Friday, April 30, 2021

జింకలు దినెబొలసు,గడ్డిసింహము మేసెన్

 వెంకాయమ్మయె యిట్లనె

జింకలు దినెబొలసు,గడ్డిసింహము మేసెన్

వంకర నోరును గలుగుట

జంకనునదిలేక పలికె జతురత లేమిన్

 అనయము ద్రాగుచుండియును నందఱి బంధుజనంబు సాక్షిగా

చనువునునుండు వానివలె శారదచేతిని ముద్దువెట్టగా

దనదగు భార్య హస్తమును సోకుట కోర్చుకొనంగ లేకనే

దనయుడు చెప్పుతీసికొని తండ్రిని కొట్టెను దప్పుగాదులే

Thursday, April 29, 2021

కొడుకుతండ్రిని,జెప్పుతోగొట్టె సరియె

 ఆశిసుల నిమ్మనిదనకు నడిగెనార్య!

కొడుకుతండ్రిని,జెప్పుతోగొట్టె సరియె

తనదు భార్యజో లికివచ్చు దమ్మునపుడు

స్వార్ధమనునది వదలదు బంధువులను

ఏడవ,భర్తకలిగినపుడేకద సాధ్వికిగౌరవంబిలన్

 వీడక యాకరోన నిల వేలకొలందిజ నంబులే జనన్

బాడుకరోన వచ్చి మాబ్రదుకు బాధలొనర్చెను నంచు భామినుల్

యేడవ,భర్తకలిగినపుడేకద సాధ్వికిగౌరవంబిలన్

వేడుకొనంగమేలు బ్రజ వీడగ బాధలురామునిన్ నికన్

ఏడవ పతియున్నసాధ్వికేగౌరవమౌ

 వీడక కరోన జనులను

నేడును నాడును బ్రబలుచు నెఱి బాధించన్

వేడుచు రాముని నాసతి

యేడవ పతియున్నసాధ్వికేగౌరవమౌ

Tuesday, April 27, 2021

సైంధవుడు,గౌరవరాజ సైన్యమడచె

సింధు దేశపు రాజుగా శ్రేణికెక్కె
సైంధవుడు,గౌరవరాజ సైన్యమడచె
యుద్ధరంగాన ఫల్గుణు డొక్కగుణిని
పాఱి పోవగ జేసెను భయముతోడ

జనవంద్యుండగు సైంధవుండు, గురురాట్సైన్యాతకుండైచనెన్

జననింద్యుండగు వానినెట్లిటనగనీచౌమాట సాకారమే
జనవంద్యుండగు సైంధవుండు, గురురాట్సైన్యాతకుండైచనెన్
గనుడో ఫల్గుణుడాయనిన్ నొకడ దాగాలించి యాచోటులన్
మనమున్ బొంగగ దీర్గుచున్ గనీయె సన్మానంబు జేయంగగా

Monday, April 26, 2021

జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్

 కనుమా రాఘవ!నీదురూపమును దాకళ్ళారజూడంగనౌ

జననంబుల్ మరణంబులన్నవి గడున్ స్వల్పంబులౌ నంశముల్

మననన్ జేయగ నీదునామమును బల్మాఱుల్ దమిన్ శ్రద్ధతో

మనగన్ జక్కటి యాయువున్ నిడుట రామానీ కుసింగారమే

జనన మరణమ్ము లల్ప వి షయము లగును

 ఆత్మ పరమాత్మ లొకటిగ నగుట వలన

నేను నేనను భావమ్ము దానువీడి

మోక్షధామము నేగిన మౌనికియిల

జనన మరణమ్ము లల్ప వి షయము లగును

Sunday, April 25, 2021

వాడల వాడలం దిరుగు వాడలరున్ సుగుణాభిరాముడై

పాడుచు రామకీర్తనలు వక్త్రము నిండుగ నార్తినొందుచున్
వాడల వాడలం దిరుగు వాడలరున్ సుగుణాభిరాముడై
వాడును వీడునున్ ననక వాలినభక్తిని నెందఱేనియున్
వాడలవాడలం దిరిగి భక్తజ నాళిని బ్రోత్సహించనౌ

వాడవాడల దిరిగెడు వాడె సుగుణి

మాయదారి కరోనను మట్టి గఱుప
రామ భజనను జేయుచు రహిజెలంగ
వాడవాడల దిరిగెడు వాడె సుగుణి
పాలు బంచుకొనుడు మీరు భజనయందు

షోడశ సత్కళల్ గలుగుసూర్యునకేనొనరింతు సంస్తుతుల్

 వీడని శ్రద్ధతో విభుడు పేర్మినివిద్యల నభ్యసించ నా

షోడశ సత్కళల్ గలుగుసూర్యునకేనొనరింతు సంస్తుతుల్

గూడును బట్టలన్ సతము గోరినవారికి యిచ్చువాడునున్ బోడిమి రూపుగల్గు వరభూపతి,రాముని కౌదలించెదన్ 

Saturday, April 24, 2021

షోడశ కళ లున్న,రవికి స్తుతులొన రింతున్

పోడిమితో వెలుగొందును
షోడశ కళ లున్న,రవికి స్తుతులొన రింతున్
నాడుచు బాడుచు చదువుచు
వీడక నామంబు లెపుడు వేడుకజేతున్

రాాఘవోదాాాహరణము

 డొంకరాయి రాఘవోదాహరణము 

ప్రణీతము: పోచిరాజు సుబ్బారావు. 



ప్రథమా విభక్తి:

ఉ.

రాముఁడు డొంకరాయి యను గ్రామపు సాధుజ నావన వ్రతో

ద్దాముఁడు ఘోర పాతక విదారుఁడు సద్గుణ భూషితుండు దా

నీ మహి రక్షకుండు పరమేశుఁడు కాచును జీవ రాశినిం 

బ్రేమ మయూఖుఁడై ప్రజల బిడ్డల వోలెను జూచు నిత్యమున్ 1.

కళిక. (తురగవల్గన రగడ)

కొండ కొండ నడుమ గలుగు గుంట లోన నుండు వాఁడు

నండ పిండములను దాను నిండి మిగుల నలరు వాఁడు

తల్లిదండ్రుల యెడ భక్తిఁ దద్ద నిల్పి మెలఁగు వాఁడు

నెల్ల జనులఁ బ్రేమ తోడ నుల్ల మలర జూచువాఁడు

తనదు తమ్ము లనినఁ బ్రేమ  దర్పములను నొందు వాఁడు

వినయ గౌరవముల  నాభరణము లనఁగఁ  బఱఁగు వాఁడు

శత్రువులకు జడల మెకపు  స్వప్నమై చెలంగు వాఁడు

మిత్ర బృందములకు నభయ పత్ర మిచ్చి సాఁకువాఁడు 2.

ఉత్కళిక.

సత్య వాక్కె యెల్లరకును  

నిత్య భూషణం బనుచును 

బలుక కుండ దా ననృతము  

కలను సైత ముంచి నిజము

మనుజ జన్మ మెత్తి ప్రజకు  

మనుగడ యవగతము కొఱకు

శిష్ట రక్షకుండు వాఁడు 

దుష్ట శిక్ష కుండు ఱేఁడు 3.

ద్వితీయా విభక్తి:

ఉ.

రాముని రావణాంతకుని రమ్య శరీరుని దీర్ఘ బాహునిన్ 

మామక పాతకంబులను మాన్చెడు వానిని ,భద్రరూపునిన్ 

దామర తంపరల్ సిరుల ధార్మిక వృత్తిని నిచ్చు వానినిన్ 

బ్రేమను గొల్వఁగా నగును భీకర యుద్ధ విశారదున్ హరిన్ 4.

కళిక. (తురగవల్గన రగడ)

కొండ శిఖర మందుఁ దనర గుట్టు గాను వెలయు వాని 

భండనంబు నందుఁ దలల  ఖండనమ్ము సేయువాని

జాన కమ్మ తోడఁ బెండ్లి జరుపు కొన్న యట్టి వాని

వేనవేలు రక్కసులను బీనుగులుగ జేయు వాని

శరణు సొచ్చువారి నెపుడు జక్కఁ జేసి పంపు వాని

నరుల మధ్య నొకఁడె దాన యై పరులను జంపు వాని

తల్లిదండ్రుల నెపుడు దన  యుల్ల మలర చూచు వాని

నెల్ల వేళల భజి యింతు  నుల్ల మలర నేను వాని 5.

ఉత్కళిక.

ఊరు వారి కీయ సిరులు

వారి నడతకు ఫలితములు

కార్య దక్షత గల వాఁడు

నార్యు లనిన బేర్మి వాఁడు 

భక్త జనులఁ బ్రోచు వాఁడు

రక్తి గలుగు నెడఁద వాఁడు

సేవ జేయుదుఁ దమి వాని 

పావ నుండు హనుమ ఱేని 6.

తృతీయా విభక్తి:

ఉ.

ఎవ్వని చేత నీ పుడమి యింతగ నాయెను బాడి పంటచే 

నెవ్వని చేత రావణుఁడె యీల్గెను ఘోర రణాంగణమ్ములో

నెవ్వని చేత రాయి యిల నింతిగ మారెనొ నట్టి వానిచే 

నవ్వర డొంకరాయి దగు నాదర మందెను గీర్తి రాముచే 7.

కళిక. (ద్విరదగతి రగడ)

శిల మారె నెవరిచే సేతు వట నెవరిచేఁ 

గలిగె భద్రమ్ముగా  విలు విఱిఁగె నెవరిచే 

రఘుకులం బెవనిచే రంజిల్లె నతనిచే 

నఘము లెవ్వానిచే నంతమగు వానిచే

భిక్షపతి నెవ్వాఁడు బ్రేమించు వానిచే 

రక్షణమ వానిచే శిక్షణమ యతనిచే 

డొంకరాయి శుభమ్ము బింకమౌ ఱేనిచే 

వంక గాదులె నిజము భద్రేశు రాముచే 8.

ఉత్కళిక.

మూల మూలల గుడులఁ  

గోలాహలము జనుల 

సిరు లీయ సతతమ్ము 

విరివిగా నటఁ జుమ్ము  

సెలయేరు ఫణి పాఱ 

శిల వెంబడినిఁ బాఱ 

వంక గన దతనిచే 

డొంక రాయి హరిచే 9.

చతుర్థీ విభక్తి:

ఉ.

రాముఁడు లోక పావనుఁడు రాక్షస మూకల దీర్ఘనిద్రకై  

నీమము దప్పకుండు గుణ నేతగ భక్తులు నమ్ము కొంటకై 

బాములు దీర్చు నేతగను భావి తరాలకు నుండు కోర్కికై 

రాముడు డొంకరాయి నిలఁ బ్రాభవ మందెను భక్త కోటికై 10.

కళిక. (వృషభగతి రగడ)

లక్ష తులసి దళముల నర్చనల నొనరింపఁగ రాఘవునకై 

భక్షణంబులు జనుల కీయఁగ శిక్షకులు గలరు రఘుపతికై 

యేట యేటను బెండ్లి సేయఁగ మేటి పౌరులు సీత పతికై

మూట మూటల నీయగ జనులు సాటి వారలు మెచ్చఁ బతికై

చైత్ర మాసము నందు పండుగ  చిత్ర రీతి జరుగ నతనికై 

చిత్ర మైనవి పిండి వంటలు  సేసి యీయగఁ బ్రీతి హరికై

డొంకరాయి విభుఁ గొని యాడుదు రంకిత హృదుల దాశరథికై 

బొంకు లాడరు రాఘవునకై పూర్ణ దృష్టి నునుతు రతనికై 11.

ఉత్కళిక.

చేర రమ్మని యీయఁ దనకై

నార బట్టలు గట్టి సతి కై

క నుడువంగ విని త్వరితము కై

కొని వ్రతము నేగంగ వని కై 

తవ మెఱుంగని సీత వనికే

కవియ ననుజుఁడు రాఁగ  జతకే

డొంక రాయి వెలసెను హరికై

కంకణమ్ములిడు రఘుపతికై 12.

పంచమీ విభక్తి:

ఉ.

దశరధ సూను కంటె నిల ధార్మికుఁ డెవ్వడు గాన రాఁడుగా

దశ దిశ లెన్ని జూచినను దద్దయు నీవల నావలన్ ధరన్ 

దశరధ రామునిం గొలువఁ దారక రాముఁ డొసంగు సంపదల్  

దిశ లవి మ్రోగు మావలన దేవుని డొంకశిలేశు పాటలన్ 13.

కళిక. (హంసగతి రగడ)

కలుగు సౌఖ్యమ్ము లే కాంతు వలన

నిలను మోదమ్ములే యీశు వలన

బరఁగు మోక్షమ్ము నెవ్వానివలన

వర భోగ రాశు లెవ్వానివలన

పరభక్తి కలుగు నెవ్వానివలన

వరముక్తి వచ్చు నెవ్వానివలన

శంక లే కడరు నా స్వామి వలన 

డొంకరాయి హరిప్రియాంకు వలన    14.

ఉత్కళిక.

బద్ధ హృదయమ్ము । శుద్ధ భావమ్ము  

నిద్ధ చరితమ్ము । విద్ధ తేజమ్ము

భక్తి గరిమమ్ము । రక్తి నాశమ్ము

డొంకశిల వలన । సంకువహుని వలన 15.

షష్ఠీ విభక్తి:

ఉ.

రాముఁడు జానకీ విభుఁడు రమ్య గుణుండును శ్యామలాంగుఁడున్ 

దామస దూరుఁడై పుడమిఁ దద్దయు వెల్గిన వానికిన్ మహా

ధామము తోడ భాసిలుచు ధార్మిక చింతన గల్గు వానికిన్ 

వేమఱు నిత్తు నే నతులు పెన్నిధి డొంక శిలాధి నేతకున్ 16.

కళిక. (ద్విరదగతి రగడ)

భక్తియే ముఖ్యమ్ము ముక్తి నిడ  రామునకు

శక్తి యత్యంతమ్ము చాపమున వీరునకు  

పాలాభిషేకమ్ము భావ్యమ్ము  రఘుపతికి 

నీలాలు ముఖ్యమ్ము నెఱరూపు మానిసికి 

సంగీత సాహిత్య సంయుక్త విజ్ఞునకు

నంగీకృ తంబగు రసానందము విభునకు

బొంకు లన రోషమ్ము డొంకరాయి ధవునకు 

వంక లేవియుఁ జెప్ప డొంకశిల రామునకు 17.

ఉత్కళిక.

కొంగ్రొత్త కీర్తనలు గొంగ్రొత్త గానములు

నల రామచంద్రునకు  నలరారు  నధిపునకు  

నృత్య నాట్యాదులే  నిత్యంపు టాటలే     

పంకేజ నేత్రునకు డొంకరాయి ప్రభునకు 18.

సప్తమీ విభక్తి:

ఉ.

ఎవ్వని యందు భక్తి నిడ నిమ్ముగ మోక్షము గల్గ నోపునో

యెవ్వని యందు చిత్త మిడ నింపుగ సౌఖ్యము నంద వచ్చునో

యెవ్వని యందు నమ్మకము నింతయు నుంచిన మేలు గూర్చునో

యవ్వర రామునం దిడుదు రాశలు డొంకశి లంబులో జనుల్ 19.

కళిక.(హంసగతి రగడ)

చిత్తమ్ముఁ బోనీరు చెడ్డ యందు

విత్తమ్ము పోనీదు మత్తు నందు 

నగ్ని వడి జేయుదురు యజ్ఞ మందు 

లగ్నమ్ము గానీరు రాశు లందు 

భక్త జనులే యుంద్రు ముక్తి యందు 

శక్తి వంతులు మిగుల భక్తి యందు

బొంక రిట మన ముంచి శంక యందు 

డొంకశిలఁ గను రాము నంక మందు    20.

ఉత్కళిక.

పద మందు రక్తి 

యెద యందు శక్తి 

జనులందు యుక్తి  

ఘనమైన భక్తి 

సీతాపతి ప్రేమ 

యాతతము రాము  

నంకమ్ము నందు 

డొంకశిల యందు 21.

సంబోధన ప్రథమా విభక్తి:

ఉ.

అంకము సేరి నింగొలుతు నాశ్రిత రక్షక! లోకబాంధవా! 

బొంకఁ దలంప నెన్నఁడును భూమిజ నాథుఁడ! పూతదేహుఁడా! 

వంకను బెట్ట నోర్వ హరి! పంకజ నాభుఁడ!లక్ష్మణాగ్రజా! 

డొంకల కేను భీతిలను డొంకశిలాధిప! రామభద్రుఁడా! 22.

కళిక. (హంసగతి రగడ)

దైనందినమ్ము  కోదండ రామ! 

మానికంబుల తోడ మహిని రామ!

పూజ నేఁ జేయుదును బూజ్య రామ!

జాజి పూలను దెచ్చి  చక్క రామ! 

యాయురారోగ్యాలు యశము రామ! 

యీయుమా మా కింక నీశ! రామ! 

బొంకు లేఁ బల్క నో భువన ధామ! 

డొంకరాయి ప్రభు! నే లెంక రామ! 23.

ఉత్కళిక.

కీర్తింతు రామ!

యార్తితో రామ!

పోఁగొట్టు రామ!

మా గోడు రామ!

యాదుకొను  రామ!

కోదండ రామ!

శంక విడు రామ! 

డొంకశిల రామ! 24.

సార్వ విభక్తికము:

శా.

రావా కావఁగ రామ, బ్రీతిగ నినున్ రంజిల్లఁగాఁ జేయ,మా

సేవల్ నిత్యము పొంది హర్షమున! మాచే నీయు సత్కారముల్ 

నీవే నీ కయి పొంది మా వలన నే నేరమ్ములం జూడకే 

రావే డెందము నందు మ్రొక్కుదుఁ దమిన్  రక్షింప సీతాపతీ!    25.

అంకితాంకము:   

శా.

వరదా! రాఘవ! పోచిరాజు కుల సుబ్బారావు నామంబునం  

బర మార్తిం దగ నీ యుదాహరణముం బద్యమ్ము లర్పింపఁగాఁ  

గరముం బ్రీతిని సంగ్రహించు మిఁక నో కాకుత్స్థ! కాపాడుచుం 

బరమౌ దారినిఁ జూపుమా దయను నా భాగ్యంబు జెల్వొందఁగా    26.

పోచిరాజు సుబ్బా రావు నామ ప్రణీత డొంకరాయి రాఘవోదాహరణ  కావ్యము సమాప్తము.

Friday, April 23, 2021

కోడల!నాసుతున్ విడిచి,కూడగనొప్పును నేడునా పతిన్

 ఏడుదినంబు లాయెగద యిప్పుడులెక్కనుజూడగాసుమా

కోడల!నాసుతున్ విడిచి,కూడగనొప్పును నేడునా పతిన్

బాడుకరోనకుందగిలి భద్రతదృష్టిని దూరముండుచున్

నేడిక గీము జేరుటన నిర్మొహమాటుగనెవ్వరేనియున్

కోడలా నాపతిని నేడు గూడవలెను

 కోడలా నాపతిని నేడు గూడవలెను

నెంతదౌర్భాగ్య మీయది యిటుల నడుగ

స్వంత భర్తను గూడుట సబబు,కాని

కోడలిని యడుగ భువిని క్రూరమగును

స్కారమె యెంతొ ముద్దు నయగారములుండీన ప్రేమజంటకున్

మీరక హద్దులెన్నడు మమేకపుభావన గల్గునట్టిసం
స్కారమె యెంతొ ముద్దు నయగారములుండీన ప్రేమజంటకున్
గోరినవాడు భర్తగనుగూర్మి లభీంచుట యోగమేకదా
పారమునొందవీలగును భవ్యతరాలకు వీరిసర్గముల్

Thursday, April 22, 2021

కారమె ప్రేమికులకు గనగడు ముద్దుసుమా

 మారుని ప్రేరణ చేతను

జేరగ దాభర్తదరికిచిత్తమునలరన్

తోరమువశమైమన,మమ

కారమె ప్రేమికులకు గనగడు ముద్దుసుమా

పండుగజేయగ దగును,-బంధువు సచ్చిన వార్తవచ్చినన్

 నిండుమనంబునందలరి నెమ్మినిఋరాముని బెండ్లివేడుకన్

బండుగజేయగ దగును,-బంధువు సచ్చిన వార్తవచ్చినన్

గుండెను నిబ్బరంబునిచి ఘోరముజర్గుట నెంచుచున్ మదిన్

నండగనుండగాదగును నన్నివిధంబుల సేవజేయుచున్

Wednesday, April 21, 2021

బంధుమరణ వార్త,మనకు పండుగెకద

 దుఃఖకరము మిగుల దుర్భరంబగునార్య!

బంధుమరణ వార్త,మనకు పండుగెకద

యింటినిండ జనము వంటిల్లుసందడి

రకరకంపు తిండ్లు లభ్యమగుట

Tuesday, April 20, 2021

 పసివాని తోడ దాటెడు

వసుదేవుని గాంచివాలీ ఫక్కున నవ్వెన్

రసమయ ఘట్టమ ని సురలు

దెసలన్నియు మారుమ్రోగ దీవనలొసగెన్

Monday, April 19, 2021

నమృతము మ్రింగి హాలహలమందఱకున్ శివుడిచ్చెజెచ్చెఱన్

మమతను దేవదానవులు మర్దన జేయగ బాలసంద్రమున్
నమృతముబాటుగాగనట హాలలంబును గామధేనువున్
దమకము గల్గు నాశివుడు దద్దయుపార్వతి బ్రోత్సహించగా
నమృతము మ్రింగి హాలహలమందఱకున్ శివుడిచ్చెజెచ్చెఱన్

అమృతమున్ మ్రింగి శివుడిచ్చె హాలహలము

అమృతమున్ మ్రింగి శివుడిచ్చె హాలహలము
నిట్టి పూరణ కష్టమే యీశునకును
శివుడు మ్రింగెను విషమును భవ్య వలన
సైంహికుడు మ్రింగె నమృతము దేవతగను

Sunday, April 18, 2021

కాలికి ముల్లు గ్రుచ్చిన,సుఖంబు లభించుట తధ్యమిద్ధరన్

కూలి జనంబులెప్పుడును గోలను జేయక తీసికొందురే
కాలికి ముల్లు గ్రుచ్చిన,సుఖంబు లభించుట తధ్యమిద్ధరన్
కాలము వమ్ముసేయకను గాలుని సేవయె నిత్యకృత్యమై
మేలగు రీతినిన్ భువిని మిక్కిలి శ్రద్ధగ జేయువారికిన్

కాలికిన్ ముల్లుగ్రుచ్చ,సుఖంబు గలుగు

 బాధ గలిగించు నిరతము వచ్చువరకు

కాలికిన్ ముల్లుగ్రుచ్చ,సుఖంబు గలుగు

ముల్లు దీసిన దదుపరి యుల్లమలరి

దాని బాధను వర్ణించ దరమె మనకు?

Saturday, April 17, 2021

దత్తపది

 ముద్దుగుమ్మ! ముదము,గోడ దద్దరిల్లు

నట్ల యరుగు దమికరమ్ము తలుపు

తీయి సైరంధ్రి యనుచును దీయపలికె

కీచ కుండప్డు కలుగగ నీచబుద్ధి

Friday, April 16, 2021

పరమాత్ము భజనసేయ బాధలు గల్గున్

తిరుపతి కేగిన వారికి
నరగంటయె కాక మునుపు టలసట కలుగన్
పరమాత్ము భజన యాగుట
పరమాత్ము భజనసేయ బాధలు గల్గున్

Thursday, April 15, 2021

ఎలుకలనంగ నీవెఱుగవే గగనమ్మున నీదునట్టివౌ

 ఎలుకలనంగ నీవెఱుగవే గగనమ్మున నీదునట్టివౌ

యెలుకలవోలె గన్పడును నెచ్చటనుండ విమానమంతటన్

గలిబొలి మాటలాడగను గాలమె యీయది?కాంత చెప్పుమా

యెలుకలు నీటనీదునని నెంచుచు జెప్పుదుబాల! యిప్పుడున్

ఎలుకలన,నాకసమ్మున నీదునవియె

 చుంచు రూపమునుగలిగి సంచరించు

నెలుకలన,నాకసమ్మున నీదునవియె

ఫ్లైటులనబడి తిరుగుచు బాటసారి

నిలను జేరవేయును వారి నిలయములకు

Wednesday, April 14, 2021

కరగిన నెయినిప్పునుంచ ,గడ్డలు కట్టెన్

చురచుర యనుచును బేలును
కరగిన నెయినిప్పునుంచ ,గడ్డలు కట్టెన్
నిరతము శీతలమగుటన
నరయుమ యాక్షీరమంత యట్లుగమారెన్

గరగిననేయి నిప్పుపయి గాచిన,గడ్డలుగట్టెజూడగన్

చురచురలాడుచున్ మిగులజొప్పుచు శబ్దమువచ్చుడప్పుడున్
గరగిననేయి నిప్పుపయి గాచిన,గడ్డలుగట్టెజూడగన్
నిరతము చల్లజేయుటన నేయియుమారెనుపూర్వరూపమై
యరయుము పండితోత్తముడ! యందలిమార్పుల చిత్రమంతయున్

Tuesday, April 13, 2021

జనమునెల్లమ్రింగె శ్వాన మొకటి

ఎటుల జూచెనేమొ యెటనుండి వచ్చెనో
క్షణము లోన జరిగె సరిత!కంటె?
తినుట కొఱకు నిన్న తేబడినట్టిభో
జనమునెల్లమ్రింగె శ్వాన మొకటి

ప్లవనామాబ్దమ!రమ్ము మాకికను సంప్రాప్తించునా సేమముల్

 భవముల్ నీయగ వేగమేయిటకు సంభావ్యంబునొప్పంగ నో

ప్లవనామాబ్దమ!రమ్ము మాకికను సంప్రాప్తించునా సేమముల్

వివరంబొప్పగజెప్పు నీమదిని నేభేదంబు లేకుండగా

భువికిన్ రక్షణ జేయగా మనుమయోపూతాత్మ! యోరక్షకా!

ప్లవసంవత్సరమ!తెత్తువా సేమమ్ముల్

 శవముల జేయుచు మమ్ముల

భువిలో లేకుండజేయ పుట్టితివేమో

వివరముగ జెపుమనీవో

ప్లవసంవత్సరమ!తెత్తువా సేమమ్ముల్

Sunday, April 11, 2021

ఇంతలుగన్నులున్న దెరువేకననైతి నిదేమిచోద్యమో

 గంతలుగట్టినట్లుగను గన్నులుగల్గుట యోవరూధినీ!

యింతలుగన్నులున్న దెరువేకననైతి నిదేమిచోద్యమో

యంతయునుండెగానరయనంతముజిక్కనిమార్గమిచ్చటన్

నింతివరూధినీ!చెపుమ యిచ్చటి మార్గము బోవ యింటికిన్

కింతలు గన్నులున్నను దెరువే కననైతిన్

ఇంతీవరూధినీ!నా
కింతలు గన్నులున్నను దెరువే కననైతిన్
నంతయు నయోమయమయే
చింతలు లేకుండ నేగ చెప్పుమ దారిన్

Saturday, April 10, 2021

అలుకంజెందినయట్టి కాంతలుచిత వ్యాపారలై మించరే

 కలలో సైతముదూషణంబుగను వాగ్ఢారన్ బ్రదర్శించున్

నలుకంజెందినయట్టి కాంతలుచిత వ్యాపారలై మించరే

లలనాశ్రేష్ఠుల జూడగాదెలియు వాలాయంపు టౌన్నత్యమున్

వలపుల్ గుప్పుచు జేరవత్తురుగ దావాల్లభ్యమున్ జూపుచున్

అలిగిన సతులుడుగరు,దగువ్యాపారములన్

 కలనైన మొఱకుదనమును

నలిగిన సతులుడుగరు,దగువ్యాపారములన్

లలనలు సేతురు చక్కగ

విలసితమగు నేర్పుతోడ పెద్దలు మెచ్చన్

Friday, April 9, 2021

పురుషవరుడు సీరగట్టిపూవులముడిచెన్

 తరతమభేదము జూడక

సరసికుడై మనుటవలన సరసతలొలకన్

మరియును బిచ్చియె ముదరగ

పురుషవరుడు సీరగట్టిపూవులముడిచెన్

Thursday, April 8, 2021

తేలును ముద్దులాడు బడతింగని మెచ్చదగున్ముదమ్మునన్

 తేలును ముద్దులాడు బడతింగని మెచ్చదగున్ముదమ్మునన్

బాలక! యేమినీపలుకుభావ్యమె నీకిది?ముద్దులాడుటల్

మేలము లాడగన్ సమయమేయిది కుట్టునుగాపుటుక్కునన్

కాలము వమ్ముగాగనక గాలుని పూజను జేయుమెప్పుడున్

తేలును ముద్దాడెడి పడతిన్ మెచ్చదగున్

 కాలుని గెలిచిన దగుటన

తేలును ముద్దాడెడి పడతిన్ మెచ్చదగున్

మేలములాడుచు నుంటివె?

బాలిక! యికజెప్పకిటుల బరిహాసముగా

దిట్టెడు వారికెల్లరకు దీవెనలిమ్ముశుభమ్ముగోరుచున్

గట్టువ రాజశేఖరుడ!గారవమొప్పగ నెల్లవేళలన్
దిట్టెడు వారికెల్లరకు దీవెనలిమ్ముశుభమ్ముగోరుచున్
బిట్టున వారిమానసముబేర్మిని మారుచు మంచివారునై
నిట్టటుచేయుచుందురిక యీప్సిత కార్యమునర్హులైనచో

తిట్టువారికిడుము దీవెనలను!

తిట్టువారికిడుము దీవెనలనుతాత!
బుద్ధివచ్చి యుండ్రు బుద్ధిగాను
నీతిమంతు డగుచు నిరతము మంచినే
చేయుచుండు బ్రజకు చిరము సుమ్ము

Wednesday, April 7, 2021

సాకలేక బిడ్డల జెప్పె సాకులెన్నొ

 ఆర్జన యిసుమం తయులేక వ్యాధి వలన

పగలు గడుచుటబహుభార మగుట,సరిగ

సాకలేక బిడ్డల జెప్పె సాకులెన్నొ

తల్లిదండ్రుల బాధలు దరమె చెప్ప

సాకగలేక బిడ్డనుసాకులుజెప్పెడు వాడెభర్తయౌ?

 ఆకసమంటు వస్తువుల నారసి చాలినసొమ్ము లేకనే

సాకగలేక బిడ్డనుసాకులుజెప్పెడు వాడెభర్తయౌ?

సాకగ దప్పదేరికిని సంతును గాయముకష్ట మైననున్

నీకలికాలమంతయును నిట్లుగనుండును జెప్పనేటికిన్ 

Tuesday, April 6, 2021

జమునను జూడగావిజయ! శాంతిలభించె జయప్రదమ్ముగన్

విమలపు మానసంబునను వేయిరకంబగు చిత్స్వరూపమౌ
జమునను జూడగావిజయ! శాంతిలభించె జయప్రదమ్ముగన్
నమలిన రక్తిగల్గుచును నాదరమొందగ జిత్రప్రక్రియన్
బ్రమదము తోడచేయుచును రాణకునెక్కినభామయామెయే

Sunday, April 4, 2021

గరములనెల్లవేళ గడుగన్ వలె దైలముతోడ మేల్గనన్

అరయుము నేటిలోకమును నంతటనుండెను నాకరోనయే
నిరతము జాగరూకతన నెమ్మదినుండగ మంచిగావునన్
గరములతోడ దాకగనుగట్టిగ జేతులు శుభ్రబర్చనౌ
గరములనెల్లవేళ గడుగన్ వలె దైలముతోడ మేల్గనన్

కడుగ వలయు దైలంబున కరయుగమును


ఏది ముట్టిన వెంటనే యీశ్వరార్య!
కడుగవలయు దైలంబున కరయుగమును
లేనియెడలను నంటుక రోనమనకు
గాన జాగ్రత్త బాటించ కరము మేలు

 

మనపద్యమ్ములనెల్ల రుంజదివియాత్మఙ్ఞానులై వెల్గరే

జనముల్ మెచ్చగ పాండితీగరిమ,సచ్ఛైలిన్ బ్రదర్శించుభవే
మనపద్యమ్ములనెల్ల రుంజదివియాత్మఙ్ఞానులై వెల్గరే
జనసామాన్యుల కర్ధమౌనటుల స్వచ్ఛంబైన బద్యాలతో
వినగానింపుగనుండు నట్లుగను దావేలాదిగావ్రాసెగా

Saturday, April 3, 2021

మనపద్యములు బఠించి మాన్యతగనరే

 మనములు రంజిలగావే

మనపద్యములు బఠించి మాన్యతగనరే

కనివిని యెఱుగని రీతిని

మనకిచ్చెను సూక్తులెన్నొ మాన్యులు మెచ్చన్

Friday, April 2, 2021

నీశు గల్గునరుల మెచ్చు నీశ్వరుండు-

 పరుల కీడును దలపెట్టు వానిగాంచి

దైవదూషణ జేయుమానవునిఋజూడ

నెయ్యమును మోసగించెడునయ్య యెడల

నీశు గల్గునరుల మెచ్చు నీశ్వరుండు-

వెధవలు పెచ్చురేగిరట వేలకోలంది శకారరూపులై

మిధిలపువాసులందఱును మీరుచు,హద్దులు దాటినట్టియా
వెధవలు పెచ్చురేగిరట వేలకోలంది శకారరూపులై
వెధవనుబేర వ్రాసిరట పేర్మిని జూడగ నూఱుపద్యముల్
వెధవలయందు వారికిల బ్రేమనుజెప్పగశక్యమే హరా!

Thursday, April 1, 2021

వెధవలు సెలరేగిరంట వేలకొలదిగన్

 మిధిలాపురమున గొందఱు

వెధవలు సెలరేగిరంట వేలకొలదిగన్

బధికుల వెంటనుబడుచు వి

విధములుగ బాధపెట్టు వెధవలు వారే