ఆ.వె.
సకల దేవతాళి సంస్తుతించుచునుండఁ
జేరి పార్వతియును, జిఱునగవుల
శివుఁడు తనదు భస్మసింహాసమ్మునఁ
గొలువు దీఱఁ, బతినిఁ గోరెనిట్లు. (1)
ఆ.వె.
“స్వామి! స్త్రీలు సకల సౌఖ్యసౌభాగ్యముల్,
పుత్రపౌత్రవృద్ధిఁ బొందునట్టి
వ్రత మొకండుఁ దెలిపి, వ్రతవిధానమ్మును
జెప్పుమయ్య నాకుఁ జిత్త మలర!” (2)
కం.
సతి కోరఁగ విని, శివుఁడును
హిత మిత వాక్యముల ననియె, “హే పార్వతి! నీ
వతి వినయమునను గోరితి;
కుతూహల మ్మెసఁగ వినుము కోరిక తీఱన్. (3)
తే.గీ.
మగధదేశానఁ గుండిన మనెడి పట్ట
ణమున నొక ద్విజ, ‘చారుమతి’, మతి దధిజ,
పద్మ పదపద్మ సక్త సద్భక్తి హృదయ,
ఘన పతివ్రత, సద్వంద్య కలదు; వినుము! (4)
కం.
ఒకనాఁడు స్వప్నమందున
సకల ధనము లొసఁగు తల్లి, సాక్షా ద్రమయే
ప్రకటిత మాయెను సరగున
వికసిత కరుణా హృదబ్జ విలసితమణియై! (5)
తే.గీ.
“చారుమతి! నన్నుఁ బూజింపు, శ్రావణమునఁ
బౌర్ణమికి ముందునన్ శుక్రవారమందు!
సకల సౌభాగ్య సంతాన సౌఖ్యతతులఁ
గూర్చుదానను నమ్ముమో గుణవిశాల!” (6)
ఆ.వె.
అనుచుఁ బలికి మాయమాయె నా మాతయ,
చారుమతియు లేచి, సంతసించి,
“వరము లొసఁగు తల్లి! వరలక్ష్మి! కరుణించి,
మమ్ముఁ బ్రోవు మమ్మ! నెమ్మి నిమ్మ! (7)
కం.
హే మాతా! సంపత్కరి!
శ్రీ! మా! నారాయ ణీంది! సింధుజ! లక్ష్మీ!
నేమమున నిన్నుఁ గొలుతును;
నీ మనమున మమ్ముఁ గరుణ నెసఁగఁగ గనుమా!” (8)
తే.గీ.
అనుచుఁ బరిపరి విధముల వినుతి సేసి,
పతికి, నత్తమామలకును నతివ తెలుప;
సంతసమ్మున విని, వారు సమ్మతించి,
“వ్రతము సలుపంగ వలె” నని పలికి రపుడు! (9)
కం.
ఇది విన్న యూరి సుదతులు
ముదమున మది మెచ్చి యంతఁ బున్నమి మున్నై
యెదురుపడు శుక్రవారము
గదురన్ శ్రావణమునందు ఘనమగు వేడ్కన్. (10)
తే.గీ.
“పద్మకరి! సర్వలోకైకవంద్య! లక్ష్మి!
దేవి! నారాయణప్రి యాబ్ధితనయ! నమ”
మనుచు వారలు చారుమతిని గలసియుఁ
జేరి వరలక్ష్మి పూజను జేసి రపుడు. (11)
తే.గీ.
తొలి ప్రదక్షిణచే నందియలును మ్రోగె;
మలి ప్రదక్షిణఁ గంకణములు మెఱసెను;
కడ ప్రదక్షిణ సర్వాంగ ఘటిత భూష
ణ యుతలైరి! సంపదలె యందఱి గృహాల!! (12)
తే.గీ.
పఱఁగ వరలక్ష్మి కరుణించి పడతులకును
సంపదలు ధాన్య సౌఖ్య సత్సంతతులను,
నాయురారోగ్య భోగ్య సన్మాన్యములను
దగఁ బ్రసాదించె! వ్రత ఫలితమ్ము దక్కె!! (13)
కం.
సతి వింటివె యీ కథ! నే
సతి పతు లిది విన్నఁ గాని, చదివిన, లక్ష్మీ
సతి, తా నొసఁగును సకలము,
లతి శుభముల నిచ్చుఁ గాత, యనవరతమ్మున్. (14)
గుండు మధుసూదన్
No comments:
Post a Comment