ధరణిన్ గొలుతును నిన్ను దాపసి వర్యా!
స్ధిరమౌ కలిమిని నిమ్ము చేతన రూపా!
వరదా! శుభకర! నందివాహన! శంభూ!
పురశాసనుఁడ! మహేశ! భో పరమేశా!
భువనంబునకు గిరీశ! పూజ్యుఁడ వీవే
భవ బంధములను బాపి పారము నిమ్మా
భవహారి శివ! మహేశ! పాపవిదూరా!
శివ మౌను నిను నుతింప శ్రీ పరమేశా!
శివరాత్రి దినము నందుఁ జేయుదు నింకన్
భవ పూజలను మహేశ! భక్తిని నింపౌ
శివముల్ విరివిగ నీయ సేమము గల్గున్
శివ! భార్గవి పతిదేవ! శ్రీ పరమేశా!
కనులార నిను సతీశ! కాంచఁగ నిమ్మా
వినఁగన్ నుడులను మంచి వీనుల నిమ్మా
మనమున్ వెతలకు దూర ముంచుమ ప్రీతిన్
విని నా మొఱలను గావు వే పరమేశా!
గతి కానక యిట నుంటిఁ గావుమ శర్వా!
మతియున్ గడచెను నేమి మాటలు రావే!
మతినిన్ గతిని నొసంగు మాటను నిమ్మా
సతమున్ గొలుతును ని న్బసం బరమేశా!
No comments:
Post a Comment