటి వనుచు

వందనములు సేయుచుండి బ్రదుకుము నరుడా!..90



: వేడుదు నిను బలుమారులు

పాడుదు నీపాట లెన్నొ పరవశ మగుచున్

వేడిన బలుకగ యుండిన

వీ డుదునా నిన్ను ననుచువేడుము నరుడా!..91 



సాగర మీసంసారము 

వేగమె యిఁక దీని నుండి విడివడ వలయున్  

భోగము రక్షణ గలిగిన 

గంగాధరుఁ వేడుకొనుము  కనుఁగొని నరుడా!..92



జోలలు  బాడుచు  నిరతము 

లాలన నేఁజేతు ననుచు లాహిరి వోవన్ 

లీలా కారుని శంభుని

ఫాలాక్షుని వేడు కొనుము ప్రగతికి నరుడా!..93


 విరమణ యనునది వరముగఁ 

గరమును భావించ మనకు కలదు సుఖంబున్ 

నిరతము  భగవద్ధ్యానముఁ 

నెరపఁగ వీలుండు గదర నెమ్మిని నరుడా!..94



తైతక్కలు తైతక్కలు 

తైతక్కల వేదికయ్యె  ధర యాచోటున్ 

మాతలు పిన్నలు బెద్దలు  

గీతాలాపనలఁ దోడ గెంతులె నరుడా!..95



 పరులును మనవారుంగనె 

యరసిన చో హింస లేక హాయిగ మనువున్ 

 నిరతముఁ గొనసాగును మఱి 

కరమును జేయంగ మేలు  గదరా నరుడా!..96


: వినుమా నాయీ మాటలు 

వినకున్నను బాధ లేదు  వేరుగఁ జూడన్ 

వినినం గడు సుఖ పడుదువు  

జననములిఁక యుండబోవు  సత్యము నరుడా!..97



 భగవద్ధ్యానముఁ జేయుము 

పగవారిని నైనఁ జూడు  మంతక  హరుగా 

ఖగపతి వాహనుఁడు, విధిని 

సుగుణాత్ముఁగఁ జేయు మనుచు చొక్కిలు నరుడా!..98



: జననము మరణము లయ్యవి 

కనిపించెడు సృష్టి కిటుకు కానఁగ వెఱగే

యనయముఁ దిరుగుచు నుండును 

మనకర్మనుబట్టి యవియ మానక నరుడా!..99



అరయుము కైలా సంబే 

హరుని పుణ్యవాసమ్ము, సింహాచలమ్ము  

బరగెను యాత్రా స్థలముగ 

నరసింహుడు వెలయు కతన  నమ్ముము నరుడా!..100



నూటొక మారులు వేడిన 

నోటను నొకమాట యైన  నుడువవు సామీ!  

మాటలె కరువాయె నేమి 

మాటాడుమ యనుము శివుని మాఱున నరుడా!..101



 మాయయె యీ జగమంతయు 

మాయకు లోఁబడని వాఁడు మహితాత్ముండే 

మాయను గెలువఁ గ శక్తుఁడు 

మాయల ప్రభుఁ డా యభవుని మరువకు నరుడా!..102



: శ్రీలను నిచ్చును మెండుగ 

భోళాశంకరునిఁ గొలువ, మూఢత్వంబౌ  

భోళా శంకరు గూరిచి  

హేళనగా మాటలాడ,హేయము   నరుడా!..103



 అంబర కేశుని,యోయన 

లాంబక!కామారి!యజుఁడ! యంతక హరుడా! 

యంబకు సగభా గమిడెడు 

సాంబుడ! కాపాడుమనుము సతతము నరుడా!..104


ఇష్టాయిష్టము లరయుచు 

నిష్టుల దరి యుండఁ బోకు మెప్పుఁడు సుమ్మీ 

యిష్టము నీవన నెవరికి  

నిష్టముగా  నుండుమచట  యెఱుగుము నరుడా!..105


హింసలు లేకను బుడమిన 

హింసావాదమ్మె ప్రజకు హితముం గూర్చున్  

హింసలు సెలరేగిన బ్రతి 

హింసలు  జరుగుటన గాదె హేయము నరుడా!..106



Tuesday, August 2, 2022

ఫాల నేత్ర శతకము.


శ్రీలు శూలము దండముల్ క్షితిని నెపుడు

సర్ప హారము నెలవంక  సంతుగాదె 

భస్మ ధారణ మనగను బరమ ప్రీతి

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర! 1.


చేయ జాలను బూజను శ్రీనిఁ బోలెఁ  

గర్మ కాండల నెఱుగను గజము పగిది 

మణుల నీయఁగ సరిపోను ఫణి వలె నిక  

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర! 2.

ఏమి పుణ్యము సేసెనో యేమొ కాని 

సాలె పురుగును నేనుగు సర్ప మరయ 

ముక్తి నొందెను, నాకును మోక్ష మిచ్చి 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర! 3.


స్వార్ధ మంచును నెగతాళి సలుపు దేమొ 

నాదు బాగును నేఁ జూడ న్యాయమె కద 

కోరు చుంటిని నిన్నునేఁ గూర్మి తోడ 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర! 4.


శాస్త్ర విఙ్ఞాన గ్రంధముల్ సదువలేదు 

మొక్కు బడిగాను నేర్చితి ముద్ద కొఱకుఁ  

జిన్ని పదములఁ గూడిన సేద్య మిదియ 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర! 5.


పార్ధు దెబ్బకు నీ లోన బహు విధముల 

మార్పు జరిగిన కతనాన మదిని సొలసి   

యలుక నొందుచు దయఁ జూడ వకట  నన్ను

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర! 6.


కాళ్లు నొప్పులు వీనులు కలసి రావు 

చేతు లాడవు కనఁగ రా దేదియు నిక  

భజన జేయగ లే నిట్టి వార్ధకమున 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర! 7.


పసిడి  రజతము తామ్రపుఁ బట్టణముల 

నొక్క బాణానఁ గూల్చిన నురసిలుడవు 

వంద నంబులు సేయుదు వంద లాది

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర! 8.


చేయి పెట్టిన శిరసుపై వేయి ముక్క 

లగు విధం బగు వరమును నసురున కిడి 

ప్రాణ హానికి లోనయి   పరువు లెత్తఁ  

గాపు గాచెను గద సామి! కైట భారి

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర! 9.


బ్రహ్మ విష్ణులు నీ రూపుఁ బడయు కొఱకు 

నెంత వెదకినఁ గన రావు సుంతయైన 

నాకు శక్యమే నిను జూడ  నతులు దప్ప 

వంక పెట్టక  కాపాడు ఫాల నేత్ర! 10.

ఆభరణములతోఁ గల యమ్మఁ  జూడ 

మనసు పులకించె  నప్పుడు మైమఱవఁగ 

నేమి భాగ్యము నా యది  యేమి రూపు 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 11.


లేకు కంట్రీ పురంబున లింగ మూర్తి  

యాలయమునకు భక్తులు హర్ష మొదవ 

వచ్చి  పూజింతు రమితంపు భక్తి తోడ 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 12.


కాశి కేగిన వారలు గాంతు రచట 

దివ్య మంగళ మూర్తుని,  భవ్య పతినిఁ  

బుణ్య మంతయు వారిదే పుణ్య పురుష ! 

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 13.


గురునిఁ బూజించు నెడ మంచి  గుణము గలుగు 

రుజయుఁ దొలగును నాతని రూపుఁ జూడ 

దేశికుడవు నీవె గద యీ  దీనున కిల 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 14.


తప్పుఁ జేయని మనుజుని దరమె వెదకఁ

జేయు చుందుము తప్పులు  సివరి వరకు 

నైన దయఁ జూపి మమ్ముల  ననవరతము 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 15.


కాల భైరవ  స్వామినిఁ గాంచి మ్రొక్క

శునక వాహను డగుచును  మనకు నిచ్చు 

సృష్టి జీవన లయముల నీశు వోలె 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 16.


గిట్టు మనుజుడు దప్పకఁ బుట్టు మరల 

యతని పాపము విడివడు నంత వరకుఁ 

బుణ్య మార్జనఁ జేయగఁ బోవు నఘము 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 17.


పూర్వ జన్మపుఁ బాపాలు వోవు వఱకు 

జన్మ రాహిత్య ముండదు సత్య మదియ 

పాప పరిహార మగు నీదు పాటవమున 

వంక పెట్టక  కాపాడు  ఫాల నేత్ర ! 18.



గతము నెన్నడుఁ దలపను గలను నైన 

భావి నూహింప  మనమున, వర్త మాన 

ము నిక  నాచరింతు సతము  ముదము కొఱకు 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 19.


పార్వతమ్మకుఁ దగు సగ భాగ మిచ్చి 

యర్ధ నారీశ్వ డను పేరు సార్థ కమ్ముఁ 

జేసి కొను నట్టి  పార్వతీశా !శివ !యిక 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 20.


పుట్టు ప్రతిజీవి తప్పక  గిట్టు భువిని 

బ్రదుకు  నన్నాళ్లు దైవము  పైన మనసు 

మలచి పాపాలు సేయక  మసలు కొందు 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 21.


విశ్వ గురువును గామారి వేద విదుడు 

సకల దేవ తారాధ్యుడు  శంకరుండు  

నయిదు మోముల వేల్పును  నయిన నీవు 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 22.


అన్ని చోట్లను నీ వుందు వండ్రు ఋషులు 

చెట్లు పుట్టలు గ్రామాలు సేరి వెదకఁ 

గాన రాదయ్యె నిన్ను నా కన్ను దోయి 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 23.


వెదక వెదకంగఁ దెలిసె నా మదికి నిపుడు  

నీవు గల వని నా లోన నెమ్మి గాను 

బట్టు కొనువాఁడ నిపుడు నీ చుట్టుఁ దిరిగి 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 24.


మ్రోగు గంటలు బడిలోన ముద్ద కొఱకు 

గంట మ్రోగును గుడిలోనఁ గాలుఁ జూడ 

గుడి బడుల గంట లుండె మా గుండె లందు 

నాత్మ పరమాత్మ రూపాన ,నవియ నీవె  

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 25.


ఆత్మ పరమాత్మ లను నవి యర్థ మగుట 

చాల కష్టము ,నరయ వత్సరముల ఘన 

సాధనలచేత నయ్యది సాధ్య మగును 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 26.


దేశ భాషల యందునఁ దెలుగు లెస్స 

యనుచు   రాయలు  నుడువుట  నాదరించి 

వ్రాయు చుంటిని  దెలుగులోఁ బద్యములను 

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 27.


పుట్టఁ బోయెడు బిడ్డకై పురుటి నొప్పు  

లెన్ని  వచ్చిన  భరియించు  నింతి వోలె 

నెన్ని కష్టము లెదురైన  నిన్ను వదల 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 28.


కన్ను మూసిన చోటను గన్నుఁ దెఱచు 

బంధముల పైనఁ బ్రీతిని  వదల లేక 

జీవి యిటులనేఁ దిరుగును  జేరి గృహము 

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 29.


శ్వాస యున్నంత కాలమే  బ్రదుకు  జీవి 

శ్వాస యాగిన మరణము  సంభవించి 

కాలి బూడిద యగు సుమా కాంతిఁ దొలగి  

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 30.


శ్వాస యనగను బ్రాణము  ప్రాణ  మనగ 

నాత్మ , యా యాత్మ  నీవయే  యాది దేవ ! 

యట్టి నీవు మా డెందముఁ బట్టి యుండి 

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 31.


బద్ధకము గల మనుజుఁడు  భరణి  యందు 

నేలఁ గొట్టిన  ముద్దలు నేల మీద 

నణగి యుండు విధంబున  నటులె యుండు 

వంక పెట్టక  కాపాడు   ఫాల నేత్ర ! 32.


ఎంత చెప్పిన వినకుండ సుంత యైన 

ముళ్ల బాటను  నడిచెడు  మూర్ఖ జనుని  

బాగుఁ జేయంగఁ జాలడు బ్రహ్మ యైన  

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 33.


నిదుర లేచెద నుదయాన, నిన్ను  గనుచుఁ 

బద్య ములు రెండు మూడైన  వ్రాసి   రతిని 

నీవె  తల్లియుఁ దండ్రివి నీవె  గురువు  

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 34.


కంటకము లన్ని గడదేఱుఁ గలుగు సుఖము 

నీదు దర్శన మాత్రాన  నిజము  సుమ్ము 

వమ్ము సేయకు  నామాట   వసుధ యందు

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 35.


ఆశ్రిత జనుల రక్షించు నగ్గి కంటి 

పాల పుంతల విహరించు  భైరవుండు 

నాదు గోడు విందు రనుచు నమ్ము చుంటి 

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 36.


ఆశ్రిత జన రక్షకు డగు  యఙ్ఞ పురుషు 

డేని మసన మందునఁ గల యీశుఁ డేని 

నాదు గోడును విను నని నమ్ము చుంటి 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 37.


వేయి మందియు వైద్యులు విసుగు లేక 

జాగరూకత తోడను సాకి యైన 

నాప గలరె  రుగ్ణుని చావు  ? నాప లేరు 

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 38.

ఏది యెటు లగుఁ దెలియగ  నెవరి తరము 

జరుగ మానదు పృథివిని  జరుగు నదియ 

చింత నొందను దానికై  సుంత యైన 

వంక పెట్టక  కాపాడు  ఫాల నేత్ర ! 39.


నాది నే నను భావమ్ము నన్నుఁ దాక 

గర్వ మేర్పడి నశియించు ఙ్ఞాన ధనము 

కాన యా రెండు రా నీక కాచి   నన్ను  

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 40.


సత్త్వము తమము గుణములు సత్వరముగ 

నింక నారజో గుణమును నిముడు కొఱకు  

నాలయముఁ జుట్టుఁ దిరుగుదు నార్తి తోడ 

మూడు మారులు లెక్కకు మూడు వరకు

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 41.


నీదు నామముఁ బలుకుచు నిదుర లేచి 

యుల్ల మలరగఁ నినుఁ జూచి  యుత్సుకతన

నాసనములను వేయుదు  ననుదినమ్ము  

వంక  పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 42.


అమ్మ నాన్న గురువు చెలి యక్క యన్న 

లన్ని మీరె మాకం చను నాశ తోడ 

బ్రదుకు చుంటిని మీ మీద భార ముంచి 

వంక  పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 43.


నీవు నాలోన నుండగ నెవ్వఁ డైన  

భీతిఁ జెందును  దరిఁ జేరఁ బృథివి యందుఁ  

జివర  కా యముఁ డైనను  జేర వెఱచు  

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 44.


కార్తికంబునఁ బూజింపఁ గాలు రతిని 

సాహసింపడు దరిఁ జేర  సంయమనుడు   

భక్తి భావము గలిగిన  వ్యక్తి యగుట 

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 45.


పాప హారుఁడు ముక్కంటి భస్మ ధరుడు 

హస్త మందుఁ గపాలము  హరికి సఖుఁడు 

చంద్ర రేఖపుఁ జిహ్నుఁడు,   సాంబు డౌచు 

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 46.


వేగ హర! "అ ఇ ఉణ్ ఋ ఌక్" నాఁగ నాడ 

సంభ వించె నకా రాది జలము  లన్ని 

యవియె వర్ణ మాలగ నయ్యె నడరి యపుడు 

వంక పెట్టక  కాపాడు ఫాల నేత్ర ! 47.


మహిమ లెన్నియో జేసెడు మానవుండు 

పతన మగు చుండె నహము దాఁ బరగు కతన 

నహముఁ దొలగిన సిద్ధిని  నందఁ గలడు 

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 48.


కోరు కొలదినిఁ బెరుగును గోరిక లిల 

వాని నణచుట  మే లగు బాగు కొఱకుఁ  

గాని యెడలను బతనమే కాన నగును 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 49.


మనసు సెప్పిన  విధముగ మసల రాదు 

మనకు లోబడి మన వలె మనసు సుమ్ము 

జీవితంబున ముఖ్యము  జీవి కెపుడు  

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 50.


పద్య భావాల తీరును బట్టి నాదు  

నార్తి  గ్రహియించి  దగు విధ మగు   నుపకృతిఁ 

జేయఁ గోరుదు ననిశముఁ జిన్మ యుండ 

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 51.


ఏమి బ్రదుకులో యమెరికా గామి జనుల 

తొమ్మి దైనను లేవరు తుడుపు లేదు 

వండు కొనుటయుఁ దినుటయుఁ  బండు కొనుటె  

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 52.


కాని పించరు బయటను గనుల కెవరు 

నిరుగు పొరుగులు సహితము  నింటి లోనె 

తిరుగు నలవాటు కలిగిన దిరుగ లేము 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 53.


గుణము లన్నిటిఁ గన దాన గుణము మేలు 

దాన మీయుట చేతనే  దైవ శక్తి  

తో డగుచు నిడు  మోక్షముఁ బుడమి యందు 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 54.

అప్పు డప్పుడు వచ్చెడు  నార్తి  కేను 

నిప్పు  డింతగాఁ గుములుట యేలఁ జెపుమ 

వచ్చి పోవును నొడలిలో బలము దఱుఁగ

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 55.


ఒకరిది ధనము భోగమిం  కొకరిది యను 

విధముగను నుండె మీ స్థితి  విశ్వనాధ ! 

మీకు వృషభము గరుడుడు  శ్రీకరునకు 

వంక పెట్టక  కాపాడు ఫాల నేత్ర ! 56.


నమ్మ కముఁ దోడ దంపతు లిమ్ముగాను 

జేయు చుండిరి సంసృతిఁ జివరి వరకు 

నట్టి నమ్మక ముండె నీ వనిన నజుడ ! 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 57.


ఓం శివ యనుచు  నీ నామ ముదయ  మందు 

నిత్య కృత్యము గాగ ననిశము పఠన 

పాఠనంబులు సేసెడు భక్తుని గద

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 58.


బంధ ముండిన బ్రదుకులు బానిస లగు

నట్లు మెలగుట  నొల్లను  నాది దేవ ! 

బంధ ముక్తుని జేయుచుఁ బరము నిచ్చి 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 59.


మనము మనలను నమ్మిన మహితుఁడైన 

హరిణ చిహ్నుని సంతోష  పరచి నట్లు  

నమ్మకమునకు సాక్షి గౌరమ్మ  విభుడు 

వంక పెట్టక కాపాడు ఫాల  నేత్ర ! 60.


ఎపుడు పోవునో యీ ప్రాణ మెవరి కెఱుక  

ప్రాణ ముండగఁ జేయుచుఁ బరుల కీవి 

బ్రదుకు  దినములు దృప్తిగఁ  బ్రదుకుదు నిక 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 61.


మమను విడుచుట యెపుడును  మఱవ కుండు 

మదియ మఱుజన్మ లేమికి  నాస్పదమ్ము

కాన విడుతును  దప్పక నేను విభుడ! 

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 62.


ఎవరి మనసును నొప్పింప ,నెవరి కైనఁ  

జేత నైనంత వఱకును జేసి మేలు 

 మీ దయకుఁ బాత్రు నగుదును  మిత్తి గొంగ!

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 63.


కాచి వడఁబోసి చూడగఁ గాపురమ్ముఁ 

బేలవమ్ముగఁ దోచెను బ్రియము లేమి  

తప్ప దీ జన్మ కయ్య దీ ధరణి యందు 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 64.


మౌన మరయగ భూషణ మై చెలంగు 

ఋషులు మును లైరి మౌనము చేతఁ జుమ్ము 

మానసిక ముగ  శాంతిని ,మహిమ నొసఁగు 

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 65.


కన్న తల్లినిఁ దండ్రిని గౌరవించి 

సేవఁ జేయగ నగుఁ జుమా  శివుని సేవ  

పుష్టి తుష్టులు గలుగును  బుణ్య మబ్బు 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 66.


మల్లె పూలను జక్కగ మాల కట్టి 

నీకు దండగా  వేసెడు నియమ మికను 

నిత్య కృత్యముఁ జేయుము నేల మీద

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 67.


ముక్తి కోరిక గల్గుచో రక్తిఁ గలిగి 

సాంబ శివునికి వేవేల సార్లు జపము 

లాచరింపగ వలెఁ జుమా  యార్తితోడ  

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 68.


కర్మ కాండలు సేసెడు కర్త లవియ

యాత్మ సాక్షిగఁ జేసిన  నాయు వెదుగు 

సకల శుభములు గలుగును శమముఁ గలుగు

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 69.


వేల కొలదిగఁ బద్యాలు  బేర్మి మీర 

వ్రాయు శక్తి యుక్తుల నిమ్ము  రాణ కెక్కు 

పద్య ములు వ్రాయుదు కవులు బరవ శింప

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 70.


కన్ను గారుట గమనించి కన్న డపుడు  

తనదు కన్నును నతికించె దయను గలిగి 

యేమి భక్తినిఁ జూపించె నేమి యీవి  

వంక  పెట్టక  కాపాడు  ఫాల నే త్ర ! 71.


శిరమున నెలవంకకుఁ గల జిలుగు మెరయ

చుట్ట లూడిన  సర్పాలు సుట్టుఁ దిరుగఁ 

దోరపు రవమునను గంగ  దుముక భువికి 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 72.


తప్పు లైనను నవి యగు నొప్పులుగను  

బదుగురి పలుకు లొక్కని బలుకు సరియ 

యైనఁ  దప్పని యందురె యౌర  ప్రజలు

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 73.


కండ్లు గలవని  పెద్దగాఁ గన జగమును

మాయ మగుఁ జుమా కనబడి మరలఁ జూడ

శాశ్వతంబు నీ రూపమే  సకల భువికి

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 74.


బలము గలుగును దప్పక  ప్రతి యొకనికి 

నాత్మ  విశ్వాస ముండిన, నది నిజముగ    

నౌను  బరమాత్మ  విశ్వాస  మభవ! యికను  

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 75.


మువ్వు రుండగఁ బిల్లలు  ముచ్చటగను 

నాకు లేదిఁక నే లోటు  నమ్ము నిజము 

మూడు పూటల నీ పూజ  ముదముఁ గూర్చు 

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 76.


సహన శక్తిని గోల్పోయి జనము ధరను

జీటి మాటికి నొకరికిఁ జేటుఁ జేయఁ 

జూచు నెప్పుడు తప్పులు సూచి చూచి 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 77.


ఉందు వందురు కైలాస మందు నీవు  

భక్త రక్షణ కొఱకునై  భరణికి దిగి 

వత్తు వనుచును వింటిని భక్త వరద ! 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 78.


శాశ్వతంబులు గావేవి,శాశ్వతుండ  

వీవయే యీ చరాచర మిలను జుమ్ము

దెలిసి కొనలేక పోతిని  దెలివి లేమి 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 79.


మూడు గుణములు లేమికై మూడు మార్లు 

భవుని  చుట్టును దిరుగంగ  వలయుఁ జుమ్ము

మూడు కంటెను నెక్కువ   మొరకుఁ దనము

వంక పెట్టక  కాపాడు  ఫాల నేత్ర ! 80.


అమ్మ నాన్నలు వోయిరి యకట మాకు 

పోయి రక్కలు బావలు ముంచి వ్యధను 

నంత మందినిఁ బోఁగొట్ట న్యాయ మౌనె  

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 81.


గురుని బాధ్యత సంఘాన  గురు తరమ్ము 

భావి పౌరులఁ జేయును  భవ్యముగను 

ప్రధమ గురుడవు గనుకనే  ప్రగతి నిచ్చి 

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 82.


వ్యాస పూర్ణిమ నాఁడు నీ యాలయమున 

మాకు చేసిరి ఘనపు సన్మానము గద

శాలువను గప్పి  యచట నీ సమ్ముఖమున  

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 83.


వచ్చి  మిమ్ములఁ జూడగ , నచ్చ మైన  

కాంతి పుంజము గనబడెఁ గాంతి తోడఁ  

గన్ను లార్పకఁ జూచితి  గడియ సేపు 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 84.


మంచి చదువులు సదివిన  మాన్యుఁ డగును 

మంచి పనులను జేసిన మహితుఁ డగును 

మంచి యందున   నుండునా మహిమ  కనుక 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 85.


పొగరుఁ గలుగుచుఁ బెద్దలఁ బూతు లాడ 

పాప కూపమ్ముఁ జేరుచు  భద్ర ముగను 

వత్స రమ్ముల తరబడి  బాధ లొందుఁ 

గాన పాపము ల్సేయను గనికరించి  

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 86.


ఆడది యనగ సబల ,కాదబల యనుచుఁ 

జేసి చూపించె నీనాడు  జివరి వరకు  

నన్ని రంగాల యందుఁ దా నగుచు  మెలగి 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 87.


మా తృ మూర్తులు గొందఱు మమత లేమిఁ

బురిటి బిడ్దను గోతినఁ బూడ్చు చుండ 

బ్రహ్మ యటులనె వారికి  వ్రాసె ననుచు  

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 88.


వేడు చుంటిని పలుమార్లు విశ్వ నాథ!

శాంతి కాముకుఁ డనగుచు , శమన మిమ్ము 

పాద పూజను జేయుదుఁ బ్రతి దినమ్ము

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 89.


నీదు పాదాల చెంతన నెమ్మనమునఁ   

బద్య పుష్పాలఁ బెట్టుదు ఫాల నేత్ర!

దయను జూడుమ నాయందు  తప్ప కుండ 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 90.


వ్యావహారిక పదములు వాడు కొనుచు 

వ్రాసి యుండెను  నీ పైన ప్రముఖ కవియె 

శతక మను పేరఁ బద్యాలు స్వామి ! వింటె

వంక  పెట్టక  కాపాడు  ఫాల నేత్ర ! 91.


సర్వ జగమును బాలించు శక్తి యుతుఁడు 

సృష్టి   లయముల కాపాడు  చేవ  గలిగి  

మసన మందున నివసింప మంచి  యగునె  

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 92.


రాచి ఱంపాన బెట్టెడు రాక్షసులను 

మార్చ నీకు మాత్రము దగు  మఱవ కుండ 

మంచి మార్గముఁ జూపించి మాననీయ 

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 93.


నాగ భూషణ విశ్వేశ  నైక రూప 

పన్న గాశన  విష్ణుని ప్రాణ మిత్ర 

శీత నగమున నివసించు శ్రీ కరుండ 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 94.


సవతి పోరులు గలుగుట సహజ మిలను 

దాని మూలాన  పిల్లలు దైనిక మగు 

బ్రదుకునఁ బడకుండు నటుల  వారిఁ జూచి 

వంక పెట్టక  కాపాడు ఫాల నేత్ర 95.


ఙ్ఞాన వారాశి యైనట్టి చదువు లమ్మ  

యాశి సులు గలు గు  కతన  హ్లాద మిచ్చు  

పద్య కుసుమాలు   నీపైన  వ్రాయు చుంటి 

వంక పెట్టక  కాపాడు  ఫాల నేత్ర ! 96.


ఙ్ఞాన నేత్రము  తోడను గనుచు  నన్ను 

బంధ ముక్తునిఁ జేయుచుఁ బరము నిమ్ము 

చివరి సారిగ నినుఁ జేరు  సృతిని  నిచ్చి 

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 97.


నాగ భూషణా !మకుటాన నాగ ధారి! 

యుత్పలమ్ముల  హారమ్ము  నుత్సుకతన 

వేయఁ దలచితి  నీ యాఙ్ఞ  వేగ యిచ్చి 

వంక పెట్టక  కాపాడు  ఫాల నేత్ర ! 98.


బుద్ధి కుశలతఁ గలిగిన బోధకుండు 

వ్యక్త పఱచుట యందున వ్యర్థు డైన  

వాని పాండిత్య మే పాటి పనికి వచ్చు 

వంక పెట్టక కాపాడు  ఫాల నేత్ర ! 99.


వ్రాసి నటువంటి పద్యాలు  శ్రద్ధ తోడఁ

జదివి సరి యగు విధముగ  సవరణమ్ముఁ  

జేయు  తమ్మున  కిడుదు నాశిసుల మూట

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 100.


అమ్మ నాన్నలు పైనుండి  యాశిసు లిడ 

వ్రాయఁ గలిగితి  శతకమ్ము  బాగు గాను   

నంకితముగ నిడుదు వారి కాదరమున 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 101.


మాతృ మూర్తిని సేవింప  మహితుఁ డగును 

పితరుని యెడలఁ గల భక్తి విడుపు నిచ్చు 

గొప్ప వానిగఁ జేయును  గురుని సేవ 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 102.


శత్రు లార్గురు నొక్కటై  శక్తిఁ బీల్ప 

నీరసంబు జనించెను నిజము గాను 

బాఱఁదోలుచు నా నుండి  వడి వడిగను  

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 103.


ప్రేమ పెండ్లిండ్లు లోకానఁ బ్రియము తోడ 

చేసి కొనుచును విడిపోవు చేష్ట వలన 

భ్రష్టు పట్టెనుగ వివాహ  పద్ధతి యిల 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 104.


వావి వరుసలు లేకుండ వ్యవహరించు 

ప్రజల నే మన వలె నేమి  పాప మిదియ  

యేవగింపును గలిగించె నీ బ్రదుకులు  

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 105.


ఉబ్బు లింగడ వను మాట  యబ్బురమ్మె 

యింత వేడినఁ బద్యాల నిన్ని యిడిన  

నులుకు బలుకును లేకుండ నుంటి వైన 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 106.


వృద్ధ దంపతు లందరు విశ్వ విభుని 

యంశము లగుట వారిని నామతింతు 

భక్తి శ్రద్ధల తోడను భజనఁ జేసి 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 107.


పట్టు చీరను శోభిల్లు భద్రకాలి 

యాయు రారోగ్య సంపద లన్ని యిడుత  

శతక మీయది చదివిన చదువరులకు 

వంక పెట్టక కాపాడు ఫాల నేత్ర ! 108.

Thursday, July 28, 2022

నాగభూషణా శతకము

శ్రీల నొసంగు నీవకట చేరుట బ్రేతవనంబు  వాసిగా 

నేలకొ? చెప్పుమా వినగ  యీశ్వర !కాలుడ! కారణంబునున్ 

ఫాలము నందునన్ గలుగు భైరవ నేత్రపు మూలమేదియో 

చాలుదు నేర్పునన్ దెలుప శాంకరి నాధుడ! నాగభూషణా !......1


 శాస్త్రము వేదముల్  గనకె సాలె యు, సర్పము నాగజేంద్రుడున్  

శాస్త్రపు రీతిగా  వడసె సాకల్య మున్ గద  భక్తి గల్గుటన్ 

శాస్త్రము లేవియున్ గనక సాకుము నన్నును నెల్లవేళలన్ 

శాస్త్రము  వేదముల్ మఱియు శబ్దము రూపుడ!నాగ భూషణా !.....2

 సర్వము నీశ్వరా మయము సర్వులు దైవము గాఁ దలంచుచోఁ

బర్వ మిదే యటంచు నొక ప్రక్కకు నేగిరి సూర్యచంద్రులే  

యుర్విని జీవముం గలుగు  జీవుల భారము మోయుచున్న యో 

శర్వ !మమున్ దయన్ గనుమ శార్వరి నాధుడ!  నాగభూషణా!....3


కాశికిఁ బోయినట్టి కవి కాంక్షలు మిక్కుట మయ్యె నక్కటా

ఆశలు లేక యుండుటకు నాశను బోవుదు రెల్ల వారునున్

నీశ! విచిత్ర మిచ్చటను నీకవి కోరెను ధాన్య సంపదన్

లేశము కూడ లేదు మతి లీలగ మాత్రము  నాగ భూషణా !........4


పంతులె తప్పులం బలుకవచ్చని చెప్పెను పిల్లవాండ్రతో

వింతగ నుండె బాల !విన వీనుల కిప్పుడు పిల్ల వాండ్రతోఁ 

బంతులె సెప్పెనా రనుట పాడియె చెప్పుము పార్వతీ పతీ !

సుంతయు బుద్ధి లేని బహు చోద్యపు మానిసి   నాగ భూషణా !.......5

లోకులు గాకులే యనుచు లోకము కోడయి కూయు చుండగా 

నేలనొ వారిగూర్చి యిక యీరక మైన ప్రసంగమేలనో  

జాలును నాదురాత్ములను జాటున నుంచుదు వారి మాటలన్ 

బాలిసు మాటగాఁ దలతు భావము నందున  నాగభూషణా !.........6


బాధలఁ గల్గనీక యికఁ బ్రార్ధనఁ జేసెడు మానసంబునున్ 

బాధల నోర్చునట్టి  దగు వర్ష్మము  నీయుమ యెల్లవే ళలన్ 

బాధలు మంచివా రికిడ భావ్యమె  చింతఁ జేయగన్ 

బాధలు నాకిడన్ దగున? భక్తులఁ గాచెడు నాగభూషణా !....

.7

కుక్షిని నింపఁ గోరికను క్షుద్రపు పూజలు సేయుచుండుచున్  

రాక్షసు వోలెఁ గ్రూరముగ  ఱాళ్ళను బిండు విధంబు పాంథులన్ 

శిక్షగ వారియస్థికలు సీల్చుచు రక్తముఁ ద్రాగుచుండగా 

సాక్షిగ యుంటివే  యరయు సాదర మొప్పగ  నాగభూషణా !........8


: త్రాగుచు నెల్లవేళలను దాహతు మించగఁ గల్లుమద్యమున్ 

వాగుచు నుండునా కిరణు  వాగుడు కాయగఁ బ్రొద్దు నంతయున్  

భోగముగాగ దానుదలఁ బోయుచు మానడు నెప్పుడున్ సుమా 

తూగుచుఁ దోగుచున్ మసలు దూరక కావుమ నాగభూషణా !.......9


మానగ లేను  మోహమును  మానక జాలను గామవాంఛలున్ 

మానగ లేను క్రోధమును, మానగ సాధ్యమె రాగ వాసనల్ 

మానగలేను సానిచెలి మానగ సాధ్యముఁ గాదునాకికన్ 

మానుప జేయవే ,దయను  మాధవ  సఖ్యుడ నాగభూషణా !....10


ఉత్పల చంపకంబులను నొయ్యనఁ దెచ్చుదు నీదు పూజకై 

సత్పథ మీయగా వలయు సారస నేత్రము

లానతీయగా 

నుత్పల రేకులం దనరు చూపులు  గల్గిన మాత దీవనల్  

సత్పథ మిచ్చు గాకనుచు జాగృతి నీయుము  నాగభూషణా!..11



 త్రాగుచు నెల్లవేళలను దాహతు మించగఁ గల్లుమద్యమున్

వాగుచు నుండునేగదిల  వాగుడు కాయగఁ బ్రొద్దు నంతయున్

భోగముగాగ దానుదలఁ బోయుచు మానవుడెప్పుడున్ సుమా

తూగుచుఁ దోగుచున్ మిగులు  దోర్బలమంతయు  నాగభూషణా !....12


: రాగము మోహముల్ మదిని రాపిడిఁ జేయుచు సంచరించగా 

దాగిన శత్రులార్గురును దాంతము శాంతము లేమిపర్చగన్ 

రోగము లొక్కసారిగను రుగ్ణునిజేయగ ఁ జేతకానినై

గాగల గార్యముల్ భవుడ! కాంచగ వేడెద నాగభూషణా..13


 !...నమ్మక మెంచి చూడగను నాణ్యతయైనది యెల్లవారికిన్ 

నమ్మకమే జనాళినిల నల్గురి యందున గారవంబుగా 

సమ్మదమొందు నట్లుగను

జయ్యన జేయును గాదెయీభువిన్

నమ్మలకమ్మయౌ సతిని నాశిసులిమ్మను నాగభూషణా !....14


పొందిక లేక కొంచెమును బోకిరి వోలెను దిర్గుచుండగా 

నందరు వానినిన్ గసరి యారడి వెట్టగ ఖిన్నుడై వెసన్ 

నిందను ద్రిప్పికొట్టుటకు  నేర్చియు శాస్త్రము లన్నిచక్కగన్  

వంద వధానముల్ సలిపె బాగనఁ బౌరులు నాగభూషణా !...15


ఙ్ఞానముఁ బొందఁ గోరునెడ కాయము మీదను నాశవీడుచున్  

నేనను భావమున్ వదలి నిత్యము నీదగు నామమంత్రమున్ 

వేనకు వేలుగాఁ బలికి  వేసడి నొందగ జాలినొందుచున్ 

ఙ్ఙానము నీయ పూనుదువె  కల్మష హారుడ నాగభూషణా !...16ప

పట్టుదు నీదు పాదములు పట్టును వీడను నింకనెప్పుడున్ 

పట్టిన నిన్నుఁ బట్టవలెఁ బాముల మాదిరి యెల్లవేళలన్ 

పట్టపు రాణియాగిరిజ  ప్రాపును నిచ్చుదు లెమ్మనంగ ,నా 

పట్టును వీడి నీగురిచి ప్రార్ధనఁ జేయుదు నాగభూషణా !...17


నాదము నీవయై గరిమనాభిని జేరెను సున్నితంబుగాఁ  

బాదము లంటియుండుదును బావనుఁ డౌవను భావమొంద,నీ 

గాధలు నిత్యముంజదివి కాఁగల ప్రాప్తికి  సిద్ధమౌదు నా 

వేదనఁ దీర్చి మమ్ములను బేర్మిని గావుము నాగభూషణా !...18


పొందిక లేక  యగ్రజుఁడుఁ బోకిరి వోలెను దిర్గుచుండగా

నందరు వానినిన్ గసరి యారడి వెట్టగ ఖిన్నుడై వెసన్

నిందను ద్రిప్పికొట్టుటకు నేర్చియు శాస్త్రము లన్నిచక్కగన్

వంద వధానముల్ బుధులు బాగనఁ జేసెను నాగభూషణా!...19


నేనను భావమున్ దొలగ నిర్మల తేజము నావహించె నా 

మానస మందునన్ బలుక మాటలు వచ్చుట లేదు నాకిటన్

గానగ వచ్చితే చెపుమ కావగ మమ్ముల నోదయానిధీ ! 

మానక రమ్ముమా దయను మారుని సంహర !నాగభూషణా !...20


 ఇభమది మూర్ఖ భావమున నేరునఁ గ్రుంగగఁ గుంభి పట్టగా

విభుఁడగు నారసింహుని కివేగమె మ్రొక్కగఁ విష్ఞుఁ డంతటన్

నభయ మొసంగి చంపుటయె యన్నిఁటికంటెను మేటి ధర్మమౌ

ప్రభులను వారలెప్పుడును బాధితు పక్షమె నాగభూషణా !...21


చదువుము తండ్రి బాగుగను శాస్త్రము లన్నియు నేర్పు పెంపునన్ 

ననగను మొండి వైఖరిని నాదర మీయక  బాలు

డుండుచో  

మృదు మధురోక్తు లెన్నఁడును మేలొన గూర్చవు తిట్టఁగా వలెన్ 

నదియె సుమార్గ   మందునిక నాశ్రవమే యది నాగభూషణా!..22


 పుట్టుక నాటినుండియును బూజలు సేసిన వాడనైన నున్ 

గిట్టుట లేదు మోహములు గీడును జేయుట మానకుంటినే 

కట్టడిఁ జేయనైతినిక  క్రౌర్యపు చేష్టలు  మేలుపొంద,నీ 

చట్టుగఁ జేరదల్చితిని జాలిని జూడుమ నాగభూషణా !..23


పాదము లంటియుండుదును  బాపము లేవియు నంటనీకుమా  

పాదము లొత్తుచున్ దమిని బ్రార్ధనఁ జేయుదు బంధమీకుమా

పాదము రెంటినిన్ గడిగి  వాజముఁ జల్లుదు నౌదలంబునన్ 

నీదగు నిర్మలంబయిన నెమ్మిని నీయుమ నాగభూషణా !..24


మల్లెల మాలనున్ దినము మార్చుచు వేయగఁనిచ్చగింతు.నేఁ 

బల్లవి రాగమున్ నిపుడు పాడుచు హర్షము నొందజేయుదున్ 

మెల్లగ నీపదంబులను మెత్తగ నొత్తుచుఁ దుష్టిఁ జేయునన్ 

జల్లగఁ జూడుమా యికను శాంతినొసంగుచు నాగభూషణా !..25.


కోరను నిన్ను భోగములఁ గోరను శ్రీలను గోరనెప్పుడున్ 

దారల శీలమున్ మదిని, దానముఁ జేయుమ రాజ్యమంచు నేఁ 

గోరను దేవలోకమును గోరను నైహిక వాంఛలెన్నడున్ 

గోరుదు సామినీ పదముఁ గోరికఁ దీర్చుమ నాగభూషణా!...26


 కావుమ యంచు నాగజము  గైటభమర్దను గోరగా వెసన్  

నావనజాక్షు సోదరుఁడు నంబుజ నాభుఁడు విష్ణువే గదా 

కావగ వచ్చినచ్చటికి  కాచెను నాగజ రాజుప్రాణమున్ 

నావిధ మేననున్  మనుచు నాశనునుందునునాగభూషణా!..27


భారము గాఁ దలంచకను  బంధుగణంబును నెల్ల వేళ,నా 

వారిగ భావమందునిచి  బాధలు లేమిగఁ జేయుచున్ సదా 

వారలఁ జెంతనే మెలగి వారి సుఖంబులు నావిగా వెసన్ 

జేరగఁజేయుశక్తినిక శీఘ్రమె యిమ్ముము నాగభూషణా!...28


నమ్ముదు నామనంబున సనాతనులై మను బార్వతీశులన్ 

నమ్ముదు యోగమాయయుతుఁ నమ్ముదుఁ భాలనేత్రునిన్ 

నమ్ముదు సర్పభూషణుని నమ్ముదునంతయు నీవెయంచిలన్  

నమ్మక మియ్యదిన్  మనిచి నమ్ముము నన్నిక నాగభూషణా!..29


మేడలు మిద్దెలంచునిల మీరని యాస్తిని గూడఁ బెట్టి,వే 

గూడుచు లాభనష్టములు గుల్కుచు నీపద సేవనంబునే 

గాడినిఁ దప్పఁ జేసితిని గాగల కార్యము నేర్వనై తినే 

వేడుకగాఁదలంచకిది పెట్టుము భిక్షను నాగభూషణా!..30


మేలము లాడుచున్ నొకడు మీరని సంతస మొందగ బల్కెనిట్లుగా 

వాలికిఁ బుట్టె మారుతి నభశ్చరుఁడౌ రవి గాంచి మెచ్చఁగన్  

వాలికి సోదరుండగును భాస్కరుఁ డయ్యది నేర్వగా వలెన్  

మూలముఁ జూచినం దెలియు మొత్తము జూడుము  నాగభూషణా!..31


అమ్మను బెండ్లి యాడుటకు నాంక్షలు పెట్టితి వెన్నియో కదా 

యిమ్ముగ నుండె నీ కవియ? యేమనిఁ జెప్పుదు నీదు వైఖరిన్

నమ్మయె మూలమీ భువికి నమ్మయె కారణ భూతురాలు,మా

యమ్మకుఁ జెప్పుమా దయను నక్షరమిమ్మని నాగభూషణా!..32


మంచిగ నుండఁ గోరికను మార్పును జేయుదు నాదువర్తనన్ 

బంచుదు నాదు ప్రేమనిక బాధను గ్రుంకుచు నుండువారికిన్  

బంచుదు నాదు సంపదను బాధిత లోకము సంతసించగన్  

నెంచుదు నీదు నామమును నెల్లపుఁ డిచ్చట నాగభూషణా!33.


కానగ లేను నేనిపుడు కన్నులు గల్గియు నీదు రూపమున్ 

వీనులు పొందియున్ వినను వేమఱు చెప్పిన యెంతవారలున్

మేనది యెంత చెప్పినను మీరెను హద్దులు శాశ్వతంబుగా 

నేనను భావముందొలగె నిర్మల చిత్తుడ! నాగ భూషణా!..34


 దక్షుని యఙ్ఞమున్ గనగ  దక్షుని కూతురు నేగగా రతిన్ 

దక్షుఁడు నామెనున్ గసరి  తద్దయు ఁ గోపముఁ జేయగా వెసన్

శిక్షను జేయనౌ దునిమె చిత్రుఁడు వీరుఁడు వీరభద్రుఁడున్ 

రక్షణఁ జేయుమా ననిక రక్షకుఁ డీవెగ  నాగభూషణా!..35


వేదనఁ దీర్చువాడవని వేయి విధంబులఁగోరుచుండ,నా

వేదనఁ దీర్చవా? చెపుమ బేషరతున్నయిన న్ సదాశివా! 

పాదము రెంటినిన్ గడిగి పాద జలంబును జల్లుకొందు,నా 

వేదన నీవయే తగును వీడగఁ జేయగ నాగభూషణా!..36


తాతల యాస్తి లేదసలు తాహతు మించిన ఖర్చులాయెనే 

వేతన జీవి నౌట,యికఁ బెండ్లము బిడ్డల పోషణంబు నో 

తాతకుఁ సఖ్యుఁడౌ భవుడ! దారినిఁ జూపుము నాకునిత్తరిన్ 

ద్రాతవు నీవెగానబరిదానముఁ జేయుము నాగభూషణా!..37


కాలము మారెనంచనుచుఁ గాంతుని బేరునఁ బిల్చు పోఁ 

గాలము దాపురించెఁ గద కాలుడ!యేమిది దారుణంబు,మా

కాలము నందు మేమిటుల గాంచుట ,పిల్చుట  చేయలేదుగా 

నాలముఁ జేయకింకయిది యాపుము వేడెద నాగభూషణా!..38


యజ్ఞము లెల్ల లోకులకు హానినిఁ గూర్చుటకే తలంచినన్ 

విఙ్ఞత తోడి పల్కులవె? వీనుల కింపుగ లేవు చూడగన్ 

యఙ్ఞము లెల్ల లోకులకు నాయువుఁ బెంచును బండు పంటలున్ 

బ్రఙ్ఞయె గాదె రైతులది  భావిసుఖించగ  నాగభూషణా!..39


పెద్దల పుణ్యమున్ గలుగఁ బేర్మిని గల్గెను వ్రాయు కోరికల్ 

బద్యము  నీపయిన్ భవుడ! పండితు లందఱు మెచ్చురీతిగన్

హృద్యముగా రచించెదను నృత్యప్రియుండ !ర యంబునన్ రతిన్ 

పద్యము లన్నియున్ సరస భావము లొప్పగ నాగభూషణా !...40


చూచితి నీదు రూపమును  జూడ్కులు బర్వశ మౌవిధం బుగా 

జూచితి నాత్రిశూ లమును శోభను గూర్చగ నామనంబునున్  

జూచితి మూడుక న్నులను జూచు కొలందిని జూడఁ గోరికన్ 

చూచుదు నెల్లకాలమును  జొచ్చుము గుండెను నాగభూషణా!...41


పార్ధుని దెబ్బకున్మిగుల బాధను నొందిన వానివోలె యే 

యర్ధముఁ జెప్పఁ గోరుచును నట్లుగ నుంటివి? చెప్పఁ గోరెదన్ 

బార్ధున కిచ్చితీవి గద పాశుపతంబును హర్షమొందగాఁ 

బ్రార్ధన జేయుచుంటి నినుఁ బ్రాపును నీయుము నాగభూషణా!..42


 శ్రీశునిఁ జేరి యాగిరిజ సేమముఁ గాసగ మాక్రమించెగా

నీశునిఁగంఠమున్  దగఁఫ ణీంద్రుఁడుఁ జుట్టెను భక్తితోడనే 

గాశిని నుండుగంగ, సిగ  కందువఁ జేరెను సాదరంబుగా 

నాశను వేడుచుంటి నిను నాశ్రయ  మిమ్మని  నాగభూషణా!..43


 ఆర్యులు సెప్ప నమ్మితిని హాస్యము గాఁగని పించె నియ్యదిన్  

సూర్యుఁడు సైకిలెక్కఁ గని చొక్కముగా శశి నవ్వె మెచ్చుచున్

చౌర్యముఁ జేసిరే పటము  జాలును జెప్పుట యిట్టి మాటలన్ 

సూర్యుఁడు సోము లిద్దరును సోదర తుల్యులు నాగభూషణా!...44


 మౌనము నాబరంగు నిల మాటలు,చేష్టలు లేకయుండుటన్ 

మౌనము మూలమే ఋషులు మాన్యులె యౌటకు లోకమందునన్ 

మౌనము మూల కారణము ముక్తిని జెందుట కిజ్జగంబునన్ 

మౌనముఁ జెంది యుండుదును మోక్షము నీయవ? నాగభూషణా!..45


బ్రదుకఁ దలంచి  నేనిఁకను బండ్లను మాత్రమె భోజనంబుగాఁ

నుదయము సాయమున్నిక యూపిరి యుండెడు కాలమంతయున్ 

పదముల నంటి యుండుదును భానుని సాక్షిగ నమ్మ కంబుతో  

సదయను గావుమా యికను సన్ముని శేఖర! నాగభూషణా!..46


 కోరినఁ గోరకుండినను గోరిక లిచ్చెడు భూతనాథుఁడా! 

మీరిన సత్కృపాన మము మేదిని రక్షణఁ జేయుమా యికన్  

సారెకు సారెకున్ బ్రజల సంపద లన్నియు వృద్ధిఁ జేయుమా 

శారదమాత వల్లభుడ! చంద్రకళాధర! నాగభూషణా!...47


 తిరిపెముఁ జేయు చుండునట  దెల్లని యాకృతిఁ దాల్చువాడునై  

నిరవుగఁ బ్రేతభూమినట యేర్పడఁజేసెను వింతఁ గొల్పగాఁ 

బురములు మూఁడుఁ గూల్చగను భూమిని దేరుగ మేరుధన్వుగాఁ

 బోరును సల్పు ధీరుఁడవుగ బూచుల రాయుడ! నాగభూషణా!...48


మౌనము గల్గుమానవుఁడు   మాన్యత నొందును భూతలంబునన్ 

మౌనము భూషణంబగును మౌనము శాంతినిఁ గల్గ జేయునే 

మౌనముఁ జేతనే మునులు మన్ననఁ గాంచిరి మానసంబులన్ 

మౌనము నిమ్ము నాకునిక మౌనిగణాఢ్యుఁడ! నాగభూషణా!..49


 నీరస మొందిమూర్ఛిలిరి నీరజ నాభుని భక్తులందరున్ 

సారము లేని తిండిఁ దిని, శక్తి గడించిరి లోకులెల్లరున్ 

నారస రూపు శాంభవిని నాయత రీతిని వేడుకోవగాఁ 

గారణ భూతుఁ డౌ భవుడ! కాచితి వీవయె నాగభూషణా!...50


: అతులిత మాధురీయతన నాశువుఁ దోడను బద్యమల్లు భా 

సతనిట యీయఁగోరుదును శాంకరి నాథుఁడ! ముక్తి వాంఛతోఁ 

సతతము నీదు రూపమునె  శక్తికొలందినిఁ జూచు వాడనై  

గతమును జూడ నెప్పుడును గావుము నన్నిక నాగభూషణా!..51


 కంటికిఁ గానిపించునవి  ఖాయము గానిది గానెఱుంగుమా 

మంటికి యంకి తంబునగు, మాయయె యౌటను మాయమౌనుగా 

మింటను నుండు తారవలె,మేదినిఁ గన్బడ జాలవేవియున్  

గంటికి నీవుతప్పయిక కానరు స్తంభుడ! నాగభూషణా!...52


విశ్వము నంతనీ యునికి  వేదము సాక్షిగ రూప మౌటచేఁ

శశ్వ దలంకృతా మయము చక్షువు రెంటికిఁ జింతఁజేయగన్

నీశ్వరి దక్షిణమ్ముగల నీశుడ! యుగ్రుడ! లోకనాథుఁడా! 

విశ్వవి భుండవీవనుచుఁ బేర్మిని వేడెద నాగభూషణా!..53


శంకరుఁ డెత్తె నా కనకశైలము మాధవు వాంఛ దీరఁగన్  

శంకరు వాసమే యదియ శైలము, నెత్తుట యేమి? భావ్యమే 

శంకలు గల్గఁవారటులు  సందడిఁ జేయఁగఁ జిత్రమాయె,నీ

యంకము వీడ నెప్పుఁడును  నాశ్రిత రక్షక! నాగభూషణా!..54


అమ్మయు నాన్న బావలు సహాగతి యించిరి యేమిపాపమో 

యిమ్మహి నేమి జేసితిమొ? యేమిది శంకర! యక్కలిద్దరున్ 

నమ్మను జేరగావెడలె నాయువు దీరగ నేమి జెప్పుదున్  

నమ్మవు నాన్న వీవెయిక  నాశ్రయ మీయుము నాగభూషణా!..55


కోరను భాగ్య మెప్పుఁడును గోరను  నేనిను  ధాన్యసంపదన్ 

గోరను రాజ పీఠమును గోరను నెప్పుఁ డు  దేవలోకమున్   

గోరను  మోక్ష మీయుమని  గోరను సానుల పొందుని త్తరిన్  

గోరుదు నీదు సేవనముఁ

 గోరికఁ దీర్చుము  నాగభూషణా!..56


కంటిని మంచియౌ కలను గండ్లకు నింపును గూర్చెనత్తరిన్ 

మింటను దారకావళులు మేళముఁ జేయగ నృత్యలీలలన్ 

జంటగ మల్లికార్జునుఁడు సైతముఁ జేయగ నృత్యమంతలోఁ 

గంటికి మాయమయ్యె యది గాంచితి వెల్తురు నాగభూషణా!..57


కాంచితి లింగరూపమును  గాంచితిఁ శూలపు మూఁడు కోణముల్ 

గాంచితిఁ భాలనేత్రమును  గాంచితిఁ  గుండ్రని బానవ ట్టమున్   

గాంచితి మోముమధ్యమున  గైరవ వర్ణపు భస్మ రేఖలన్ 

గాంచఁగఁ బొంగిపో వమది గంతులు  వేసితి  నాగభూషణా!..58


భల్లునఁ దెల్లవారినది భామలు బిందెలు సంకనెత్తుకు 

న్బల్లవి పాడుకొంచు మఱి బావుల యొద్దకు నీరు తేవగా

నల్లది చూచి నాయెడద హ్లాదము నొందుచుఁ బర్వశించగాఁ 

మెల్లగ నొత్తఁ బాదములు మీదరిఁ జేరితి నాగభూషణా!..59


వరముని సేవితుండవయి బాధిత లోకము నార్తిఁ దీర్చు చున్ 

బరమ దురూహలం జెలఁ గు పాలసు లైఁజను వారినందరిన్ 

తరతమ భావముంగనక దండనఁ జేయుచు నుండు చేత నే 

వరమని నీదు పాదములు బట్టుదుఁ గావుము నాగభూషణా!..60


ఆలును బిడ్డలున్గలుగ హాయిగ నుండక వారితోడ,నీ 

వేలన? లింగరూపమున నిక్కడ యుంటివి? చెప్పుమా దయన్ 

గాలుని  గర్వమూడ్చగను,గాముని జంపగ నిట్లు మారితే? 

చాలను నిట్లు చూడగను జంద్రకళాధర! నాగభూషణా!..61


వాసుకిఁ ద్రాడుగా మలచి పాలసముద్రముఁ జిల్కనత్తరిన్ 

భాసుర మొప్పగా నమృత భాండముఁ గల్పవృక్షమున్ 

వాసిగఁగామధేనువిడ, బాయగ వచ్చిన గాలకూటమున్ 

దీసుకుఁ ద్రాగ భావ్యమునె? దీయగ నుండెనె? నాగభూషణా!..62


నిరతముఁ ద్రాగు చుండుచును నేర్వక మంచిని గోలఁజేయగాఁ 

బరువును బోయెనంచునిఁక భామిని వేదనఁ జెంది తానుగా

మరణముఁ గోరి వచ్చినది మానిని సూడఁగఁ బాధఁగల్గె నో 

పురహర!యామె కీయనగుఁ బూర్తిగ రక్షణ నాగభూషణా!..63


చేతిని బెట్టగాఁ దలను శీఘ్రము గానగు వేయిచెక్కలౌ 

భాతిని రాక్షసాధముఁడు భస్మున కీయగ  నీప్సితమ్ము ,నే 

రీతిని నిన్ను వేదనము రేగగ  జేసెనొ నూహఁజేసితే 

ఱాతిని నాతిగా మలచు రాముఁడు  నీవెగ నాగభూషణా!..64


సారెకు నీదు మంత్రమును సంతస మొందగఁ బాడు కొందు ,సా 

కారపు గొప్పరూపమును గన్నుల విందుగఁ జూచు కొందు,నే 

తీరుగు నైన  మోక్షమను దేరును నెక్కుట నిశ్చ యంబు ,నీ 

దారిని జూపు నీదరికి  దర్శన మిచ్చుచు నాగభూషణా!..65


ఒంటరి వాడుగాఁ బ్రదుకునుండుట  జేయుము  నాత్మ శాంతికిన్ 

బంటును వేడుచుంటినిను భాస్వర తేజుఁడ ! శ్యామ కంఠుఁడా! 

యంటుదు నీదు పాదముల నాశ్రిత రక్షక!  సాక తమ్మునౌ 

గంటిని జూడఁగో రుదును గల్మష హారుఁడ! నాగభూషణా!..66


భాగ్యము లెన్ని యుండినను బాధిత లోకము నాదరించకన్  

యోగ్యము కాని కోరికలు యూహకు రానివి యైన గోరుచున్ 

భాగ్యము లింకనుం బెరుగు వాసిత మార్గముఁ జూపు గోరికన్ 

యోగ్యుఁడ వంచు వచ్చు నెడ యోచనఁ జేయుము నాగభూషణా!..67


 కాలుని బారినుండితను గావుమటన్న మృకండు సూనునిన్ 

గాలయముండవై చనుచుఁ గాచితి వీవయె ప్రేమ మూర్తివై 

యాలయ మందె కాక యిఁక యంతట నుందువు పార్వతీశ! పూ

మాలలు దెచ్చి నీకిడుదు  మమ్ములఁ గావుము నాగభూషణా!..68


నాకము నందు దేవతల నాట్యము లెంతగ  హృద్య మైన భో 

నీకమనీయ తాండవము నీమధు రాకృతి ముందు సాటియే 

లోకము మర్చి చూచుదురు లోలత  నొందగ  భక్తు లందరున్  

నాకటువంటి దర్శనము నవ్వుచు నీయుము నాగభూషణా!..69



విద్దెలు నేర్చుగా, మొదట విఘ్నము లేవియు  లేక యుండనౌ 

దద్దయుఁ బూజఁజేతురిల దప్పిద మంతయు మాన్చి, మమ్ములన్  

బెద్దమ నంబుతో ననుచు వేడుదు రెల్లరు నీ కుమారునున్ 

గద్దఱి యంచుఁ ,గావున నగాధిప!  కావుము నాగభూషణా!..70



మూగగ మారె నా మనము మూసిన పుస్తక మా యనంగ ,నో 

యాగమ శాస్త్రరూపుఁడ!  యయాచిత  సంపద లిచ్చువాడవై 

మాగమ నంబు నీ దరికి  మారగఁ జేయుమ యెల్లవేళలన్  

వేగమె మిమ్ముఁ జే రుటకు వేడెద నిప్పుఁడె నాగ భూషణా!..71


ముక్తినిఁ బొందఁ గోరునెడ  విషయ  మోహముఁ జెందక  యెల్ల వేళలన్  

శక్తిని భక్తిపూ ర్వకము,సల్పఁగఁ బూజను హర్ష మొంది,దా 

రక్తినిఁ జేరదీ సితన రమ్యపు హస్తము  మస్త కంబు నన్  

ముక్తిని బొందు గాకనుచు మోదము తోడను బెట్టుఁ బ్రీతితోన్ 

ముక్తిని బొంద మార్గమిది  మోహన రూపుఁడ!  నాగ భూషణా!..72


చంపక మాలలో నునిచి సంపగి మల్లెలు నుత్పలంబు తోఁ 

నింపుగఁ జేతుఁబూజనిక యీశ్వర కాదన కుండ యుండు,నీ 

పంపునఁ జేయుచుంటి యిటు వంకలు బెట్టక యుండు మాదయం 

గెంపులు వజ్రముల్ మణులు గేలుకు దొడ్గుదు నాగ భూషణా!..73


 జగతికి నీవె మూలమని సల్పగఁ బూజలు,సూచు చుంటివా 

పగతుని వోలె యెందుకిటు పాపముఁ జేసితె? పూజఁజేసి,నా 

వగపులు దీర్చుమాదయను  భారము నీదని నమ్మి యుంటి సూ

సుగతినిఁ గల్గఁజేయుమిక  సూనృత పాలన! నాగభూషణా!..74


చూచితి సామి నేనిపుఁడు చూడ్కులు నిండుగ నీదు మోమునుం 

జూచితి గాదెచి ర్నగవుఁ జూచిన వెంటనె సంత సంబునం 

జాచితి నాదు చేతులను  సాదర మొప్పగ నిన్ను వేడనై

బ్రోచగ  రాగదే  యిపుఁడ బూచుల రాయడ! నాగ భూషణా!..75



చేసితిఁ బాపకార్యములు సేసితి దుర్జన వాస మిత్తఱిం 

జేసితి నేరముల్ మిగుల  చేతన బుద్ధిని జింతఁ జేయకం 

జేసితి నన్యదైవముల జేరిభ జించెడు వారి పొందు,నేఁ 

జేసిన దప్పునీ హృదిని జేరగ నీయకు  నాగభూషణా!..76


త్రాగుదు నీకథామృతముఁ ద్రాగుదు  నీపద కంజ వారినిం 

ద్రాగుదు నీదునా మ మహి తారస  సారము నెల్ల వేళలం 

ద్రాగుదుఁ ద్రాగి దూలుదును  దన్మయ మొందుచు నాట్య భంగిమన్ 

వేగమెఁజేర నీదరికిఁ బ్రేమను జేర్చుకొ నాగభూషణా!..77


ఏలయు పేక్ష నేననిన ,నెందుల కిట్లుగ  ,నన్నుఁ జూడ నీ 

వేలన ?నేహ్య భావమున నెంతగ వేడిన జాలిఁ జూపకం 

గాలుని వోలె నిర్దయను గాంక్షను దీర్చను మొండికేతువా? 

చాలిక  నీయుపేక్ష  మరు జన్మము నీయకు నాగ భూషణా!..78


కాలము లెన్నియుం డినను గాసుల నార్జన యక్ర మంబుగాఁ 

బాలన మూలముం బ్రభులు  పాల్పడు చుండుట కారణంబు నౌ 

కాలములందు మేటి కలికాలమె యంచు వచింత్రు పండితుల్ 

బాలనఁ జేయఁగాఁ దగునె  పాలసుఁ  డక్కట నాగభూషణా!..79


వాసన లేని పూవువలె  వమ్ముగ  నాయెను  నాదు పద్యముల్ 

వ్రాసిన వన్నిపోయినవి బాధమి గుల్చుచు నైన నాదు పే

రాస ను  వ్రాయఁబూనితిని రంజిలు నట్లుగఁ జేయుమా దయం 

గాసి నివాస !భార్గవుఁడ! కల్మష కంఠుడ! నాగభూషణా!..80


వరముగ నాయె నీకు ధర బండిగ మేరువు నాయె విల్లుగా 

పరువము గల్గునాతఁడగు బ్రహ్మయు సారధి యాయె,విష్ణుఁడుం 

శరముగ మారె, యగ్నియును శల్యపు సూదిగ మారె గాదె సూ

యరయగఁదారకాసుతులహత్యకు బీజము  నాగభూషణా!..81


చదువును బెద్దగాఁ జదువ జాలక పోతిని బొట్ట కూటికైఁ 

జదివితిఁ గొద్దిపాటిగను సంస్కృత  భాషను దెల్గు భాషనుం 

బదుగురి కీయగాఁ దలచి  పాఠన రూపున నో దయామయా!  

తదనుగుణంపు సారమును దప్పక యీయుము నాగభూషణా!..82



ఞ కవనముఁ జేయు వారలకుఁ గావలె మందు పదా ర్ధము లందు చేతనే 

కవివరుఁ డెల్లవారు గనఁగా వడిఁ జొచ్చెను గల్లుపాకలో  

దివమును ఱేయి యంతయును దృప్తిగఁ ద్రాగుచు  నుండు వార లీ 

యవనికిఁజీడ పుర్వులిల యంత్రణ  మీయవె? నాభూషణా!..8

3

కలతలురేపు దుష్టులను,గాపురుషాదుల చేష్ట,శత్రుమూ

కలను,సహింపగావలయు గాపురమందభివృద్ధి,గోరినన్

గలతలులేని గాపురము గాంచును వృద్ధిని నెల్లవేళలన్

గలనున సైతమున్ వలదు కర్కశరూపము నాగ భూషణా!..8

4

హీనపు వానిగా మసలి హేయపు జీవిత మొందనౌనుగా

మానక మాతృభాష నవమాన మొనర్చెడివాడె,మాన్యుడౌ

మానవు డెల్లవేళలను మంచిగ నుండుచు బీదసాదకున్

దానయి పెద్దదిక్కుగను ధార్మికదృష్టిని  నాగభూషణా!..85


 హృద్యముగాకభావమునునేరికినర్ధముగానియట్టుగా

పద్యమువ్రాయబూనుటయెపాపముద్రోహముమానుకొమ్మికన్

పద్యమువ్రాయగావలయుప్రాసయుతంబుగ,లక్షణాలతోన్

చోద్యముగాదెపండితులుసూచనలిచ్చుట నాగ భూషణా!,,86


వినుమురభార తంబునిల వేయిరకంబులుగా రచించినన్

వినదగునట్లుగాసరగు వీనులకింపుగనుండు నందుచే 

ననయము బాల బాలికలు హర్షము ,నార్ద్రత గల్గి విన్నచో

గనుదురు మోక్షముం దుదిని  గాలునిఁగాదని నాగభూషణా!..8

7

వారము వారముంగుడిని భక్తులు సేసెడు వేదమంత్ర మోం 

కారము తీయనై సుఖముగా మురిపించెను భక్తబృందమున్  

భారము గాఁ దలంచక ను భారతి   తీర్ధుల దివ్య  బోధనా 

సారము నంతయుంగలిపి  సాకృతిఁ జేయుదు నాగభూషణా!..88


వంకలు జూడగా దొరకు వందలువేలుగ నిజ్జగంబునన్

శంకను నొందుచున్ మనక సర్దుకు బోయిన హాయిగల్గుగా

శంకల బాటలోనడువ శక్తివిహీనులె యౌదురెప్పుడున్

శంకలు లేనివాడు సరసంబునెఱుంగును   నాగభూషణా!..89


ణూచూరగొనంగ మానసము చోద్యము నాకపుభామరంభయా

కారము గాంచినంతనె వికారము గాంతురు మౌనిపుంగవుల్

పారము నొందియున్ మునులు భ్రష్టులు నౌటకు కామవాంఛయే

కారణమౌట జూడ,విను గామము చెడ్డది నాగభూషణా!..90


ఘనమగు తేజముం గలిగి కైకకు మ్రొక్కియు గౌరవమ్ముతో 

ననుమతి నీయగా జనని హర్షము తోడను సీత తోడుతన్ 

వనమున వాస ముండుటకుఁ బార్థివ పుంగవు కాంక్ష మేరకున్ 

వినయ మనస్కుడై చనెను బ్రీతిని జూచితె నాగభూషణా!..91


పలువిధ పాపకార్యముల బాధితుఁ జేయగ బూనువాడిలం

దలపఁగ గ్రూరుడౌను,గురుదక్షిణ నిచ్చెడువాడు నమ్ముమా

యిలనజరామరంబగుచు నెల్లెడగారవమొందుచుండుచుం

బలువురిచేత మన్ననల వాసిగడించును  నాగభూషణా!..92


 అరమరి కల్ గనంగకను నర్హత కానటువంటి వారికిన్

విరివిగ నిచ్చుచుంటివిల వేలకువేలు వరంబు లొక్కెడన్

ఖరులగు వారలెప్పుడును కర్కశ వృత్తిని జేటు జేతురే

వరములనిచ్చి దుష్టులకు వాసిగ డింతువె? నాగభూషణా!..93


 దురితము లెల్లఁబోవుగద దోచిన సొమ్ముల వేయ హుండిలో

నరయగఁ గొంతపాపమది యాక్షణమందున బోవు నందురే 

యిరవుగ మంచికార్యమున కిచ్చుచు ఖర్చునుబెట్టగల్గుచోఁ

గరమును సంతసించుచును గాంక్షలు దీర్తువు  నాగభూషణా!..94


పెంపనుఁ దల్లివై శ్రవణ పేయపు నామము నుచ్చరించ ర 

క్షింపను దండ్రివై యొడలఁ జిక్కిన  రోగముల్ ని వా 

రింపను వెజ్జువై దయ గు రించి వరంబు ది రంబు గాఁగ స 

త్సంపద లీయుమా 

కృపను సాంబశి వా!హర! నాగభూషణా!..95


తప్పు లెఱుంగలేక దురితంబులు సేసితినంటి,నిన్ను నే 

గొప్పవ రాల దాతవని గోరుచు నుంటిని ముక్తి ధామమున్ 

దప్పుగ నాదలంచకను  దాల్మిని జూపుచు నెల్లవేళ లం 

దిప్పలు లేని చందమున  దీర్చుము కోరిక నాగభూషణా!..96


 నిలయముఁగల్గి యుండియును నెవ్వగ లేవియు లేకయుండి,రూ 

కలు గలవాఁడె రాజు కలికాలములోనఁ దలంచి చూచినం 

బలువురి నోటి యందిదియె పల్కగ వింటిని  బెక్కు మార్లుగా 

కలుఁగుట సంపదల్ భువిని గారకుఁడీవయె  నాగభూషణా!..97


 నేటికిఁ దీరె నావరము నిక్కము గానని సంతసించి,స 

య్యాటల నాడ బూని  నొయారపు మాటల  నిన్ను జేరగన్ 

మాటికి మాటి కిన్మదికి మక్కువ  హెచ్చెను  కాలకంధరా! 

సూటిగఁ జూచి నాముఖము  శూన్యముఁ జేయుము  నాగభూషణా!..98



కోపము మాని నా యెడలఁ గూర్మిని జల్లని జూపు వెన్నెలల్ 

నాపయిఁ జల్లుమా దయను నమ్మితి సర్వము నీవయంచు నో 

దాపస వర్య! నాకిడుమ దానముఁ జేయఁగ బుద్ధిని,  నెల్ల వేళలం 

బ్రాపును  బ్రోపునున్ శమముఁ బాయక యీయుము నాగభూషణా!..99


వందలు మించి నీపయిని  వ్రాసితిఁ బద్యము  లైనఁ జెప్పు  నీ 

వెందుల కిట్లు మౌనముగ , నేమరు పాటున నుంటి వోశివా! 

యందరి వంటి భక్తుఁడను నాశను నుంటిని రక్షఁ జేయుమా 

వందలు వేలుగా నతులు భక్తిని జేయుదు నాగభూషణా!..100


అల్లన బేరరా జునకు నగ్రపు బుత్రుని గాజనించి  నీ 

యుల్లము సంతసింపఁగను నుత్పల చంపక మాలతో జనం  

బెల్లరు హాయనంగ రచి యించితి  రక్తిని గల్గి నీపయిం 

దెల్లని దేహముం గలుగు దేవర! శంకర! నాగభూషణా!..101


గోకుల మందు గోపికలు గొల్వగఁ గృష్ణుని బ్రేమ తోడుతన్ 

వ్యాకుల భావముంగలిగి వైకృత చేష్టలు సేయు చుండు నా

పోకిరి వారు కొందరట పూర్తిగ మత్తున నుండి పేలగా 

సాకుట న్యాయమా చెపుమ  శాంకరి నాథుఁడ నాగభూషణా!..102


 అమ్మగు శారద కరుణన 

నిమ్ముగ నే వ్రాసినట్టి యీశతకము మా 

యమ్మకు నంకిత మీయుదు 

నెమ్మనమునఁ జెప్పు చుంటి  నిక్కము సుమ్మీ .


రాముఁడు రాక్షసప్రభువు రావణుఁడే పురుషోత్తముం డిలన్  

రాముని గూర్చి యట్లుడువ రాక్షసు లై జని యించు దప్పకన్ 

రాముడు లోకరక్షకుఁడు రాజిలు  మోమున నొప్పు వాడునై  

దామహి తాత్ముఁడౌ భువిని దాశరధే గద నాగభూషణా!..103




 దేహము పైన మోహమును దీరిన పిమ్మట గీత పైని వ్యా 

మోహము, మోక్షకారణము మోదముఁ గూర్చును సజ్జనాళికిన్ 

సాహస కార్య మే యగును సద్గురు సేవన ముండు చోనగున్ 

మోహము పాప పంకిలము మూర్ఖునిఁ జేయును  నాగభూషణా!..104



: సానికి మ్రొక్కి పత్నికి విషంబిడు టొప్పు వివేకశీలికిన్  

మానుట యొప్పు మ్రొక్కుటలు మంచిది కాదది మెచ్చ రెవ్వరున్  

గానగ వచ్చునే యరయ కాంతకు నీయగఁ గాలకూటమున్ 

సానులఁ మార్చగా వలయు సాధ్వుల వోలెను  నాగభూషణా!..105



మారడు గాక మారఁడిక మాపులు రేపులె యెన్ని వచ్చినన్  

వారక వారకామినుల వద్దకుఁ జేరెడివాఁడు ,విజ్ఞుఁడౌ  

కారణ భూతుఁడౌచునిల గాఁగల జన్మకు నాందిఁ బల్కనౌ 

భూరిగ దానధర్మములు బ్రీతిని జేయఁగ నాగభూషణా!..106


సత్యముఁ బల్క నాపద లసత్యముఁ బల్కిన మేలు గల్గెడిన్  

సత్యముఁ బల్కఁ గాఁదలచి చప్పునఁ బల్కిరి తారుమారుగా 

నిత్యము వారు సత్యమును నిండుమనంబున బల్కువారలై 

భృత్యులు  సైతమున్ బలుకు వీలుగఁ జేయును నాగభూషణా!..107