Saturday, April 13, 2019

wy b

్రీరామచంద్రమూర్తికి అక్షరార్చన

: 1.ఆ.వె:శ్రీగణేశు దలచి శ్రీవాణికిని మ్రొక్కి
      వ్రాయ బూనితేను రామకథను
      నాదరంబున విని యాశిస్సు లిడరండు
     నదియె నాదు భాగ్య మవని యందు.

2.ఆ.వె:ముగ్గు రమ్మలకట మురిపెంబు తోడను
       తనయులు జనియింప దశరథుండు
      సంబరమ్మునంది సలిపె నామకరణ
       మవని జనులు జూచి హర్షమొంద

3.ఆ.వె:జ్యేష్ట పుత్రుడయ్యె శ్రీరామచంద్రుండు
           లక్ష్మణభరతాదు లై రి పిదప
            మురిసె దశరథుండు ముగ్గురు సతులందు
           నల్వురు సుతుల గని నంద మొందె.

: 4.ఆ.వె:మునియు పిలువ నేగె ముదమున భ్రాతతో
      రాఘవుండు తాను రయముగాను
     రక్కసులను జంపి రాయియైన యహల్య
    శాపముడిపి నట్టి సద్గుణుండు.

5.ఆ.వె:జనకును పురిచేరి శంభుని విల్లును
     విరువ ముదము తోడ పెద్ద లెల్ల
     మెచ్చ పెండ్లి యాడి మిథిలజతోగూడి
    తానయోధ్య చేరె తన్మయతన.

6.ఆ.వె:తండ్రి మాట నిల్ప ధరణిని వీడుచు
        కానకేగినాడు కలతపడక
       తమ్ముడనుసరింప ధరణిజ తోడుగా
      వనము లందు గడిపె వంత లేక.

7.ఆ.వె:పసిడి జింక యొకటి వనమున దిరుగంగ
       పడతి సీత తాను వాంఛ చేయ
       దనుజ మాయ యనుచు దలచియు రాముడు
       ముదిత కోర్కె దీర్చ ముందు సాగె.

8.కం:మారీచుని యరుపును విని
     యారామున కాపదయ్యె నని దుఃఖింపన్
     భారంబగు మది తోడను
    తా రయమున నేగె జూడ తమ్ముడు వడిగా.

9.ఆ.వె:యతిగ రూపు దాల్చి యరుదెంచె రావణుం
           డతివ నపహరింప నాశ తోడ
            బిక్ష నిడగ రాగ వెలది సీతను బట్టి
            పుష్పకంబు నెక్కి పురిని చేరె.

10.ఆ.వె:ధరణిజను వెదుకుచు తమ్మునితో నడువ
       శబర కాంత గాంచి సంతసాన
      యాశ్రమంబు నందు నందించ ఫలములన్
      యారగించి ముక్తి యతివ కొసగె.

11.ఆ.వె:సీత జాడ లేక శ్రీరాము డడలుచు
        వెదుక సాగె వనిని వేదనమున
        పవన పుత్రుని గని పరమ హర్షము నంది
        చేరి రవిజు తోడ చెలిమి చేసె

12.ఆ.వె:రవిజు కోర్కె మేర రణమొనర్చి యతని
       భ్రాతను వధియించి పతిని చేయ
       ప్రతిఫలమ్ముగాను పడతిని వెదుకంగ
      వానరులను పంపె వడిగ నతడు.

13.ఆ.వె:కడలి దాటినట్టి కపివరుండచ్చోట
       వనిత జాడ నరసి పలకరించి
       రాము కుశల వార్త రమణీయముగ దెల్పి
      ముదము కూర్చె హనుమ ముదిత కపుడు.

14.ఆ.వె:సీత జాడ దెలుప శ్రీరామ చంద్రుండు
    సంతసమ్ము నంది సాగరమును
     దాటి సంహరించె దనుజుల నెల్లను
    మరలి సీత తోడ మహిని యేలె.

15.ఆ.వె:జయము జయము నీకు జానకీ వల్లభా
       జాగు చేయ కుండ జయము లొసగు
      కోరి కొలుతుమయ్య కోదండ రామయ్య
      క్షణము విడక మమ్ము కావు మయ్య.

16.ఆ.వె:రామ నవమి నాడు రమ్యమౌ శ్రీరఘు
       రామ కథను వినగ రహియు కలుగు
       రాముని దయచేత వ్రాసితి నెమ్మిని
      వినగ రండు మీరు విజ్ఞులార.

No comments:

Post a Comment