డొంకరాయి రాఘవోదాహరణము
ప్రణీతము: పోచిరాజు సుబ్బారావు.
ప్రథమా విభక్తి:
ఉ.
రాముఁడు డొంకరాయి యను గ్రామపు సాధుజ నావన వ్రతో
ద్దాముఁడు ఘోర పాతక విదారుఁడు సద్గుణ భూషితుండు దా
నీ మహి రక్షకుండు పరమేశుఁడు కాచును జీవ రాశినిం
బ్రేమ మయూఖుఁడై ప్రజల బిడ్డల వోలెను జూచు నిత్యమున్ 1.
కళిక. (తురగవల్గన రగడ)
కొండ కొండ నడుమ గలుగు గుంట లోన నుండు వాఁడు
నండ పిండములను దాను నిండి మిగుల నలరు వాఁడు
తల్లిదండ్రుల యెడ భక్తిఁ దద్ద నిల్పి మెలఁగు వాఁడు
నెల్ల జనులఁ బ్రేమ తోడ నుల్ల మలర జూచువాఁడు
తనదు తమ్ము లనినఁ బ్రేమ దర్పములను నొందు వాఁడు
వినయ గౌరవముల నాభరణము లనఁగఁ బఱఁగు వాఁడు
శత్రువులకు జడల మెకపు స్వప్నమై చెలంగు వాఁడు
మిత్ర బృందములకు నభయ పత్ర మిచ్చి సాఁకువాఁడు 2.
ఉత్కళిక.
సత్య వాక్కె యెల్లరకును
నిత్య భూషణం బనుచును
బలుక కుండ దా ననృతము
కలను సైత ముంచి నిజము
మనుజ జన్మ మెత్తి ప్రజకు
మనుగడ యవగతము కొఱకు
శిష్ట రక్షకుండు వాఁడు
దుష్ట శిక్ష కుండు ఱేఁడు 3.
ద్వితీయా విభక్తి:
ఉ.
రాముని రావణాంతకుని రమ్య శరీరుని దీర్ఘ బాహునిన్
మామక పాతకంబులను మాన్చెడు వానిని ,భద్రరూపునిన్
దామర తంపరల్ సిరుల ధార్మిక వృత్తిని నిచ్చు వానినిన్
బ్రేమను గొల్వఁగా నగును భీకర యుద్ధ విశారదున్ హరిన్ 4.
కళిక. (తురగవల్గన రగడ)
కొండ శిఖర మందుఁ దనర గుట్టు గాను వెలయు వాని
భండనంబు నందుఁ దలల ఖండనమ్ము సేయువాని
జాన కమ్మ తోడఁ బెండ్లి జరుపు కొన్న యట్టి వాని
వేనవేలు రక్కసులను బీనుగులుగ జేయు వాని
శరణు సొచ్చువారి నెపుడు జక్కఁ జేసి పంపు వాని
నరుల మధ్య నొకఁడె దాన యై పరులను జంపు వాని
తల్లిదండ్రుల నెపుడు దన యుల్ల మలర చూచు వాని
నెల్ల వేళల భజి యింతు నుల్ల మలర నేను వాని 5.
ఉత్కళిక.
ఊరు వారి కీయ సిరులు
వారి నడతకు ఫలితములు
కార్య దక్షత గల వాఁడు
నార్యు లనిన బేర్మి వాఁడు
భక్త జనులఁ బ్రోచు వాఁడు
రక్తి గలుగు నెడఁద వాఁడు
సేవ జేయుదుఁ దమి వాని
పావ నుండు హనుమ ఱేని 6.
తృతీయా విభక్తి:
ఉ.
ఎవ్వని చేత నీ పుడమి యింతగ నాయెను బాడి పంటచే
నెవ్వని చేత రావణుఁడె యీల్గెను ఘోర రణాంగణమ్ములో
నెవ్వని చేత రాయి యిల నింతిగ మారెనొ నట్టి వానిచే
నవ్వర డొంకరాయి దగు నాదర మందెను గీర్తి రాముచే 7.
కళిక. (ద్విరదగతి రగడ)
శిల మారె నెవరిచే సేతు వట నెవరిచేఁ
గలిగె భద్రమ్ముగా విలు విఱిఁగె నెవరిచే
రఘుకులం బెవనిచే రంజిల్లె నతనిచే
నఘము లెవ్వానిచే నంతమగు వానిచే
భిక్షపతి నెవ్వాఁడు బ్రేమించు వానిచే
రక్షణమ వానిచే శిక్షణమ యతనిచే
డొంకరాయి శుభమ్ము బింకమౌ ఱేనిచే
వంక గాదులె నిజము భద్రేశు రాముచే 8.
ఉత్కళిక.
మూల మూలల గుడులఁ
గోలాహలము జనుల
సిరు లీయ సతతమ్ము
విరివిగా నటఁ జుమ్ము
సెలయేరు ఫణి పాఱ
శిల వెంబడినిఁ బాఱ
వంక గన దతనిచే
డొంక రాయి హరిచే 9.
చతుర్థీ విభక్తి:
ఉ.
రాముఁడు లోక పావనుఁడు రాక్షస మూకల దీర్ఘనిద్రకై
నీమము దప్పకుండు గుణ నేతగ భక్తులు నమ్ము కొంటకై
బాములు దీర్చు నేతగను భావి తరాలకు నుండు కోర్కికై
రాముడు డొంకరాయి నిలఁ బ్రాభవ మందెను భక్త కోటికై 10.
కళిక. (వృషభగతి రగడ)
లక్ష తులసి దళముల నర్చనల నొనరింపఁగ రాఘవునకై
భక్షణంబులు జనుల కీయఁగ శిక్షకులు గలరు రఘుపతికై
యేట యేటను బెండ్లి సేయఁగ మేటి పౌరులు సీత పతికై
మూట మూటల నీయగ జనులు సాటి వారలు మెచ్చఁ బతికై
చైత్ర మాసము నందు పండుగ చిత్ర రీతి జరుగ నతనికై
చిత్ర మైనవి పిండి వంటలు సేసి యీయగఁ బ్రీతి హరికై
డొంకరాయి విభుఁ గొని యాడుదు రంకిత హృదుల దాశరథికై
బొంకు లాడరు రాఘవునకై పూర్ణ దృష్టి నునుతు రతనికై 11.
ఉత్కళిక.
చేర రమ్మని యీయఁ దనకై
నార బట్టలు గట్టి సతి కై
క నుడువంగ విని త్వరితము కై
కొని వ్రతము నేగంగ వని కై
తవ మెఱుంగని సీత వనికే
కవియ ననుజుఁడు రాఁగ జతకే
డొంక రాయి వెలసెను హరికై
కంకణమ్ములిడు రఘుపతికై 12.
పంచమీ విభక్తి:
ఉ.
దశరధ సూను కంటె నిల ధార్మికుఁ డెవ్వడు గాన రాఁడుగా
దశ దిశ లెన్ని జూచినను దద్దయు నీవల నావలన్ ధరన్
దశరధ రామునిం గొలువఁ దారక రాముఁ డొసంగు సంపదల్
దిశ లవి మ్రోగు మావలన దేవుని డొంకశిలేశు పాటలన్ 13.
కళిక. (హంసగతి రగడ)
కలుగు సౌఖ్యమ్ము లే కాంతు వలన
నిలను మోదమ్ములే యీశు వలన
బరఁగు మోక్షమ్ము నెవ్వానివలన
వర భోగ రాశు లెవ్వానివలన
పరభక్తి కలుగు నెవ్వానివలన
వరముక్తి వచ్చు నెవ్వానివలన
శంక లే కడరు నా స్వామి వలన
డొంకరాయి హరిప్రియాంకు వలన 14.
ఉత్కళిక.
బద్ధ హృదయమ్ము । శుద్ధ భావమ్ము
నిద్ధ చరితమ్ము । విద్ధ తేజమ్ము
భక్తి గరిమమ్ము । రక్తి నాశమ్ము
డొంకశిల వలన । సంకువహుని వలన 15.
షష్ఠీ విభక్తి:
ఉ.
రాముఁడు జానకీ విభుఁడు రమ్య గుణుండును శ్యామలాంగుఁడున్
దామస దూరుఁడై పుడమిఁ దద్దయు వెల్గిన వానికిన్ మహా
ధామము తోడ భాసిలుచు ధార్మిక చింతన గల్గు వానికిన్
వేమఱు నిత్తు నే నతులు పెన్నిధి డొంక శిలాధి నేతకున్ 16.
కళిక. (ద్విరదగతి రగడ)
భక్తియే ముఖ్యమ్ము ముక్తి నిడ రామునకు
శక్తి యత్యంతమ్ము చాపమున వీరునకు
పాలాభిషేకమ్ము భావ్యమ్ము రఘుపతికి
నీలాలు ముఖ్యమ్ము నెఱరూపు మానిసికి
సంగీత సాహిత్య సంయుక్త విజ్ఞునకు
నంగీకృ తంబగు రసానందము విభునకు
బొంకు లన రోషమ్ము డొంకరాయి ధవునకు
వంక లేవియుఁ జెప్ప డొంకశిల రామునకు 17.
ఉత్కళిక.
కొంగ్రొత్త కీర్తనలు గొంగ్రొత్త గానములు
నల రామచంద్రునకు నలరారు నధిపునకు
నృత్య నాట్యాదులే నిత్యంపు టాటలే
పంకేజ నేత్రునకు డొంకరాయి ప్రభునకు 18.
సప్తమీ విభక్తి:
ఉ.
ఎవ్వని యందు భక్తి నిడ నిమ్ముగ మోక్షము గల్గ నోపునో
యెవ్వని యందు చిత్త మిడ నింపుగ సౌఖ్యము నంద వచ్చునో
యెవ్వని యందు నమ్మకము నింతయు నుంచిన మేలు గూర్చునో
యవ్వర రామునం దిడుదు రాశలు డొంకశి లంబులో జనుల్ 19.
కళిక.(హంసగతి రగడ)
చిత్తమ్ముఁ బోనీరు చెడ్డ యందు
విత్తమ్ము పోనీదు మత్తు నందు
నగ్ని వడి జేయుదురు యజ్ఞ మందు
లగ్నమ్ము గానీరు రాశు లందు
భక్త జనులే యుంద్రు ముక్తి యందు
శక్తి వంతులు మిగుల భక్తి యందు
బొంక రిట మన ముంచి శంక యందు
డొంకశిలఁ గను రాము నంక మందు 20.
ఉత్కళిక.
పద మందు రక్తి
యెద యందు శక్తి
జనులందు యుక్తి
ఘనమైన భక్తి
సీతాపతి ప్రేమ
యాతతము రాము
నంకమ్ము నందు
డొంకశిల యందు 21.
సంబోధన ప్రథమా విభక్తి:
ఉ.
అంకము సేరి నింగొలుతు నాశ్రిత రక్షక! లోకబాంధవా!
బొంకఁ దలంప నెన్నఁడును భూమిజ నాథుఁడ! పూతదేహుఁడా!
వంకను బెట్ట నోర్వ హరి! పంకజ నాభుఁడ!లక్ష్మణాగ్రజా!
డొంకల కేను భీతిలను డొంకశిలాధిప! రామభద్రుఁడా! 22.
కళిక. (హంసగతి రగడ)
దైనందినమ్ము కోదండ రామ!
మానికంబుల తోడ మహిని రామ!
పూజ నేఁ జేయుదును బూజ్య రామ!
జాజి పూలను దెచ్చి చక్క రామ!
యాయురారోగ్యాలు యశము రామ!
యీయుమా మా కింక నీశ! రామ!
బొంకు లేఁ బల్క నో భువన ధామ!
డొంకరాయి ప్రభు! నే లెంక రామ! 23.
ఉత్కళిక.
కీర్తింతు రామ!
యార్తితో రామ!
పోఁగొట్టు రామ!
మా గోడు రామ!
యాదుకొను రామ!
కోదండ రామ!
శంక విడు రామ!
డొంకశిల రామ! 24.
సార్వ విభక్తికము:
శా.
రావా కావఁగ రామ, బ్రీతిగ నినున్ రంజిల్లఁగాఁ జేయ,మా
సేవల్ నిత్యము పొంది హర్షమున! మాచే నీయు సత్కారముల్
నీవే నీ కయి పొంది మా వలన నే నేరమ్ములం జూడకే
రావే డెందము నందు మ్రొక్కుదుఁ దమిన్ రక్షింప సీతాపతీ! 25.
అంకితాంకము:
శా.
వరదా! రాఘవ! పోచిరాజు కుల సుబ్బారావు నామంబునం
బర మార్తిం దగ నీ యుదాహరణముం బద్యమ్ము లర్పింపఁగాఁ
గరముం బ్రీతిని సంగ్రహించు మిఁక నో కాకుత్స్థ! కాపాడుచుం
బరమౌ దారినిఁ జూపుమా దయను నా భాగ్యంబు జెల్వొందఁగా 26.
పోచిరాజు సుబ్బా రావు నామ ప్రణీత డొంకరాయి రాఘవోదాహరణ కావ్యము సమాప్తము.